Skip to main content

నవంబర్ 2017 ఎకానమీ

15వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం
15వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నవంబర్ 22న నిర్ణయించింది. ఈ సంఘం పన్నుల ఆదాయ వనరులను మదింపు వేసి వాటిని కేంద్రం, రాష్ట్రాల వారీగా ఏ విధంగా పంపిణీ చేయాలన్న విధానాన్ని రూపొందిస్తుంది. 15వ ఆర్థిక సంఘం సభ్యులను త్వరలోనే నియమిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2015 జనవరి 1 నుంచి 2020 మార్చి 31 వరకు కాలానికి అమల్లో ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 15వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు నిర్ణయం
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర కేబినెట్

ఐటీ చట్టాల సమీక్షకు అత్యున్నత స్థాయి కమిటీ
ఆదాయపు పన్ను చట్టాల సమీక్షకు కేంద్రం ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 50 సంవత్సరాలకుపైగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టాన్ని దేశ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పునర్ లిఖించడం, ముసాయిదా రూపకల్పన ఈ కమిటీ కర్తవ్యం. ఆరు నెలల్లో కమిటీ ఈ మేరకు తన నివేదికను సమర్పించాల్సి ఉంది.
కన్వీనర్‌గా అరవింద్ మోదీ
ఆరుగురు సభ్యుల కమిటీకి సీబీడీటీ సభ్యులు (లెజిస్లేషన్) అరవింద్‌మోదీ కన్వీనర్‌గా ఉంటారు. గిరీష్ అహూజా (చార్డెడ్ అకౌంటెంట్), రాజీవ్ మెమానీ (ఈవై చైర్మన్ అండ్ రీజినల్ మేనేజింగ్ పార్ట్నర్) మాన్సీ కేడియా (కన్సల్టెంట్, ఐసీఆర్‌ఐఈఆర్) కమిటీలో సభ్యులుగా ఉన్నారని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం కమిటీకి శాశ్వత ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారు. వివిధ దేశాల్లో ప్రస్తుతం పన్ను వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తోంది? అంతర్జాతీయ స్థాయిలో పాటిస్తున్న అత్యున్నత ప్రమాణాలు ఏమిటి? దేశ అవసరాలకు అనుగుణంగా కొత్త ఆదాయపు పన్ను చట్టం ఎలా ఉండాలి? వంటి అంశాలను తన కర్తవ్య నిర్వహణలో కమిటీ పరిశీలిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐటీ చట్టాల సమీక్షకు అరవింద్ మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : ఆదాయపు పన్ను చట్టాల సమీక్షకు

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో హైక్ జట్టు
Current Affairs దేశీ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘హైక్’ తాజాగా తన యూజర్లకు మెరుగైన డిజిటల్ వాలెట్ సర్వీసులు అందించేందుకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హైక్ యూజర్లు ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్‌కు సంబంధించిన మర్చంట్, యుటిలిటీ పేమెంట్ సర్వీసులు పొందొచ్చు. 2012లో ప్రారంభమైన హైక్‌కు ప్రస్తుతం 10 కోట్లకుపైగా యూజర్లు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌తో హైక్ జట్టు
ఎప్పుడు : నవంబర్ 22
ఎందుకు : యూజర్లకు మెరుగైన డిజిటల్ వాలెట్ సర్వీసులు అందించేందుకు

న్యూఢిల్లీలో సైబర్ స్పేస్ ప్రపంచ సదస్సు
ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ తీవ్రమవుతోన్న సైబర్ ముప్పుని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవలంబించాల్సిన విధానాలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో నవంబర్ 23, 24 తేదీల్లో 5వ సైబర్ స్పేస్ ప్రపంచ సదస్సు (Global conference on cyber space) జరిగింది. ఈ సదస్సుకి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు దేశాల మధ్య సమాచార మార్పిడి, సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదాలకు ఇంటర్నెట్ ఆటస్థలంగా మారకుండా చూడాలని ప్రపంచ దేశాలకు సూచించారు. కార్యక్రమంలో శ్రీలంక ప్రధాని విక్రమసింఘే కూడా పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ స్పేస్
ఎప్పుడు : నవంబర్ 23, 24
ఎక్కడ : న్యూఢిల్లీ

దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన పథకం ప్రారంభం
తపాలా బిళ్లల సేకరణ చేసేవారికి కేంద్రప్రభుత్వం ఉపకార వేతనం (స్కాలర్‌షిప్) అందించనుంది. పోస్టాఫీసుల వైపు విద్యార్థులను మళ్లించేందుకు వారిలో తపాలాబిళ్లల సేకరణ అలవాటును పెంచాలని నిర్ణయించింది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పరిమిత సంఖ్యలో ఉపకార వేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో ఎంపికై న వారికి రూ.ఆరు వేల ఆర్థిక సాయం అందుతుంది. దీన్ని ప్రతి మూడు నెలలకు రూ.1,500 చొప్పున తపాలాశాఖ చెల్లిస్తుంది. ఈ మేరకు దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన పేరుతో కేంద్రం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇందులో స్పర్శ్ (ఎస్‌పీఏఆర్‌ఎస్‌హెచ్)ను స్కాలర్‌షిప్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్స్ యాజ్ ఏ హాబీగా పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన పథకం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : తపాలా బిళ్లల సేకరణకు విద్యార్థులకు ఉపకార వేతనం ఇచ్చేందుకు

సామాజిక సేవకు సునీల్ మిట్టల్ 7,000 కోట్ల విరాళం
ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎయిర్‌టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ కుటుంబం తమ సంపదలో 10 శాతాన్ని దాతృత్వానికి ఇస్తామని ప్రతిన బూనింది. ఈ మొత్తం సుమారు రూ.7,000 కోట్లు. భారతీ ఎయిర్‌టెల్ కంపెనీలో మిట్టల్ కుటుంబ సభ్యులకు ఉన్న మూడు శాతం వాటా కూడా విరాళంలో భాగమే. ఈ మొత్తాన్ని తమ కుటుంబం తరఫున ఏర్పాటు చేసిన భారతీ ఫౌండేషన్ కార్యక్రమాల కోసం ఇవ్వనున్నట్టు సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు. తన సోదరులు రాకేశ్, రాజన్‌తో కలసి ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రతిభావంతులైన నిరుపేదలకు ఉచితంగా విద్యనందించేందుకు సత్యభారతి యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని మిట్టల్ చెప్పారు. ఉత్తర భారతంలో ఏర్పాటు చేయనున్న ఈ యూనివర్సిటీ 2021 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. విరాళంలో అధిక భాగం యూనివర్సిటీ ప్రాజెక్టుపైనే వెచ్చించనున్నామని, కొంత మేర ఇప్పటికే నిర్వహిస్తున్న సత్యభారతి స్కూళ్ల విస్తరణకు వినియోగిస్తామని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సామాజిక సేవకు రూ. 7,000 కోట్ల విరాళం
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : భారతీ ఎయిర్‌టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ కుటుంబం

సీఎస్‌ఆర్ కింద వెయ్యి గ్రామాల అభివృద్ధి : హెచ్‌డీఎఫ్‌సీ
కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వెయి్య గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించింది. ఈ మేరకు 16 రాష్ట్రాల పరిధిలోని వెయి్య గ్రామాల్లో పది లక్షల మంది ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించనుంది. హోలిస్టిక్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(హెచ్‌ఆర్‌డీపీ)లో భాగంగా రెండున్నరేళ్ల కాలంలో 750 వెనకబడిన గ్రామాలకు సాధికారత కల్పించామని బ్యాంకు పేర్కొంది. హెచ్‌ఆర్‌డీపీలో భాగంగా విద్య, నీరు, పారిశుద్ధ్యం, అందరికీ బ్యాంకింగ్ సేవలు తదితర రంగాల్లో మెరుగుదలకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వచ్చే ఆర్థిక సంవత్సరంలో సీఎస్‌ఆర్ కింద వెయ్యి గ్రామాల అభివృద్ధి
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

ఎస్‌బీఐ ‘యోనో’ యాప్‌ను ఆవిష్కరించిన అరుణ్ జైట్లీ
డిజిటల్ సేవలను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా యోనో (యూ నీడ్ ఓన్లీ వన్) పేరిట కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నవంబర్ 24న ఈ యాప్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. ఆన్‌లైన్‌లోనే బ్యాంకు ఖాతాను తెరవడం, లావాదేవీలు నిర్వహించడం, రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవడం నుంచి ఆన్‌లైన్ షాపింగ్ దాకా ఈ యాప్ ద్వారా నిర్వహించే వెసులుబాటు ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై ఇది అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందించేందుకు 60 పైగా ఈ-కామర్స్ సంస్థలతో ఎస్‌బీఐ చేతులు కలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యెనో యాప్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : ఎస్‌బీఐ
ఎందుకు : డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు

భారత్ రేటింగ్‌ను యథాతథంగా కొనసాగించిన ఎస్ అండ్ పీ
భారత్‌కు ఇస్తున్న రేటింగ్ ‘బీబీబీ-మైనస్‌ను’ స్టేబుల్ అవుట్‌లుక్‌తో ఇదే విధంగా కొనసాగించనున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ‘స్టేబుల్ అవుట్‌లుక్’ అనేది భారత పటిష్ట వృద్ధికి సంకేతమని వివరించింది. పటిష్ట వృద్ధి ధోరణి రెండేళ్లు కొనసాగుతుందని కూడా ఎస్ అండ్ పీ అంచనావేసింది. అతి తక్కువ తలసరి ఆదాయం, ప్రభుత్వానికున్న భారీ రుణం ప్రాతిపదికన యథాతథ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు సూచించింది.
2007 వరకూ ఎస్‌అండ్‌పీ భారత్ రేటింగ్ ‘బీబీబీ మైనస్’గా ఉండేది. ఇది అతి దిగువ స్థాయి గ్రేడ్. ఈ రేటింగ్‌కు ఎస్‌అండ్‌పీ 2007 జనవరిలో ‘స్టేబుల్ అవుట్‌లుక్’ను చేర్చింది. 2009లో అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’కు మార్చిన సంస్థ, మళ్లీ 2010లో స్టేబుల్ హోదా ఇచ్చింది. 2012లో మళ్లీ నెగటివ్ అవుట్‌లుక్‌కు మార్చిన ఎస్‌అండ్‌పీ... మోడీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టాక మళ్లీ ‘స్టేబుల్’ అవుట్‌లుక్‌ను ఇచ్చింది. ఇదే రేటింగ్ ఇప్పటికీ కొనసాగుతోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు ‘బీబీబీ-మైనస్’ రేటింగ్ కొనసాగింపు
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : స్టాండర్డ్ అండ్ పూర్

మహిళా సాధికారతకు అమెజాన్ ‘సహేలి’
మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ ‘సహేలి’ అనే కార్యక్రమాన్ని నవంబర్ 28న ఆవిష్కరించింది. మహిళలు తయారు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్, దుస్తులు, హ్యాండ్‌బ్యాగ్‌‌స, గృహాలంకరణ ఉత్పత్తులు విక్రయించేందుకు వీలుగా సహేలి ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా సబ్సిడీతో రెఫరల్ ఫీజు, ఉత్పత్తుల ఉచిత చిత్రీకరణ, ఖాతా నిర్వహణకు మహిళా వ్యాపారులకు తోడ్పాటునిస్తారు. సెల్ఫ్ ఎంప్లాయ్‌డ్ వుమెన్ అసోసియేషన్, ఇంపల్స్ సోషల్ ఎంటర్‌ప్రైస్ సహకారంతో అమెజాన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహిళా సాధికారతకు సహేలి కార్యక్రమం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : అమెజాన్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించడానికి

పేటీఎం పేమెంట్ బ్యాంక్ ప్రారంభం
పేటీఎం పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నవంబర్ 28న ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన టెక్నాలజీ దేశ బ్యాంకింగ్ రూపురేఖలను మార్చేసి నగదు స్థానాన్ని భర్తీ చేస్తోందన్నారు. ఈ బ్యాంక్ కార్యకలాపాలను 2017 మేలో ప్రయోగాత్మకంగా చేపట్టగా, ఇప్పుడు అధికారికంగా ప్రారంభించారు. ఈ సంస్థ కనీస బ్యాలెన్‌‌సలేని, ఉచిత ఆన్‌లైన్ లావాదేవీలను ఆఫర్ చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పేటీఎం పేమెంట్ బ్యాంక్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : పేటీఎం

పప్పుధాన్యాల ఎగుమతికి కేంద్రం అనుమతి
Current Affairs
రైతులకు మేలు చేకూర్చేలా అన్ని రకాల పప్పుధాన్యాల ఎగుమతులకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్ 16న జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆ మేరకు ఎగుమతులపై నిషేధం ఎత్తివేతకు ఆమోదం తెలిపారు.
మన అవసరాలకు మించి అధికంగా పండే పప్పుధాన్యాలకు ప్రత్యామ్నాయ మార్కెట్‌గా ఈ ఎగుమతులు ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తోంది. పప్పు దినుసులపై ఎగుమతి, దిగుమతి విధానాన్ని సమీక్షించేందుకు కేంద్ర ఆహార, పౌర సరఫరా కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి అధికారం కల్పిస్తూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) నిర్ణయం తీసుకుంది. పప్పు ధాన్యాల నిల్వల పరిమాణం, ఉత్పత్తికి అనుగుణంగా దిగుమతి సుంకాల్లో మార్పులు, డిమాండ్, స్థానిక, అంతర్జాతీయ ధరలు తదితర అంశాల్ని కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది. 2016-17లో ప్రభుత్వం 20 లక్షల టన్నుల పప్పుధాన్యాల్ని మద్దతు ధర చెల్లించి సేకరించింది. అంత భారీ మొత్తంలో పప్పుధాన్యాల్ని సేకరించడం ఇదే తొలిసారి.
కేబినెట్ నిర్ణయాలు...
  • ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (పీఎంఏవై-అర్బన్) పథకంలో ఇళ్ల నిర్మాణాల కార్పెట్ ఏరియాను పెంచేందుకు అనుమతి.
  • జీఎస్టీలో భాగంగా నేషనల్ యాంటీ-ప్రాఫిటీరింగ్ అథారిటీ ఏర్పాటుకూ ఆమోదం. జీఎస్టీలో పన్ను తగ్గింపు లాభం వినియోగదారుడికి అందకపోతే.. ఈ అథారిటీకి ఫిర్యాదు చేయొచ్చు. ఐదుగురు సభ్యుల ఈ కమిటీకి కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా నేతృత్వం వహిస్తారు. రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా, సీబీఈసీ చైర్మన్ వనజా సర్నా, రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. చైర్మన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్ల పాటు కమిటీ కొనసాగుతుంది.
  • ఐసీడీఎస్‌లో నాలుగు పథకాల్ని నవంబర్ 2018 వరకూ కొనసాగించాలని నిర్ణయం. ఇందులో అంగన్‌వాడీ సేవలు, సబల, బాలల పరిరక్షణ సేవలు, జాతీయ శిశు సంరక్షణ పథకాలు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పప్పు ధాన్యాల ఎగుమతికి అనుమతి
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : కేంద్ర కేబినెట్

తలసరి ఆదాయంలో భారత్ ర్యాంకు 126
స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) ఆధారంగా తలసరి ఆదాయానికి సంబంధించి భారత్ 7,170 డాలర్ల ఆదాయంతో 126వ ర్యాంకులో నిలిచింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ ఈ మేరకు నవంబర్ 18న తాజా గణాంకాలు విడుదల చేసింది. గతేడాది(2016) ఐఎంఎఫ్ గణాంకాల్లో భారత్ 6,690 డాలర్ల తలసరి ఆదాయంతో 127వ ర్యాంకులో ఉంది.
కొనుగోలు శక్తి ఆధారంగా(పర్చేజ్ పవర్ ప్యారిటీ) ప్రపంచంలోని 200 దేశాల జీడీపీలను లెక్కలోకి తీసుకొని ఐఎంఎఫ్ ఈ ర్యాంకింగ్‌‌సను నిర్ణయించింది. ఇటీవలి ప్రపంచ ఆర్థిక ముఖచిత్రం’ నివేదికలో భాగంగానే ఈ జాబితాను కూడా ప్రవేశపెట్టింది. ర్యాంకింగ్స్ లో 1,24,930 డాలర్ల తలసరి ఆదాయంతో ఖతార్ ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది. 2,3 స్థానాల్లో మకావూ(1,14,430 డాలర్లు), లగ్జెంబర్గ్(1,09,190 డాలర్లు) నిలిచాయి.
బ్రిక్స్ దేశాల్లో రష్యా తలసరి ఆదాయం 27,900 డాలర్లు, చైనా 16,620 డాలర్లు, బ్రెజిల్ 15,500 డాలర్లు, దక్షిణాఫ్రికా 13,440 డాలర్లతో భారత్‌కంటే చాలా మెరుగైన స్థితిలో ఉన్నాయి.
పర్చేజ్ పవర్ ప్యారిటీ(పీపీపీ) అంటే..:
ఏదైనా ఒక దేశం కరెన్సీని మరో దేశం కరెన్సీలోకి మార్పిడి చేసినప్పుడు మొదటి దేశంలోని నిర్ధేశిత కరెన్సీతో ఏ విధంగా వస్తు, సేవల పరిమాణం లభిస్తుందో.. అదే విధంగా రెండో దేశంలో కూడా నిర్ధేశిత మొత్తం(కరెన్సీని మార్పిడి చేయడం ద్వారా లభించే సొమ్ము)తో అంతే పరిమాణంలో సేవలు, వస్తువులను కొనుగోలు చేయగలగడం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తలసరి ఆదాయంలో 126వ ర్యాంకులో భారత్
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : ఐఎంఎఫ్
ఎక్కడ : 200 దేశాల జాబితాలో

ఆరేడు నెలల గరిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం
అక్టోబర్‌లో హోల్‌సేల్ ధరలు పెరిగాయి. సెప్టెంబర్‌లో 2.6 శాతం ఉన్న టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) అక్టోబర్‌లో 3.59 శాతానికి పెరిగింది. ఇది ఆరు నెలల గరిష్ట స్థాయి. గత ఏడాది ఇది 1.27 శాతం వద్ద ఉండటం గమనార్హం. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఈ గణాంకాలను కేంద్ర గణాంక కార్యాలయం నవంబర్ 14న విడుదల చేసింది.

జీఎస్‌టీ అక్రమాల నిరోధానికి ప్రాధికార సంస్థ
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) శ్లాబ్‌ల పరిధి తగ్గించినా ఆ ప్రయోజనాలు వినియోగదారులకు పంచకుండా సొమ్ము చేసుకుంటున్న వ్యాపారుల అక్రమాలను అరికట్టడానికి జాతీయ అనుచిత లాభ నిరోధక ప్రాధికార సంస్థ (నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ) ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నవంబర్ 16న జరిగిన మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోద ముద్ర వేసింది. 178 వస్తువులను 28 శాతం పన్ను పరిధి నుంచి 18 శాతంలోపు పన్ను పరిధిలోకి చేర్చిన నేపథ్యంలో ఆ ప్రయోజనాలు వినియోగదారులకు చేరేలా చూడటానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

రెస్టారెంట్లపై జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు
Current Affairs
వస్తు, సేవల పన్ను శ్లాబుల్లో జీఎస్టీ కౌన్సిల్ కీలక మార్పులు చేసింది. 28% పన్ను భారాన్ని తగ్గించింది. ఇప్పటివరకు 28% పన్ను పరిధిలో 228 వస్తువులుండగా వాటిని 50కి కుదించింది. అంటే 178 వస్తు, సేవలపై పన్నును 18% పరిధిలోకి మార్చింది. ఇప్పటివరకు ఏసీ రెస్టారెంట్లపై 18%, నాన్ ఏసీ రెస్టారెంట్లపై 12% జీఎస్టీ విధిస్తుండగా ఏసీ, నాన్ ఏసీ రెస్టారెంట్లపై పన్ను భారాన్ని 5% తగ్గించింది. ఈ మార్పులతో వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులు అందుబాటులోకి వస్తాయని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయన్నారు.
రెస్టారెంట్లకు భారీ లాభం
ప్రస్తుతం నాన్-ఏసీ రెస్టారెంట్లలో భోజనంపై 12%, ఏసీ రెస్టారెంట్లలో 18% జీఎస్టీ అమలవుతోంది. వీటన్నింటికీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ఉంటుంది. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను రెస్టారెంట్లు వినియోగదారులకు ఇవ్వట్లేదు. దీనిపై గువాహటి సమావేశంలో చర్చించిన మండలి ఏసీ, నాన్-ఏసీ రెస్టారెంట్లను 5% పరిధిలోకి తీసుకొచ్చి ఐటీసీని ఎత్తేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెస్టారెంట్లపై జీఎస్టీ 18 నుంచి 5 శాతానికి తగ్గింపు
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : జీఎస్టీ మండలి
ఎక్కడ : గువాహటి సమావేశంలో

సెప్టెంబర్‌లో పారిశ్రామిక వృద్ధి 3.8%
దేశ పారిశ్రామిక రంగ ఉత్పత్తి (ఐఐపీ) సెప్టెంబర్ నెలలో కాస్తంత నిదానించింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో 4.5 శాతంగా ఉన్న ఐఐపీ వృద్ధి మరుసటి నెల సెప్టెంబర్‌లో మాత్రం 3.8 శాతం వద్దే ఆగిపోయింది. గతేడాది సెప్టెంబర్ మాసంనాటి వృద్ధి 5 శాతంతో పోల్చుకున్నా తగ్గినట్టుగానే తెలుస్తోంది. ఈ మేరకు తాజా వివరాలను కేంద్ర గణాంక విభాగం నవంబర్ 10న విడుదల చేసింది. వీటిని గమనిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఐఐపీ 2.5 శాతం వృద్ధి చెందగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఉన్న 5.8 శాతంతో పోల్చుకుంటే సగానికి పైగా తగ్గినట్టు తెలుస్తోంది.
విభాగాల వారీగా...
  • ఐఐపీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం వృద్ధి సెప్టెంబర్‌లో 3.4 శాతానికే పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఇది 5.8 శాతంగా ఉండడం గమనార్హం. ఏప్రిల్-సెప్టెంబర్ ఆరు నెలల కాలంలో 1.9 శాతమే వృద్ధి సాధించింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో ఇది 6.1 శాతంగా ఉంది.
  • కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, హోమ్‌అప్లియెన్సెస్ తదితర) ఉత్పత్తి 4.8 శాతం మేర వృద్ధి చెందింది.
  • విద్యుదుత్పత్తి రంగం వృద్ధి సైతం అంతకుముందు ఏడాది ఇదే నెలలో 5.1 శాతంగా ఉండగా, అది తాజాగా 3.4 శాతానికి పడిపోయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
సెప్టెంబర్ పారిశ్రామిక వృద్ధి 3.8 శాతం
ఏమిటి : నవంబర్ 10
ఎవరు : కేంద్ర గణాంక విభాగం

పదేళ్లు పెరిగిన భారతీయుల ఆయుష్షు
1990వ దశకం నుంచి ఇప్పటి వరకు భారతీయుల సగటు ఆయుష్షు సంభావ్యత 10 ఏళ్లు పెరిగింది. ప్రతిష్టాత్మక లాన్సెట్ జర్నల్ చేసిన తాజా అధ్యయనంలో ఈ జీవనరేఖలు బయటపడ్డాయి. పురుషుల సగటు జీవిత కాలం 66.9 సంవత్సరాలకు పెరగ్గా, మహిళల జీవన సంభావ్యత 70.3 సంవత్సరాలకు పెరిగిందని జర్నల్ ప్రచురించింది. మహిళల ఆయుష్షు సంభావ్యత కేరళలో అధికంగా 78.7 ఏళ్లు ఉండగా, ఉత్తర ప్రదేశ్‌లో అత్యల్పంగా 66.8 ఏళ్లు ఉన్నట్లు అధ్యయనం తేల్చింది. సగటు జీవిత కాలం పెరగటానికి భారత దేశంలో పెరుగుతున్న అత్యాధునిక వైద్యసదుపాయాలతో పాటు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేనని లాన్సెట్ స్పష్టం చేసింది. కాని దేశవ్యాప్తంగా మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయని సర్వే తెలిపింది. అభివృద్ధి చెందిన కేరళ, గోవా వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్, అసోం వంటి రాష్ట్రాలు అన్ని రకాల వైద్య సేవల్లో 4 రెట్లు వెనుకబడి ఉన్నాయని పేర్కొంది. మరోవైపు దేశవ్యాప్తంగా 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు తగ్గాయని నివేదిక వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 1990వ దశకం నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్లు పెరిగిన భారతీయుల సగటు ఆయుష్షు సంభావ్యత
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : లాన్సెట్ జర్నల్

‘భారత్ నెట్’ రెండో దశ ప్రారంభం
దేశంలోని మొత్తం 1.5 లక్షల గ్రామ పంచాయతీలకు 2019 మార్చి నాటికి బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ ప్రాజెక్టు రెండో/తుది దశను నవంబర్ 13న ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.34,000 కోట్లు. ఇందులో భాగంగా అదనంగా 10 లక్షల కిలో మీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు. గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్, వైఫై సేవలను అందించే టెలికం కంపెనీలకు 75 శాతం తక్కువ ధరకే బ్యాండ్ విడ్త్ సౌకర్యం కల్పిస్తామని, ఆయా సంస్థలు సెకన్‌కు రెండు మెగా బిట్ల వేగంతో డేటా సేవలు అందిస్తాయని భావిస్తున్నట్లు కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్ పేర్కొన్నారు.

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పేరు మార్పు
వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధే లక్ష్యంగా ప్రస్తుతం ఉన్న రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (RKVY) పథకంను రఫ్తార్ (వ్యవసాయం, అనుబంధ రంగాల పునరుత్తేజానికి లాభసాటి విధానాలు - Remunerative Approaches for Agriculture and Allied sector Rejuvenation -RAFTAAR) గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో నవంబర్ 1న జరిగిన సమావేశంలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఈ పథకానికి కేంద్రం, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో (ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంత రాష్ట్రాల్లో 90:10) నిధులను సమకూరుస్తాయి. వార్షిక వ్యయంలో 50 శాతం నిధులను వ్యవసాయ మౌలిక వసతులు, ఆస్తుల కల్పన, 30 శాతం వాల్యూ అడిషన్ అనుసంధానిత ఉత్పత్తి ప్రాజెక్టులు, 20 శాతం స్థానిక అవసరాలకు అనుగుణంగా వెచ్చిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పేరు రఫ్తార్ గా మార్పు
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధే లక్ష్యంగా

వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సులో 68,000 కోట్ల ఎంవోయూలు
Current Affairs న్యూఢిల్లీలో నవంబర్ 3న ప్రారంభమైన ‘వరల్డ్ ఫుడ్ ఇండియా 2017’ సదస్సు తొలిరోజు రూ.68,000 కోట్ల విలువైన 13 ఒప్పందాలు కుదిరాయి. దేశీయ ఆహార, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఐటీసీ, పెప్సికో, హెర్షీ, పతంజలి, కోకకోలా తదితర కంపెనీలు తమ ప్రణాళికలు వెల్లడించాయి.
మొదటిరోజు సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ వ్యాపార సులభతర నిర్వహణ సూచీలో 2014లో 142వ స్థానంలో ఉన్న భారత్ 2017లో 100వ స్థానానికి చేరుకోవడం గొప్ప పురోగతిగా అభివర్ణించారు. గత మూడేళ్లలో చేపట్టిన సంస్కరణలే ఇందుకు కారణమని తెలిపారు.
ఒప్పందాల ముఖ్యాంశాలు
  • ఐటీసీ రూ.10,000 కోట్ల రూపాయలతో 20 సమగ్ర ఆహార ప్రాసెసింగ్, లాజిస్టిక్ పార్క్‌లను ఏర్పాటు చేయనుంది.
  • పతంజలి రూ.10,000 కోట్ల రూపాయిలను పెట్టుబడులుగా పెట్టనుంది.
  • పెప్సికో ఐదేళ్లలో 2 బిలియన్ డాలర్లు (రూ.12,800 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తుంది.
  • అమెరికాకు చెందిన చాక్లెట్ తయారీ సంస్థ హెర్షీ ఐదేళ్లలో 50 మిలియన్ డాలర్లు (రూ.320 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి :
వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సులో రూ.68,000 కోట్ల ఒప్పందాలు
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : ఐటీసీ, పెప్సికో, హెర్షీ, పతంజలి, కోకకోలా తదితర కంపెనీలు
ఎక్కడ : భారత్‌లో

ఎన్‌పీఎస్ గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలు
న్యూ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)లో చేరేందుకు గరిష్ట వయోపరిమితిని పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ పెంచింది. ప్రస్తుతం ఉన్న 60 సంవత్సరాల నుంచి 65 కు పెంచుతూ నవంబర్ 1న ప్రకటన విడుదల చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌పీఎస్ గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలకు పెంపు
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : పెన్షన్ ఫండ్ నియంత్రణ, అభివృద్ధి సంస్థ
ఎందుకు : పథకంను మరింత విస్తరింపచేయడానికి

లింగ వ్యత్యాస సూచీలో భారత్‌కు 108 వ ర్యాంక్
ప్రపంచ లింగ వ్యత్యాస సూచీ (Global Gender Gap Index) 2017లో భారత్ 108వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చితే ఈ సారి 21 స్థానాలు దిగజారింది. ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 144 దేశాల్లో ఆర్థిక, విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, రాజకీయాల్లో మహిళల స్థితిగతులపై అధ్యయనం చేసి విడుదల చేసిన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. రాజకీయ సాధికారత, ఆయుః ప్రమాణం, అక్షరాస్యతలో లింగ వ్యత్యాసం పెరగడమే భారత్ ర్యాకింగ్‌లో వెనకబడటానికి ప్రధాన కారణం అని డబ్ల్యూఈఎఫ్ వివరించింది.
జాబితాలో ఐస్‌లాండ్ తొలి స్థానంలో నిలవగా, తర్వాతి స్థానాల్లో నార్వే(2), ఫిన్‌లాండ్(3), రువాండా(4), స్వీడన్(5) ఉన్నాయి.
నివేదిక ముఖ్యాంశాలు:
  • మొత్తం జాబితాలో భారత ర్యాంక్ 108
  • పనిచేసే చోట లింగ వ్యత్యాసం, మహిళలకు వేతన చెల్లింపుల్లో 136వ స్థానం
  • ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాల్లో 139వ స్థానం
  • ఆరోగ్యం, అస్తిత్వం విషయంలో 141వ స్థానం
  • భారత్ లింగ వ్యత్యాసాన్ని 67% పూరించింది. ఇది బంగ్లాదేశ్, చైనాలతో పోల్చితే తక్కువే
  • ప్రపంచ వ్యాప్తంగా 68 శాతం లింగ వ్యత్యాసాన్ని పూరించారు. 2016లో ఇది 68.3 శాతంగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచ లింగ వ్యతాస సూచీ 2017
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : ప్రపంచ ఆర్థిక ఫోరం
ఎక్కడ : భారత్‌కు 108వ ర్యాంక్
ఎందుకు : రాజకీయ సాధికారత, ఆయుఃప్రమాణం, అక్షరాస్యతలో లింగ వ్యత్యాసం పెరగడం వల్ల

విదేశాల్లోని భారతీయులకు పీఎఫ్ సౌకర్యం
విదేశాల్లో పనిచేసే భారతీయులకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)లో చేరే అవకాశాన్ని కల్పించినట్లు కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జాయ్ నవంబర్ 3న తెలిపారు. దీని కోసం కేంద్రం 18 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో చేరాలంటే ఆయా దేశాల్లో వారు పొందుతున్న సోషల్ సెక్యూరిటీ పథకాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. పీఎఫ్ కోసం సర్టిఫికెట్ ఆఫ్ కవరేజ్(సీవోసీ)ను ఆన్‌లైన్‌లో పొందవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విదేశాల్లోని భారతీయులకు పీఎఫ్ సౌకర్యం
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : కేంద్ర ప్రావిడెంట్ ఫండ్

35 వేల కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు
నోట్ల రద్దు తర్వాత సుమారు 35 వేల కంపెనీలు బ్యాంకుల్లో రూ.17 వేల కోట్లకు పైగా అక్రమంగా డిపాజిట్ చేశాయని కేంద్ర ప్రభుత్వం నవంబర్ 5న వెల్లడించింది. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన ఆ కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది. అలాగే 3.09 లక్షల మంది డెరైక్టర్లపై అనర్హత వేటు వేసినట్లు పేర్కొంది. నల్లధనం, అవినీతిని రూపుమాపేందుకు 2016 నవంబర్ 8న ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 35 వేల కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : నోట్ల రద్దు తర్వాత అక్రమ డిపాజిట్లు చేసినందుకు

ఓడరేవుల అభివృద్ధికి ‘సాగరమాల’
ప్రతిష్ఠాత్మక సాగరమాల కార్యక్రమంలో భాగంగా తీరప్రాంత ఓడ రేవుల పథకం కింద రూ.2,302 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది రాష్ట్రాల్లో 47 ప్రాజెక్టులు చేపడుతున్నట్లు కేంద్ర నౌకాయాన శాఖ నవంబర్ 3న వెల్లడించింది. ఈ జాబితాలో మధ్యప్రదేశ్‌లో 12; ఏపీ, గోవాల్లో 10 చొప్పున; కర్ణాటకలో 6; కేరళ, తమిళనాడుల్లో మూడు చొప్పున; గుజరాత్‌లో 2; పశ్చిమ బెంగాల్‌లో ఒక ప్రాజెక్టు ఉన్నాయి. ఇందులో రూ.1,075 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులను ఇప్పటికే మంజూరు చేశారు. నౌకాయాన శాఖ ఈ పథకం పరిధిని విస్తరించడంతోపాటు అమలు గడువును 2020 మార్చి 31 వరకు పొడిగించింది.
Published date : 15 Nov 2017 11:31AM

Photo Stories