Green Toilet Train: దక్షిణ భారతదేశంలోనే తొలి గ్రీన్ టాయిలెట్ రైలు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న రైళ్లలో పినాకిని ఇంటర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రధానమైనది. దక్షిణ భారతదేశంలోనే మొదటి గ్రీన్ టాయిలెట్లు కలిగిన రైలు ఇదే. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి తమిళనాడులోని చెన్నై నగరం మధ్య ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రయాణికులను తరలిస్తున్నది. పినాకిని ఎక్స్‌ప్రెస్ సేవలు జులై 1వ తేదీతో 30 ఏళ్లు పూర్తిచేసుకున్నాయి. 1992 జూలై ఒకటో తేదీన 2711/2712 నంబర్లతో విజయవాడ–చెన్నై మధ్య నడిచేలా పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కించారు.
ఘనంగా బర్త్‌డే వేడుకలు..
ఈ ఏడాది జులై 1వ తేదీ నాటికి పినాకిని ఎక్స్‌ప్రెస్ రైలు 30 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా విజయవాడ ఎలక్ట్రికల్ లోకో షెడ్ (ఈఎల్‌ఎస్) సిబ్బంది ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై రైలు బయలుదేరే ముందు బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. ఈఎల్‌ఎస్ సీనియర్ డీఈఈ సీహెచ్.దినేష్‌రెడ్డి, కోచింగ్ డిపో ఆఫీసర్ ఉదయ భాస్కర్, పీఆర్‌వో నస్రత్ మండ్రూప్కర్ కేక్ కట్ చేశారు. కోచింగ్ డిపో సిబ్బందిని డీఆర్‌ఎం శివేంద్రమోహన్ ప్రత్యేకంగా అభినందించారు.
పెన్నానది గుర్తుగా పినాకినిగా నామకరణం
రాష్ట్రంలోని నెల్లూరుజిల్లా పెన్నా నది మీదుగా రాకపోకలు సాగిస్తుండడంతో ఈ రైలుకు పినాకిని అని పేరు పెట్టారు. 2010 నుంచి 12711/12712 నంబర్ల మార్పుతో ఈ రైలు నడుస్తున్నది.
24 కోచ్‌లకు పెంపు
పినాకిని ఎక్స్‌ప్రెస్ రైలులో పూర్తిగా సిట్టింగ్ సదుపాయంతో మొదట్లో 18 కోచ్‌లు ఉండేవి. ప్రయాణికుల డిమాండ్ మేరకు 24 కోచ్‌లకు పెంచారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP