Skip to main content

Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్‌ 24 కరెంట్‌ అఫైర్స్‌

G4 Countries

UN Security Council: జీ–4 దేశాల విదేశాంగమంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా న్యూయార్క్‌కు చేరుకున్న జీ–4 దేశాల(భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్‌) విదేశాంగ మంత్రులు సెప్టెంబర్‌ 22న సమావేశమయ్యారు. భారత విదేశాంగ మంత్రి జై శంకర్, బ్రెజిల్‌ విదేశాంగ మంత్రి కార్లోస్‌ ఆల్బెర్టో ఫ్రాంకో ఫ్రాంకా, జర్మనీ విదేశాంగ మంత్రి హైకో మాస్, జపాన్‌ విదేశాంగ మంత్రి మొతెగి తొషిమిట్సులు ఈ భేటీలో పాల్గొన్నారు. భేటీ అనంతరం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం జీ–4 దేశాలు చాన్నాళ్లుగా డిమాండ్‌ చేస్తున్న విషయం తెల్సిందే.

ప్రకటనలోని ముఖ్యాంశాలు...

  • ప్రపంచవ్యాప్తంగా శాంతి సామరస్యాలు మరింతగా పరిఢవిల్లాలంటే ఐరాస భద్రతా మండలిలో అందుకనుగుణంగా సంస్కరణలు అనివార్యం. భద్రతా మండలిలో మరి కొన్ని దేశాలకు శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాల హోదా ఇవ్వడం ద్వారా ఇది సుసాధ్యమవుతుంది.
  • భద్రతా మండలిలో సంస్కరణల బాధ్యతలు చూసే ఇంటర్‌–గవర్నమెంటల్‌ నెగోషియేషన్స్‌(ఐజీఎన్‌) విభాగంతో లిఖితపూర్వక చర్చలకు సిద్ధం.
  • ఐరాస మూడు కీలక విభాగాలైన భద్రతా మండలి, సర్వ ప్రతినిధి సభ, ఆర్థిక, సామాజిక మండలిలో సంస్కరణలు తప్పనిసరి అని ‘అవర్‌ కామన్‌ అజెండా’ నివేదికలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ వ్యాఖ్యానించారని ఆయా దేశాలు గుర్తుచేశాయి.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జీ–4 దేశాల(భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్‌) విదేశాంగ మంత్రుల సమావేశం
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 22
ఎవరు    : భారత విదేశాంగ మంత్రి జై శంకర్, బ్రెజిల్‌ విదేశాంగ మంత్రి కార్లోస్‌ ఆల్బెర్టో ఫ్రాంకో ఫ్రాంకా, జర్మనీ విదేశాంగ మంత్రి హైకో మాస్, జపాన్‌ విదేశాంగ మంత్రి మొతెగి తొషిమిట్సు
ఎక్కడ    : న్యూయార్క్, అమెరికా
ఎందుకు : ఐరాస భద్రతా మండలిలో రి కొన్ని దేశాలకు శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాల హోదా ఇవ్వడంపై చర్చించేందుకు...  

 

India-USA: భారత ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షురాలు కమల భేటీ

Modi-Kamala

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో సమావేశమయ్యారు. అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్‌లో సెప్టెంబర్‌ 23న జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక బంధాల బలోపేతం, అమెరికా– భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం, కోవిడ్‌ మహమ్మారిపై పోరాటం, సాంకేతిక రంగం, అంతరిక్ష రంగం వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. భారత్‌ రావాలని కమలను మోదీ ఆహ్వానించారు. భారత సంతతికి చెందిన కమల అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యాక... ప్రధాని మోదీతో ప్రత్యక్షంగా సమావేశం కావడం ఇదే తొలిసారి.

మోరిసన్‌తో సమావేశం...
ప్రధాని మోదీ సెప్టెంబర్‌ 23న వాషింగ్టన్‌లో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మోరిసన్‌తో సమావేశమయ్యారు. భారత్‌–ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక సంబంధాలతోపాటు ద్వైపాక్షిక బంధాల బలోపేతం, కోవిడ్‌–19, రక్షణ, క్లీన్‌ ఎనర్జీ అంశాలపై చర్చించారు. ఆకస్‌(AUKUS-ఆస్ట్రేలియా, యూకే, యూఎస్‌) భద్రతా భాగస్వామ్యం ఏర్పాటైన తర్వాత మోదీ, మోరిసన్‌ భేటీ కావడం ఇదే తొలిసారి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 23
ఎవరు    : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌
ఎక్కడ    : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు  : ద్వైపాక్షిక బంధాల బలోపేతం, కోవిడ్‌ మహమ్మారిపై పోరాటం వంటి అంశాలపై చర్చలు జరిపేందుకు...


India-UAE: భారత్‌కు మూడో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోన్న దేశం?

India-UAE Ministers

 

భారత పర్యటనలో ఉన్న యూఏఈ విదేశాంగమంత్రి థాని బిన్‌ అహ్మద్‌ అల్‌ జియోదితో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్‌ 23న జరిగిన ఈ సమావేశంలో... ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు వంటి పలు అంశాలపై ఇరువురూ చర్చలు జరిపారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై ఇరు దేశాలు చర్చలు ప్రారంభించిన నేపథ్యంలో తాజా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2022 మార్చిలో రెండు దేశాలు సీఈపీఏపై సంతకాలు చేసే అవకాశం ఉంది.

మూడో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి..
ప్రస్తుతం యూఏఈ భారత్‌కు మూడో అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. 2019–20లో ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 59 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. యూఏఈకి అమెరికా తర్వాత ఎగుమతులకు అతి పెద్ద భాగస్వామిగా భారత్‌ ఉంటోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 23
ఎవరు    : యూఏఈ విదేశాంగమంత్రి థాని బిన్‌ అహ్మద్‌ అల్‌ జియోది
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు  : ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు వంటి పలు అంశాలపై చర్చలు జరిపేందుకు..


Men's Hockey: హాకీ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారతీయ నగరం?

Hockey

భారత హాకీ జట్టు ప్రధాన స్పాన్సర్‌ గా ఉన్న ఒడిశా రాష్ట్రం మరో ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు వేదిక కానుంది. 2021, నవంబర్‌ 24 నుంచి డిసెంబర్‌ 5 వరకు జరిగే పురుషుల జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరగనుంది.  ఈ మేరకు ఆతిథ్య హక్కులను ఒడిశాకు కట్టబెడుతూ సెప్టెంబర్‌ 23న అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ ఈవెంట్‌ కోసం ఉత్తరప్రదేశ్‌ కూడా రేసులో ఉన్నా... 2016 ప్రపంచకప్‌ అక్కడే జరగడంతో ఈసారి ఒడిశాకు అవకాశం దక్కింది. ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌తో పాటు మరో 15 దేశాలు పాల్గొంటున్నాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పురుషుల జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌–2021కు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం? 
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 23
ఎవరు    : ఒడిశా 
ఎక్కడ    : కళింగ స్టేడియం, భువనేశ్వర్, ఒడిశా
ఎందుకు  : అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్ణయం మేరకు...


High Court: ట్రాన్స్‌ఫర్మేటివ్‌ జస్టిస్‌ పుస్తకాన్ని ర‌చించిన‌ విశ్రాంత న్యాయమూర్తి?

Transformative Justice

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ శివశంకరరావు రచించిన ‘ట్రాన్స్‌ఫర్మేటివ్‌ జస్టిస్‌’ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీజే అరూప్‌ కుమార్‌ గోస్వామి ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా, మంగళగిరిలో సెప్టెంబర్‌ 23న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్‌ గోస్వామి మాట్లాడుతూ... న్యాయవాదులు, న్యాయమూర్తులకు ఉపయుక్తంగా జస్టిస్‌ డాక్టర్‌ బులుసు శివశంకరరావు మరిన్ని పుస్తకాలు రచించాలని ఆకాంక్షించారు. న్యాయవ్యవస్థలోని వివిధ అంశాలను వివరణాత్మకంగా ఈ పుస్తకం ద్వారా అందించారన్నారు. ఏపీ టెండర్ల ప్రక్రియ న్యాయ పరిశీలన కమిటీ(జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిటీ) చైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి. శివశంకరరావు 2019, సెప్టెంబర్‌ 14న బాధ్యతలు స్వీకరించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ శివశంకరరావు రచించిన ‘ట్రాన్స్‌ఫర్మేటివ్‌ జస్టిస్‌’ పుస్తకావిష్కరణ
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 23
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీజే అరూప్‌ కుమార్‌ గోస్వామి
ఎక్కడ    : మంగళగిరి, గుంటూరు జిల్లా


Visakhapatnam: దేశంలో మూడో అమెరికన్‌ కార్నర్‌ ఏ రాష్ట్రంలో ఏర్పాటైంది?

America Cornor

విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఉన్నత విద్యలో అవకాశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందించే వేదిక ‘అమెరికన్‌ కార్నర్‌’ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఏర్పాటైంది. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఈ కార్నర్‌ను సెప్టెంబర్‌ 23న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఇది దేశంలో మూడో అమెరికా కార్నర్‌. ఒకటి అహ్మదాబాద్, మరోటి హైదరాబాద్, మూడోది విశాఖలో ఏర్పాటైంది. విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యపై సూచనలు, సలహాలు.. మరెన్నో విధాలుగా సేవలందించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కార్నర్‌ ప్రారంభ కార్యక్రమంలో అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మన్, యూఎస్‌ ఎయిడ్‌ మిషన్‌ డైరెక్టర్‌ వీణారెడ్డి పాల్గొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అమెరికన్‌ కార్నర్‌ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్‌ 23
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
ఎక్కడ    : ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు  : విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఉన్నత విద్యలో అవకాశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందించేందుకు...


Mk-1A Tanks: హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?

MK 1a Tank

భారత సైన్యం పోరాట సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.7,523 కోట్లతో అర్జున్‌ ఎంకే–1ఏ రకం 118 యుద్ధ ట్యాంకులను కొత్తగా కొనుగోలు చేయాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది. వీటి కొనుగోలు కోసం తమిళనాడు రాష్ట్రం చెన్నై నగర శివారు ఆవడిలో ఉన్న హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీ(హెచ్‌వీఎఫ్‌)కు ఆర్డర్‌ ఇచ్చినట్లు సెప్టెంబర్‌ 23న రక్షణ శాఖ తెలిపింది. వేగంగా కదలడం, మెరుగైన నిఘా సామర్థ్యం, పేలుడు శక్తి తదితర 72 ఆధునీకరించిన ప్రత్యేకతలు కలిగిన దేశీయ అర్జున్‌ ట్యాంక్‌ ఆధునిక రూపమే ఏంకే–1ఏ. ఈ ట్యాంకులు అన్ని వేళల్లో, అన్ని రకాలైన ప్రాంతాల్లో కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలవు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)కి చెందిన ల్యాబోరేటరీ... కంబాట్‌ వెహికల్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌(సీవీఆర్‌డీఈ) ఎంకే–1ఏ రకం ట్యాంకులను డిజైన్‌ చేసింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : రూ.7,523 కోట్లతో అర్జున్‌ ఎంకే–1ఏ రకం 118 యుద్ధ ట్యాంకులను కొనుగోలు చేసేందుకు హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీ(హెచ్‌వీఎఫ్‌)కు ఆర్డర్‌
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 23
ఎవరు    : భారత రక్షణ శాఖ
ఎక్కడ    : ఆవడి, చెన్నై
ఎందుకు : భారత సైన్యం పోరాట సామర్థ్యాన్ని పెంచేందుకు...


CEOs of American Firms: ప్రధాని మోదీ భేటీ అయిన క్వాల్‌కామ్‌ సీఈవో పేరు?

Modi-Qualcomm CEO
క్వాల్‌కామ్‌ సీఈవో క్రిస్టియానో అమోన్‌తో ప్రధాని మోదీ సమావేశం

అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయిదు రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. సెప్టెంబర్‌ 23న వాషింగ్టన్‌లో జరిగిన ఈ సమావేశంలో భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. భారత్‌లో వ్యాపార అవకాశాల గురించి వివరించారు. చిప్‌ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్‌ సీఈవో క్రిస్టియానో ఇ అమోన్, సౌర విద్యుత్‌ సంస్థ ఫస్ట్‌ సోలార్‌ చీఫ్‌ మార్క్‌ విడ్మర్, ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ చైర్మన్‌ స్టీఫెన్‌ ఎ ష్వార్జ్‌మాన్, అడోబ్‌ చైర్మన్‌ శంతను నారాయణ్, జనరల్‌ అటామిక్స్‌ సీఈవో వివేక్‌ లాల్‌తో ప్రధాని భేటీ అయ్యారు.

దోతి శతాబ్ది వేడుక...
రామ్‌రాజ్‌æ కాటన్‌ ఆధ్వర్యంలో ‘ధోతి 100’ పేరుతో తమిళనాడులోని తిరుప్పూర్‌లో ధోతి శతాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నారు. దోతిని తన వస్త్రాధరణగా మార్చుకున్న మహాత్మా గాంధీ శతవార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ వేడుకను జరుపుతున్నారు. ఈ సందర్భంగా 100 మంది అమరవీరుల కుటుంబాలను, 100 మంది నేత కార్మికులను సత్కరించనున్నారు. 100 మొక్కలు నాటనున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అయిదు రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల సీఈవోలతో సమావేశం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 23
ఎవరు    : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ    : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు: భారత్‌లో వ్యాపార అవకాశాల గురించి వివరించేందుకు...


AUKUS, Security Alliance: ఆకస్‌ కూటమిలో ఎన్ని దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి?

ఆస్ట్రేలియా, యూకేలతో కలిసి ఏర్పాటు చేసిన త్రైపాక్షిక రక్షణ కూటమి(ఆకస్‌–ఆస్ట్రేలియా, యూకే, యూఎస్‌ఏ)లో భారత్, జపాన్, ఫ్రాన్స్‌లను చేర్చుకోబోమని సెప్టెంబర్‌ 23న అమెరికా తెలిపింది. వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో –పసిఫిక్‌ ప్రాంతంలో 21వ శతాబ్దంలో ఎదురయ్యే భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు త్రైపాక్షిక కూటమి (ఆకస్‌)ను ఏర్పాటు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్, యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌లు సెప్టెంబర్‌ 15వ తేదీన సంయుక్తంగా ప్రకటించారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడును నిలువరించడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా అమెరికా మొదటిసారిగా ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాములను సమకూర్చనుంది.


Minister Harish Rao: ధరణి పోర్టల్‌ ఉపసంఘం చైర్మన్‌గా వ్యవహరించనున్న మంత్రి?

Harish Rao

ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చైర్మన్‌గా, సభ్యులుగా మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీష్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వ్యవహరించనున్నారు. ఈ ఉప సంఘం కన్వీనర్‌గా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సెప్టెంబర్‌ 23న ఉత్తర్వులు జారీ చేశారు.

సీఐఐ మిస్టిక్‌ సౌత్‌: గ్లోబల్‌ లింకేజెస్‌ సదస్సు
సెప్టెంబర్‌ 23న సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మిస్టిక్‌ సౌత్, గ్లోబల్‌ లింకేజెస్‌ సమ్మిట్‌ టువార్డ్స్‌ 1.5 ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమి బై 2025’సదస్సును ఉద్దేశించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వర్చువల్‌ వేదికగా ప్రసంగించారు. దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 1.5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకునేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవడాన్ని ఆయన అభినందించారు. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ధరణి పోర్టల్‌ ఉపసంఘం చైర్మన్‌గా వ్యవహరించనున్న మంత్రి?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 23
ఎవరు    : తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
ఎందుకు : ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయానికి...

 

చ‌ద‌వండి: Daily Current Affairs in Telugu: 2021, సెప్టెంబర్‌ 23 కరెంట్‌ అఫైర్స్‌

Published date : 25 Sep 2021 02:52PM

Photo Stories