Skip to main content

Supreme Court of India : భారత సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ ప్రమాణ స్వీకారం

భారత సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ ఆగస్టు 27వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. రిజిస్టర్‌లో సంతకం చేసిన అనంతరం జస్టిస్‌ లలిత్‌కు రాష్ట్రపతి ముర్ము అభినందనలు తెలియజేశారు. 

ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రమాణం చేసిన తర్వాత జస్టిస్‌ లలిత్‌ తన తండ్రి, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉమేశ్‌ రంగనాథ్‌ లలిత్‌(90)తోపాటు కుటుంబ పెద్దల పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం పొందారు. 

బార్‌ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన రెండో వ్యక్తి జస్టిస్‌ లలిత్‌. 1964లో జస్టిస్‌ ఎస్‌.ఎం.సిక్రీ బార్‌ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్‌ లలిత్‌ పదవీ విరమణ అనంతరం నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నియమితులయ్యే అవకాశముంది.
100 రోజుల్లోపే పదవిలో ఉండే ఆరో సీజేఐగా.. 
దేశంలో ఇప్పటిదాకా 100 రోజుల్లోపే పదవిలో ఉన్న ఆరో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ యు.యు.లలిత్‌ రికార్డుకెక్కనున్నారు. ఆయన ఈ ఏడాది నవంబర్‌ 8న పదవీ విరమణ చేస్తారు. అంటే కేవలం 74 రోజులపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తారు. ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన జస్టిస్‌ కమల్‌ నారాయణ్‌ సింగ్‌ 18 రోజులు, జస్టిస్‌ రాజేంద్రబాబు 30 రోజులు, జస్టిస్‌ జె.సి.షా 36 రోజులు, జస్టిస్‌ జి.బి.పటా్నయక్‌ 41 రోజులు, జస్టిస్‌ ఎల్‌.ఎం.శర్మ 86 రోజులపాటు పదవిలో కొనసాగారు.

Published date : 29 Aug 2022 05:01PM

Photo Stories