Yashwant Sinha: ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఖరారు.. ఈయన ప్రస్థానం ఇదే..
పార్లమెంట్ ఎన్‌ఎక్స్ భవన్‌లో సమావేశమైన 18 విపక్ష పార్టీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. 2002లో కేంద్ర విదేశాంగశాఖ మంత్రిగా యశ్వంత్ సిన్హా పనిచేశారు. 2018లో యశ్వంత్ సిన్హా బీజేపీకి రాజీనామా చేశారు. 2021లో తృణమూల్‌లో చేరారు. కాయస్త బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యశ్వంత్ సిన్హా జూన్ 21వ తేదీన (మంగళవారం) ఉదయం టీఎంసీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మంగళవారం ఉదయం ట్విటర్ వేదికగా ప్రకటించారు.
ఐఏఎస్ అధికారిగా.. సర్వీస్సులో ఉండగానే..
బీహార్, పాట్నాలో పుట్టిపెరిగిన యశ్వంత్ సిన్హా.. ఐఏఎస్ అధికారి. ఆపై దౌత్యవేత్తగానూ తరపున పని చేశారు. సర్వీస్సులో ఉండగానే రాజీనామా చేసిన ఆయన 1984లో జనతా పార్టీలో చేరారు. నాలుగేళ్లకు రాజ్యసభకు వెళ్లారు. జనతా దళ్ ప్రభుత్వంలో.. పార్టీ జనరల్ సెక్రటరీగా పని చేశారు. ఆపై చంద్రశేఖర్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా ఏడాది పాటు పని చేశారు. 1996లో బీజేపీ అధికార ప్రతినిధిగా పని చేసిన యశ్వంత్ సిన్హా.. 22 ఏళ్ల పాటు బీజేపీలోనే కొనసాగారు. లోక్‌సభ ఎంపీగా, పార్టీ కీలక ప్రతినిధిగా, ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో బీజేపీ పాలనను బహిరంగంగానే విమర్శిస్తూ పార్టీని వీడి.. కిందటి ఏడాది టీఎంసీలో చేరారు.
కేసీఆర్ మద్దతు ఈయనకే..
మొదటి నుంచి రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ రసవత్తరంగా మారింది. అయితే, ముందు నుంచీ మద్దతు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికారు. ఈమేరకు కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ మంగళవారం వెల్లడించారు. యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి సంబంధించి కేసీఆర్‌తో రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ మద్దతు తెలిపారని పేర్కొన్నారు.