Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 11 కరెంట్‌ అఫైర్స్‌

Delhi Security Dialogue on Afghanistan

Afghanistan: ఢిల్లీ సెక్యూరిటీ డైలాగ్‌కు ఎవరు నేతృత్వం వహించారు?

అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లాక ఆ దేశం నుంచి ఎదురవుతున్న సవాళ్లపై, భద్రతా పరిస్థితులపై చర్చించడానికి భారత్‌ ‘ఢిల్లీ సెక్యూరిటీ డైలాగ్‌ ఆన్‌ అఫ్గానిస్తాన్‌’ అనే అంశంపై నవంబర్‌ 10న సదస్సు నిర్వహించింది. వివిధ దేశాలకు చెందిన భద్రతా సలహాదారుల స్థాయిలో ఢిల్లీ జరిగిన ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ నేతృత్వం వహించారు. సదస్సులో  రష్యా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ దేశాల భద్రతా సలహాదారులు పాల్గొన్నారు. సదస్సు ఒక డిక్లరేషన్‌ని ఆమోదించింది. మళ్లీ 2022 ఏడాది సమావేశం కావాలని అంగీకారానికి వచ్చారు. సదస్సు ముగిసిన తర్వాత భద్రతా ప్రతినిధులందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. పాకిస్తాన్, చైనాలను కూడా సదస్సుకు ఆహ్వానించగా... సదస్సుకు హాజరుకాలేమని ఆ దేశాలు తెలిపిన విషయం విదితమే.

డిక్లరేషన్‌లో ఏముందంటే?

  • అఫ్గానిస్తాన్‌ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యాకలాపాలు జరగకూడదు. అక్కడ ప్రభుత్వం ఉగ్రవాదులకు శిక్షణ, ఆశ్రయం, ఆర్థిక సహకారం అందించకూడదు. 
  • అఫ్గాన్‌ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తాం. ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎవరి జోక్యం ఉండకూడదంటూ పాకిస్తాన్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ.  
  • సామాజికంగా, ఆర్థికంగా కునారిల్లుపోతున్న అఫ్గానిస్తాన్‌ పరిస్థితిపై సదస్సు ఆందోళన. అఫ్గాన్‌ ప్రజలకు మానవత్వంతో అత్య వసరంగా సాయం చెయ్యాలని నిర్ణయం. 
  • అఫ్గాన్‌లో అన్ని వర్గాల ప్రజలకు నిరాటంకంగా సాయం అందేలా చర్యలు చేపట్టాలి. మానవతా దృక్పథంతో చేసే ఈ సాయంలో ఎలాంటి వివక్షలకు తావు ఉండకూడదు 
  • మహిళలు పిల్లలు, మైనారిటీల హక్కుల్ని ఎవరూ ఉల్లంఘించకూడదు.  
  • అఫ్గానిస్తాన్‌లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం లభించేలా ప్రభుత్వం ఏర్పాటుకావాలి.  
  • కోవిడ్‌పై పోరాటానికి అఫ్గానిస్తాన్‌కు కావల్సిన సాయం అందించడానికి కట్టుబడి ఉన్నాం. భవిష్యత్‌లో కూడా అన్ని దేశాలు పరస్పర సహకారాన్ని అందించుకుంటాయి.  
  • ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు అఫ్గాన్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షించాలి.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఢిల్లీ సెక్యూరిటీ డైలాగ్‌ ఆన్‌ అఫ్గానిస్తాన్‌ అనే అంశంపై సదస్సు నిర్వహణ
ఎప్పుడు : నవంబర్‌ 10
ఎవరు    : భారత్‌
ఎక్కడ    : ఢిల్లీ
ఎందుకు : అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లాక ఆ దేశం నుంచి ఎదురవుతున్న సవాళ్లపై, భద్రతా పరిస్థితులపై చర్చించడానికి...


Union Cabinet: ఎంపీల్యాడ్స్‌ పథక పునరుద్ధరణకు కేబినెట్‌ ఆమోదం

Union Cabinet

కోవిడ్‌–19 మహమ్మారి ఉధృతి కారణంగా నిలిచిపోయిన పార్లమెంట్‌ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి (ఎంపీల్యాడ్స్‌) పథకాన్ని పునరుద్ధరించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నవంబర్‌ 10న సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

15వ ఆర్థిక సంఘం కాలపరిమితి వరకూ..
15వ ఆర్థిక సంఘం కాలపరిమితి వరకూ ఎంపీల్యాడ్స్‌ పునరుద్ధరణ, కొనసాగింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అభివృద్ధి పనుల నిమిత్తం 2021–22లో మిగిలిన కాలానికి గానూ ప్రతి పార్లమెంట్‌ సభ్యుడికి రూ.2 కోట్లు ఒకే విడతలో, 2022–23 నుంచి 2025–26 వరకూ ఏటా రూ.5 కోట్ల నిధులను రెండు విడతల్లో కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేయనుంది. 2025–26 దాకా ఎంపీల్యాడ్స్‌కు కేంద్ర సర్కారు రూ.17,417 కోట్లు వెచ్చించనుంది. కోవిడ్‌–19 వైరస్‌ వ్యాప్తి కారణంగా ఎంపీల్యాడ్స్‌ పథకాన్ని 2020 ఏప్రిల్‌లో తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పార్లమెంట్‌ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి (ఎంపీల్యాడ్స్‌) పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయం
ఎప్పుడు : నవంబర్‌ 10
ఎవరు    : కేంద్ర కేబినెట్‌
ఎందుకు : పార్లమెంట్‌ స్థానాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు...


Birsa Munda: జన జాతీయ గౌరవ్‌ దివస్‌గా ఏ రోజును ప్రకటించనున్నారు?

Birsa Munda

బ్రిటిష్‌ వలసవాదం, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్థం నవంబర్‌ 15వ తేదీని జన జాతీయ గౌరవ్‌ దివస్‌గా ప్రకటించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. గిరిజనుల విజయాలు, సంస్కృతిని స్మరించుకుంటూ ప్రతిఏటా నవంబర్‌ 15 నుంచి వారం రోజులపాటు వేడుకలు నిర్వహించనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన నవంబర్‌ 10న సమావేశమైన కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయించింది. అలాగే పెట్రోల్‌లో కలపడానికి చెరకు నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌పై లీటర్‌కు రూ.1.47 చొప్పున ధరను పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రుణాలు తీర్చడానికి రూ.17,408 కోట్లు..
2014–15 నుంచి 2020–21 వరకూ ఏడు పత్తి సీజన్లలో రైతుల నుంచి పత్తి కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి రూ.17,408.85 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) అంగీకారం తెలిపింది. ఆహార ధాన్యాలు వందశాతం, చక్కెరను 20 శాతం జనపనార సంచుల్లో ప్యాకేజింగ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్థం నవంబర్‌ 15వ తేదీని జన జాతీయ గౌరవ్‌ దివస్‌గా ప్రకటించాలని నిర్ణయం
ఎప్పుడు  : నవంబర్‌ 10
ఎవరు    : కేంద్ర కేబినెట్‌
ఎందుకు : బ్రిటిష్‌ వలసవాదం, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని...


Christianity: సెయింట్‌ హుడ్‌ హోదా పొందనున్న తొలి భారతీయ క్యాథలిక్‌?

Devasahayam Pillai

హిందూ కుటుంబంలో జన్మించి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన దేవసహాయం పిళ్లైకు సెయింట్‌ హుడ్‌ హోదా లభించనుంది. మతపరమైన కార్యకలాపాల్లో లేని ఒక సామాన్య భారతీయ క్యాథలిక్‌కు సెయింట్‌ హోదా దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేవసహాయంతో పాటు వేర్వేరు దేశాలకు చెందిన మరో ఐదుగురికి సెయింట్‌ హుడ్‌ హోదా ఇవ్వనున్నారు. 2022, మే 15వ తేదీన వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ బాసిలికాలో జరిగే కార్యక్రమంలో పోప్‌ ఫ్రాన్సిస్‌ ఈ ఆరుగురికి సెయింట్‌ హుడ్‌ హోదాను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ఆరుగురికి సెయింట్‌ హోదా ఇవ్వాలని నవంబర్‌ 9న వాటికన్‌లో మతాధికారుల సమ్మేళనంలో నిర్ణయించారు.

సమాన హోదా దక్కాలని..
అప్పటి ట్రావన్‌కోర్‌ సంస్థానం పాలనలోని తమిళనాడు ప్రాంతంలో 1712, ఏప్రిల్‌ 23న నాయర్‌ కుటుంబంలో దేవసహాయం జన్మించారు. 1745లో క్రైస్తవ మతాన్ని స్వీకరించాక తన పేరును లాజరస్‌గా మార్చుకున్నారు. ధనిక పేద తారతమ్యాలు లేకుండా సమాజంలో అందరికీ సమాన హోదా దక్కాలని ఆయన అభిలషించారు. ఇది ఆనాటి సమాజంలోని అగ్రవర్గాలకు నచ్చేది కాదు. దీంతో 1749లో పాలకులు ఆయనను నిర్బంధించారు. 1752 జనవరి 14న ఆయనను చంపేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : సెయింట్‌ హుడ్‌ హోదా పొందనున్న తొలి భారతీయ క్యాథలిక్‌?
ఎప్పుడు : నవంబర్‌ 10
ఎవరు    : దేవసహాయం పిళై(లాజరస్‌)
ఎందుకు : క్రైస్తవ మతాధికారుల నిర్ణయం మేరకు...


ISA: అంతర్జాతీయ సోలార్‌ కూటమిలో చేరిన 101వ దేశం?

ISA

భారత్‌ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమి (International Solar Alliance&ISA)లో 101వ సభ్య దేశంగా అమెరికా చేరింది. స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న సీఓపీ 26 సదస్సు సందర్భంగా... ఐఎస్‌ఏ కార్యాచరణ ఒప్పందంపై అమెరికా అధ్యక్ష ప్రత్యేక రాయబారి జాన్‌ కెర్రీ సంతకం చేశారు. ఐఎస్‌ఏలో చేరడం సంతోషంగా ఉందని.. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ముందున్నట్టు జాన్‌ కెర్రీ పేర్కొన్నారు. 2015 నవంబర్‌ 30వ తేదీన ప్యారిస్‌లో జరిగిన సీఓపీ–21 సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు కలిసి ఐఎస్‌ఏను ప్రారంభించారు. సోలార్‌ ఇంధనాన్ని పోత్సహించే లక్ష్యంతో ప్రపంచ దేశాల్ని ఒకే వేదికపైకి తేవాలన్న భారత్‌ ఆలోచన నుంచి పుట్టిందే ఐఎస్‌ఏ. దీని ప్రధాన కార్యాలయం హరియాణలోని గురుగ్రామ్‌లో ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమిలో 101వ సభ్య దేశంగా చేరిన దేశం?
ఎప్పుడు : నవంబర్‌ 10
ఎవరు    : అమెరికా
ఎక్కడ    : గ్లాస్గో, స్కాట్‌లాండ్‌
ఎందుకు : సోలార్‌ ఇంధనాన్ని పోత్సహించే లక్ష్యంలో భాగంగా...


Chickpea: శనగల సంపూర్ణ జన్యుక్రమాన్ని నమోదు చేసిన సంస్థ?

Chikpea

భారత్‌తో పాటు దాదాపు 50 దేశాల్లో విరివిగా వాడే శనగల పూర్తిస్థాయి జన్యుక్రమ నమోదు పూర్తయింది. అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌) నేతృత్వంలో దేశ విదేశాలకు చెందిన 41 పరిశోధన సంస్థలు కలసి నిర్వహించిన ప్రాజెక్టు ఫలితంగా సంపూర్ణ జన్యుక్రమం సిద్ధమైంది. దీంతో అధిక దిగుబడులిచ్చే, చీడపీడలు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థంగా తట్టుకోగల కొత్త వంగడాల సృష్టికి మార్గం సుగమైంది. ఇక్రిశాట్‌ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.

కాబూలీ చనా...
ఇక్రిశాట్‌ 2013లో ‘కాబూలీ చనా’అని పిలిచే ఒక రకం శనగల జన్యుక్రమాన్ని విజయవంతంగా నమోదు చేసింది. అయితే మరిన్ని రకాల జన్యుక్రమాలను కూడా నమోదు చేయడం ద్వారా శనగల పుట్టు పూర్వోత్తరాల గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. దాదాపు 3,366 శనగ రకాలను ఎంపిక చేసి వాటన్నింటి జన్యుక్రమాలను నమోదు చేసి, విశ్లేషణ జరిపింది. ఫలితంగా శనగల్లో దాదాపు 29,870 జన్యువులు ఉంటాయని స్పష్టం కాగా ఇందులో 1,582 జన్యువులను మొదటిసారి గుర్తించారు.

మధ్యధరా ప్రాంతంలో పుట్టుక..
‘సిసెర్‌ రెటిక్యులాటమ్‌’అనే అడవిజాతి మొక్క నుంచి దాదాపు 12,600 ఏళ్ల కింద శనగలు పుట్టుకొచ్చాయని ఇక్రిశాట్‌ సంపూర్ణ జన్యుక్రమ విశ్లేషణ ద్వారా తేలింది. ఫర్టైల్‌ క్రెసెంట్‌గా పిలిచే ప్రస్తుత ఇజ్రాయెల్, ఇరాక్, సిరియా ప్రాంతంలో పుట్టిన ఈ పంట కాలక్రమంలో టర్కీ మీదుగా మధ్యధరా ప్రాంతానికి, దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికా ప్రాంతాలకు రెండు మార్గాల్లో విస్తరించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : శనగల పూర్తిస్థాయి జన్యుక్రమ నమోదు పూర్తి
ఎప్పుడు    : నవంబర్‌ 10
ఎవరు    : అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌) నేతృత్వంలో దేశ విదేశాలకు చెందిన 41 పరిశోధన సంస్థలు
ఎందుకు : అధిక దిగుబడులిచ్చే, చీడపీడలు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థంగా తట్టుకోగల కొత్త వంగడాల సృష్టికి..


Inter-State Issues: ఏపీ, ఒడిశా ముఖ్యమంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?

AP-Odisha

ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య దాదాపు ఆరు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, నవీన్‌ పట్నాయక్‌ సమావేశమయ్యారు. నవంబర్‌ 9న ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్‌(ఒడిశా సచివాలయం)లో జరిగిన ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా నలుగుతున్న వంశధార, జంఝావతి జల వివాదాలు, సరిహద్దు సమస్య.. బలిమెల, అప్పర్‌ సీలేరులో జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు సంబంధించిన ఎన్‌వోసీలు తదితర అంశాలపై చర్చలు జరిపారు. మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించడంతోపాటు గంజాయి సాగు, అక్రమ రవాణాను నివారించేందుకు సమష్టిగా కృషి చేయాలని నిశ్చయించారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో జాయింట్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సంయుక్త ప్రకటనలో తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఏపీ, ఒడిశా ముఖ్యమంత్రుల సమావేశం
ఎప్పుడు : నవంబర్‌ 10
ఎవరు    : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, నవీన్‌ పట్నాయక్‌
ఎక్కడ    : లోక్‌సేవా భవన్, భువనేశ్వర్, ఒడిశా
ఎందుకు : ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య దాదాపు ఆరు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు..


Women Boxing: ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ను ఎక్కడ నిర్వహించనున్నారు?

Boxing

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ 2022 ఏడాదికి వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం 2021 డిసెంబరు 4న టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఈ మెగా టోర్నీ ఆరంభం కావాల్సి ఉంది. అయితే ఆ దేశంలో కరోనా ప్రభావం ఎక్కువ ఉండటంతో చాంపియన్‌షిప్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం ప్రకటించింది. టర్కీలో రోజు 25 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అన్ని విభాగాల్లో పోటీపడుతున్నారు. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో విజేతలకు నేరుగా ఈ టోర్నీకి పంపారు. అయితే ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహెయిన్‌ (70 కిలోలు) జాతీయ బాక్సింగ్‌లో పోటీపడకపోయినా ఆమెకు అర్హత కల్పించారు.

వరుణ్‌–గణపతి జోడీకి టైటిల్‌..
ఒమన్‌లోని అల్‌–ముసన్నా పట్టణంలో జరిగిన ఆసియా 49ఈఆర్‌ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన వరుణ్‌ ఠక్కర్‌–కేసీ గణపతి జోడీ విజేతగా నిలిచింది. ఆసియా సెయిలింగ్‌ టోర్నీ చరిత్రలో వరుణ్‌–గణపతి జంటకిది మూడో పతకం. 2018లో ఈ జోడీ స్వర్ణం, 2019లో రజతం సాధించింది. మరోవైపు మహిళల విభాగంలో హర్షిత తోమర్‌–శ్వేత జోడీ రజత పతకం నెగ్గింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 2022 ఏడాదికి మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌–2021 వాయిదా
ఎప్పుడు : నవంబర్‌ 10
ఎవరు    : అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం
ఎక్కడ     : ఇస్తాంబుల్, టర్కీ
ఎందుకు : టర్కీలో కరోనా ప్రభావం ఎక్కువ ఉండటంతో..

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, న‌వంబ‌ర్ 10 కరెంట్‌ అఫైర్స్‌

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 12 Nov 2021 01:09PM

Photo Stories