Skip to main content

ప్రముఖ శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ అవార్డీ కన్నుమూత

ప్రముఖ ఏరోస్పేస్ శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ రొద్దం నరసింహ (87) కన్నుమూశారు.
Current Affairs
మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొదుతూ డిసెంబర్ 14న తుదిశ్వాస విడిచారు. అనంతపురం జిల్లా పెనుకొండ ప్రాంతానికి చెందిన నరసింహ 1933, జూలై 20న జన్మించారు. ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా భారతదేశానికి ఎంతో సేవ చేశారు. ఇస్రో తేలికపాటి యుద్ద విమానం తేజస్ నిర్మాణంలో, ప్రధాన శాస్త్రీయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

ఎన్‌ఏఎల్ డెరైక్టర్‌గా...
ప్రొఫెసర్ సతీశ్ ధావన్ మొదటి విద్యార్థి అయిన నరసింహ మైసూర్ యూనివర్శిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)కి ఫ్యాకల్టీగా పని చేశారు. 1984-1993 వరకు నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్(ఎన్‌ఏఎల్) డెరైక్టర్‌గా విధులు నిర్వర్తించారు. 2000 నుంచి 2014 వరకు బెంగళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జేఎన్‌సీఏఎస్‌ఆర్)లో ఇంజనీరింగ్ మెకానిక్స్ యూనిట్ చైర్మన్‌గా కొనసాగారు. భారతీయ అంతరిక్ష సమితి (ఇండియన్ స్పేస్‌కమిషన్)లో సభ్యుడిగానూ ఉన్నారు.

కలాంతో కలిసి పుస్తకం...
2013లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డును నరసింహ అందుకున్నారు. 1978లో భట్నాగర్ పురస్కారాన్ని స్వీకరించారు. మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంతో కలిసి ‘‘డెవలప్‌మెంట్స్ ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ’’ అనే పుస్తకాన్ని రచించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ ఏరోస్పేస్ శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : రొద్దం నరసింహ
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 15 Dec 2020 06:03PM

Photo Stories