Food Storage Scheme : ఆహార ధాన్యాల స్టోరేజీకి అతి భారీ పథకం.. రూ.లక్ష కోట్లతో..
పంట నష్టాలను తగ్గించడమే గాక నిల్వ సదుపాయం లేక రైతులు పంటను అయిన కాడికి అమ్ముకునే దుస్థితిని ఇది తప్పించనుంది. దేశ ఆహార భద్రతను కూడా మరింత పటిష్టం చేయనుంది. ఇందులో భాగంగా సహకార రంగంలో వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోకెల్లా అతి భారీగా 7 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల స్టోరేజీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి బ్లాకులో 2 వేల టన్నుల నిల్వ సామర్థ్యంతో గోదాములను ఏర్పాటు చేస్తారన్నారు. మంత్రివర్గ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు.
‘ప్రస్తుతం దేశ వార్షిక ఆహార ధాన్యాల ఉత్పత్తి దాదాపు 31 కోట్ల టన్నులు. కానీ నిల్వ సామర్థ్యం మాత్రం 14.5 కోట్ల టన్నులే. అంటే సగాని కంటే తక్కువ. తాజా పథకంతో అమలైతే అది 21.5 కోట్ల టన్నులకు పెరుగుతుంది. వికేంద్రీకృత తరహాలో ఎక్కడికక్కడ నిల్వ సామర్థ్యం ఏర్పాటు చేస్తే ఆహార ధాన్యాల వృథా, రవాణా వ్యయం తదితరాలన్నీ బాగా తగ్గుతాయి’ అని చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల (పీఏసీఎస్)ను ఇది బలోపేతం చేస్తుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్ష పీఏసీఎస్‌ల్లో 63 వేల దాకా చురుగ్గా పని చేస్తున్నాయి.
Rs.75 coin: రూ.75 నాణెం విడుదల.. కొత్త కాయిన్ పొందండి ఇలా ..
☛ ఆహార ధాన్యాల నిల్వ పథకం అమలుకు మంత్రుల కేమిటీ వేయనున్నారు. కేంద్ర సహకార శాఖ మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
☛ వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర శాఖలకు చెందిన పలు పథకాలను దీనిలో విలీనం చేస్తారు.
☛ ముందుగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన 10 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసి చూస్తారు. ఆ అనుభవాల ఆధారంగా పూర్తిస్థాయి పథకాన్ని దశలవారీగా అమల్లో పెడతారు.
☛ పీఏసీఎస్‌ల కార్యకలాపాలను విస్తృతం చేయడం ద్వారా వాటి ఆదాయాన్ని ఇతోధికంగా పెంచడం కూడా ఈ పథకం లక్ష్యాల్లో ఒకటి.