VR Chaudhari: వైమానిక దళం కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎయిర్ మార్షల్?
భారత వైమానిక దళం నూతన చీఫ్‌గా ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి(వీఆర్ చౌదరి) బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు వైస్ చీఫ్‌గా ఉన్న ఆయన సెప్టెంబర్ 30న న్యూఢిల్లీలో ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా నుంచి బాధ్యతలు చేపట్టారు. దీంతో వీఆర్ చౌదరి దేశ 27వ ఎయిర్ స్టాఫ్ చీఫ్ అయ్యారు. మూడేళ్ల పాటు ఎయిర్ ఫోర్స్ చీఫ్ పదవిలో కొనసాగనున్నారు.
వాయుసేనలో బాధ్యతలు
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) పూర్వ విద్యార్థి అయిన చౌదరి డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1982 డిసెంబర్‌లో ఎయిర్ ఫోర్స్ ఫైటర్ స్ట్రీమ్‌లో ఫైటర్ పైలట్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత మిగ్ –21, మిగ్ –23 ఎమ్‌ఎఫ్, మిగ్–29, సు–30 ఎమ్‌కేఐ వంటి యుద్ధ విమానాలను నడిపారు. 3,800 గంటలకు పైగా యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఉంది. ప్రస్తుతం వాయుసేన చీఫ్ అయ్యేముందు ఎయిర్‌ఫోర్స్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్(వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్)గా, తూర్పు కమాండ్‌లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా పనిచేశారు.
వివిధ హోదాల్లో...
- పాకిస్తాన్, చైనాతో సరిహద్దులలోని కొన్ని ప్రాంతాల భద్రతకు బాధ్యత వహించే వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు కమాండర్–ఇన్–చీఫ్‌గానూ చౌదరి పనిచేశారు.
- తూర్పులద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న సమయంలోనే వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా నియమితులయ్యారు.
- గతంలో ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ సఫేద్ సాగర్ వంటి ఎయిర్ ఫోర్స్ చేపట్టిన కొన్ని ముఖ్యమైన మిషన్లలో భాగస్వాములయ్యారు.
- ఫ్రంట్‌లైన్ ఫైటర్ స్క్వాడ్రన్‌కు కమాండింగ్ అధికారిగా వ్యవహరించారు.
- హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ డిప్యూటీ కమాండెంట్‌గా, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వహించారు.
చదవండి: ట్రాన్స్‌ఫర్మేటివ్ జస్టిస్ పుస్తకాన్ని రచించిన విశ్రాంత న్యాయమూర్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత వైమానిక దళం నూతన చీఫ్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి(వీఆర్ చౌదరి)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఇప్పటివరకు వైమానిక దళం నూతన చీఫ్‌గా ఉన్న ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా పదవీ విరమణ చేసిన నేపథ్యంలో...