Supreme Court: మంత్రుల వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించలేం.. సుప్రీంకోర్టు
‘‘మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల భావ ప్రకటనపై ఇప్పటికే ఆర్టికల్ 19(2)లో ఉన్నవాటికి అదనంగా మరిన్ని పరిమితులు విధించలేం. సమష్టి బాధ్యత సూత్రాన్ని ఈ విషయంలో వర్తింపజేయలేం’’ అని స్పష్టం చేసింది. ఒక మంత్రి చేసే విద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించలేమని పేర్కొంది. ఓ సామూహిక అత్యాచారం కేసుపై విద్వేష వ్యాఖ్యలు చేసిన అప్పటి యూపీ మంత్రి ఆజం ఖాన్‌ను అరెస్టు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎస్.ఎ.నజీర్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం జనవరి 3న ఈ మేరకు 4–1తో మెజారిటీ తీర్పు వెలువరించింది. భారత్ వంటి పార్లమెంటరీ వ్యవస్థలో ఆరోగ్యకర ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ అత్యవసరమని జస్టిస్ నజీర్‌తో పాటు న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఎ.ఎస్.బొపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ పేర్కొన్నారు. ఐదో సభ్యురాలైన జస్టిస్ నాగరత్న మాత్రం, మంత్రి అధికారిక హోదాలో చేసే వ్యాఖ్యలను మొత్తం ప్రభుత్వానికి ఆపాదించవచ్చంటూ భిన్నమైన తీర్పు వెలువరించారు.
Demonetisation: పెద్ద నోట్ల రద్దు సరైనదే.. సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పిందంటే..
రాజ్యాంగ స్ఫూర్తికే గొడ్డలిపెట్టు: జస్టిస్ నాగరత్న
విద్వేష వ్యాఖ్యలు రాజ్యాంగ మౌలిక విలువల స్ఫూర్తికే గొడ్డలిపెట్టని జస్టిస్ నాగరత్న అన్నారు. ‘‘సమాజంలో అసమానతలకు దారి తీసే ఇలాంటి పోకడ పెరిగిపోతుండటం ఆందోళనకరం. ప్రతి పౌరునికీ తోటి పౌరుని గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. భిన్న నేపథ్యాలకు చెందిన పౌరుల మధ్య సౌభ్రాతృత్వ భావనలను విద్వేష వాతావరణం ఎంతగానో దెబ్బ తీస్తుంది. అందుకే మంత్రులు, ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు ఉ విషయంలో మరింత బాధ్యతగా ఉండటం తప్పనిసరి. అది వారి విధి కూడా. తాము మాట్లాడుతున్న మాటలు, వాటి పర్యవసానాలు, ప్రజల మనోభావాలపై అవి చూపబోయే ప్రభావం, అలాంటి మాటల ద్వారా తాము నెలకొల్పుతున్న ఉదాహరణ వంటివాటిపై వారికి అవగాహన ఉండి తీరాలి’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘మంత్రులు, నేతలు చేసే ప్రసంగాలను నియంత్రించడం వారి పార్టీ బాధ్యత. అవసరమైతే ప్రవర్తన నియమావళిని నిర్దేశించాలి. ప్రజాప్రతినిధులు తమ తోటి పౌరులపై రెచ్చగొట్టే, విద్వేష వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించేలా రాజ్యాంగంలోని 19(1)(ఏ), 19(2) అధికరణల స్ఫూర్తికి అనుగుణంగా పార్లమెంటు చట్టం తేవాలి’’ అని ఆమె సూచించారు.