Central Govt Scheme: ఈవీలపై రూ.10వేల ప్రోత్సాహకం
దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ–మొబిలిటీ ప్రమోషన్ (ఈఎంపీ 2024) స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ పథకం ఏప్రిల్ ఒకటి నుంచి జూలై 31 వరకు అమలులో ఉంటుంది. ఈ స్కీమ్ కోసం నాలుగు నెలల పాటు రూ.500 కోట్లు వెచ్చించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే తెలిపారు. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సెకండ్ ఫేజ్ (ఫేమ్2) పథకం గడువు ఈ నెల(మార్చి) 31తో ముగియనుంది. పథకం గడువును పెంచే ఆలోచన లేదని.. ఈవీల కోసం కొత్త పథకాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. కొత్త పథకంలో ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలకు మాత్రమే ప్రోత్సాహకం అందుబాటులో ఉండనుంది. ఈ పథకం కింద కేంద్రం ప్రతి ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనంపై రూ.10వేల వరకు ప్రోత్సాహకం అందిస్తుంది. చిన్న ఎలక్ట్రికల్ త్రీ వీలర్ వాహనాలు (ఈ–రిక్షా, ఈ–కార్ట్) వాహనాలకు రూ.25వేలు, భారీ వాహనాలకు రూ.50వేల వరకు సబ్సిడీ వర్తిస్తుంది. కొత్తగా తీసుకువచ్చిన ఈ–మొబిలిటీ స్కీమ్‌లో దాదాపు 3.3 లక్షల ద్విచక్ర వాహనాలు, దాదాపు 31వేల ఎలక్ట్రికల్ త్రీ వీలర్స్‌కు సబ్సిడీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారీ పరిశ్రమల శాఖ తెలిపింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP