Skip to main content

రెపో రేటు పావు శాతం తగ్గించిన ఆర్‌బీఐ

కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పావుశాతం(25 బేసిస్ పాయింట్లు) తగ్గించింది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి, రివర్స్ రెపో 6 శాతానికి దిగొచ్చాయి. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4న జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయాలతో గృహ, రుణ, వాహన రుణాలపై కస్టమర్ల నెలవారీ చెల్లింపులు (ఈఎంఐ) తగ్గుతాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకూ) ఎంపీసీకి ఇది తొలి ద్వైమాసిక సమావేశం. రెండు నెలల క్రితం జరిగిన ద్వైమాసిక సమావేశంలో (ఫిబ్రవరి 7) కూడా ఆర్‌బీఐ రెపో రేటు పావుశాతం కోత నిర్ణయం తీసుకుంది. 2016లో ఎంపీసీ ఏర్పాటయిన తర్వాత ఇలా వరుసగా రెండుసార్లు రేటు కోత నిర్ణయం ఇదే తొలిసారి.

పాలసీ ముఖ్యాంశాలు...
  • రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు. రివర్స్ రెపో రేటు 6 శాతం నుంచి 5.75 శాతానికి తగ్గింపు.
  • వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌తో పాటు పామీదువా, రవీంద్ర దోలాకియా, మైఖేల్‌పాత్రలు అనుకూలంగా ఓటు వేశారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య, ఎంసీసీ సభ్యుడు ఛేతన్ ఘాటే వ్యతిరేకంగా ఓటు వేశారు.
  • జీడీపీ వృద్ధి రేటు వచ్చే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతంగా ఉండొచ్చు. 2019, ఫిబ్రవరిలో ఈ రేటును 7.4 శాతంగా ఆర్‌బీఐ అంచనా వేసింది. అంటే 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది.
  • ద్రవ్యోల్బణం రేటు అంచనాలను ఆర్‌బీఐ తగ్గించింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ద్రవ్యోల్బణం 2.9-3 శాతం శ్రేణిలో ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఫిబ్రవరిలో ఈ అంచనాలను 3.2-3.4 శ్రేణిగా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో 3.5-3.8 శాతం వరకూ ఉంటుందని అంచనావేసింది. అంటే ఆర్‌బీఐ లక్ష్యం 4 శాతం దిగువనే ద్రవ్యోల్బణం ఉంటుందన్నమాట.
ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: రెపో రేటు, రివర్స్ రెపో రేటు పావుశాతం(25 బేసిస్ పాయింట్లు) తగ్గింపు
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
Published date : 05 Apr 2019 06:27PM

Photo Stories