Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 12 కరెంట్‌ అఫైర్స్‌

51st Conference of Governors

Ram Nath Kovind: గవర్నర్ల 51వ సదస్సును ఎక్కడ నిర్వహించారు?

దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరుగుతున్న గవర్నర్ల 51వ సదస్సులో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొన్నారు. గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లనుద్దేశించి ప్రసంగిస్తూ... గవర్నర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మిత్రులుగా, మార్గదర్శకులుగా వ్యవహరించాలని మన దేశ రాజ్యాంగ రూపకర్తలు భావించారని చెప్పారు. రాష్ట్రాల అభ్యున్నతి కోసం గవర్నర్లు సాధ్యమైనంత ఎక్కువ సమయం కేటాయించాలని, ప్రజలతో మమేకం కావాలన్నారు. రాష్ట్రపతి కోవింద్‌ అధ్యక్షతన గవర్నర్ల సదస్సు జరగడం ఇది నాలుగోసారి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గవర్నర్ల సదస్సు దాదాపు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. తొలి సదస్సు 1949లో రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. తాజా సదస్సులో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : గవర్నర్ల 51వ సదస్సునుద్దేశించి ప్రసంగం
ఎప్పుడు : నవంబర్‌ 11
ఎవరు    : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
ఎక్కడ    : రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ 


Nationhood in our Times: నేషన్‌హుడ్‌ టైమ్స్‌ పుస్తకాన్ని రచించిన కేంద్ర మాజీ మంత్రి?

Salman Khurshid Book

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ ‘సన్‌రైజ్‌ ఓవర్‌ అయోధ్య: నేషన్‌హుడ్‌ ఇన్‌ అవర్‌ టైమ్స్‌’ పేరిట రాసిన పుస్తకం వివాదాస్పదంగా మారింది. నవంబర్‌ 10న విడుదలైన ఈ పుస్తకంలో ఆయన ప్రస్తావించిన అంశాలు రాజకీయంగా సెగలు రాజేస్తున్నాయి. సనాతన ధర్మం, ప్రాచీన హిందూవాదంతో కూడిన హిందూత్వం పక్కకుపోయిందని, ప్రస్తుతం హిందూత్వం అనేది జిహాదీ ఇస్లామిక్‌ సంస్థలైన ఐసిస్, బోకో హరాంల మాదిరిగా మారిపోయిందని పుస్తకంలో ఖుర్షీద్‌ ఆక్షేపించారు. ఇప్పుడున్నది అతివాద హిందూత్వం అని పేర్కొన్నారు.

SpaceX: రోదసిలోకి వెళ్లిన 600వ యాత్రికుడు ఎవరు?

Crew 3

మానవుని అంతరిక్ష ప్రయాణం మొదలైన గడిచిన 60 ఏళ్లలో.. 600 మంది రోదసిలోకి వెళ్లారు. తాజాగా, స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ద్వారా నలుగురు వ్యోమగాములు భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరి వెళ్లడంతో ఈ మైలురాయిని అధిగమించినట్లయింది. మిషన్‌ కమాండర్, భారతీయ మూలాలున్న రాజాచారి(44) నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందంలో జర్మనీకి చెందిన మథియాస్‌ మౌరెర్‌(51) 600వ యాత్రికునిగా నమోదయ్యాడు. ఈ బృందాన్ని తీసుకుని నవంబర్‌ 10న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ రాకెట్‌(స్పేస్‌ఎక్స్‌–3) నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం తాము అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నట్లు రాజాచారి సమాచారం పంపించారు. ఈ బృందం అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలలపాటు గడుçపనుంది. రష్యాకు చెందిన యూరి గగారిన్‌ 1961లో మొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి వచ్చాక ఏడాదికి సగటున 10 మంది రోదసి యానం చేశారు.

తెలుగువాడే..
స్పేస్‌ఎక్స్‌–3 ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన రాజాచారి తెలంగాణ మూలాలు ఉన్న వ్యక్తి. రాజాచారి తండ్రి శ్రీనివాసాచారి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన వారు. 1977 జూన్‌ 24న అమెరికాలోని లూనీ మిల్వాకీలో జన్మించిన చారి రాజాచారి పూర్తి పేరు రాజా జాన్‌ వీర్‌పుత్తూర్‌ చారి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : రోదసిలోకి వెళ్లిన 600వ యాత్రికునిగా నమోదు
ఎప్పుడు  : నవంబర్‌ 10
ఎవరు    : జర్మనీకి చెందిన మథియాస్‌ మౌరెర్‌(51)
ఎక్కడ    : కెన్నడీ స్పేస్‌ సెంటర్, ఫ్లోరిడా, అమెరికా
ఎందుకు : తాజాగా, స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ద్వారా మథియాస్‌ మౌరెర్‌ కూడిన బృందం భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరి వెళ్లడంతో...


India Post Payments Bank: తపాలా శాఖతో భాగస్వామ్యం చేసుకున్న సంస్థ?

IPPB

భారతీయ తపాలా శాఖ (పోస్టల్‌ విభాగం), తపాలా శాఖ పరిధిలోని ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ)తో బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. గ్రామీణ ప్రాంత కస్టమర్లను చేరువ అయ్యేందుకు వీలుగా రెండు ఉత్పత్తులును ఆవిష్కరించింది. టర్మ్, యాన్యుటీ ప్లాన్లను ఐపీపీబీ కస్టమర్లకు ఆఫర్‌ చేయనుంది.

భారత సెయిలర్‌ నేత్రకు స్వర్ణం
స్పెయిన్‌ వేదికగా జరిగిన గ్రాన్‌ కెనేరియా సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా సెయిలర్‌ నేత్రా కుమనన్‌ స్వర్ణ పతకంతో మెరిసింది. ఆరు రేసుల పాటు జరిగిన లేజర్‌ రేడియల్‌ క్లాస్‌ ఈవెంట్‌లో బరిలోకి దిగిన ఆమె 10 నెట్‌ పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని అందుకుంది. బెనీటో లాంచో రజతాన్ని, మార్టినా రినో కాంస్యాన్ని సాధించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారతీయ తపాలా శాఖ (పోస్టల్‌ విభాగం), తపాలా శాఖ పరిధిలోని ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ)తో భాగస్వామ్య ఒప్పందం
ఎప్పుడు  : నవంబర్‌ 10
ఎవరు    : బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ
ఎందుకు : గ్రామీణ ప్రాంత కస్టమర్లను చేరువ అయ్యేందుకు వీలుగా...


Nobel Peace Prize: దక్షిణాఫ్రికాకు చివరి శ్వేతజాతి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి?

FW de Klerk

దక్షిణాఫ్రికాకు చివరి శ్వేతజాతి అధ్యక్షుడిగా పనిచేసిన ఫ్రెడరిక్‌ విలియం డి  క్లెర్క్‌( ఎఫ్‌డబ్ల్యూ డి క్లెర్క్‌)(85) కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడుతూ నవంబర్‌ 11న కేప్‌టౌన్‌ ఫ్రెస్నే తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1990 ఫిబ్రవరి 2న ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సహా ఇతర ఉద్యమ సంఘాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటిస్తూ క్లెర్క్‌ చేసిన ప్రసంగం చరిత్రలో నిలిచిపోయింది. 27 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న నెల్సన్‌ మండేలాను విడుదల చేయాలనే ఆదేశాలనూ ఆయన అదే వేదికపై నుంచే జారీ చేశారు. నాలుగేళ్ల అనంతరం జరిగిన మొట్టమొదటి ప్రజాస్వామ్య ఎన్నికల్లో మండేలా దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

నోబెల్‌ బహుమతి...
వర్ణవివక్షను రూపుమాపేందుకు స్థాపించిన జాతీయ పార్టీ సభ్యుడిగా దక్షిణాఫ్రికా పార్లమెంటుకు క్లెర్క్‌ ఎన్నికయ్యారు. పలు ఉన్నత పదవులను అధిరోహించారు. 1994లో మండేలాకు పాలనా పగ్గాలు అప్పగించే వరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సేవలందించారు. శ్వేతజాతీయుల నుంచి దేశ పాలనను నల్ల జాతీయులకు అందించే క్రమంలో అందించిన అద్భుత సేవలకు గాను నెల్సన్‌ మండేలాతో కలిసి నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : దక్షిణాఫ్రికాకు చివరి శ్వేతజాతి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి కన్నుమూత
ఎప్పుడు : నవంబర్‌ 11
ఎవరు    : ఫ్రెడరిక్‌ విలియం డి  క్లెర్క్‌( ఎఫ్‌డబ్ల్యూ డి క్లెర్క్‌)(85)
ఎక్కడ    : కేప్‌టౌన్, వెస్ట్రన్‌ కేప్, దక్షిణాఫ్రికా
ఎందుకు : క్యాన్సర్‌ కారణంగా...


Nepal: పశుపతినాథ్‌ – కాశీ విశ్వనాథ్‌ ర్యాలీని ఎవరు ప్రారంభించారు?

Amrit Mahotsav Motorcycle Rally

భారత 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాల్లో భాగంగా నేపాల్‌ నుంచి వారణాసికి ‘పశుపతినాథ్‌ – కాశీ విశ్వనాథ్‌ అమృత్‌ మహోత్సవ్‌ మోటారు సైకిల్‌ ర్యాలీ’ నవంబర్‌ 11న ప్రారంభమైంది. ఖాట్మాండులోని పవిత్ర పుణ్యక్షేత్రమైన పశుపతినాథుని ఆలయం వద్ద నేపాల్‌ సాంస్కృతిక, పర్యాటక, పౌర విమానయాన శాఖల మంత్రి ప్రేమ్‌ బహదూర్‌ అలే, భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వత్రాలు ర్యాలీని ప్రారంభించారు. భారత్, నేపాల్‌ల మధ్య స్నేహానికి చిహ్నంగా.. ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ‘రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌’ సంస్థతో కలిసి నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఈ ర్యాలీని చేపట్టారు. ఇందులో దాదాపు 50 మంది భారతీయులు, నేపాలీలు మోటార్‌బైక్‌లతో పాల్గొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పశుపతినాథ్‌ – కాశీ విశ్వనాథ్‌ అమృత్‌ మహోత్సవ్‌ మోటారు సైకిల్‌ ర్యాలీ ప్రారంభం
ఎప్పుడు  : నవంబర్‌ 11
ఎవరు    : నేపాల్‌ సాంస్కృతిక, పర్యాటక, పౌర విమానయాన శాఖల మంత్రి ప్రేమ్‌ బహదూర్‌ అలే, భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వత్రా
ఎక్కడ  : పశుపతినాథుని ఆలయం, ఖాట్మాండు, నేపాల్‌
ఎందుకు : భారత్, నేపాల్‌ల మధ్య స్నేహానికి చిహ్నంగా.. ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు...


Young Innovators: కేంద్రం చేపట్టిన స్టార్‌ కాలేజ్‌ మెంటార్‌షిప్‌ కార్యక్రమ ఉద్దేశం?

DBT-Star College Mentorship Programme

యువ ఆవిష్కర్తల కోసం కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ‘డీబీటీ–స్టార్‌ కాలేజ్‌ మెంటార్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ ప్రారంభమైంది. నవంబర్‌ 8న న్యూఢిల్లీలో కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) జితేంద్రసింగ్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవంలో భాగంగా తీసుకొచ్చిన ఈ పథకంలో భాగంగా... దేశంలో శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణలకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన స్టార్‌ కళాశాలల్లో బోధనను బలోపేతం చేస్తారు. డిగ్రీ స్థాయిలో కోర్సులను అత్యున్నతంగా తీర్చిదిద్దుతారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ఈ కళాశాలలు పనిచేస్తాయి. దేశ వ్యాప్తంగా 278 కళాశాలల్లో స్టార్‌ కాలేజ్‌ కార్యక్రమం అమలవుతోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
డీబీటీ–స్టార్‌ కాలేజ్‌ మెంటార్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్‌ 8
ఎవరు    : కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) జితేంద్రసింగ్‌
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : దేశంలో శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణల్లో యువతకు తోడ్పాటు అందించేందుకు...

 

Former CBDT Chairman: రాజ్యసభ నూతన సెక్రెటరీ జనరల్‌గా నియమితులైన వ్యక్తి?

PC Mody

రాజ్యసభ నూతన సెక్రెటరీ జనరల్‌గా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌(సీబీడీటీ) మాజీ చైర్మన్‌ ప్రమోద్‌ చంద్ర మోదీ(పీసీ మోదీ) నియమితులయ్యారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులపై రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతకం చేశారు. దీంతో తెలుగు వ్యక్తి డాక్టర్‌ పరాశరం పట్టాభి కేశవ రామాచార్యులు స్థానంలో పీసీ మోదీ బాధ్యతలు చేపట్టనున్నారు.

మహారాష్ట్రకు నాయకత్వ పురస్కారం...
పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నందుకు మహారాష్ట్రకు ‘స్ఫూర్తిదాయక ప్రాంతీయ నాయకత్వం’ పురస్కారం లభించింది. స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న కాప్‌–26 సమావేశాల సందర్భంగా మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే అవార్డును స్వీకరించారు. ‘అండర్‌2 కొయిలేషన్‌’ అనే సంస్థ దీన్ని బహూకరించింది. ‘మాఝీ వసుంధర’ అనే కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణలో రాష్ట్ర ప్రజలు అందర్నీ భాగస్వామ్యం చేస్తున్నందుకు ఈ పురస్కారం లభించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : రాజ్యసభ నూతన సెక్రెటరీ జనరల్‌గా నియామకం
ఎప్పుడు : నవంబర్‌ 8
ఎవరు    : సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌(సీబీడీటీ) మాజీ చైర్మన్‌ ప్రమోద్‌ చంద్ర మోదీ(పీసీ మోదీ)
ఎందుకు : రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్ణయం మేరకు..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 11 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 12 Nov 2021 07:45PM

Photo Stories