World Food Day: అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత గురించి అవగాహన పెంపొందించడానికి, ఆకలి, పోషకాహార లోపాలపై చర్యలు తీసుకోవడానికి ఈ రోజు జరుపుకుంటారు.
ఈ ఏడాది థీమ్.. "మెరుగైన జీవితం మరియు మెరుగైన భవిష్యత్తు కోసం ఆహార హక్కు(Right to Food for a Better Life and a Better Future)". ఈ థీమ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆహారానికి సంబంధించిన అంశాలు, ఆరోగ్యకరమైన ఆహారం అందించడానికి అవసరమైన విధానాలు, అందరికీ అందుబాటులో ఉండే ఆహారాన్ని ప్రోత్సహించడం వంటి విషయాలను ప్రచారం చేయాలని లక్ష్యంగా ఉంది.
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) 1945లో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రారంభించింది. ఆహారం అనేది విభిన్నత, పోషణ, సరసమైన ధర, భద్రత, ప్రాప్తతతో నిర్వచించబడిందని ఎఫ్ఏఓ పేర్కొంది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని అక్టోబర్ 16వ తేదీ జరుపుకుంటున్నారు.
ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ఆహారం చాలా ముఖ్యం. కొన్నిచోట్ల ఆహార కొరత కనిపిస్తుంటే, మరికొన్ని చోట్ల ఆహారం వృధా అవుతోంది. ఆహారాన్ని వృధా చేసే వారు ఆహార కొరతను అర్థం చేసుకుని జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉంది. ఈ విషయం గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కూడా ప్రపంచ ఆహార దినోత్సవానికి ఒక ముఖ్యమైన అంశం.
ప్రస్తుతం.. ఐక్యరాజ్యసమితి ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల మందికి ఆహార కొరత ఉంది. అందులో 78 కోట్ల మంది ఆకలితో ఉన్నారు. 14 కోట్ల మంది పిల్లలు పోషకాహార లోపం కారణంగా ఎదుగుదలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అనేక దేశాలలో ఆహార వృధా జరుగుతుండగా, పశ్చిమాసియా, ఆఫ్రికా, కరీబియన్ దేశాల్లో 20% ప్రజలు ఆకలితో నష్టపోతున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి సంఘటనలు కూడా ఆహార కొరతను పెంచుతున్నాయి. యుద్ధాలు, మహమ్మారులు, ప్రకృతి వైపరీత్యాలు ఈ పరిస్థితిని మరింత కష్టతరంగా మారుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో.. ధనవంతులు ఆహారాన్ని వృధా చేయకుండా పేదవారితో పంచుకోవడం ద్వారా ఆకలితో ఉన్న వారి సంఖ్యను తగ్గించవచ్చు. మీరు చేసే ఆహార వృధా ఇతర కుటుంబాలను ఆకలితో బాధపడేలా చేస్తుందని గుర్తించాలి. అందువల్ల, ఆహారాన్ని జాగ్రత్తగా వినియోగించడం, అంగీకరించడం అత్యంత అవసరం.
October Important Days: అక్టోబర్ నెలలోని జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు ఇవే..