Biparjoy Cyclone: భయానకంగా బిపర్‌జోయ్.. గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంగా వీస్తున్న గాలులు
ప్రస్తుతం గుజరాత్ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో బిపర్‌జాయ్ తుఫాను పయణిస్తున్నదని తెలిపింది. దీని ప్రభావంతో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తున్నాయి. బిపర్‌జోయ్ తుపాను అత్యంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడనుంది. తీరం దాటక ముందే తుపాను ధాటికి గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర–కచ్ ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇప్పటికే తీరప్రాంతలు, తుపాను ప్రభావిత జిల్లాల్లో 74 వేల మందికిపైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కఛ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్‌లో కుంబవృష్టి ఖాయమని భారత వాతావరణ శాఖ తెలిపింది.
దేవభూమి ద్వారక, జామ్‌నగర్, జునాగఢ్, పోరుబందర్, రాజ్‌కోట్ జిల్లాల్లో జూన్ 14న ఉదయంకల్లా 24 గంటల్లో 50 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడింది. ఒకటి రెండు చోట్ల ఏకంగా 121 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అరేబియా సముద్రంలో తుపాను కేంద్రబిందువు కాస్తంత దిశ మార్చుకుని ఈశాన్యవైపుగా కదులుతూ కఛ్, సౌరాష్ట్రల మధ్య జఖౌ పోర్ట్ సమీపంలో జూన్ 15న సాయంత్రం తీరం దాటి బీభత్సం సృష్టించనుందని వెల్లడించింది.
Cyclones: ఆయా దేశాల్లో పిలవబడే తుఫాన్ల పేర్లు ఇవే..
పోరుబందర్, రాజ్‌కోట్, మోర్బీ, జునాగఢ్‌సహా ఇతర సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆ శాఖ అహ్మదాబాద్ డైరెక్టర్ మనోరమ మొహంతీ అంచనా వేశారు. తీరం దాటేటపుడు గంటకు 150 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. తుపాను విలయం ఊహించని రీతిలో ఉంటే దానికి తగ్గ సహాయక కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని త్రివిధ దళాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆదేశించారు.
వందల కొద్దీ సహాయక బృందాలు
‘ప్రస్తుతం తుఫాను కేంద్రబిందువు కచ్ తీరానికి 200 కి.మీ.ల దూరంలో ఉంది. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు 18, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు 12, రోడ్డు, భవనాల శాఖకు చెందిన 115 బృందాలు, విద్యుత్ శాఖకు చెందిన దాదాపు 400 బృందాలను రంగంలోకి దింపాం ’ అని స్టేట్ రిలీఫ్ కమిషనర్ అలోక్ కుమార్ పాండే చెప్పారు. మరోవైపు సిబ్బంది సన్నద్దతపై గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమీక్షా సమావేశం నిర్వహించి తాజా పరిస్థితిని తెల్సుకున్నారు. తీరానికి దూరంగా ఉన్న పాఠశాలలు, కార్యాలయాలను సహాయక శిబిరాలుగా మార్చారు. ఆహారం, తాగునీరు, వైద్యసదుపాయాలు కల్పించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో తగినంత మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు పంపారు. భుజ్ చేరుకొని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సైతం తుపాను వేళ వైద్యసేవలపై సమీక్ష జరిపారు. అరేబియా సముద్రంలో ఆరో తేదీన చిన్నదిగా మొదలైన తుపాను నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతూ శక్తిని పెంచుకుంటూ 11వ తేదీనాటికి భీకరంగా మారింది. ప్రచండ శక్తితో గుజరాత్, పాకిస్తాన్ తీరాల వైపు దూసుకొస్తోంది. జఖౌ పోర్టు సమీపంలో తీరాన్ని దాటి జనావాసాలపై తన పెనుప్రతాపం చూపనుంది.