Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 23rd కరెంట్ అఫైర్స్
Lancet Journal: మరణమృదంగం.. ఐదు బ్యాక్టీరియాలకు.. 77 లక్షల మంది బలి
ఈ.కోలి, ఎస్ నిమోనియా, కె.నిమోనియా, ఎస్.ఏరియస్, ఎ.మౌమనీ. ఈ ఐదు రకాల బ్యాక్టీరియాలు 2019లో భారత్‌లో ఏకంగా 6.8 లక్షల మంది ఉసురు తీశాయని లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. ‘‘2019లో ప్రపంచం మొత్తమ్మీద సంభవించిన మరణాలకు గుండె సంబంధిత వ్యాధుల తర్వాత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లే రెండో అతి పెద్ద కారణంగా నిలిచాయి. ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకటి వీటి ఫలితమే. 33 రకాల సాధారణ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు 77 లక్షల మరణాలకు కారణమయ్యాయి. వీటిలోనూ కేవలం ఐదు బ్యాక్టీరియాల వల్ల సగానికి పైగా మరణాలు సంభవించాయి’’ అని అధ్యయనం పేర్కొంది. ప్రజారోగ్యం దృష్ట్యా బ్యాక్టీరియాలను అదుపు చేయడం తక్షణావసరమని హెచ్చరించింది.
➤ Career Tips : మీ ఉద్యోగం పోయిందా..! అయితే వీటికి జోలికి అసలు వెళ్లొద్దు..
‘‘పటిష్టమైన ఆరోగ్య, వ్యాధి నిర్ధారణ వ్యవస్థల నిర్మాణం, మెరుగైన అదుపు చర్యలు, యాంటీబయాటిక్‌ల వాడకాన్ని గరిష్ట స్థాయికి పెంచడం వంటి చర్యలు చేపట్టాలి’’ అని వాషింగ్టన్ వర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ డైరెక్టర్, అధ్యయన కర్త క్రిస్టోఫర్ ముర్రే సూచించారు. చాలా ఇన్ఫెక్షన్లు తదితరాలకు మనకిప్పటిదాకా కారణాలు తెలియకపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. పలు గణాంకాలతో పాటు 3.43 కోట్ల మంది వైద్య రికార్డులను పరిశీలించారు. ‘‘2019లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 1.37 కోట్ల ఇన్ఫెక్షన్ సంబంధిత మరణాల్లో సగానికి పైగా బ్యాక్టీరియానే కారణం.
77 లక్షల బ్యాక్టీరియా సంబంధిత మరణాల్లో మూడొంతులకు పైగా శ్వాస, రక్త, ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్లే. బ్యాక్టీరియాల్లో ఒక్క ఎస్.ఏరియస్ రకమే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 1.1 కోట్ల మరణాలకు కారణమైంది. వయసుపరంగా కూడా 15 ఏళ్ల పై బడ్డ వారిలో అత్యధికంగా 9.4 లక్షల మందిని ఇది బలి తీసుకుంది’’ అని పరిశోధకులు తేల్చారు. సహారా ఆఫ్రికా ప్రాంతంలో అత్యధికంగా ప్రతి లక్ష మంది జనాభాకు 230 మంది బ్యాక్టీరియాకు బలైనట్టు వివరించారు. అదే పశి్చమ యూరప్, ఉత్తర అమెరికా, ఆ్రస్టేలియా వంటి సంపన్న ప్రాంతాల్లో ఈ సంఖ్య అత్యల్పంగా ప్రతి లక్ష మందికి 52గా ఉందని చెప్పారు.
World Health Organization: కొత్త మహమ్మారుల జాబితా తయారీకి డబ్ల్యూహెచ్‌ఓ సిద్దం
ప్రపంచవ్యాప్తంగా సమీప భవిష్యత్తులో కరోనా తరహా మహమ్మారులకు కారణం కాగల వైరస్‌లను గుర్తించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) రంగంలోకి దిగింది. మనకింకా ఆనుపానులు తెలియని డిసీజ్ ఎక్స్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉంది. ప్రస్తుత జాబితాలో దానితో పాటు కొవిడ్–19, ఎబోలా, మార్బర్గ్, లాసా ఫీవర్, మిడిలీస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (ఎంఈఆర్‌ఎస్), నిఫా, సార్స్, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, జికా వైరస్ తదితరాలున్నాయి. పరిశోధనలో తెరపైకి వచ్చే కొత్త వైరస్‌లతో జాబితాను సవరించనున్నారు. ‘‘ఇందుకోసం పలు బ్యాక్టీరియా కారకాలపై నిశితంగా దృష్టి పెట్టాం. వీటిలో డిసీజ్ ఎక్స్ అత్యంత ప్రమాదకరమైన అంతర్జాతీయ అంటువ్యాధిగా మారే ఆస్కారముంది’’ అని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. 300 మందికి పైగా శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో తలమునకలుగా ఉన్నారు. 25కు పైగా వైరస్, బ్యాక్టీరియా కుటుంబాలపై పరిశోధనలు చేయనున్నారు. ఇలాంటి జాబితాను తొలిసారిగా 2017లో డబ్ల్యూహెచ్‌ఓ విడుదల చేసింది. దాన్ని 2018లో సవరించారు. భావి మహమ్మారిని ముందుగానే గుర్తించి దీటుగా ఎదుర్కొనేందుకు రాబోయే జాబితా కరదీపిక కాగలదని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. ఈ జాబితాను 2023 మార్చిలోగా విడుదల చేయొచ్చని భావిస్తున్నారు.
Also read: Population Decline: జనాభా తగ్గుదల ఆందోళనకరం... ప్రపంచ దేశాల ముందు కొత్త సవాళ్లు
ప్రతి 11 నిమిషాలకు.. ఒక యువతి బలి
ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ/బాలిక తమ భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో దారుణ హత్యకు గురవుతున్నారని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.. మానవ హక్కుల ఉల్లంఘనల్లో మహిళలపై జరిగే హింస ముందు వరసలో ఉందని పేర్కొంది. నవంబర్ 25న ‘‘మహిళలపై హింసా నిర్మూలన‘‘ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రపంచంలో మానవ హక్కుల ఉల్లంఘనల్లో మహిళలపై హింస విస్తృతమైనది. ప్రతీ 11 నిమిషాలకు ఒక మహిళ తన భాగస్వామి లేదంటే సొంత కుటుంబానికి చెందిన వారి చేతిల్లోనే ప్రాణాలు కోల్పోతోంది. కోవిడ్–19, ఆర్థిక వెనుకబాటుతనం, ఇతర ఒత్తిళ్లతో మహిళలపై శారీరక, మానసిక హింస ఎక్కువైపోతోంది’’ అని గుటెరస్ పేర్కొన్నారు. దీనిని ఎదుర్కోవడానికి దేశాలన్నీ కార్యాచరణ రూపొందించాలన్నారు. ‘‘మహిళలపై హింస అంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. మహిళా హక్కుల కోసం పాటు పడే సంస్థలకు నిధులను 2026 నాటికి 50 శాతం పెంచాలి. మనందరం ఫెమినిస్టులమని గర్వంగా ప్రకటించుకోవాలి’’ అన్నారు.
Champions of the Earth: అస్సాం పర్యావరణవేత్త పూర్ణిమకు ఐరాస అవార్డు
అస్సాంకు చెందిన పూర్ణిమా దేవి బర్మన్‌కు 2022 సంవత్సరానికి గాను ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ వరించింది. అంతరించిపోతున్న హర్గిలా అనే పక్షి జాతిని కాపాడేందుకు ఈమె ‘హర్గిలా ఆర్మీ’ పేరుతో మహిళా గ్రూపును తయారు చేశారు. అటవీ జీవశాస్త్రవేత్త అయిన బర్మన్ రెండు దశాబ్దాలుగా చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంటల్ ప్రోగ్రాం(యూఎన్‌ఈపీ) మంగళవారం తెలిపింది. గ్రీన్ ఆస్కార్‌గా పిలుచుకునే ఈ అవార్డును బర్మన్, యూకేకు చెందిన సర్ పార్థా దాస్‌గుప్తా, పెరూ, లెబనాన్, కామెరూన్ దేశాల ఉద్యమకారులకు ఐరాస ప్రకటించింది.
UK Inflation: బ్రిటన్‌ను వణికిస్తున్న ద్రవ్యోల్బణం.. చిక్కుల్లో బ్రిటన్ ప్రధాని
IND Vs NZ T20: టీ20 సీరిస్ భారత్‌దే..
నవంబర్ 22న టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టి20 టైగా ముగిసింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్ నిలిపోయింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం మ్యాచ్ టై అయినట్లు అంపైర్లు ప్రకటించారు. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 1-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.
Mega Project: మంచి నీటి సరఫరా ప్రాజెక్టు పూర్తి
మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) బిహార్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంచి నీటి సరఫరా ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. హర్ ఘర్ గంగాజల్ మొదటి దశ పనులతో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన బోధ్ గయా, గయా, రాజ్‌గిర్ నగరాల తాగునీటి కష్టాలు తీరిపోనున్నాయి. శుద్ధి చేసిన గంగాజలాలు ఇకపై ఈ ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. భౌగోళిక పరిస్థితుల కారణంగా గంగా నదీ జలాలు అందుబాటులో లేని ఈ ప్రాంతాలకు వరద నీటిని తాగునీరుగా మార్చేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వరద నీటిని ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లలో నింపి, శుద్ధిచేసి 365 రోజులు ప్రజలకు తాగునీరు సరఫరా చేసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టులో భాగంగా 151 కిలోమీటర్ల పొడవు పైప్‌లైన్, నాలుగు వంతెనలతోపాటు రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు.
Report on Food Crises: ఆహార సంక్షోభం ముంగిట్లో...
Turkey Earthquake: టర్కీలో భూకంపం.. 50 మందికి గాయాలు
టర్కీలోని డ్యూజ్ పట్టణ సమీపంలో నవంబర్ 23న భూకంపం సంభవించింది. భూకంపం దాటికి 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1 నమోదైంది. టర్కీలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్‌కు తూర్పున దాదాపు 210 కి.మీ దూరంలో డ్యూజ్ పట్టణం ఉంది. ఈ ప్రకంపనలు ఇస్తాంబుల్, దేశ రాజధాని అంకారాలో సంభవించాయని టర్కీ మంత్రి సులేమాన్ సోయ్లు తెలిపారు. భూకంపం లోతు 2 కిమీ నుంచి 10 కిమీ వరకు ఉండచ్చని అధికారులు అంచనా వేశారు.
Indonesia Earthquake: ఇండోనేసియాలో భూకంపం.. 268 మంది మృతి
ఇండోనేసియాలోని జావా దీవిలో నవంబర్ 21న వచ్చిన భూకంపంలో మృతుల సంఖ్య 268కి పెరిగింది. మరో 151 మంది జాడ తెలియాల్సి ఉందని, 1,083 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వారిలో 300 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల్లో ఎక్కువ మంది పాఠశాల విద్యార్థులేనని పశ్చిమ జావా గవర్నర్ చెప్పారు. 13 వేల నివాసాలు దెబ్బతిన్నాయని చెప్పారు. మరిన్ని ప్రకంపనలు సంభవించవచ్చనే భయాందోళనల మధ్య ప్రజలు రోడ్లపైనే చీకట్లో గడిపారు. నవంబర్ 22న దేశాధ్యక్షుడు జోకో విడొడొ సియంజుర్‌లో పర్యటించారు.