Cabinet Committee: రూ.6,828 కోట్లతో 70 శిక్షణ విమానాలు
Sakshi Education
భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం రూ.6,828 కోట్లతో 70 హెచ్‌టీటీ–40 బేసిక్ శిక్షణ విమానాల కోనుగోలుకు రంగం సిద్ధమైంది.
ఈ విమానాలను కొనుగోలు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) మార్చి 1న ఆమోదం తెలిపింది. రానున్న ఆరేళ్లలో ఈ విమానాలు ఐఏఎఫ్‌కు అందనున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్‌లో వెల్లడించారు. హెచ్‌టీటీ–40 విమానాలను ప్రభుత్వ రంగంలోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) ఉత్పత్తి చేయనుందని భారత రక్షణ శాఖ తెలియజేసింది.
తక్కువ వేగంతో నడిచే ఈ విమానాలతో వైమానిక దళం సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇవ్వొచ్చని పేర్కొంది. హెచ్‌టీటీ–40 విమానాల తయారీలో హెచ్‌ఏఎల్ సంస్థ ప్రైవేట్ పరిశ్రమలను కూడా భాగస్వాములను చేయనుంది. దీనివల్ల 100కుపైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో 1,500 మందికి ప్రత్యక్షంగా, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా.
Published date : 02 Mar 2023 03:29PM