Skip to main content

జూలై 2018 ఎకానమీ

ఐడియా, వొడాఫోన్‌ల విలీనానికి కేంద్రం అనుమతి
Current Affairs టెలికం సంస్థలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్‌ల విలీన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం జూలై 26న తుది అనుమతులు మంజూరు చేసింది. దీంతో విలీన సంస్థ మొత్తం 43 కోట్ల మంది యూజర్లతో 35 శాతం మార్కెట్ వాటాతో దేశీయంగా అతి పెద్ద టెలికం కంపెనీగా ఆవిర్భవించనుంది. ప్రస్తుతం 34.4 కోట్ల యూజర్లతో భారతీ ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఈ డీల్‌కు సంబంధించి జూలై 9న టెలికం శాఖ (డాట్) కొన్ని షరతులతో కూడిన అనుమతులిచ్చింది. దీని ప్రకారం ఇరు సంస్థలు రూ. 7,269 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాయి. విలీనం ప్రక్రియ ఆగస్టు చివరి నాటికి పూర్తి అవుతుందని వొడాఫోన్ గ్రూప్ సీఈవో విటోరియో కొలావో పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పడే విలీన సంస్థ విలువ సుమారు 23 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 1.5 లక్షల కోట్లు) స్థాయిలో ఉండనుంది. ఇందులో వొడాఫోన్‌కి 45.1 శాతం, ఆదిత్య బిర్లాకు 26 శాతం, ఐడియా షేర్‌హోల్డర్లకు 28.9 శాతం వాటాలు ఉంటాయి. ఈ సంస్థకు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, బాలేశ్ శర్మ కొత్త సీఈవోగాను ఉంటారు. ఇది లిస్టెడ్ కంపెనీగా కొనసాగుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐడియా, వొడాఫోన్‌ల విలీనానికి తుది అనుమతుల మంజూరు
ఎప్పుడు : జూలై 26
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

భారత్ వృద్ధిరేటు 7.3 శాతం
Current Affairs 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.3 శాతం, 2019-20లో 7.6 శాతంగా నమోదవుతుందని ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) జూలై 19న అంచనా వేసింది. భారత్ కారణంగా దక్షిణాసియా అత్యధిక వేగంతో వృద్ది చెందుతున్న ప్రాంతంగా ఉంటుందని ఏడీబీ తన నివేదికలో పేర్కొంది. మరోవైపు చైనా వృద్ధి 2018లో 6.6 శాతం, 2019లో 6.4 శాతంగా ఉంటుందని తెలిపింది. 2017లో చైనా వృద్ధి రేటు 6.9 శాతం ఉండగా భారత్ 6.6 శాతం వృద్ధిని నమోదు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ వృద్ధిరేటు 7.3 శాతం
ఎప్పుడు : 2018-19
ఎవరు : ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ)

88 రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గింపు
వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు వంటి 88 రకాల వస్తువులపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. శానిటరీ న్యాప్కిన్లపై మొత్తం పన్ను రద్దయింది. ఈ మేరకు కొత్త పన్ను రేట్లు జూలై 27 నుంచి అమల్లోకి వస్తాయని వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి తెలిపింది. కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ అధ్యక్షతన ఢిల్లీలో జూలై 21న జరిగిన జీఎస్టీ మండలి 28వ సమావేశంలో జీఎస్టీ చట్టంలో మొత్తం 40 సవరణలకు జీఎస్టీ మండలి ఆమోదం తెలిపింది.
అలాగే ప్రస్తుతం ప్రతి నెలా రిటర్నులు దాఖలు చేస్తున్న రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్థలు ఇకపై మూడు నెలలకోసారి సమర్పించవచ్చు. పన్ను ఎగవేతలను నియంత్రించేందుకు ఉద్దేశించిన ఆర్‌సీఎం (రివర్స్ చార్జ్ మెకానిజం) అమలును వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు వాయిదా వేయనున్నారు. కాంపొజిషన్ పథకం పరిమితిని రూ.1.5 కోట్లకు పెంచారు.
28 శాతం నుంచి 18 శాతానికి తగ్గే వస్తువులు
వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు (28 అంగుళాల కంటే చిన్నవి), విద్యుత్తు ఇస్త్రీ పెట్టెలు, వీడియో గేమ్స్ పరికరాలు, వ్యాక్యూమ్ క్లీనర్లు, లారీలు, ట్రక్కుల వెనుక ఉండే కంటెయినర్లు, జ్యూసర్ మిక్సర్లు గైండర్లు, షేవింగ్ పరికరాలు, హెయిర్, హ్యాండ్ డ్రయ్యర్లు, వాటర్ కూలర్లు, స్టోరేజ్ వాటర్ హీటర్లు, పెయింట్లు, వాల్‌పుట్టీలు, వార్నిష్‌లు, లిథియం-అయాన్ బ్యాటరీలు, పర్ఫ్యూమ్‌లు, టాయిలెట్ స్ప్రేలు
క్విక్ రివ్యూ:
ఏమిటి : 88 రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గింపు
ఎప్పుడు : జూలై 21
ఎవరు : జీఎస్టీ మండలి

సుకన్య సమృద్ధి యోజన కనీస డిపాజిట్ తగ్గింపు
ఆడ పిల్లల పేరిట పొదుపు చేసేందుకు ఉద్దేశించిన సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) పథకం వార్షిక కనీస డిపాజిట్‌ను రూ.250కు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం జూలై 22న నిర్ణయం తీసుకుంది.వార్షిక ప్రీమియంను కూడా రూ.250 కి తగ్గించింది. ప్రస్తుతం కనీస డిపాజిట్ రూ. 1000 గా ఉండగా డిపాజిట్లపై వడ్డీ రేటు జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి 8.1 శాతంగా ఉంది.
ఈ పథకం కింద 2017 నవంబర్ నాటికి 1.26 కోట్ల ఖాతాలు ప్రారంభం కాగా రూ.19,183 కోట్ల మొత్తం ఆయా ఖాతాల్లో డిపాజిట్ అయ్యింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుకన్య సమృద్ధి యోజన వార్షిక కనీస డిపాజిట్ రూ. 250 కి తగ్గింపు
ఎప్పుడు : జూలై 22
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

డీసీఎంకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ తయారీ లెసైన్స్
Current Affairs డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, మానవ రహిత వైమానిక వాహనాల (యూఏవీలు) తయారీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి జూలై 5న లెసైన్స్ పొందింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) నేతృత్వంలోని ఆర్‌‌మ్స లెసైన్స్ అథారిటీ డీసీఎంకు ఇండస్ట్రియల్ లెసైన్స్ ను జారీ చేసింది.
సాయుధ, బుల్లెట్ ప్రూఫ్ వంటి వాహనాలతోపాటు గ్రౌండ్ డేటా టర్మినల్, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్స్, లాంచర్లు, యూఏవీలను డీసీఎం రూపొందిస్తుంది. అలాగే చెక్కర, ఇండస్ట్రియల్ ఫైబర్, రసాయనాలు వంటి విభాగాల్లోనూ ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్‌కు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ తయారీ లై సెన్స్
ఎప్పుడు : జూలై 5
ఎవరు : కేంద్రప్రభుత్వం

రైతుబంధుకు 3 లక్షల కోట్లు: ఎస్‌బీఐ
దేశవ్యాప్తంగా రైతుబంధు పథకంను అమలు చేయడానికి రూ.3 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పేర్కొంది. ఈ మేరకు రైతులు పండించిన పంటకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధర కల్పించడం, భవంతర్ భుగ్తాన్ యోజన (బీబీవై) పథకం, రైతుబంధుపై జాతీయ స్థాయిలో రూపొందించిన పరిశోధన పత్రంను జూలై 6న విడుదల చేసింది. రైతుబంధును అమలు చేయడంలో వ్యవస్థీకృతంగా ఎలాంటి లోపాలు తలెత్తక పోవడంతోపాటు అక్రమాలు కూడా జరగవని ఎస్‌బీఐ తెలిపింది. ఒకటిన్నర రెట్లు మద్దతు ధర కల్పించడం, బీబీఐ పథకం అమలు చేయడం కంటే రైతుబంధు పథకానికే అధికంగా ఖర్చవుతుందని విశ్లేషించింది. ఈ మూడు పథకాలు రైతు సమస్యలకు తక్షణ పరిష్కారమే చూపుతాయని, దీర్ఘకాలిక పరిష్కారాలు చూపవని ఎస్‌బీఐ పేర్కొంది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న బీబీవై కింద మద్దతు ధరకు, మార్కెట్ ధరకు తేడాను ప్రభుత్వమే రైతులకు చెల్లిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం కింద రైతులకు నేరుగా డబ్బులు చెల్లిస్తారు.
రైతుబంధు అమలుకు రాష్ట్రాల వారీగా అయ్యే ఖర్చు

రాష్ట్రం

ఖర్చు (రూ.కోట్లలో)

1) ఆంధ్రప్రదేశ్

15,098

2) అస్సాం

5,762

3) బీహార్

12,191

4) ఛత్తీస్‌గఢ్

9,781

5) గుజరాత్

21,114

6) హరియాణా

7,132

7) జార్ఖండ్

5,476

8) కర్ణాటక

22,962

9) కేరళ

4,168

10) మధ్యప్రదేశ్

31,115

11) మహారాష్ట్ర

37,054

12) ఒడిషా

10,659

13) పంజాబ్

8,306

14) రాజస్తాన్

38,307

15) తమిళనాడు

11,500

16) తెలంగాణ

11,421

17) ఉత్తరాఖండ్

1,497

18) ఉత్తరప్రదేశ్

35,030

19) పశ్చిమబెంగాల్

11,025

మిగతా రాష్ట్రాలు

7,255

దేశం మొత్తం

3,06,853

క్విక్ రివ్యూ:
ఏమిటి : రైతుబంధుకు 3 లక్షల కోట్లు
ఎప్పుడు : జూలై 6
ఎవరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎక్కడ : దేశవ్యాప్తంగా

నోయిడాలో శాంసంగ్ మొబైల్ తయారీ ప్లాంటు
ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ తయారీ ప్లాంటును దక్షిణ కొరియాకి చెందిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ శాంసంగ్ ప్లాంటును జూలై 9న ప్రారంభించారు. ప్రస్తుతం ఏటా 6.8 కోట్లుగా ఉన్న శాంసంగ్ హ్యాండ్‌సెట్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దశలవారీగా 2020 నాటికి 12 కోట్లకు పెంచుకునేందుకు ఈ కొత్త ప్లాంటు తోడ్పడనుంది. ఇందులో కొత్తగా 2,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని, ఇక్కడ తయారయ్యే స్మార్ట్‌ఫోన్స్ ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాలకు ఎగుమతి అవుతాయని శాంసంగ్ ఇండియా సీఈవో హెచ్‌సీ హాంగ్ తెలిపారు.
1996లో నోయిడాలో శాంసంగ్ తమ ఫ్యాక్టరీని ప్రారంభించింది. ప్రస్తుతం అక్కడ గెలాక్సీ ఎస్9, ఎస్9+, గెలాక్సీ నోట్8 వంటి ఫోన్లను తయారు చేస్తుంది. శాంసంగ్‌కి భారత్‌లో చెన్నైకి దగ్గర్లోని శ్రీపెరంబుదూర్‌లో మరో ప్లాంటు ఉండగా అయిదు పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, ఒక డిజైన్ సెంటర్ ఉన్నాయి.
ప్రస్తుతం భారత్‌లో 120 మొబైల్ ఫోన్స్ తయారీ ఫ్యాక్టరీలు ఉండగా 40 కోట్ల పైగా స్మార్ట్‌ఫోన్స్ వినియోగంలో ఉన్నాయి. 32 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ తయారీ ప్లాంటు ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 9
ఎవరు : శాంసంగ్
ఎక్కడ : నోయిడా, ఉత్తరప్రదేశ్

భారత్‌లో బ్యాంక్ ఆఫ్ చైనా కార్యకలాపాలు
Current Affairs భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడానికి బ్యాంక్ ఆఫ్ చైనాకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతినిచ్చింది. చైనాలో 2018 జూన్ లో జరిగిన ఎస్‌సీవో సదస్సులో ప్రధాని మోదీ, చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ జరిపిన చర్చల్లో భారత్‌లో బ్యాంక్ ఆఫ్ చైనా ఏర్పాటుకు మోదీ అంగీకారం తెలిపారు. దీంతో భారత్‌లో తొలి బ్రాంచ్ ఏర్పాటుకు బ్యాంక్ ఆఫ్ చైనాకు ఆర్‌బీఐ జులై 4న లెసైన్స్ జారీ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో బ్యాంక్ ఆఫ్ చైనా కార్యకలాపాలు
ఎప్పుడు : త్వరలో
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక
బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) మరింత పెరగనున్నాయని ఆర్‌బీఐ వెల్లడించింది. 2017-18 చివరికి ఎన్‌పీఏలు 11.6శాతం కాగా, ఇవి మరో 0.6% పెరిగి 2018-19 చివరికి 12.2 శాతానికి పెరిగి బ్యాంకింగ్ రంగంపై ఒత్తిడి మరింత తీవ్రమవుతుందని ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్) అంచనా. సత్వర దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలో ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు గత మార్చికి 21% కాగా, వచ్చే మార్చి ఆఖరుకు 22.3 శాతానికి పెరగనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ 11 బ్యాంకుల్లో 6 బ్యాంకులకు నష్టభయం ఆధారిత ఆస్తుల నిష్పత్తి (సీఆర్‌ఏఆర్) దృష్ట్యా మూలధన కొరత ఏర్పడుతుందని పేర్కొంది.

రూ.125 నాణేన్ని ఆవిష్కరించిన ఉప రాష్ట్రపతి
12వ వార్షిక గణాంక దినాన్ని పురస్కరించుకుని రూ.125 ముఖ విలువ గల స్మారక నాణేన్ని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు జూన్ 29న కోల్‌కతాలో ఆవిష్కరించారు. భారతీయ గణాంక సంస్థ వ్యవస్థాపకుడు పీసీ మహలనోబిస్ 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలో ఆయన ప్రసంగించారు. మహలనోబిస్ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ 2007 నుంచి జూన్ 29ను గణాంక దినంగా పాటిస్తున్నట్లు కేంద్ర గణాంక మంత్రి డీవీ సదానందగౌడ తెలిపారు.
Published date : 03 Aug 2018 05:23PM

Photo Stories