Skip to main content

IndiGo: ఇండిగో రికార్డ్‌ ఆర్డర్‌.. ఎయిర్‌బస్‌ నుంచి 500 విమానాల కొనుగోలు.. డెలివరీ ఎప్పుడంటే..?

దేశీ విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించే దిశగా పెద్ద ఎత్తున విమానాలను కొనుగోలు చేస్తున్నాయి.
IndiGo

చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో తాజాగా మరో 500 ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం ఫ్రెంచ్‌ విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్‌కు భారీ ఆర్డరు ఇచ్చింది. ఎయిర్‌బస్‌కు ఏ ఎయిర్‌లైన్‌ నుంచైనా ఇంత స్థాయి ఆర్డరు లభించడం ఇదే ప్రథమం. ప్యారిస్‌ ఎయిర్‌ షో 2023 సందర్భంగా విమానాల కొనుగోలు ఒప్పందంపై ఇరు సంస్థలు సంతకాలు చేశాయి. ఈ డీల్‌ విలువ ఎంత అనేది వెల్లడి కాలేదు. 2030–35 మధ్య కాలంలో డెలివరీలు ఉంటాయని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో ఏ320నియో, ఏ321నియో, ఏ321ఎక్స్‌ఎల్‌ఆర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉంటాయని వివరించింది.  

Millionaires: భార‌త్ నుంచి సంపన్నుల వలసబాట.. ఆ దేశాలకు వెళ్లేందుకు మొగ్గు.. ఎందుకు..?

ఇండిగో గతంలోనే 480 విమానాల కోసం ఆర్డరు ఇచ్చింది. వాటి డెలివరీలను ఇంకా అందుకోవాల్సి ఉంది. తాజా ఒప్పందంతో ఇండిగో మొత్తం దాదాపు 1,000 ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసినట్లవుతుంది. వచ్చే దశాబ్దకాలంలో ఇండిగో వీటిని అందుకోనుంది. దేశీ రూట్లలోనూ, అంతర్జాతీయంగాను భారత్‌లో విమాన సేవల నెట్‌వర్క్‌ మరింతగా విస్తరించి, ఎయిర్‌ కనెక్టివిటీ మెరుగుపడేందుకు తమ వంతు తోడ్పాటు అందించగలమని ఆశిస్తున్నట్లు ఎయిర్‌బస్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ క్రిస్టియన్‌ షెరర్‌ తెలిపారు.
దేశ ఆర్థిక వృద్ధికి, దేశీయంగా ప్రయాణాలకు ఊతమివ్వాలన్న తమ లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ఈ విమానాల కొనుగోలు సహాయకరంగా ఉండగలదని ఇండిగో సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌ పేర్కొన్నారు. కొన్నాళ్ల క్రితమే టాటా గ్రూప్‌ దిగ్గజం ఎయిరిండియా కూడా 470 విమానాల కోసం ఎయిర్‌బస్, బోయింగ్‌లకు ఆర్డరు ఇవ్వడం తెలిసిందే.  

World Health Organization: ప్రపంచంలోని టాప్‌-20 వాయు కాలుష్య పట్టణాల్లో 14 భారత్‌లోనే..!

ఇప్పటివరకు 1,300 పైచిలుకు ఎయిర్‌క్రాఫ్ట్‌.. 
కొత్త కొనుగోళ్లతో ఇండిగో 2006లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఎయిర్‌బస్‌కు ఇప్పటిదాకా మొత్తం 1,330 విమానాలను ఆర్డరు ఇచ్చినట్లయింది. ప్రస్తుతం ఇండిగో 300 పైచిలుకు విమానాలను నడుపుతోంది.

5 నెలల్లో 1,000 విమానాలు.. 
తాజా ఆర్డరుతో భారతీయ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిరిండియా గత అయిదు నెలల్లో మొత్తం 970 విమానాలను కొనుగోలు చేసినట్లవుతుంది. కొత్తగా ఆకాశ ఎయిర్‌ కూడా ఈ ఏడాది ఆఖరు నాటికి మూడంకెల స్థాయిలో ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డరు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టులో కార్యకలాపాలు ప్రారంభించిన ఆకాశ ఎయిర్‌కి ప్రస్తుతం 19 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉండగా, జులైలో 20వ విమానం డెలివరీ కానుంది. ప్రస్తుతం దేశీయంగా 700 పైచిలుకు కమర్షియల్‌ విమానాలు నడుస్తున్నాయి.
వచ్చే ఏడాది, రెండేళ్లలో భారతీయ విమానయాన సంస్థలు 1,500 నుంచి 1,700 పైచిలుకు ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డరు ఇచ్చే అవకాశం ఉందని ఏవియేషన్‌ కన్సల్టెన్సీ సంస్థ సీఏపీఏ ఫిబ్రవరిలో అంచనా వేసింది. దానికి అనుగుణంగా వచ్చే కొన్నేళ్లలో భారతీయ ఎయిర్‌లైన్స్‌ 1,100 పైచిలుకు విమానాల డెలివరీలను అందుకోనున్నాయి. ఇండిగో 500, గో ఫస్ట్‌ 72, ఆకాశ ఎయిర్‌ 56, విస్తార 17 ఎయిర్‌క్రాఫ్ట్‌ల డెలివరీలు పొందాల్సి ఉంది. అయితే, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్‌.. మే నెల నుంచి ఫ్లయిట్‌ సేవలు నిలిపివేసింది.  

Forbes Global List: ప్రపంచ దేశాల్లోని దిగ్గజ కపెనీలని వెనక్కి నెట్టిన రిలయన్స్‌..

Published date : 20 Jun 2023 01:11PM

Photo Stories