Skip to main content

ఏపీ చట్టసభల సమావేశంలో గవర్నర్

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి, శాసనసభ ఉమ్మడి సమావేశంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జూన్ 14న ప్రసంగించారు.
పారదర్శకమైన, అవినీతి రహిత పాలన అందించడం.. నవరత్నాల సంక్షేమ ఫలాలు ప్రతి అర్హుని ఇంటికి చేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ఈ సందర్భంగా గవర్నర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం, వెలిగొండతోపాటు ముఖ్యమైన ప్రాజెక్టులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్న అంశాలు, ఇతర హామీల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని పేర్కొన్నారు.

గవర్నర్ ప్రసంగం-అంశాలు
  • రైతు సంక్షేమంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
  • రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వడంతోపాటు ఉచితంగా బోర్లు వేయిస్తుంది.
  • వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందించనుంది.
  • రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2,000 కోట్లతో ప్రకృతి విపత్తు సహాయ నిధి ఏర్పాటు.
  • సహకార డెయిరీలకు పాలు సరఫరా చేసే రైతులకు లీటరుకు రూ.4 ప్రోత్సాహకం అందిస్తుంది.
  • ఏదేని కారణంవల్ల రైతు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి వైఎస్సార్ బీమా పథకం కింద రూ.7 లక్షలు అందిస్తుంది.
  • ఐదు లక్షలలోపు వార్షికాదాయం ఉన్న ప్రతి కుటుంబానికి రూ. వెయి్యకి మించిన వైద్యం అవసరమైతే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం. ఈ పథకం కింద ప్రస్తుతమున్న 1095 వ్యాధులకు మరో 936 చేరుస్తాం.
  • దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు, తలసేమియా వంటి వ్యాధులతో బాధపడే రోగలకు ప్రత్యేక సాయంగా నెలకు రూ.10 వేల పింఛను.
  • వైఎస్సార్ ఆరోగ్య శ్రీని సమర్థంగా అమలుపర్చడంతోపాటు ప్రభుత్వాస్పత్రులను మెరుగుపరిచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక.
  • గ్రామ ఆరోగ్య కార్యకర్తల నెలసరి గౌరవ వేతనాన్ని రూ.3,000 నుంచి రూ. 10,000కు పెంపు.
  • దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో భాగంగా మొదటి దశలో బెల్ట్‌షాపులను మూసివేతకు నిర్ణయం.
  • పిల్లలను పాఠశాలకు పంపించే ప్రతి తల్లికీ అమ్మ ఒడి పథకం కింద సంవత్సరానికి రూ.15,000లు చెల్లింపు.
  • సాంకేతిక, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయడంతోపాటు ప్రతి విద్యార్థికి వసతి కోసం ఏటా రూ. 20,000 మంజూరు
  • ‘వైఎస్సార్ చేయూత’ కింద రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాల్లో మహిళల ఆర్థిక ప్రగతి కోసం 45-60 ఏళ్ల మధ్య వయసుగల వారికి ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75,000 చెల్లింపు.
  • ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, బలహీన వర్గాల నూతన వధువులకు వివాహ సమయంలో రూ. లక్ష ప్రోత్సాహకంగా అందిస్తాం.
  • ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. రాజకీయపరంగా నియమించే డెరైక్టర్లు, చైర్మన్లు, పాలక మండళ్లు తదితర నియామకాల్లో కూడా 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం.
  • కాపుల సంక్షేమానికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయించాలని ప్రణాళిక రూపొందించాం. అలాగే, ఆర్య వైశ్యులు, ముస్లింలు, క్రిస్టియన్లు, అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిపట్ల తగు శ్రద్ధ చూపుతాం.
  • సామాజిక పింఛన్‌ను దశల వారీగా రూ.3,000కు పెంచుతామన్న హామీ మేరకు వైఎస్సార్ భరోసా పింఛను రూ.2,250కి పెంచాం. నాలుగేళ్లలో దీనిని రూ.3,000కు తీసుకెళ్తాం. అలాగే, పింఛనుకు అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించాం. దీనివల్ల 5 లక్షల మందికి అదనంగా ప్రయోజనం కలిగింది.
  • 2020 ఉగాది నుంచి 25 లక్షల ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. అలాగే, వచ్చే నాలుగేళ్లపాటు ఏటా 6 లక్షల ఇళ్లు నిర్మిస్తాం.
  • ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి కమిటీ ఏర్పాటు చేశాం.
  • పురపాలక పారిశుధ్య కార్మికుల వేతనాలను రూ.12,000 నుంచి రూ. 18,000కు పెంచాం.
  • ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) 27 శాతం జూలై నుంచి చెల్లిస్తాం.
  • గిరిజన సంక్షేమ శాఖలో సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు గౌరవ వేతనం రూ.400 నుంచి రూ.4,000కు పెంచాం. అంగన్‌వాడీలు, హోంగార్డులకు వేతనాలు పెంచాం.
  • అక్రమ మైనింగ్, అవినీతి నిరోధానికి కొత్త ఇసుక విధానం తెస్తాం.
Published date : 15 Jun 2019 06:20PM

Photo Stories