Alzheimer's: అల్జీమర్స్‌ను అర్థం చేసుకునే కొత్త సాంకేతికతను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు?
కుంగుబాటు, అల్జీమర్స్, స్కిజోఫ్రేనియా వంటి మెదడు సంబంధిత రుగ్మతలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడంలో దోహదపడగల సరికొత్త సాంకేతిక సాధనాన్ని భారత్, అమెరికా శాస్త్రవేత్తలు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఆయా వ్యక్తులకు అనువైన చికిత్సా విధానాలను రూపొందించడంలోనూ అది దోహదపడుతుందని వారు తెలిపారు. అవేనా సటైవా(ఓట్స్) మొక్కల్లో కనిపించే ‘ఏఎస్‌ఎల్‌వోవీ2’ ఫొటోట్రోపిక్ రిసెప్టార్లపై తొలుత తాము అధ్యయనం చేసినట్లు జామియా మిలియా ఇస్లామియా(జేఎంఐ) విశ్వవిద్యాలయం, అమెరికాకు చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ ఐహెచ్) పరిశోధకులు తెలిపారు. వాటిని ప్రేరణగా తీసుకొని.. న్యూరేగులిన్ 3 (ఎన్ ఆర్‌జీ3) ప్రొటీన్ , లైట్ సెన్సిటివ్ డొమైన్ ఎల్‌వోవీ2ల సంయోజనంతో వినూత్న కైమెరిక్ అణు నమూనాలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. నాడీకణాల్లో ప్రొటీన్ల స్థితిగతుల్లో మార్పును అధ్యయనం చేసేందుకు ఈ ఆవిష్కరణ దోహదపడుతుందని వివరించారు. దాని సాయంతో మెదడు సంబంధిత వ్యాధులను మెరుగ్గా అర్థం చేసుకోవచ్చునని పేర్కొన్నారు.