Abortion : గర్భస్రావం మహిళ హక్కు : సుప్రీంకోర్టు
వివాహితులు, అవివాహితులు అంటూ తేడా చూపించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. పెళ్లయిన వారితో సమానంగా అవివాహితులకు కూడా 24 వారాల్లోపు గర్భస్రావం చేయించుకునే హక్కు ఉంటుందని పేర్కొంది. అంతేగాక వైవాహిక అత్యాచారాన్ని కూడా వైద్యపరమైన గర్భవిచ్ఛిత్తి (ఎంటీపీ) చట్ట నిర్వచనం ప్రకారం రేప్‌గానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంటీపీ చట్ట పరిధిని విస్తరిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పార్డీవాలా, జస్టిస్ ఎ.ఎన్.బొపన్నలతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 29న చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అంతర్జాతీయ సురక్షిత అబార్షన్ దినోత్సవం (సెప్టెంబర్ 28) మర్నాడే ఈ తీర్పు రావడం విశేషం.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: 64వ రామన్ మెగసెసే అవార్డు 2022 గ్రహీతలు/గ్రహీతలు ఎవరు?
"చట్టపరంగా సురక్షిత అబార్షన్ చేయించుకోవడానికి మహిళలందరూ అర్హులే. గర్భిణులు 20–24 వారాల మధ్య అబార్షన్ చేయించుకోవచ్చని గర్భవిచ్ఛిత్తి చట్టం సెక్షన్ 3(2)(బీ) చెబుతోంది. దీన్ని వివాహితులకే వర్తింపజేసి అవివాహితులను దూరం పెట్టడం ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే.
స్త్రీకి తన శరీరంపై సంపూర్ణ హక్కుంటుంది. అవాంఛిత గర్భం ఆమె శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. కనుక పెళ్లయిందా, లేదా అనేదానితో నిమిత్తం లేకుండా అబార్షన్‌పై ఆమెదే అంతిమ నిర్ణయం. అత్యాచారానికి, లైంగిక వేధింపులకు గురైనట్టు నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కుటుంబ సభ్యుల సమ్మతీ అవసరం లేదు. మైనర్, లేదా మానసిక వైకల్యమున్న వారికి మాత్రమే సంరక్షకుల సమ్మతి అవసరం" – జస్టిస్ డీవై చంద్రచూడ్
ఇప్పటిదాకా వీరు అర్హులు...
2021లో చేసిన సవరణ నేపథ్యంలో ఎంటీపీ చట్టం సెక్షన్ 3(బి) ప్రకారం 24 వారాల దాకా అబార్షన్ చేయించుకోవడానికి ఇప్పటిదాకా ఈ కింది కేటగిరీల మహిళలకు అర్హత ఉంది...
☛ లైంగిక దాడి, అత్యాచార బాధితులు
☛ మైనర్లు
☛ గర్భధారణ తర్వాత భర్తను కోల్పోయిన, విడాకులు తీసుకున్నవాళ్లు
☛ కాన్పును కష్టతరం చేసే తరహా శారీరక వైకల్యమున్న వాళ్లు
☛ మానసిక సమస్యలున్నవాళ్లు
☛ పిండం సరిగా ఎదగనివాళ్లు
☛ ప్రకటిత అత్యవసర పరిస్థితులు, విపత్తుల వేళల్లో గర్భం ధరించిన వాళ్లు
తాజా తీర్పుతో అవివాహితలు/సహజీవనం చేస్తున్న వారికీ 24 వారాల దాకా అబార్షన్ చేయించుకునే హక్కు దఖలుపడింది.
కేసు నేపథ్యం ఇదీ...
ఈశాన్య ప్రాంతానికి చెందిన ఓ 25 ఏళ్ల అవివాహిత 23 వారాల 5 రోజుల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతివ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. భాగస్వామి పెళ్లికి నిరాకరించి తనను వదిలేశాడని పేర్కొంది. కానీ, ‘‘ఆమె ఇష్టపూర్వకంగా గర్భం దాల్చింది. 20 వారాలు దాటినందున ఎంటీపీ చట్టం ప్రకారం అబార్షన్‌కు అనుమతివ్వలేం’’ అని హైకోర్టు పేర్కొంది. దీన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అబార్షన్‌కు అనుమతిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఎంటీపీ చట్టానికి 2021లో చేసిన సవరణ ద్వారా ‘భర్త’ అనే పదాన్ని ‘భాగస్వామి’గా మార్చిన విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని అభిప్రాయపడింది. ఆగస్టు 23న వాదనలు ముగించి తాజాగా తీర్పు వెలువరించింది.
వైవాహిక అత్యాచారానికి గురైనా...
వైవాహిక అత్యాచారాన్ని కూడా ఎంటీపీ చట్టానికి సంబంధించినంత వరకు అత్యాచారం పరిధిలోకి తేవాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘అత్యాచారమంటే మహిళ తన సమ్మతి లేకుండా లైంగిక సంపర్కంలో పాల్గొనాల్సి రావడం. అపరిచితులు మాత్రమే రేప్‌లకు, లైంగిక వేధింపులకు పాల్పడతారన్న అపోహ ఉంది. భర్త/జీవిత భాగస్వామి చేతిలో లైంగిక వేధింపులు చిరకాలంగా మహిళలు ఎదుర్కొంటున్న చేదు అనుభవాలే. కాబట్టి వీటినీ అత్యాచారంగానే పరిగణిస్తూ, తద్వారా దాల్చే బలవంతపు గర్భం బారినుంచి మహిళలను కాపాడాల్సి ఉంది. వారికీ 24 వారాల్లోపు అబార్షన్ చేయించుకునే హక్కుంటుంది’’ అని పేర్కొంది. అయితే ‘‘వైవాహిక అత్యాచారాన్ని ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం రేప్‌గా పరిగణించాలా, లేదా అన్నది మరో ధర్మాసనం విచారణలో ఉంది. దీనిపై వారిదే తుది నిర్ణయం’’ అని పేర్కొంది.
Also read: Weekly Current Affairs (Economy) Bitbank: ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తంలో GST వసూలు చేసింది?
మైనర్ల పేరు వెల్లడించాల్సిన పని లేదు
మైనర్‌కు అబార్షన్ సందర్భంగా పోలీసు రిపోర్టు తప్పనిసరే అయినా బాధితురాలి పేరు, వ్యక్తిగత వివరాలను వైద్యులు తెలపాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. పోక్సో చట్టాన్ని సామరస్యపూర్వకంగా వర్తింపజేయాలని సూచించింది. ‘‘వివాహితలు మాత్రమే లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటారన్నది సరికాదు. అవివాహితలు, మైనర్లు కూడా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం, లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురవడం, గర్భం దాల్చడం జరుగుతోంది. సరైన లైంగిక ఆరోగ్య విద్య లేక కౌమారదశలో పునరుత్పత్తి వ్యవస్థ, సురక్షిత లైంగిక పద్ధతులు, గర్భనిరోధక పరికరాల గురించి తెలియడం లేదు. ఈ సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలి. ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాలు, గుర్తింపు పొందిన వైద్యులు తప్పనిసరిగా ఉండాలి’’అని ఆదేశించింది.
ఏ దేశంలో ఎలా ?
సరిగ్గా మూడు నెలలు క్రితం అగ్రరాజ్యమైన అమెరికా సుప్రీం కోర్టు అబార్షన్లపై రాజ్యాంగబద్ధంగా మహిళలకు వచ్చిన హక్కుల్ని తోసిపుచ్చుతూ తీర్పు చెప్పడం సంచలనం సృష్టించింది. 1973లో రియో వర్సెస్ వేడ్ కేసు ద్వారా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కుని 50 ఏళ్ల తర్వాత కొట్టేసింది. ఫలితంగా కొన్ని పరిమితుల మధ్య అబార్షన్ చేయించుకునే దేశాల జాబితాలో చేరిపోయింది. అయితే అమెరికాలో రాష్ట్రాలే శక్తిమంతం కావడంతో ఆయా రాష్ట్రాల నిబంధనల ఆధారంగా మహిళలకు అబార్షన్‌పై హక్కులు వస్తాయి. యూరప్ దేశాల్లో అబార్షన్ చేయించుకోవడం అత్యంత సులభమైతే, ఆఫ్రికా దేశాల్లో నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. చైనాలో 1953 నుంచి అబార్షన్ చట్టబద్ధం. జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో 1970 తర్వాత బలవంతపు అబార్షన్లని కూడా ప్రోత్సహించింది. ఇప్పుడు వృద్ధులు పెరిగిపోతూ ఉండడంతో అనవసరంగా అబార్షన్ చేయించుకోవడానికి వీల్లేదంటూ గత ఏడాది ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: DRDO కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
యూరప్ దేశాల్లో...
యూరప్‌లోని అత్యధిక దేశాల్లో మహిళలకు గర్భ విచ్చిత్తిపై హక్కులున్నాయి. 12–14 వారాల్లోపు అబార్షన్ చేయించుకోవడం పూర్తిగా మహిళల ఇష్టమే. ఇంగ్లండ్, స్కాట్‌లాండ్, వేల్స్‌లో 1967లో చట్టం చేశారు. 24 వారాలవరకు అబార్షన్ చేయించుకోవచ్చు. యూకేలో గర్భంలో శిశువు సరిగా ఎదగలేదని తేలితే ఎన్నో నెలలో అయినా గర్భాన్ని తీయించుకునే హక్కు మహిళలకి ఉంది. కెనడాలో గర్భవిచ్చిన్నానికి ప్రత్యేకంగా చట్టం లేకపోయినప్పటికీ ఏ దశలోనైనా అబార్షన్ చేయించుకోవచ్చు. యూరప్, లాటిన్ అమెరికా సంప్రదాయ కేథలిక్ దేశాల్లో కూడా మహిళా కార్యకర్తల ఉద్యమాలతో అబార్షన్‌పై హక్కులు కల్పించారు. గత ఏడాది కొలంబియాలో 24 వారాల్లోపు అబార్షన్ చేయించుకోవడం చట్టబద్ధం చేశారు. ఐర్లాండ్‌లో అబార్షన్ చట్టాలకు పరిమితులు విధించడంపై 2018లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మహిళలు తిరస్కరించారు. 12 వారాల్లో ఎప్పుడైనా అబార్షన్ చేయించుకునే హక్కు వారికి ఉంది. న్యూజిలాండ్‌లో 2020లోనే మహిళలకు అబార్షన్లపై హక్కులు వచ్చాయి.
Also read: Weekly Current Affairs (National) Bitbank: 300 మీటర్ల పొడవైన అటల్ వంతెన ఏ నగరంలో ప్రారంభించబడింది?
24 దేశాల్లో అబార్షన్ చట్టవిరుద్ధం
ప్రపంచంలోని 24 దేశాల్లో అబార్షన్ చేయించుకోవడం చట్టవిరుద్ధం. వీటిలో అత్యధికంగా ఆఫ్రికా దేశాలుంటే ఆసియా, సెంట్రల్ అమెరికా, యూరప్‌కు చెందిన దేశాలు వీటిలో ఉన్నాయి. సెనగల్, మార్షినియా, ఈజిప్టు, లావోస్, ఫిలిప్పైన్స్, ఎల్ సాల్వోడర్, హోండరస్, పోలాండ్, మాల్టాలో మహిళలు చట్టబద్ధంగా అబార్షన్ చేయించుకోలేరు. కొన్ని దేశాల్లో అబార్షన్ చేయించుకుంటే కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి. ఎల్ సాల్వేడర్‌లో మహిళలు అబార్షన్ చేయించుకుంటే దోషిగా నిర్ధారించి జైలు శిక్ష కూడా విధిస్తారు. పోలాండ్ గత ఏడాదే అబార్షన్లపై సంపూర్ణ నిషేధాన్ని విధించింది.పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన వయసులో ఉండే ప్రపంచ మహిళా జనాభాలో 5% మంది ఈ 24 దేశాల్లోనే ఉన్నారు. అంటే దాదాపుగా 9 కోట్ల మందికి మహిళలకి అబార్షన్ చేయించుకునే హక్కు లేదని సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ రైట్స్ సంస్థ నివేదికలో వెల్లడైంది.