Skip to main content

Bhupendra Patel: గుజరాత్‌ సీఎంగా భూపేంద్ర పటేల్‌ ప్రమాణ స్వీకారం

గుజరాత్‌ రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ డిసెంబ‌ర్ 12న‌ ప్రమాణ స్వీకారం చేశారు.
పటేల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న మోదీ

ఆ రాష్ట్ర‌ రాజధాని గాందీనగర్‌లో నూతన సచివాలయం సమీపంలోని హెలిప్యాడ్‌ గ్రౌండ్‌లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. భూపేంద్ర పటేల్‌ సీఎంగా ప్రమాణం చేయడం వరుసగా ఇది రెండోసారి. గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. అలాగే 16 మంది మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 8 మంది.. కానూ దేశాయ్, రిషికేశ్‌ పటేల్, రాఘవ్‌జీ పటేల్, బల్వంత్‌సింగ్‌ రాజ్‌పుత్, కున్వర్‌జీ బవాలియా, మూలూ బేరా, కుబేర్‌ దిందోర్, భానూబెన్‌ బబారియాకు కేబినెట్‌ ర్యాంకు దక్కింది. 11 మంది మాజీ మంత్రులకు మరోసారి మంత్రులుగా అవకాశం కల్పించారు. మంత్రివర్గంలో ఒక మహిళ ఉన్నారు.  

Sukhvinder Singh: హిమాచల్‌ సీఎంగా సుఖ్వీందర్‌
మున్సిపాలిటీ సభ్యుడి నుంచి సీఎం స్థాయికి
భూపేంద్ర.. పటీదార్‌లోని కేడ్వా ఉపకులానికి చెందిన వ్యక్తి. సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన భూపేంద్ర తొలినాళ్లలో రాజకీయాల్లోకి వచ్చినపుడు అహ్మదాబాద్‌ జిల్లాలోని మేమ్‌నగర్‌ మున్సిపాలిటీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1995–2006 వరకు మున్సిపాలిటీ సభ్యునిగా కొనసాగారు. అదే మున్సిపాలిటీకి రెండు సార్లు అధ్యక్షుడిగానూ సేవలందించారు. తర్వాత అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఏఎంసీ)కు స్థాయి కమిటీ చైర్మన్‌గా 2010నుంచి 2015దాకా పనిచేశారు. ఏఎంసీ అనేది గుజరాత్‌లోనే అత్యంత పెద్ద మున్సిపాలిటీ. ఆ తర్వాత ఆయన అహ్మదాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి 2015 నుంచి రెండేళ్లపాటు చైర్మన్‌గా పనిచేశారు. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తుండే ఈయనను స్థానికంగా అందరూ ‘దాదా’ అని పిలుచుకుంటారు.
పటీదార్ల సామాజిక, ఆర్థిక ప్రగతికి కృషిచేసే సర్దార్‌ధామ్‌ విశ్వ పటీదార్‌ కేంద్రానికి ట్రస్టీగా కొనసాగారు. రాజకీయాల్లో మరింత ఎదిగిన భూపేంద్ర ఆ తర్వాత మాజీ మహిళా ముఖ్యమంత్రి, ప్రస్తుత యూపీ గవర్నర్‌ అయిన ఆనందీబెన్‌ పటేల్‌ నియోజకవర్గమైన ఘట్లోడియా నుంచి తొలిసారిగా 2017లో ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. తాజాగా మరోసారి అదే నియోజకవర్గంలో ఏకంగా 1.17 లక్షల మెజారిటీతో గెలుపుబావుటా ఎగరేశారు. అహ్మదాబాద్‌లోని శిలాజ్‌ ప్రాంతంలో భార్య హీతల్‌బెన్‌తో నివసించే ఈయనకు క్రికెట్, బ్యాడ్మింటన్‌ అంటే ఎంతో ఇష్టం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గాపాల్గొంటారు.  

 

Published date : 13 Dec 2022 11:48AM

Photo Stories