Supreme Court: కేశవానంద తీర్పునకు ప్రత్యేక వెబ్‌పేజీ
చారిత్రక ‘కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం’ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 50 ఏళ్లు పూర్తయ్యింది. భూపరిమితిని విధిస్తూ కేరళ ప్రభుత్వం చేసిన భూసంస్కరణల చట్టాన్ని ఆధ్యాత్మికవేత్త కేశవానంద భారతి సుప్రీంకోర్టులో సవాల్‌చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎం సిక్రీ నేతృత్వంలో 13 మంది న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి విచారించింది. ఇప్పటివరకు 13 మంది సభ్యుల ధర్మాసనం విచారించిన ఏకైక కేసు ఇదే. 1972, అక్టోబర్31న విచారణ ప్రారంభం కాగా.. 1973, ఏప్రిల్ 24న 7 : 6 మెజారిటీతో ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య వ్యవస్థ వంటి రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలను, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పార్లమెంటు సవరించలేదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సుప్రీంకోర్టు సంరక్షణదారుగా ఉంటుందని పేర్కొంది. కేశవానంద భారతి తీర్పు వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఈ తీర్పు వివరాలతో సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ప్రత్యేక వెబ్‌పేజీని ఏర్పాటుచేసింది. తీర్పు హిందీ అనువాదాన్ని కూడా వెబ్‌పేజీలో అందుబాటులో ఉంచారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP