Supreme Court: ‘స్టాక్ మార్కెట్ల’పై సుప్రీంకోర్టు కమిటీ
మదుపరుల ప్రయోజనాలను కాపాడే విషయంలో పూర్తి పారదర్శకత కావాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రతిపాదిత నిపుణుల కమిటీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సిట్టింగ్ జడ్జిని నియమించడం సాధ్యం కాదని పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత మదుపరులు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లపై నియంత్రణ చర్యలను బలోపేతం చేయాలని, ఇందుకోసం సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని, మదుపరుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, ఎంఎల్ శర్మతోపాటు పలువురు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు(పిల్స్) దాఖలు చేశారు.
Indian American: యూట్యూబ్ కొత్త సీఈఓగా భారతీయుడు.. ఆయనకి సంబంధించిన ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస జేబీ పార్దివాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని గత విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కమిటీ సభ్యుల పేర్లు, విధివిధానాలను ఫిబ్రవరి 17న సీల్డ్ కవర్లో అందజేయగా, ధర్మాసనం స్వీకరించలేదు. ప్రభుత్వం సూచించిన సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తే అది పూర్తిగా ప్రభుత్వ కమిటీ అవుతుందని అభిప్రాయపడింది. పారదర్శకత కావాలి కాబట్టి తామే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, తద్వారా న్యాయస్థానంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని వెల్లడించింది. ఇకపై సిట్టింగ్ న్యాయమూర్తులు ఈ అంశాన్ని విచారిస్తారని, కమిటీలో మాత్రం వారు సభ్యులుగా ఉండబోరని తెలిపింది.