Skip to main content

Bruce Lee Death: బ్రూస్‌ లీ మరణం.. న‌మ్మ‌లేని నిజం.. అస‌లు కార‌ణం ఏంటి..?

తరాలు మారుతున్న మార్షల్‌ ఆర్ట్స్‌పై ఆసక్తికనబరిచే యువతకు ఆదర్శం బ్రూస్ లీనే. ఈయ‌న‌ మార్షల్‌ ఆర్ట్స్‌కు ఐకాన్‌. ముఖ్యంగా చైనీస్‌ మార్షల్‌ ఆర్ట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని ఆదరణ సాధించి పెట్టిన కుంగ్‌ఫూ వీరుడు. మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రియులౖకైతే అక్షరాలా ఆరాధ్య దైవమే. బతికింది కొన్నేళ్లే అయినా మార్షల్‌ ఆర్ట్స్‌కు మారుపేరుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.

మరణించి తరాలు గడుస్తున్నా ఆయనకు ఆదరణ నానాటికీ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఎంటర్‌ ద డ్రాగన్‌తో సహా బ్రూస్‌ లీ తీసిన హాలీవుడ్‌ సినిమాలన్నీ మాస్టర్‌పీస్‌లుగా నిలిచి ఇప్పటికీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి. 

Success Story: పెట్రోల్ బంక్‌లో ప‌నిచేస్తూ.. కలెక్టర్ అయ్యానిలా..

బ్రూస్‌ లీ మరణానికి కార‌ణం ఇదే..
ఈ యాక్షన్‌ వీరుడు కేవలం 32 ఏళ్ల వయసులో హఠాత్తుగా మరణించి అభిమానులను శోకసంద్రంలో ముంచాడు. అందుకు కారణమేమిటన్నది ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రత్యర్థులు హతమార్చారని, ఎండ దెబ్బ కొట్టిందని, కొకైన్‌ మితిమీరి వాడాడని.. ఇలా రకరకాల పుకార్లే తప్ప నిజమేమిటో ఎవరికీ తెలియదు. అయితే మంచినీళ్లు మితిమీరి తాగడమే బ్రూస్‌ లీ మరణానికి దారి తీసిందని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది..! 

Bruce lee


బ్రూస్‌ లీ 1973 జూలై 20న హాంకాంగ్‌లో మరణించాడు. హైపోనాట్రేమియానే అందుకు దారి తీసిందని మాడ్రిడ్‌లోని ఐఐఎస్‌–ఫౌండేషన్‌ జిమెనెజ్‌ డియాజ్‌ యూఏఎస్‌కు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ పరిశోధకులు అంటున్నారు. నీళ్లు అతిగా తాగడం వల్ల ఒంట్లో సోడియం గాఢత తగ్గడాన్ని హైపోనాట్రేమియా అంటారు. గుండె, మూత్రపిండాల వంటివి సజావుగా పనిచేయడంలో సోడియం పాత్ర అతి కీలకం. 
నీళ్లు మితిమీరి తాగితే సోడియం నీళ్లలో కలిసిపోయి మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతూ ఉంటుంది. చాలాకాలం ఇలా జరిగితే ఒంట్లో సోడియం లోపం తలెత్తి కణాలు క్రియారహితంగా మారతాయి. కిడ్నీలు ఫెయిలవుతాయి. అదనపు నీరు ఒంట్లోంచి బయటికి వెళ్లదు. బ్రూస్‌ లీ విషయంలో సరిగ్గా ఇదే జరిగిందని అధ్యయనం చెబుతోంది. ఫలితంగా మెదడు వాచి మరణానికి దారి తీసిందంటోంది. ‘‘బ్రూస్‌ లీ పోస్ట్‌మార్టం రిపోర్టులోని వివరాల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చాం. ఆయన మెదడు 1,575 గ్రాములకు పెరిగిందని పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. ఇది సాధారణం కంటే 175 గ్రాములు ఎక్కువ’’ అని పేర్కొంది. ధారాళంగా నీళ్లు తాగడమే గాక క్యారెట్, ఆపిల్‌ జ్యూస్‌లనే ప్రధాన ఆహారంగా తీసుకోవడం బ్రూస్‌ లీకి ఏళ్ల తరబడి అలవాటని గుర్తు చేసింది. ముఖ్యంగా చనిపోయిన రోజంతా బ్రూస్‌ లీ పదేపదే నీళ్లు తాగుతూ గడిపాడని సన్నిహితులు చెప్పడాన్ని ఉటంకించింది. ఈ అధ్యయన పత్రం క్లినికల్‌ కిడ్నీ జర్నల్లో పబ్లిషైంది. 
అస‌లు ఆ రోజు ఏం జరిగింది..? 

Bruce lee


బ్రూస్‌ లీ 1940 నవంబర్‌ 27న జన్మించాడు. 13 ఏళ్ల కల్లా హాంకాంగ్‌లో మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సాధించాడు. 16 ఏళ్ల వయసులో అమెరికా వెళ్లాడు. 26వ ఏట అమెరికా టీవీలో మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైటర్‌గా కనిపించి అలరించాడు. ముఖ్యంగా జిత్‌ కునెడో పేరిట ఆయన ప్రవేశపెట్టిన సొంత ఫైటింగ్‌ టెక్నిక్‌ జనానికి పిచ్చిగా నచ్చింది. 29వ ఏట బ్రూస్‌ లీ హాంకాంగ్‌ తిరిగి వెళ్లాడు. సినీ రచయితగా, డైరెక్టర్‌గా, నటునిగా, ఫైట్‌మాస్టర్‌గా పని చేశాడు. ఎంటర్‌ ద డ్రాగన్‌ తదితర చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరాధ్యుడయ్యాడు. 1973 జూలై 20న ఒక సినిమాకు సంబంధించిన యాక్షన్‌ సీన్లలో నటించిన అనంతరం బ్రూస్‌ లీ ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 7.30 ప్రాంతంలో నొప్పితో తల తిరుగుతోందని చెప్పాడు. ఏక్వజెసిక్‌ ట్యాబ్లెట్‌ వేసుకుని బెడ్రూంలోకి వెళ్లాడు. 9.30 కల్లా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అప్పటికే హృదయస్పందన ఆగిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించారు. అంతకు రెండు నెలల క్రితమే బ్రూస్‌లీకి మెదడు వాపు సంబంధిత సమస్య తలెత్తింది. కాసేపు అపస్మారక స్థితిలోకి వెళ్లి కోలుకున్నాడు.   

ఈమె పేరే ఒక‌ సంచలనం.. ఇదే తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని..

ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత నీరు తీసుకోవాలి?
కొందరు రెండు, కొందరు మూడు, కొందరు ఐదు లీటర్లు అంటూ చెప్తుంటారు. కానీ శాస్త్రీయంగా దీనికంటూ ఓ పరిమితి లేదు. వైద్య నిపుణులు గంటలో లీటర్‌ లోపు నీటిని మాత్రమే తీసుకోవాలని తద్వారా కిడ్నీలపై ఒత్తిడి ఉండదని చెప్తున్నారు. అంతేకాదు అతిగా నీటిని తీసుకోవడం మూలంగా మానసిక అనారోగ్యం కూడా సంభవించవచ్చని అంటున్నారు.

Published date : 24 Nov 2022 01:28PM

Photo Stories