World Health Organization: పొగాకు వ్యర్థాలపై షాకింగ్ నిజాలు
పొగాకు ఉత్పత్తుల నుంచి వచ్చే వ్యర్థాల గురించి షాకింగ్ నిజాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) బయట పెట్టింది. మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని.. డబ్ల్యూహెచ్‌వో కీలక విషయాలను వెల్లడించింది. పొగాకు పరిశ్రమ ప్రతి సంవత్సరం ప్రపంచంలోని ఎనిమిది మిలియన్లకు పైగా మానవ జీవితాలను హరిస్తోందని తెలిపింది. అంతేకాకుండా పొగాకు ఉత్పత్తుల కారణంగా 600 మిలియన్‌ల చెట్లను, 200,000 హెక్టార్ల భూమిని, 22 బిలియన్ టన్నుల నీరు, 84 మిలియన్ టన్నుల CO2ను కోల్పోతున్నామని పేర్కొంది. పొగాకు ఉత్పత్తులు కలిగించే విధ్వంసానికి పరిశ్రమను జవాబుదారీగా చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. పొగాకు ఉత్పత్తుల నుంచి వచ్చే వ్యర్థాలను శుభ్రపరచడానికి భారతదేశానికి ప్రతి సంవత్సరం 766 మిలియన్లు(రూ.5,900 కోట్లకు పైగా) ఖర్చవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతేకాకుండా డబ్ల్యూహెచ్‌వో అంచనా ప్రకారం–భారతదేశంలోని అన్ని ఉత్పత్తుల వ్యర్థాల నుంచి వచ్చే మొత్తం చెత్తను శుభ్రపరచడానికి సుమారు 8 బిలియన్ల వ్యయం అవుతుంది. ఇందులో దాదాపు 9.57శాతం పొగాకు ఉత్పత్తుల చెత్తను శుభ్రపరచడానికి వెళ్తుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.