Andaman Islands: అండమాన్‌లో 21 దీవులకు ‘పరమ వీరచక్ర’ల పేర్లు
నేతాజీ 126వ జయంతిని పురస్కరించుకొని జనవరి 23వ తేదీ ఘనంగా నివాళులర్పించారు. ప్రతిపాదిత నేతాజీ స్మారకం నమూనాను వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఈ స్మారకాన్ని కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లోని రాస్ ఐలాండ్‌లో ఏర్పాటు చేయనున్నారు. నేతాజీ జయంతి సందర్భంగా అండమాన్‌లోని 21 దీవులకు పరమ వీరచక్ర పురస్కార గ్రహీతల పేర్లను పెట్టారు. సుభాష్‌చంద్రబోస్ 1943లో తొలిసారిగా అండమాన్ గడ్డపైనే జాతీయ జెండాను ఎగురవేశారని మోదీ గుర్తుచేశారు. అండమాన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం రావడం గర్వకారణంగా భావిస్తున్నానని చెప్పారు.
దీవులకు వీర సైనికుల పేర్లు పెట్టామని, ఈ దీవులు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినందిస్తాయని తెలిపారు. మేజర్ సోమనాథ్ శర్మ, లెఫ్టినెంట్ కల్నల్(అనంతరం మేజర్) ధన్‌సింగ్ థాపా, సుబేదార్ జోగీందర్ సింగ్, మేజర్ షైతాన్ సింగ్, కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవల్దార్ అబ్దుల్ హమీద్, సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ క్షేత్రపాల్, ఫ్లైట్ ఆఫీసర్ నిర్మల్జిత్ సింగ్ షెకాన్ తదితర వీర జవాన్ల పేర్లను అండమాన్ దీవులకు పెట్టినట్లు వెల్లడించారు. ఈ దీవులు బానిసత్వానికి గుర్తులుగా ఉండేవని, దాన్ని మార్చేందుకే జవాన్ల పేరిట నామకరణం చేసినట్లు వివరించారు.
Exam Warriors: 13 భాషల్లో ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం
నేతాజీ పత్రాలను బహిర్గతం చేశాం
స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ పాత్రను తగ్గించి చూపేందుకు ప్రయత్నాలు జరిగాయని మోదీ ఆరోపించారు. ‘‘కానీ ఈ రోజు ఢిల్లీ నుంచి అండమాన్ దాకా ఈ రోజు దేశం మొత్తం ఆ మహావీరుడికి ఘనంగా నివాళులర్పిస్తోంది. పరాక్రమ్ దివస్ నిర్వహించుకుంటోంది. నేతాజీ చరిత్రను, వారసత్వాన్ని పరిరక్షించుకొంటున్నాం. ఆయనకు సంబంధించిన పత్రాలను మా ప్రభుత్వం బయట పెట్టింది’’ అన్నారు. 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టడం హర్షణీయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అండమాన్‌లోని ప్రఖ్యాత సెల్యూలార్ జైల్ తీర్థయాత్ర క్షేత్రం కంటే ఎంతమాత్రం తక్కువ కాదని వ్యాఖ్యానించారు. రాస్ ఐలాండ్‌లో నేతాజీ స్మారకంలో మ్యూజియం, కేబుల్ కార్ రోప్‌పే, లేజర్–సౌండ్ షో, చిల్డ్రన్స్ అమ్యూజ్‌మెంట్ పార్కు, రెస్ట్రో లాంజ్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.