Daily Current Affairs in Telugu: 2022, జూన్ 20th కరెంట్ అఫైర్స్
Rajiv Gandhi International Airport: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి అరుదైన గౌరవం
- జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి అరుదైన గౌరవం లభించింది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్స్ 2022లో బెస్ట్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అవార్డును దక్కించుకుంది. అంతేకాదు ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో కూడా హైదరాబాద్ స్థానం మెరుగైంది. టాప్ 100 ఎయిర్‌పోర్ట్ లీగ్ జాబితాలో 2021లో 64వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఒక స్థానంపైకి ఎగబాకి 63వ ప్లేస్‌లో నిల్చుంది.
- బెస్ట్ స్టాఫ్ విభాగంతో పాటు హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు మరికొన్ని విభాగాల్లోనూ ప్రశంసలు దక్కాయి. బెస్ట్ రీజనల్ ఎయిర్‌పోర్ట్ ఇన్ ఇండియా (ద్వితీయ), క్లీనెస్ట్ ఎయిర్‌పోర్ట్ ఇన్ ఇండియా (మూడవ), బెస్ట్ రీజనల్ ఎయిర్‌పోర్ట్ ఇన్ ఏషియా (నాలుగవ) విభాగాల్లోనూ హైదరాబాద్‌కు టాప్‌లో నిలిచేందుకు ప్రయత్నించింది.
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
5G service to commence in 20-25 Indian cities: ఈ ఏడాదే 25 నగరాల్లో 5జీ సేవలు
- టెలికం యూజర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5జీ సేవలు ఈ ఏడాది నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఆగస్ట్–సెప్టెంబర్‌కల్లా 5జీ రంగ ప్రవేశం చేస్తుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం తెలిపారు. డిసెంబర్ కల్లా 20 నుంచి 25 నగరాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ‘‘దేశంలో డేటా ధరలు అంతర్జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయి. 5జీలోనూ ఇదే పంథా కొనసాగుతుంది.
- నెట్‌వర్క్ ప్రొవైడర్ల విషయంలో నమ్మదగ్గ దేశంగా భారత్ టాప్‌లో నిలుస్తుంది. మన 4జీ, 5జీ ఉత్పత్తులు, సాంకేతికతలపై పలు దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. ఆయాచిత ఫోన్‌కాల్స్‌కు సంబంధించి కీలక నిబంధన రానుంది. కాల్ చేస్తున్న వారి వివరాలు కేవైసీ ఆధారంగా ఫోన్‌లోనే ప్రత్యక్షమవుతాయి’’ అని మంత్రి తెలిపారు. ఢిల్లీ సహా పలు నగరాల్లో మొబైల్ టవర్లపై ప్రజలు అభ్యంతరాల నేపథ్యంలో, రేడియేషన్‌పై ఆందోళన అవసరం లేదన్నారు.
Bella J Dark: ఐదేళ్ల వయసు పుస్తకాన్నే రాసి రికార్డు సృష్టించిన చిన్నారి
- ఐదేళ్ల వయసు... ఆల్ఫాబెట్స్‌ను కూడా స్పష్టంగా పలకడం రాదు కొందరికి. కానీ ఆ వయసులో పుస్తకాన్నే రాసి రికార్డు సృష్టించిందో బ్రిటిష్ చిన్నారి. ఈ ఘనత సాధించిన అత్యంత చిన్నవయస్కురాలైన బాలికగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. అంతేనా అందులోని బొమ్మలు సైతం తానే గీసింది. ‘ద లాస్ట్ క్యాట్’ పుస్తకం పబ్లిష్ అయిన 31 జనవరి 2022నాటికి ఆమె వయసు సరిగ్గా ఐదేళ్ల 211 రోజులు. జనవరిలో పబ్లిష్ అయితే... రికార్డుకు ఎందుకు లేటయ్యిందంటే... గిన్నిస్ టైటిల్ గెలవాలంటే కచ్చితంగా అది వెయ్యి కాపీలు అమ్ముడవ్వాలనేది సంస్థ నియమం.
- యూకేలోని వేముత్‌లో 2016 జూలై 14న పుట్టిన బెల్లా జె డార్క్ పుస్తకం రాస్తానని చెప్పినప్పుడు పిల్ల చేష్టలు అనుకున్నారు వాళ్లు. 32 పేజీల పుస్తకం రాసి ముందు పెడితే షాకయ్యారు. పుస్తకాన్ని ఫెయిర్ చేయడంలో బెల్లాకు తల్లి చెల్సీ సైమ్ సహకరించింది. కథేంటంటే.. తల్లిదండ్రులు వెంట లేకుండా బయటికి వెళ్లిన బాలిక తనకు ప్రియమైన పిల్లిని పోగొట్టుకుంటుంది. అది పోయినందుకు ఆమె పడిన బాధ, వెంట ఎవరూ లేకుండా అలా వెళ్లకూడదన్న సందేశం ఈ పుస్తకంలో ఉన్నాయని చెప్పింది బెల్లా తల్లి చెల్సీ. సినిమాలకేనా పార్ట్ వన్, పార్ట్ టూలు... ద లాస్ట్ క్యాట్ 2 చదవడానికి సిద్ధంగా ఉండండంటున్నారు బెల్లా తల్లిదండ్రులు.
- Download Current Affairs PDFs: Click Here
Air India prepares one of largest aircraft deals in history: ఎయిర్ ఇండియా చరిత్రలో అతిపెద్ద ఎయిర్‌క్రాప్ట్ డీల్
- ఎయిర్ ఇండియా లిమిటెడ్ దాదాపు 300 నారోబాడీ జెట్లను ఆర్డర్ చేసేందుకు సిద్ధమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇది విమానాయన చరిత్రలో అతి పెద్ద ఆర్డర్‌లలో ఒకటి అని స్పష్టం చేశాయి. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఎయిర్‌లైన్ కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో తన విమానాలను సరిదిద్దాలని చూస్తోంది. ఈ మేరకు క్యారియర్ ఎయిర్‌బస్ A320neo ఫ్యామిలీ జెట్‌లు లేదా బోయింగ్ 737 మ్యాక్స్ మోడల్ లేక రెండింటిని మిక్స్ చేసి సరికొత్త మోడల్స్‌ని ఆర్డర్ చేయవచ్చునని అధికారులు అంటున్నారు.
- దేశంలో ఎయిర్‌బస్ ఆధిపత్యం చెలాయిస్తున్నందున భారత్ ఈ నారోబాడీ జెట్ ఆర్డర్‌ని గెలుచుకోవడం బోయింగ్ విమానాలను తిరుగుబాటుగా అయ్యింది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతున్న ఇండిగో అత్యధికంగా అమ్ముడై నారోబాడీల కోసం యూరోపియన్ తయారీదారులకు ప్రపంచంలోనే అతిపెద్ద కస్టమర్‌గా మారింది. పైగా సుమారు 700 నారోబాడీలను ఆర్డర్ చేస్తోంది. గో ఎయిర్‌లైన్స్ ఇండియా లిమిటెడ్, ఎయిర్‌ఏషియా ఇండియా లిమిటెడ్‌తో సహా ఇతర సంస్థలు ఒకేతరహా విమానాలను నడుపుతున్నాయి.
- సుమారు 300 విమానాల ఉత్పత్తికి, డెలివరీకి సంవత్సరాలు లేదా ఒక దశాబ్దం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చునని అధికారుల చెబుతున్నారు. ఎయిర్‌బస్ ఒక నెలలో దాదాపు 50 నారోబాడీ జెట్‌లను నిర్మిస్తుంది, 2023 కల్లా వాటిని 65కి, 2025 నాటికి 75కి పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో ప్రైవేటీకరణలో భాగంగా ఈ ఏడాది ప్రారంభంలోనే టాటా ఎయిర్‌లైన్‌ను కొనుగోలు చేసింది. ఇది నాలుగు ఎయిర్‌లైన్ బ్రాండ్‌లతో సహా దాని విమానయాన వ్యాపారాలను ఏకీకృతం చేయాలని భావిస్తోంది. కొత్త విమానాల కోసం చేస్తున్న ఆర్డర్ డీల్ ముఖ్యంగా దీర్ఘకాలిక నిర్వహణపై అనుకూలమైన నిబంధనలతో ఖర్చులను తగ్గించుకోవడం తోపాటు చాలా చౌక ధరల్లో కొనుగోలు చేసి..ప్రత్యర్థులతో మెరుగ్గా పోటీ పడడంలో సహాయపడుతుంది.
Justice Ujjal Bhuyan is the new CJ of the High Court:హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్
- రాష్ట్ర హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఈ మేరకు సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సుపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఐదు హైకోర్టులకు నూతన సీజేలను నియమించాలని, తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ చేయాలంటూ మే 17న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
- ఆ సిఫార్సులపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ ఆదివారం పేర్కొంది. జస్టిస్ భూయాన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులోనే న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. రాష్ట్రపతి ఆమోదముద్రతో ఆయనకు ఇదే కోర్టులో పదోన్నతి లభించింది. కాగా, 2021, అక్టోబర్ 11న తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఢిల్లీకి బదిలీ అయ్యారు.
1991లో బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్..
- జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. అస్సాంలోని గువాహటిలో 1964, ఆగస్టు 2న జన్మించారు. ఈయన తండ్రి సుచేంద్రనాథ్ సీనియర్ న్యాయవాదిగా, అస్సాం అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. ఉజ్జల్ భూయాన్ డాన్ బాస్కో స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. కాటన్ కాలేజీలో ప్లస్ టూ, ఢిల్లీలోని కిరోరి కళాశాలలో డిగ్రీ చదివారు. గువాహటి ప్రభుత్వ లా కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌బీని, గౌహతి వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టా అందుకున్నారు.
- అస్సాం బార్ కౌన్సిల్‌లో 1991, మార్చి 20న పేరును నమోదు చేసుకున్నారు. ఇతర పలు రాష్ట్రాల బార్ కౌన్సిల్స్‌లో ఎన్‌రోల్ చేసుకోవడమే కాకుండా పలు హైకోర్టుల్లో అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. ఆదాయపు పన్ను శాఖ స్టాండింగ్ కౌన్సిల్‌గా, సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా చాలా కాలం పనిచేశారు. 2010, సెప్టెంబర్ 6న సీనియర్ అడ్వొకేట్‌గా నియమితులయ్యారు. అసోం అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా, గౌహతి హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడిగా, బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కొనసాగారు.
- మిజోరాం రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేశారు. గౌహతి హైకోర్టులో అడిషనల్ జడ్జిగా 2011, అక్టోబర్ 17న నియమితులయ్యారు. 2019, అక్టోబర్ 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ రెండేళ్లు జడ్జిగా సేవలందించారు. 2021, అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా భూయాన్ కొనసాగుతున్నారు.
నాలుగేళ్లలో ఐదో సీజే..
- జస్టిస్ ఉజ్జల్ భూయాన్ రాష్ట్ర హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరిస్తే నాలుగేళ్ల కాలంలో ఈ పదవిని చేపట్టిన ఐదో వ్యక్తి అవుతారు. 2019, జనవరి 1న ఏర్పాటైన తెలంగాణ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్, రెండో సీజేగా జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, మూడో సీజేగా జస్టిస్ హిమాకోహ్లి, నాలుగో సీజీగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ వ్యవహరించిన విషయం విదితమే.
National Open Masters Athletics Championship 2022: తెలంగాణ అథ్లెట్లకు 8 పతకాలు
- జాతీయ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అథ్లెట్లు మెరిశారు. గుజరాత్‌లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో తెలంగాణ అథ్లెట్లు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించారు. మహిళల ప్లస్ 45 వయో విభాగంలో దివ్య బొల్లారెడ్డి 400, 800 మీటర్ల కేటగిరీల్లో రజత పతకాలు గెలిచింది. దివ్య 400 మీటర్ల దూరాన్ని 1ని:14.91 సెకన్లలో... 800 మీటర్ల దూరాన్ని 3ని:02.67 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల ప్లస్ 35 వయో విభాగంలో అష్లి గోపీ 110 మీటర్ల హర్డిల్స్‌లో రజతం, ట్రిపుల్ జంప్‌లో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.
- 110 మీటర్ల హర్డిల్స్ రేసును గోపీ 21.02 సెకన్లలో ముగించి రెండో స్థానంలో... ట్రిపుల్ జంప్‌లో 9.88 మీటర్ల దూరం గెంతి మూడో స్థానంలో నిలిచాడు. మహిళల ప్లస్ 45 వయో విభాగంలో కృతి కడాకియా 1500 మీటర్ల రేసును 6ని:51.56 సెకన్లలో ముగించి కాంస్యం గెల్చుకుంది. పురుషుల ప్లస్ 60 వయో విభా గం పోల్‌వాల్ట్‌లో బండారి భాస్కర్ రావు 1.60 మీటర్ల ఎత్తుకు ఎగిరి కాంస్యం... హైజంప్‌లో 1.05 మీటర్ల ఎత్తుకు ఎగిరి రజతం నెగ్గాడు. పురుషుల ప్లస్ 60 వయో విభాగం హ్యామర్ త్రోలో మనోహర్ రావు (27.58 మీటర్లు) స్వర్ణం గెలిచాడు.
Dovely Bike Taxi Services: హైదరాబాద్‌లో తొలిసారిగా మహిళల కోసం
- హైదరాబాద్‌లో సిటీ సర్వీసుల సంఖ్య గణనీయంగా తగ్గపోయింది. ఎంఎంటీఎస్ రైళ్లు ఇంకా పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. మెట్రోరైలు ఉన్నా రాత్రి వేళలో సర్వీసులు లేవు. ఈ తరుణంలో అత్యవసర సమయంలో బయటకు వెళ్లాలనుకునే మహిళల కోసం నగరంలో డోవ్లీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మహిళ సేఫ్టీకే అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ సర్వీసును ప్రారంభించారు.
మహిళలు.. మహిళలు
- నగరానికి చెందిన జైనాబ్ కాతూన్, ఉజ్మా కాతూన్, మసరట్ ఫాతిమాలు డోవ్లీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. వీరికి ఓబైదుల్లా ఖాన్ సహకారం అందించారు. ఓలా, ర్యాపిడో తరహాలో రెంటల్ బైక్ (బైక్ ట్యాక్సీ) సర్వీసులు డోవ్లీ అందిస్తుంది. అయితే డోవ్లీలో రైడర్‌గా మహిళలే ఉండగా ఇందుగా కస్టమర్లకు కూడా కేవలం మహిళలే కావడం డోవ్లీ ప్రత్యేకత. అంటే మహిళల కోసం మహిళల చేత ఇక్కడ సేవలు అందివ్వబడతాయి.
సెక్యూరిటీ కీలకం
- శాంతిభద్రతలు ఎంతగా మెరుగైనా ఇప్పటికీ మహిళల భద్రత విషయంలో సరికొత్త సవాళ్లు ఉదయిస్తూనే ఉన్నాయి. అందుకే విమెన్ సెక్యూరిటీకి పెద్ద పీట వేస్తూ డోవ్లీని అందుబాటులో తెచ్చారు. రైడ్ మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రతి క్షణం ప్రయాణాన్ని మానిటర్ చేస్తుంటారు. అప్పటి వరకు రైడర్ లైవ్ లొకేషన్‌ను ఆన్‌లోనే ఉంచాల్సి ఉంటుంది.
వాట్సాప్ వేదికగా
- వాట్సాప్ వేదికగా డోవ్లీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. డోవ్లీ పేరుతో యాప్ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా ప్లేస్టోర్, యాప్‌స్టోర్లలో అందుబాటులోకి తేలేదు. ప్రస్తుతం డోవ్లీలో కస్టమర్ల సంఖ్య నాలుగు వందలు ఉండగా రైడర్ల సంఖ్య ఇరవైకి పైగా ఉన్నారు. అతి త్వరలోనే రైడర్ల సంఖ్యను రెండు వందల వరకు తీసుకుళ్లి నగరంలో విరివిరిగా సేవలు అందించే యోచనలో డోవ్లీ ఫౌండర్లు ఉన్నారు.
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Daily Current Affairs in Telugu: 2022, జూన్ 18th కరెంట్ అఫైర్స్