Daily Current Affairs in Telugu: 2022, జూన్ 16th కరెంట్ అఫైర్స్
Hardik Pandya to captain India in Ireland T20Is : ఐర్లాండ్‌తో టి20లకు భారత జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా
ఐర్లాండ్‌తో ఈ నెల 26, 28 తేదీల్లో జరిగే రెండు టి20 మ్యాచ్‌ల కోసం 17 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ జూన్ 15(బుధవారం) ప్రకటించింది. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా నిలిపిన హార్దిక్ పాండ్యాకు తొలిసారి భారత జట్టు సారథ్య బాధ్యతలు దక్కడం విశేషం. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రాణించిన రాహుల్ త్రిపాఠి మొదటిసారి టీమిండియాకు ఎంపిక కాగా... సామ్సన్, సూర్యకుమార్ పునరాగమనం చేశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్‌లో కెప్టెన్‌గా ఉన్న పంత్, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌లు టెస్టు జట్టులో సభ్యులు కావడంతో వారిని ఎంపిక చేయలేదు.
- Download Current Affairs PDFs: Click Here
- యాప్ డౌన్లోడ్ ఇలా..
డౌన్లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Prithvi2 Test Success : పృథ్వీ 2 పరీక్ష సక్సెస్
బాలాసోర్(ఒడిశా): దేశీయంగా తయారుచేసిన అణ్వస్త్ర సామర్థ్య పృథ్వీ–2 క్షిపణిని రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి రాత్రి ఏడున్నర ప్రాంతంలో పరీక్షించారు. అత్యంత ఖచ్చితత్వంతో నిర్దేశిత పథంలో మిస్సైల్ దూసుకెళ్లిందని సంస్థ వెల్లడించింది. భూతలం నుంచి 350 కి.మీల దూరం దూసుకెళ్లి భూతల లక్ష్యాలను చేధించే పృథ్వీ క్షిపణి పరీక్ష అన్ని నిర్దేశిత ప్రమాణాలను అందుకుందని సంస్థ పేర్కొంది. రెండు ఇంజన్లు ఉండే పృథ్వీ దాదాపు వేయి కిలోల బాంబులను మోసుకెళ్లగలదు.
Russia is the second largest supplier of oil to India : భారత్‌కు చమురు సరఫరాలో రెండో స్థానానికి రష్యా.
The ‘commercial’ tide to the economy : ఎకానమీకి ‘వాణిజ్య’ పోటు
భారత్ ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు మేలో రికార్డు స్థాయిలో 24.29 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2021 మేలో ఈ విలువ కేవలం 6.53 బిలియన్ డాలర్లు. సమీక్షా నెల్లో భారత్ వస్తు ఎగుమతుల విలువ 20.55% పెరిగి (2021 మేనెల గణాంకాలతో పోల్చి) 38.94 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఇక వస్తు దిగుమతుల విలువ 62.83% ఎగసి 63.22 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు...
ఎగుమతుల రీతి..
► ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 12.65 శాతం పెరిగి 9.7 బిలియన్ డాలర్లకు చేరాయి.
► పెట్రోలియం ప్రొడక్టుల విషయంలో ఎగుమతులు 60.87 శాతం ఎగసి 8.54 బిలియన్ డాలర్లకు చేరాయి.
► రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2021 మేలో 2.96 బిలియన్ డాలర్లుంటే, తాజా సమీక్షా నెల్లో 3.22 బిలియన్ డాలర్లకు చేరాయి.
► రసాయనాల ఎగుమతులు 17.35% పెరిగి 2.5 బి. డాలర్లకు చేరాయి.
► ఫార్మా ఎగుమతులు 10.28 శాతం వృద్ధితో 2 బిలియన్ డాలర్లకు చేరాయి
► రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు 28% పెరిగి 1.41 బి. డాలర్లకు చేరాయి.
► ముడి ఇనుము, జీడిపప్పు, హస్తకళలు, ప్లాస్టిక్స్, కార్పెట్, సుగంధ ద్రవ్యాల ఎగుమతుల్లో వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది.
దిగుమతుల పరిస్థితి..
► మే నెల్లో పెట్రోలియం అండ్ క్రూడ్ ఆయిల్ దిగుమతులు 102.72 శాతం ఎగసి 19.2 బిలియన్ డాలర్లకు చేరాయి.
► బొగ్గు, కోక్, బ్రిక్విటీస్ దిగుమతుల విలువ 2 బిలియన్ డాలర్ల నుంచి 5.5 బిలియన్ డాలర్లకు చేరింది.
► పసిడి దిగుమతుల విలువ 2021 మేలో 677 మిలియన్ డాలర్లుంటే, 2022 మేలో 6 బిలియన్ డాలర్లకు చేరింది.
రెండు నెలల్లో..: ఏప్రిల్–మే నెలల్లో ఎగుమతులు 25 శాతం పెరిగి 78.72 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ఇదే కాలంలో దిగుమతులు 45.42 శాతం ఎగసి 123.41 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరిసి ఆర్థిక సంవత్సరం (2022–23) రెండు నెలల్లో వాణిజ్యలోటు 44.69 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2021–22) రెండు నెలల్లో వాణిజ్యలోటు 21.82 బిలియన్ డాలర్లు.
సేవల దిగుమతుల తీరిది...
ఇక వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మేలో సేవల దిగుమతుల విలువ 45.01 శాతం పెరిగి 14.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో సేవల దిగుమతులు 45.52 శాతం పెరిగి 28.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
Upgrade Fitch Rating Outlook to Nine Banks: తొమ్మిది బ్యాంకులకు ఫిచ్ రేటింగ్ అవుట్‌లుక్ అప్‌గ్రేడ్
రేటింగ్ దిగ్గజం ఫిచ్ జూన్ 15 (బుధవారం) తొమ్మిది భారత్ బ్యాంకుల రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్టేబుల్’కు అప్‌గ్రేడ్ చేసింది. ఫిచ్ రేటింగ్ అప్‌గ్రేడ్ అయిన తొమ్మిది బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (న్యూజిలాండ్), బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లు ఉన్నాయి. తొమ్మిది బ్యాంకుల లాంగ్‌టర్మ్ ఇష్యూయర్ డిఫాల్ట్ రేటింగ్స్ (ఐడీఆర్) రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్టేబుల్’కు అప్‌గ్రేడ్ చేసినట్లు ఫిచ్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎగ్జిమ్ బ్యాంక్ లాంగ్‌టర్మ్ ఐడీఆర్ కూడా...
- ఎగుమతులు–దిగుమతుల వ్యవహారాల భారత్ బ్యాంక్ (ఎగ్జిమ్) లాంగ్‌టర్మ్ ఐడీఆర్‌ను కూడా ‘నెగటివ్’ నుంచి ‘స్టేబుల్’కు అప్‌గ్రేడ్ చేసినట్లు ఫిచ్ మరొక ప్రకటనలో తెలిపింది. భారతదేశ సార్వభౌమ రేటింగ్‌కు సంబంధించి ‘అవుట్‌లుక్’ను ఈ నెల 10వ తేదీన ఫిచ్ రెండేళ్ల తర్వాత ‘నెగటివ్’ నుండి ‘స్థిరం’కు అప్‌గ్రేడ్ చేసింది.
- వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణ వల్ల మధ్య–కాల వృద్ధికి ఎదురయ్యే సవాళ్లు తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భారత్ ఎకానమీ రికవరీ వేగవంతంగా ఉందని, ఫైనాన్షియల్ రంగం బలహీనతలు తగ్గుతున్నాయని ఫిచ్ పేర్కొంది. కమోడిటీ ధరల తీవ్రత వల్ల సవాళ్లు ఉన్పప్పటికీ ఎకానమీకి ఉన్న సానుకూల అంశాలు తమ నిర్ణయానికి కారణమని తెలిపింది.
YSR free crop insurance is ideal for the country : వైఎస్సార్ ఉచిత పంటల బీమా దేశానికే ఆదర్శం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఆర్థికంగా ఎంతో రక్షణ కల్పిస్తోందన్నారు. బుధవారం సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై)తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఉచిత పంటల బీమాను అమలు చేయడం చరిత్రాత్మకమన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు చేస్తూ 26 రకాల పంటలకు బీమా వర్తిస్తోందన్నారు.
సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ.. బీమా పరిహారం
ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు నెలలోగా పంట నష్ట పరిహారం(ఇన్‌పుట్ సబ్సిడీ), సీజన్ మారేలోగా పంటల బీమా పరిహారం క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇది గతంతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉందన్నారు. 2016 ఖరీఫ్‌లో 16.36 లక్షల మంది రైతులు పంటల బీమా కోసం నమోదు చేసుకోగా 2021 నాటికి ఆ సంఖ్య 30.6 లక్షలకు పెరిగిందన్నారు. దీనికి అనుగుణంగా 2021 ఖరీఫ్‌లో నష్టపోయిన 15.60 లక్షల మంది రైతులకు 2022 ఖరీఫ్ ప్రారంభంలోనే రూ.2,977.82 కోట్లు పరిహారం జమ చేశామన్నారు. ఉల్లి, టమాట, దానిమ్మతోపాటు చిరుధాన్యాల పంటలను కూడా బీమా పరిధిలోకి తీసుకొచ్చామన్నారు.
ఇంకా అర్హులుంటే ఆర్బీకేలను సంప్రదించాలి..
పంటలు నష్టపోయిన అర్హుల జాబితాను ఆర్బీకేల్లో సోషల్ ఆడిట్ నిర్వహించి పారదర్శకంగా రూపొందించినట్టు వివరించారు. బీమా పరిహారం అందని అర్హులైన రైతులు ఎవరైనా ఉంటే 15 రోజుల్లోగా ఆర్బీకేల్లో గానీ గ్రామ సచివాలయాల్లో సంప్రదిస్తే విచారించి పంట నష్ట పరిహారాన్ని అందిస్తామన్నారు. రెండు రకాలుగా నోటిఫైడ్ పంటలకు బీమా వర్తింపజేస్తున్నామన్నారు. ఇందులో దిగుబడి ఆధారిత పంటలు నష్టపోయిన 8,47,759 మంది రైతులకు రూ.2,143.85 కోట్లు, వాతావరణ ఆధారిత పంటలు నష్టపోయిన 7,12,944 మంది రైతులకు రూ.833.97 కోట్లు జమ చేశామన్నారు. గతంలో ప్రైవేటు సంస్థల వల్ల రైతులకు సరైన పరిహారం దక్కేది కాదని, చాలామంది ఆర్థిక ఇబ్బందులతో పంటల బీమా ప్రీమియానికి దూరంగా ఉండేవారన్నారు. ఇప్పుడు ఈ–క్రాప్ నమోదు సమయంలోనే బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు.
తగ్గిన రుణ ఎగవేతలు..
రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తు నుంచి విక్రయం వరకు అన్ని రకాల సేవలను అందిస్తూ వ్యవసాయ సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రైతులకు పెద్ద ఎత్తున అందుతున్న సంక్షేమ పథకాలతో రుణ ఎగవేతలు బాగా తగ్గినట్టు ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లు కితాబు ఇచ్చారన్నారు. పంటల విస్తీర్ణంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ గణనీయంగా వృద్ధి నమోదైందన్నారు.
క్రాప్ హాలిడే కాదు.. మూడు పంటల ముందస్తు జోరు..
రాష్ట్రంలో రైతులకు మేలు జరిగేలా ముందస్తుగా నీటిని విడుదల చేసి మూడు పంటలు సాగయ్యేలా ప్రోత్సహిస్తున్నట్లు పూనం మాలకొండయ్య తెలిపారు. క్రాప్ హాలిడేకు అవకాశం లేదన్నారు. మూడు పంటలు వస్తే రైతులకు ఆదాయం పెరగడమే కాకుండా నేల సారవంతం అవుతుందన్నారు. గత నాలుగేళ్లలో రైతుల మరణాలు రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్నాయని మీడియా ప్రశ్నలకు సమాధానంగా పేర్కొన్నారు. కోనసీమ డెల్టా చివరి ప్రాంతాలకూ నీరందేలా జలవనరుల శాఖతో సమన్వయం చేసుకుని కాలువల మరమ్మతులు, పూడికతీతపై దృష్టి సారించామని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. గతంలో ఆలస్యంగా పంటలు వేయడంతో తుపాన్లతో పంట నష్టపోవడమేగాక మూడో పంటకు అవకాశం ఉండేది కాదన్నారు.
Record rainfall in Cherrapunji: చిరపుంజిలో రికార్డ్ స్థాయి వర్షం
- దేశంలో అత్యధిక వర్షపాతానికి చిరునామాగా నిలిచిన చిరపుంజిలో గత 27 ఏళ్లలో జూన్‌లో ఎన్నడూలేనంతటి భారీ వర్షపాతం ఈ ఏడాది నమోదైంది. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర వరకు అంటే ఒక రోజులో ఏకంగా 811.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ 1995 తర్వాత జూన్‌లో ఒక్కరోజులో ఇంతటి వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి అని భారత వాతావరణ శాఖ బుధవారం పేర్కొంది.
- నైరుతి రుతుపవనాల ప్రభావం వల్లే ఇంతటి వర్షం పడిందని వెల్లడించింది. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర వరకు మాసిర్రమ్‌లో 710.6 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదవడం గమనార్హం. 1974–2022 కాలానికి ప్రపంచంలోనే అత్యంత అధిక వర్షపాతం నమోదైన ప్రాంతంగా మాసిర్రమ్ గతంలో రికార్డులకెక్కడం తెల్సిందే. చిరపుంజి, మాసిడ్రమ్ రెండూ దాదాపు 10 కి.మీ.ల దూరంతో మేఘాలయలోనే ఉన్నాయి.
The days of conquering AIDS with injection are coming : ఎయిడ్స్ వ్యాధిని ఇంజక్షన్‌తో జయించే రోజులు రాబోతున్నాయి
- వైద్య చరిత్రలో మేలిమలుపు. చికిత్స లేదు నివారణే మార్గమని భావిస్తున్న ఎయిడ్స్ వ్యాధిని ఇంజక్షన్‌తో జయించే రోజులు రాబోతున్నాయి. ఇజ్రాయెల్‌కు శాస్త్రవేత్తల బృందం జన్యువుల ఎడిటింగ్ విధానాన్ని ఉపయోగించి హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌ను కట్టడి చేసే కొత్త వ్యాక్సిన్‌ను కనుగొంది. టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన న్యూరో బయోలజీ, బయో కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్ శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనలు నిర్వహించి ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది.
- పరిశోధన వివరాలను నేచర్ జర్నల్ ప్రచురించింది. ఈ వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీస్ అత్యంత సమర్థంగా ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. ఒక్క డోసు వ్యాక్సిన్‌తో హెచ్‌ఐవీ రోగుల్లో వైరస్‌ను తటస్థీకరించేలా చేయడంలో శాస్త్రవేత్తలు తొలి దశలో విజయం సాధించారు. ఈ ఇంజెక్షన్‌తో వైరస్ నిర్వీర్యం కావడంతో పాటు రోగుల ఆరోగ్యమూ బాగా మెరుగవుతోంది.
- ఇంజనీరింగ్–టైప్ బీ తెల్ల రక్తకణాల ద్వారా రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచి హెచ్‌ఐవీ వైరస్‌ను న్యూట్రలైజ్ చేసే యాంటీ బాడీలు ఉత్పత్తయేలా ఈ వ్యాక్సిన్ పని చేస్తుంది. వైరస్‌లు, బ్యాక్టీరియాలను నిర్వీర్యం చేసే యాంటీ బాడీలు శరీరంలో ఉత్పత్తి కావాలంటే బీ సెల్స్ ఉండాలి. ఇవి వైరస్‌తో పోరాడి వాటిని విభజిస్తాయి. ఫలితంగా జరిగే వైరస్ మార్పుల్లోనూ చోటుచేసుకొని వాటిపై పోరాడి నిర్వీర్యం చేస్తాయి.
- ‘‘ఇప్పటిదాకా జరిగిన ప్రయోగాల్లో హెచ్‌ఐవీ వైరస్‌ను ఇవి సమర్థవంతంగా తటస్థం చేస్తున్నాయి. , యాంటీబాడీలు సమృద్ధిగా ఉత్పత్తవుతున్నాయి. ఎయిడ్స్‌పై పోరాటంలో ఇదో పెద్ద ముందడుగు’’ అని శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన డాక్టర్ బర్జేల్ వివరించారు. ఎయిడ్స్‌కు త్వరలో ఔషధాన్ని కనిపెడతామని ధీమా వెలిబుచ్చారు.