తెలంగాణ భూమి హక్కుల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
అలాగే తెలంగాణ గ్రామ అధికారుల పదవుల రద్దు బిల్లుకు, పంచాయతీరాజ్- 2020 సవరణ బిల్లుకు, పురపాలక చట్టం-2020 సవరణ బిల్లుకు కూడా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భూములపై రైతులు, భూ యజమానుల హక్కులను పరిరక్షించడం, రెవెన్యూ శాఖలో విపరీతంగా పెరిగిన అవినీతి, అక్రమాలను రూపుమాపడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలను చేపట్టింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న భూ యాజమాన్య హక్కులు-1971 చట్టం స్థానంలోనే.. ద తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ బిల్ -2020ను ప్రభుత్వం తీసుకోచ్చింది. గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో) పోస్టులను రద్దు చేసేందుకు ‘ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్-2020’ను రూపొందించింది. శాసనసభలో బిల్లులకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు.
సీఎం తెలిపిన వివరాల ప్రకారం...
- రాష్ట్రంలో భూ వివాదాలను పరిష్కరించేందుకు భూముల సమగ్ర సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- భూముల సమగ్ర సర్వే పూర్తయ్యాక.. భూ రికార్డులను వెబ్‌సైట్ (దరణి పోర్టల్), డిజిటల్(సీడీల రూపంలో), డాక్యుమెంట్ రూపంలో స్టోర్ చేస్తారు.
- ధరణి వెబ్‌సైట్ ఒకే సర్వర్ మీద ఆధారపడకుండా దేశంలో ఎక్కడ భద్రమైన ప్రాంతాలు ఉంటాయో అక్కడ సర్వర్లు ఏర్పాటు చేస్తారు.
- పార్ట్-ఏ(వ్యవసాయ), పార్ట్-బీ(వ్యవసాయేతర) భూములకు వేర్వేరు ధరణి పోర్టళ్లను రెండు విధాలుగా అందుబాటులోకి తేనున్నారు.
- ఆర్‌వోఎఫ్‌ఆర్ ఉన్న వాటిని కూడా ధరణి వెబ్ సైట్‌లో ప్రత్యేకంగా పొందుపరుస్తారు.
- సమగ్ర సర్వేలో టెక్నాలజీ ఆధారంగా కోఆర్డినేట్స్ (అక్షాంశాలు, రేఖాంశాలు) ఉంటాయి.
- వ్యవసాయ భూములకు ఆకుపచ్చ పాస్‌బుక్‌లను, ఇతర భూములన్నింటికి మెరూన్ కలర్ పాస్‌బుక్‌లను ఇస్తారు.
- వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ శాఖ చేస్తే, వ్యవసాయ భూములను రెవెన్యూ శాఖ చేస్తుంది.
- రెవెన్యూ కోర్టులన్నీ రద్దయ్యాయి. ఇకపై భూ వివాదాలను సివిల్ కోర్టులకు వెళ్లి పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
- వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తారు.
- ఇకపై వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌కు ఒక చోటుకు, మ్యుటేషన్‌కు మరో చోటుకు వెళ్లాల్సిన అవసరం లేదు. జాయింట్ రిజిస్ట్రార్ల హోదాలో తహసీల్దార్లే ఆ రెండు పనులు చేసి రైతుకు వెంటనే పాసు పుస్తకం ఇచ్చేస్తారు.