Skip to main content

వింజమూరి అనసూయాదేవి కన్నుమూత

ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని, ప్రఖ్యాత కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలు వింజమూరి అనసూయాదేవి (99) కన్నుమూశారు.
వయోభారంతో అమెరికాలోని హ్యూస్టన్‌లో మార్చి 24న తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1920, మే 12న జన్మించిన అనసూయాదేవి ఆలిండియా రేడియో ద్వారా జానపద గీతాలకు ఎనలేని ప్రాచుర్యం కల్పించారు. జానపద గేయాలు రాయడం, బాణీలు కట్టడం, పాడడంతోపాటు హార్మోనియం వాయించడంలోనూ ఆమె విశేషమైన ప్రతిభ కనబరిచారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన దేశభక్తి గీతం ‘జయజయజయ ప్రియ భారత‘ పాటకు బాణీ కట్టింది అనసూయాదేవే.

జానపద సంగీతంపై అనసూయాదేవి ఏడు పుస్తకాలను రచించారు. ఆమె రాసిన భావ గీతాలు, జానపద గేయాలు అనే రెండు పుస్తకాలను ఆమెకు 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా చెన్నైలో 2008 ఏప్రిల్ 12న ఆవిష్కరించారు. ఎనిమిదేళ్ల వయసులోనే ఆమె పాట రికార్డ్ అయి్యంది. స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ, సుభాస్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారి సమక్షంలో అనుసూయాదేవి దేశభక్తి గీతాలు పాడారు. ఆమెకు 1977లో ఆంధ్రా విశ్వవిద్యాలయం ’కళాప్రపూర్ణ’ అనే బిరుదును, గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. అమెరికాలో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న ఆమెకు పారిస్‌లో ‘క్వీన్ ఆఫ్ ఫోక్’అనే బిరుదును ప్రదానం చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని కన్నుమూత
ఎప్పుడు : మార్చి 24
ఎవరు : వింజమూరి అనసూయాదేవి (99)
ఎక్కడ : హ్యూస్టన్, అమెరికా
Published date : 25 Mar 2019 05:25PM

Photo Stories