Skip to main content

వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభం

పొదుపు సంఘాల మహిళలకు ఆర్ధిక తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ ఆసరా పథకం’ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది.
Current Affairs

2019, ఏప్రిల్ 11 నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 11న లాంఛనంగా ప్రారంభించారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్ నొక్కి తొలి దశలో రూ.6,792.20 కోట్లను పొదుపు సంఘాల మహిళల ఖాతాలకు సీఎం జమ చేశారు.

మొత్తం రూ.27,168.83 కోట్లు...

  • 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168.83 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేయనుంది. ఇందులో భాగంగా తొలి ఏడాది రూ.6,792.20 కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేశారు.


ముఖ్యమంత్రి ప్రసంగం-ప్రధానాంశాలు
వైఎస్సార్ ఆసరా ప్రారంభం సందర్భంగా సీఎం.. జిల్లాల్లోని పొదుపు సంఘాల మహిళలనుద్ధేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం... పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాం.
  • దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నామినేటెడ్ పదవుల్లో 50 శాతం, నామినేషన్ విధానంలో ఇచ్చే పనుల్లో 50 శాతం మహిళలకు ఇస్తున్నాం.
  • 21వ శతాబ్దంలో ఆధునిక భారతీయ మహిళ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇంటింటా కనిపించాలని ఆకాంక్షిస్తున్నాం.
  • వైఎస్సార్ ఆసరా సహాయం ద్వారా వ్యాపారం లేదా స్వయం ఉపాధి పొందాలనుకుంటే ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. ఈ డబ్బు వాడుకోవడంపై పూర్తి స్వేచ్ఛ, అధికారం మీకు ఉంది.
  • పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కోసం రూ.1400 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం. ఈ పథకాన్ని నిరాటంకంగా కొనసాగిస్తాం.

క్విక్ రివ్యూ :

ఏమిటి : వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : పొదుపు సంఘాల మహిళలకు ఆర్ధిక తోడ్పాటు అందించేందుకు
Published date : 12 Sep 2020 05:11PM

Photo Stories