China Border: సరిహద్దుల్లో శాంతితోనే చైనాతో సత్సంబంధాలు
సరిహద్దులకు అత్యంత సమీపంలో చైనా తన బలగాలను మోహరించడమే ప్రధాన సమస్య అని ఆయన జూన్ 8న మీడియా సమావేశంలో పేర్కొన్నారు. చైనాతో సంబంధాలను మెరుగుపర్చుకోవాలని భారత్ కూడా కోరుకుంటోందన్న ఆయన.. రెండు దేశాల సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత నెలకొన్నప్పుడు మాత్రమే అలాంటిది సాధ్యమని పేర్కొన్నారు. చైనా ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని ఆ దేశానికి తెలియజేశామన్నారు.
ఘర్షణలు, రెచ్చగొట్టే చర్యలు, తప్పుడు కథనాలు వంటి వాటికి భారత్ భయపడబోదన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌ల పట్ల చైనాకు తన నిరసనను భారత్ పలుమార్లు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణకు మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఇరు దేశాలకు ఉందన్నారు. ‘ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న పరిస్థితులు చైనాకు కూడా ఏమంత మంచివికావు. సరిహద్దుల్లో పరిస్థితుల ప్రభావం ఇప్పటికే రెండు దేశాల సంబంధాలపై ప్రభావం చూపింది..ఇంకా చూపుతోంది. సరిహద్దుల్లో ప్రశాంతత లేనప్పుడు సాధారణ సంబంధాలను ఆశించడం సరికాదు’ అని జై శంకర్ అన్నారు.
Kharif Crops : రైతుకు మరింత దన్ను.. 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
2020 మేలో సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తినప్పుడు చైనా బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను మీడియా ప్రస్తావించగా.. సరిహద్దులకు అత్యంత సమీపంలో రెండు దేశాల బలగాల మోహరింపే అసలైన సమస్య అని మంత్రి బదులిచ్చారు. సమస్య పరిష్కారానికి రెండు పక్షాలు చర్చలు జరుపుతున్నాయని చెప్పారు. ‘సంబంధాలు మాత్రం తెగిపోలేదు. విషయం ఏమిటంటే..రెండు దశాబ్దాల్లోనే అత్యంత భీకరంగా 2020 జూన్‌లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి.
గల్వాన్ ఘర్షణల తర్వాత రోజు ఉదయం చైనా విదేశాంగ మంత్రితో ఫోన్‌లో మాట్లాడాను కూడా. ఆ తర్వాత కూడా దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు సాగిస్తున్నాం. అయితే, చైనా మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఘర్షణలకు దిగుతోంది. అందుకే ఆ దేశంతో సంబంధాలు గాడినపడటం లేదు’అని వివరించారు. ఒక్క చైనాతో తప్ప అన్ని ముఖ్యమైన అన్ని దేశాలు, సమూహాలతో భారత్ సంబంధాలు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు.