Skip to main content

ఉత్తరాఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఎమ్మేల్యే?

పర్వత రాష్ట్రం ఉత్తరాఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ యువనేత పుష్కర్‌సింగ్‌ ధామీ(45) జూలై 4న ప్రమాణ స్వీకారం చేశారు.
Current Affairs
డెహ్రాడూన్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పుష్కర్‌తో పాటు 11మంది మంత్రులతో రాష్ట్ర గవర్నర్‌ బేబీ రాణి మౌర్య ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ఉత్తరాఖండ్‌కు పిన్నవయస్కుడైన ముఖ్యమంత్రిగా పుష్కర్‌ రికార్డు నెలకొల్పారు. పుష్కర్‌ను జూలై 3న బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కేవలం నాలుగు నెలలపాటు సీఎం పదవిలో ఉన్న తీరథ్‌సింగ్‌ రావత్‌ జూలై 2న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు లేకపోవడంతో ఆయన స్వల్ప కాలంలోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఉత్తరాఖండ్‌లో 2022 ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం నుంచి...
సరిహద్దు ప్రాంతమైన పిథోరాగఢ్‌లో 1975 సెప్టెంబర్‌ 16న పుష్కర్‌ జన్మించారు. మాజీ సైనికుడి కుమారుడైన ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. తొలుత రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)లో సభ్యుడిగా పనిచేశారు. పదేళ్లపాటు ఏబీవీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2002 నుంచి 2008 దాకా భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. 2001–2002లో అప్పటి ముఖ్యమంత్రిగా భగత్‌సింగ్‌ కోషియారీ వద్ద ఓఎస్‌డీగా పనిచేశారు. 2012, 2017లో.. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఉత్తరాఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : జూలై 4
ఎవరు : పుష్కర్‌సింగ్‌ ధామీ
ఎక్కడ : రాజ్‌భవన్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్‌
ఎందుకు : సీఎం పదవిలో ఉన్న తీరథ్‌సింగ్‌ రావత్‌ జూలై 2న రాజీనామా చేయడంతో
Published date : 05 Jul 2021 05:29PM

Photo Stories