Skip to main content

Tokyo Paralympics: టోక్యో పారాలింపిక్స్‌–2020లో భారత్‌కు ఐదు పతకాలు

టోక్యో పారాలింపిక్స్‌–2020లో భారత క్రీడాకారులు ఒకేరోజు ఐదు పతకాలు గెలుచుకున్నారు.
ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. 1984 న్యూయార్క్‌ పారాలింపిక్స్‌లో 4 పతకాలు... 2016 రియో పారాలింపిక్స్‌లో 4 పతకాలు నెగ్గడమే భారత్‌ అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. అయితే 2021, ఆగస్టు 30న టోక్యో వేదికగా భారత క్రీడాకారులు ఏకంగా ఐదు పతకాలు సాధించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌ ఎస్‌హెచ్‌–1 కేటగిరీలో అవనీ లేఖరా, పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌–64 కేటగిరిలో సుమిత్‌ అంటిల్‌ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు.

జావెలిన్‌ త్రోలో రెండు పతకాలు...
పారాలింపిక్స్‌ జావెలిన్‌ త్రోలోనే భారత్‌కు మరో రెండు పతకాలు లభించాయి. పురుషుల ఎఫ్‌–46 కేటగిరీలో పోటీపడిన రాజస్తాన్‌ జావెలిన్‌ త్రోయర్లు దేవేంద్ర ఝఝారియా రజతం సాధించగా... సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. 40 ఏళ్ల దేవేంద్ర బల్లెంను 64.35 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో... 25 ఏళ్ల సుందర్‌ సింగ్‌ బల్లెంను 64.01 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచారు. పారాలింపిక్స్‌లో దేవేంద్రకిది మూడో పతకం కావడం విశేషం. 2004 ఏథెన్స్‌ పారాలింపిక్స్‌ లో, 2016 రియో పారాలింపిక్స్‌లో దేవేంద్ర స్వర్ణ పతకాలు గెలిచాడు.

డిస్కస్‌ త్రోలో యోగేశ్‌ అద్భుతం...
పురుషుల డిస్కస్‌ త్రో ఎఫ్‌–56 విభాగంలో భారత అథ్లెట్‌ యోగేశ్‌ కథునియా రజత పతకం సాధించాడు. తొలిసారి పారాలింపిక్స్‌లో బరిలోకి దిగిన 24 ఏళ్ల యోగేశ్‌ డిస్క్‌ను చివరిదైన ఆరో ప్రయత్నంలో 44.38 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. క్లాడినె బటిస్టా (బ్రెజిల్‌–45.59 మీటర్లు) స్వర్ణం, లియోనార్డో దియాజ్‌ (క్యూబా–43.36 మీటర్లు) కాంస్యం సాధించారు.

సుమిత్‌కు రూ. 6 కోట్లు నజరానా...
పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన తమ రాష్ట్ర జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌కు రూ. 6 కోట్లు... రజత పతకం గెలిచిన డిస్కస్‌ త్రోయర్‌ యోగేశ్‌కు రూ. 4 కోట్లు నగదు పురస్కారం అందిస్తామని హరియాణా ప్రభుత్వం తెలిపింది. అలాగే స్వర్ణం గెలిచిన తమ రాష్ట్రానికి చెందిన షూటర్‌ అవనికి రూ. 3 కోట్లు... జావెలిన్‌ త్రోలో రజతం నెగ్గిన దేవేంద్ర ఝఝారియాకు రూ. 2 కోట్లు... కాంస్య పతకం సాధించిన సుందర్‌ సింగ్‌ గుర్జర్‌కు రూ. ఒక కోటి అందజేస్తామని రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోట్‌ ప్రకటించారు.

వినోద్‌కు నిరాశ...
మరోవైపు ఆగస్టు 29న పురుషుల డిస్కస్‌ త్రో ఎఫ్‌–52 విభాగంలో కాంస్యం గెలిచిన వినోద్‌ కుమార్‌పై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. వినోద్‌ వైకల్యం వర్గీకరణ జాబితాలో లేదని అతని ప్రత్యర్థులు ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 30న నిర్వాహకులు దీనిపై సమీక్షించారు. చివరకు వినోద్‌ వైకల్యం వర్గీకరణ జాబితాలో లేకపోవడంతో అతని ఫలితాన్ని రద్దు చేసి కాంస్య పతకాన్ని వెనక్కి తీసుకున్నారు.
Published date : 31 Aug 2021 06:10PM

Photo Stories