Bharat Gaurav Train: భారత్ నేపాల్ మైత్రి యాత్ర రైలు ప్రారంభం.. టిక్కెట్ ఎంతంటే..
గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైలు నేపాల్ పర్యటన కోసం ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుండి పరుగులందుకుంది.
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ రైలు ప్రయాణంతో పర్యాటకులు భారత్ - నేపాల్ భాగస్వామ్య సాంస్కృతిక వారసత్వాన్ని చవిచూడగలుగుతారు. ఈ యాత్రకు ‘ఇండియా- నేపాల్ మైత్రి యాత్ర’ అని పేరు పెట్టారు.
ఈ భారత్ గౌరవ్ రైలులో ప్రయాణికులు భారతదేశం-నేపాల్‌ల సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను ఒకే ప్యాకేజీలో పర్యటించేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. 'ఇండియా నేపాల్ మైత్రి యాత్ర' ప్రయాణం 9 రాత్రులు, 10 పగళ్లు ఉండనుంది. ఈ రైలు ప్యాకేజీలో అయోధ్య, కాశీ, సీతామర్హి, జనక్‌పూర్, పశుపతినాథ్, బిండియా బస్ని టెంపుల్‌లను దర్శించవచ్చు. ప్రయాణికుల బస, ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను భారతీయ రైల్వే కల్పిస్తుంది.
టిక్కెట్ ఎంతంటే..
ఈ రైలులో మొదటి ఏసీ క్యాబిన్ ఛార్జీ ఒక్క వ్యక్తికి రూ.1,05,500, ఇద్దరికి రూ.89,885, ముగ్గురికి రూ.87,655లు ఉంటుంది. ఇందులో బెడ్ విత్ చైల్డ్ ఛార్జీ రూ.82,295. సెకండ్ ఏసీలో ఒక్క వ్యక్తి టిక్కెట్ ధర రూ.94,735. ఇద్దరు వ్యక్తులకు రూ.79,120 కాగా, ముగ్గురికి రూ.76,890. ఇందులో బెడ్‌తో కూడిన పిల్లల ఛార్జీ రూ.71,535గా ఉంది. థర్డ్ ఏసీలో ఒక్క వ్యక్తికి రూ.81,530, ఇద్దరికి రూ.66,650, ముగ్గురికి రూ.64,525. ఇందులో బెడ్‌తో కూడిన పిల్లల ఛార్జీ రూ.60,900గా ఉంటుంది.
ఈ రైలులో ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. సౌకర్యవంతమైన సీట్లతో పాటు పూర్తి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. రైలులో ప్రయాణికుల కోసం రెండు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.