Daily Current Affairs in Telugu: 2021, అక్టోబర్ 30 కరెంట్ అఫైర్స్
European Union: ప్రధాని మోదీతో భేటీ అయిన ఈయూ కౌన్సిల్ అధ్యక్షుడి పేరు?
జీ–20 సదస్సులో పాల్గొనడానికి యూరప్ పర్యటనకు వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 29న ఇటలీ రాజధాని రోమ్‌లో యూరోపియన్ యూనియన్(ఈయూ) అత్యున్నత అధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో భాగంగా కోవిడ్–19 మహమ్మారి విసురుతున్న సవాళ్లు, ఈయూ–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం, అఫ్గానిస్తాన్, ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఆరోగ్యం, వాణిజ్యం, సంస్కృతి, పర్యాటకం తదితర రంగాల్లో భారత్, ఈయూ మధ్య బంధాన్ని మరింత సుదృఢం చేసుకోవాలని నిర్ణయించారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘీతోనూ సమావేశమైన మోదీ పలు కీలక అంశాలపై చర్చించారు. మరోవైపు రోమ్‌లో భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించి.. నివాళులర్పించారు.
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిషెల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెర్ లెయన్‌తో ప్రధాని మోదీ లోతైన చర్చలు జరిపారని భారత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) వెల్లడించింది. మరోవైపు రోమ్‌లో భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని మోదీ.. సందర్శించి నివాళులర్పించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూరోపియన్ యూనియన్(ఈయూ) అత్యున్నత అధికారులతో సమావేశం
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : రోమ్, ఇటలీ
ఎందుకు : జీ–20 సదస్సులో పాల్గొనడానికి మోదీ యూరప్ పర్యటనకు వచ్చిన సందర్భంగా...
ADR Report: విరాళాల సేకరణలో అగ్రస్థానంలో నిలిచిన ప్రాంతీయ పార్టీ?
దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) రూపొందించిన నివేదిక అక్టోబర్ 29న విడుదలైంది. ఈ నివేదిక ప్రకారం... 2019–20 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విరాళాలు ప్రకటించిన మొదటి ఐదు(టాప్–5) పార్టీల్లో శివసేన, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్ర కజగం(ఏఐఏడీఎంకే), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బిజు జనతా దళ్ పార్టీ(బీజేడీ), యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్‌ఆర్‌సీపీ) ఉన్నాయి.
ఏడీఆర్ నివేదికలోని ముఖ్యాంశాలు...
- తమకు అందినట్లుగా 27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన విరాళాల మొత్తం రూ.233.686 కోట్లుగా ఉంది.
- 27 ప్రాంతీయ పార్టీల్లో రూ.62.859 కోట్లతో శివసేన ముందంజలో ఉంది. ఆ తర్వాత ఏఐఏడీఎంకే రూ.52.17 కోట్లను స్వీకరించింది.
- మూడో స్థానంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ రూ.37.37 కోట్లు అందుకుంది.
- ప్రాంతీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాలలో 81.10 శాతం.. అంటే రూ.189.523 కోట్లు కేవలం టాప్–5 ప్రాంతీయ పార్టీలకే అందాయి.
- విరాళాల కింద అత్యధికంగా మహారాష్ట్ర నుంచి రూ.110.475 కోట్లు, ఢిల్లీ నుంచి రూ.46.24 కోట్లు, కర్ణాటక నుంచి రూ.9 కోట్లు అందుకున్నట్లు ప్రాంతీయ పార్టీలు ప్రకటించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019–20 ఏడదిలో విరాళాల సేకరణలో అగ్రస్థానంలో నిలిచిన ప్రాంతీయ పార్టీ?
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : శివసేన
ఎక్కడ : దేశంలో...
ఎందుకు : అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) రూపొందించిన నివేదిక ప్రకారం...
Reserve Bank of India: ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ ఎప్పటి వరకు కొనసాగనున్నారు?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌గా శక్తికాంత దాస్ మరో మూడేళ్ల పాటు(డిసెంబర్, 2024 వరకు) కొనసాగనున్నారు. ఉర్జిత్ పటేల్ ఆకస్మిక రాజీనామా అనంతరం 2018 డిసెంబర్ 12వ తేదీన ఆర్‌బీఐ 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మూడేళ్ల పదవీకాలం 2021, డిసెంబర్ 10వ తేదీతో పూర్తవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని నియామకపు వ్యవహారాల కమిటీ దాస్ పదవీకాలాన్ని పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనితో ఆయన డిసెంబర్ 2024 వరకూ బాధ్యతల్లో కొనసాగుతారు.
ఒడిశా నుంచి మొదటి వ్యక్తి...
1980 బ్యాచ్ తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి అయిన దాస్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు. 2008లో పి.చిదంబరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, తొలిసారి ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ పదవిని చేపట్టారు. 2017 మేలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన అనంతరం 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా నియమితులయ్యారు. తదనంతం ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి... ఒడిశా నుంచి ఈ పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌గా శక్తికాంత దాస్ పదవీకాలం(డిసెంబర్, 2024 వరకు) పొడిగింపు
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని నియామకపు వ్యవహారాల కమిటీ
ఎందుకు : శక్తికాంత దాస్ పదవీకాలం 2021, డిసెంబర్ 10వ తేదీతో యుగియనున్న నేపథ్యంలో...
Trade Conference: యాంబిషన్ ఇండియా సదస్సులో ప్రసగించిన నేత?
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఫ్రెంచ్ సెనేట్‌లో అక్టోబర్ 29న జరిగిన ‘యాంబిషన్ ఇండియా 2021’ వాణిజ్య సదస్సులో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు కీలకోపన్యాసం చేశారు. సెనేట్ సభ్యులతో పాటు స్థానిక వాణిజ్య, రాజకీయ వర్గాల ప్రముఖులు పాల్గొన్న ఈ సదస్సులో, ‘కోవిడ్ తదనంతర కాలంలో భారత్–ఫ్రెంచ్ సంబంధాల భవిష్యత్తుకు కార్యాచరణ’అంశంపై మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏడేళ్లుగా తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు, సాధించిన అభివృద్ధిని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాల్సిందిగా ఫ్రెంచ్ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. పారిస్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ‘క్యాంపస్ స్టేషన్ ఎఫ్’ను కూడా కేటీఆర్ సందర్శించారు.
భారత్, ఫ్రాన్స్ మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మాక్రాన్ చొరవతో ‘యాంబిషన్ ఇండియా 2021’సదస్సును ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్ రాయబారి ఎమాన్యుయేల్ లెనైన్ ఆహ్వానం మేరకు మంత్రి కేటీఆర్ సదస్సులో ప్రసంగించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యాంబిషన్ ఇండియా 2021 వాణిజ్య సదస్సులో ప్రసంగం
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : ఫ్రెంచ్ సెనేట్, పారిస్, ఫ్రాన్స్
ఎందుకు : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను గురించి వివరించేందుకు...
WHO Director General: డబ్ల్యూహెచ్‌ఓకి సారథ్యం వహించిన మొట్టమొదటి ఆఫ్రికన్?
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్‌గా టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయాసస్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని అక్టోబర్ 29న డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌ఓ తదుపరి అధినేత ఎన్నిక కోసం నామినేషన్ల గడువు ముగిసే నాటికి కొత్తగా ఎలాంటి నామినేషన్లు రాలేదని తెలిపింది. ఇథియోపియాకు చెందిన టెడ్రోస్ డబ్ల్యూహెచ్‌ఓకి సారథ్యం వహించిన మొట్టమొదటి ఆఫ్రికన్. 2017లో డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఐదేళ్ల పదవీకాలం 2022, మేలో ముగియనుంది. రెండోసారి ఆ పదవిలో కొనసాగేందుకు టెడ్రోస్ పేరును ఫ్రాన్స్, జర్మనీ సిఫార్సు చేశాయి. ఆయన ఎన్నికను ఇతరులెవ్వరూ వ్యతిరేకించలేదు
ప్రపంచ ఆరోగ్య సంస్థ: ఏప్రిల్ 7, 1948న ఏర్పాటైంది. ఏప్రిల్ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది. ఈ సంస్థ ప్రపంచ ఆరోగ్య నివేదికను విడుదల చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సర్వేను కూడా నిర్వహిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్‌గా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయాసస్
ఎందుకు : డబ్ల్యూహెచ్‌ఓ తదుపరి డైరెక్టర్ జనరల్ ఎన్నిక కోసం నామినేషన్ల గడువు ముగిసే నాటికి కొత్తగా ఎలాంటి నామినేషన్లు రాకపోవడంతో...
National Crime Records Bureau: 2020 సంవత్సరంలో 1.53 లక్షల ఆత్మహత్యలు
2020 సంవత్సరంలో రోజుకు 418 చొప్పున మొత్తం 1,53,052 బలవన్మరణాలు సంభవించాయి. ఇందులో వ్యవసాయ రంగానికి చెందిన 10,677 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంతకుముందు, 2019 ఏడాదిలో మొత్తం 1,39,123 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అక్టోబర్ 29న విడుదలైన నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) వార్షిక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు..
- ఆత్మహత్యల రేటు ప్రతి వెయ్యి మందికి 2019లో 10.4 శాతం ఉండగా 2020లో అది 11.3 శాతానికి పెరిగింది.
- 2020లో వ్యవసాయ రంగానికి చెందిన 10,677 మంది ఆత్మహత్య చేసుకోగా అందులో 5,579 మంది రైతులు, 5,098 మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు.
- మొత్తం 1,53,052 ఆత్మహత్యల్లో 7 శాతం మంది సాగు రంగానికి చెందిన వారే.
- ఆత్మహత్యల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 19,909, ఆతర్వాత తమిళనాడులో 16,883, మధ్యప్రదేశ్‌లో 14,578, పశ్చిమ బెంగాల్‌లో 13,103, కర్ణాటకలో 12,259 చేసుకున్నాయి. మొత్తం బలవన్మరణాల్లో ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి 50.1 శాతం వరకు ఉన్నాయి.
Puneeth Rajkumar: కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం
ప్రముఖ కన్నడ నటుడు, గాయకుడు, డ్యాన్సర్, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత పునీత్ రాజ్‌కుమార్(46) ఇకలేరు. అక్టోబర్ 29న బెంగళూరులోని తన నివాసంలో జిమ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. అనంతరం ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తుండగా.. తుదిశ్వాస విడిచారు. 1975 మార్చి 17న చెన్నైలో రాజ్‌కుమార్(కన్నడ కంఠీరవ), పార్వతమ్మ దంపతులకు జన్మించిన పునీత్‌కు తొలుత లోహిత్ అనే పేరు పెట్టారు. తదనంతర కాలంలో పునీత్‌గా పేరు మార్చారు.
1800 మంది విద్యార్థులకు సాయంగా...
కన్నడ పవర్‌స్టార్‌గా పేరొందిన పునీత్.. స్వస్థలం చామరాజనగర జిల్లా గాజనూరు. పసికందుగా ఉన్నప్పుడే ‘ప్రేమద కానికే’ (1976) చిత్రంతో తొలిసారి వెండితెరకు పరిచమయ్యాడు. బాలనటుడిగా చాలా చిత్రాల్లో నటించడంతోపాటు... కర్నాటక ప్రభుత్వం నుంచి రెండు సార్లు, భారత ప్రభుత్వం నుంచి ఒకసారి ఉత్తమ బాల నటుడి అవార్డును అందుకున్నారు. 2002 ఏడాదిలో ‘అప్పుు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అప్పటినుంచి ఆయన్ను ప్రేక్షకులు ‘అప్పు’ అని పిలవడం మొదలుపెట్టారు. హీరోగా దాదాపు 30 చిత్రాల్లో నటించారు. తండ్రి రాజ్‌కుమార్‌పై ‘డాక్టర్ రాజ్‌కుమార్: ది పర్సన్ బిహైండ్ ది పర్సనాలిటీ’ అనే పుస్తకాన్ని పునీత్ రాశారు. దాదాపు 26 అనాథాశ్రమాలు, 45 పాఠశాలలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలకు పునీత్ సాయం అందిస్తూ వచ్చారు. ‘శక్తిధామ’ అనే సంస్థ ఆధ్వర్యంలో చదువుకుంటున్న దాదాపు 1800 మంది విద్యార్థులకు సాయంగా ఉన్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ కన్నడ నటుడు, గాయకుడు, డ్యాన్సర్, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : పునీత్ రాజ్‌కుమార్(46)
ఎక్కడ : విక్రమ్ ఆస్పత్రి, బెంగళూరు
ఎందుకు : గుండెపోటు కారణంగా...
Tennis: ఫెనెస్టా ఓపెన్ చాంపియన్‌షిప్ ఎక్కడ జరిగింది?
ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్–2021లో హైదరాబాద్ అమ్మాయి చిలకలపూడి శ్రావ్య శివాని మహిళల డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. న్యూఢిల్లీలో అక్టోబర్ 29న జరిగిన ఫైనల్లో శ్రావ్య (తెలంగాణ)–షర్మద (కర్ణాటక) ద్వయం 6–2, 6–3తో వైదేహి (గుజరాత్)–మిహికా యాదవ్ (మహారాష్ట్ర)పై జోడీపై గెలిచి టైటిల్ సాధించింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్)–ప్రజ్వల్ (కర్ణాటక) జంట 6–2, 7–6 (7/3)తో చంద్రిల్æ–లక్షిత్ (పంజాబ్) జంటపై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అక్టోబర్ 25న ప్రారంభమైన ఫెనెస్టా ఓపెన్ చాంపియన్‌షిప్ అక్టోబర్ 30న ముగిసింది.
హర్మీత్ దేశాయ్ ఏ క్రీడకు చెందినవాడు?
ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) కంటెండర్ ట్యూనిస్ ఓపెన్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్–హర్మీత్ దేశాయ్ (భారత్) జంట టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. అక్టోబర్ 29న ట్యూనిసియా రాజధాని నగరం ట్యూనిస్‌లో జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సత్యన్–హర్మీత్ ద్వయం 8–11, 12–14, 11–9, 11–8, 11–9తో నాందోర్ ఎసెకి–ఆడమ్ జుడి (హంగేరి) జంటపై గెలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్–2021లో డబుల్స్ విభాగంలో విజయం సాధించిన జోడి?
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : చిలకలపూడి శ్రావ్య శివాని(తెలంగాణ)–షర్మద(కర్ణాటక) ద్వయం
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఫైనల్లో శ్రావ్య షర్మద ద్వయం 6–2, 6–3తో వైదేహి (గుజరాత్)–మిహికా యాదవ్ (మహారాష్ట్ర)పై జోడీపై విజయం సాధించడంతో...
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, అక్టోబర్ 29 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్