CAG Accounts Report: భారీగా పెరిగిన ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం.. ఎంతంటే..
2022–23 ఆర్థిక సంవత్సరం కాగ్ అకౌంట్స్ నివేదికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 8వ తేదీ అసెంబ్లీకి సమర్పించింది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం పెరుగుతుండటంతో తప్పనిసరి రెవెన్యూ వ్యయం ఏటేటాపెరుగుతోందని కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి.
ఉద్యోగుల వేతనాల వ్యయం అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చి చూస్తే 2022–23 ఆర్థిక సంవత్సరంలో 19.18 శాతం మేర పెరిగినట్టు కాగ్ అకౌంట్స్ పేర్కొన్నాయి. 2019–20 ఉద్యోగుల పెన్షన్ల వ్యయం రూ.17,385 కోట్లు ఉండగా, 2022–23 నాటికి పెన్షన్ల వ్యయం రూ.22,584 కోట్లకు పెరిగినట్లు కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి.. అంటే నాలుగేళ్లలో పెన్షన్ల వ్యయం రూ.4,942 కోట్ల మేర పెరిగింది.
అలాగే ఉద్యోగుల వేతనాల వ్యయం 2019–20లో రూ.36,179 కోట్లు ఉండగా, 2022–23 నాటికి వేతనాల వ్యయం రూ.49,421 కోట్లు పెరిగినట్లు కాగ్ అకౌంట్స్ పేర్కొన్నాయి. అంటే నాలుగేళ్లలో వేతనాల వ్యయం రూ.13,242 కోట్ల మేర పెరిగింది.