World Athletics Championship: సత్తా చాటిన 101 ఏళ్ల విశాఖ వాసి.. మూడు కేటగిరీల్లో 3 స్వర్ణ పతకాల విజేత
ఆగస్టు 13 నుంచి 25వ తేదీ వరకు స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫీల్డ్ అంశాలైన జావెలిన్ త్రో, డిస్కస్‌త్రో పాటు షాట్‌పుట్‌లోనూ 101 ఏళ్ల వయసులో విజేతగా నిలిచి 3 స్వర్ణ పతకాలను శ్రీరాములు సాధించారు.
స్వాతంత్య్రానికి ముందే రాయల్ ఇండియన్ నేవీలో చేరిన శ్రీరాములు రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం స్వతంత్ర భారత్‌లోనూ భారత నావికా దళంలో అధికారిగా నియమితులయ్యారు. కళాశాల రోజుల నుంచే క్రీడాకారుడైన శ్రీరాములు అప్పట్లో ఫుట్‌బాల్‌తో పాటు అథ్లెటిక్ అంశాల్లో పాల్గొనేవారు. పదవీ విరమణ అనంతరం విశాఖలోని తన స్వగృహంలో గతేడాది నూరు వసంతాల్ని పూర్తి చేసుకున్నారు.
జూలైలో 101వ జన్మదినాన్ని నిర్వహించుకున్న ఈయన మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని 3 స్వర్ణాల్ని అందుకుని ఆగస్టు 27వ తేదీ విశాఖ చేరుకున్నారు. 2011 నుంచి 15 వరకు కాలికి గాయం కావడంతో కాస్త విరామం ఇచ్చినా, తిరిగి పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచానని చెప్పారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ మాస్టర్స్ పోటీల్లో 24 పతకాల్ని సొంతం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈయన 81 ఏళ్ల వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు.