Skip to main content

Daily Current Affairs in Telugu: డైలీ కరెంట్‌ అఫైర్స్‌ సెప్టెంబర్‌ 8

CAG GC Mrumu
కాగ్‌ జీసీ ముర్ము


CAG GC Murmu: భారత కాగ్‌ జీసీ ముర్ము ఏ అంతర్జాతీయ సంస్థ చైర్మన్‌గా ఎంపికయ్యారు?  

సుప్రీం ఆడిట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అంతర్జాతీయ సంఘం (ఐఎన్‌టీఓఎస్‌ఏఐ) ప్రాంతీయ గ్రూప్‌లలో ఒకటైన అసెంబ్లీ ఆఫ్‌ ది ఆసియన్‌ ఆర్గనైజేషన్‌ (ఏఎస్‌ఓ ఆఫ్‌ ఎస్‌ఏఐ) చైర్మన్‌గా భారత్‌ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) జీసీ ముర్ము ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (కాగ్‌) సెప్టెంబర్‌ 7న ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటన ప్రకారం...

  • 2024 నుంచి 2027 వరకూ జీసీ ముర్ము ఏఎస్‌ఓఎస్‌ఏఐ చైర్మన్‌ బాధ్యతల్లో ఉంటారు.
  • వియత్నాం రాజధాని హనోయ్‌లో జరిగిన ఏఎస్‌ఓఎస్‌ఏఐ 56వ గవర్నింగ్‌ బోర్డ్‌  జీసీ ముర్మును చైర్మన్‌గా ఎంచుకుంది. ఈ ఎంపికకు సెప్టెంబర్‌ 7న ఏఎస్‌ఓఎస్‌ఏఐ 15వ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది.
  • ఏఎస్‌ఓఎస్‌ఏఐ 16వ అసెంబ్లీ సమావేశాన్ని 2024లో భారత్‌ నిర్వహిస్తుంది.

1979లో ఏర్పాటు...
సుప్రీం ఆడిట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అంతర్జాతీయ సంఘం 1979 ఏడాదిలో ఏర్పాటయ్యింది. ప్రారంభంలో 11 సుప్రీం ఆడిట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఈ సంఘంలో సభ్యులుగా ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 47కు చేరింది. అసెంబ్లీ సమావేశాల్లో సుప్రీం ఆడిట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అంతర్జాతీయ సంఘం సభ్యులందరూ పాల్గొంటారు. మూడేళ్లకు ఒకసారి ఈ సమావేశం జరుగుతుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అసెంబ్లీ ఆఫ్‌ ది ఆసియన్‌ ఆర్గనైజేషన్‌ (ఏఎస్‌ఓ ఆఫ్‌ ఎస్‌ఏఐ) చైర్మన్‌గా ఎంపికైన వ్యక్తి?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 7
ఎవరు    : భారత్‌ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) జీసీ ముర్ము 
ఎందుకు   : జీసీ ముర్ము ఎంపికకు ఏఎస్‌ఓఎస్‌ఏఐ 15వ అసెంబ్లీ ఆమోదముద్ర వేయడంతో...

 

Afghanistan PM: అఫ్గానిస్తాన్‌ ప్రధానిగా ఎంపికైన తాలిబన్‌ ప్రతినిధి?

అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న దాదాపు మూడు వారాల అనంతరం తాలిబన్లు కొత్త ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రకటించారు. ముల్లా మహ్మద్‌ హసన్‌ అఖుంద్‌ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తాలిబన్‌ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ సెప్టెంబర్‌ 7న వెల్లడించారు. అమెరికాతో చర్చల్లో అత్యంత కీలకపాత్ర పోషించిన ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌తో పాటు మౌల్వీ హనాఫీలు అఖుంద్‌కు డిప్యూటీ పీఎంలుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఖారీ ఫసిహుద్దీన్‌ బంద్‌క్షనిని ఆర్మీ చీఫ్‌గా నియమించినట్లు తెలిపారు. అయితే ఎంతకాలం ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుందో, ప్రభుత్వంలో మార్పులు ఎలా వస్తాయో తాలిబన్లు వెల్లడించలేదు.

కీలక మంత్రులు– శాఖలు

  • అమీర్‌ ఖాన్‌ ముత్తఖీ:  విదేశాంగ మంత్రి 
  • షేర్‌ మొహ్మద్‌ అబ్బాస్‌ స్టానెక్‌జాయ్‌: విదేశాంగ సహాయ మంత్రి
  • సిరాజ్‌ హక్కానీ: హోంశాఖ మంత్రి 
  • ముల్లా యాకూబ్‌: రక్షణ మంత్రి 
  • అబ్దుల్లా హకీం షరే: న్యాయ మంత్రి
  • హిదాయతుల్లా బద్రి: ఆర్థిక మంత్రి 
  • షేక్‌ మవ్లావీ నూరుల్లా: విద్యా మంత్రి

ఎవరీ అఖుంద్‌?
ముల్లా మహ్మద్‌ హసన్‌ అఖుంద్‌(65), తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌కు అత్యంత సన్నిహితుడు, రాజకీయ సలహాదారు. గత తాలిబన్‌ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా, కాందహార్‌ గవర్నర్‌గా పనిచేశారు. అనంతరం ఐరాస ఆంక్షల జాబితాకెక్కారు. తాలిబన్‌ కమాండర్లలో అత్యంత ప్రభావశాలి అని ఐరాస పేర్కొంది. ఇరవైఏళ్లుగా తాలిబన్ల నాయకత్వ మండలి ‘రెహబరి షురా’కు అఖుంద్‌ అధిపతిగా ఉన్నారు.

ఇతర ప్రముఖులు

  • డిప్యూటీగా నియమితులైన ముల్లా బరాదర్, తాలిబన్‌ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు.
  • హోంశాఖ మంత్రి సిరాజుద్దీన్‌ హక్కానీ కీలకమైన హక్కానీ నెట్‌వర్క్‌ అధిపతి.
  • రక్షణ మంత్రిగా నియమితులైన ముల్లా యాకూబ్, తాలిబన్‌ స్థాపకుడు ముల్లా ఒమర్‌ కుమారుడు.

పాక్‌ జోక్యాన్ని సహించం..
అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో పాకిస్తాన్‌ జోక్యాన్ని నిరసిస్తూ సెప్టెంబర్‌ 7న వందలాది మంది కాబూల్‌ రోడ్లెక్కి నిరసన ప్రదర్శనలు చేశారు. పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడానికి పాకిస్తాన్‌ సహాయ సహకారాలు అందించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అఫ్గానిస్తాన్‌ తాత్కాలిక ప్రధానిగా ఎంపికైన తాలిబన్‌ ప్రతినిధి?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 7
ఎవరు    : ముల్లా మహ్మద్‌ హసన్‌ అఖుంద్‌ 
ఎందుకు  : అఫ్గానిస్తాన్‌ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా... 


Pan Masala: పాన్‌మసాలా ప్యాకెట్‌పై ఎంత శాతం హెచ్చరిక ముద్ర ఉండాలి?

పాన్‌ మసాలా నమలడం ఆరోగ్యానికి హానికరమనే హెచ్చరికను ఉత్పత్తి సంస్థలు ప్యాకెట్‌పై 50 శాతం మేర ప్రచురించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆహార భద్రత, ప్రమాణాలు (లేబులింగ్, డిస్‌ప్లే) సవరణ నిబంధనలు, 2021 గెజిట్‌ నోటిఫికేషన్‌ సెప్టెంబర్‌ 7న కేంద్రం విడుదల చేసింది. బ్రెడ్లకు సంబంధించి సదరు పదార్థాలు ఎంత శాతం ఉండాలనేది గెజిట్‌లో పొందుపరిచింది. పూర్తి గోధుమ బ్రెడ్‌లో గోధుమలు 75 శాతం, మల్టీగ్రైన్‌ బ్రెడ్‌లో ఆయా పదార్థాలు 20 శాతం, మిల్క్‌ బ్రెడ్‌లో పాల ఘనపదార్థం ఆరు శాతం, హనీబ్రెడ్‌లో తేనె 5 శాతం, చీజ్‌ బ్రెడ్‌లో వెన్న 10 శాతం, ఓట్‌మీల్‌ బ్రెడ్‌లో ఓట్స్‌ 15 శాతం, ప్రోటీన్‌ బ్రెడ్‌లో 20 శాతం ప్రోటీన్లు ఉండాలంటూ... ఆయా పదార్థాల శాతం గెజిట్‌లో పొందుపరిచింది.

ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా ఎవరు ఉన్నారు?
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ తండ్రి నంద కుమార్‌ బఘేల్‌ అరెస్టయ్యారు. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై రాయ్‌పూర్‌ పోలీసులు ఢిల్లీలో నందకుమార్‌ను అరెస్టు చేశారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పాన్‌ మసాలా నమలడం ఆరోగ్యానికి హానికరమనే హెచ్చరికను ఉత్పత్తి సంస్థలు ప్యాకెట్‌పై 50 శాతం మేర ప్రచురించాలి
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 7
ఎవరు    : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ    : దేశ వ్యాప్తంగా...
ఎందుకు   : పాన్‌ మసాలా నమలడం గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా...


Shikshak Parv–2021: శిక్షక్‌ పర్వ్‌–2021 కాంక్లేవ్‌ థీమ్‌ ఏమిటీ?

శిక్షక్‌ పర్వ్‌–2021 కాంక్లేవ్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్‌ 7న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియన్‌ సైన్‌లాంగ్వేజి డిక్షనరీ, ఆడియో పుస్తకాలు, టాకింగ్‌ బుక్స్‌ను మోదీ విడుదల చేశారు. సీబీఎస్‌ఈకి అవసరమైన స్కూల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ విధానాలు, నిపుణ్‌ భారత్‌ కోసం నిష్టా టీచర్‌ ట్రైనింగ్‌ కార్యక్రమం, పాఠశాలల అభివృద్దికి సంబంధించిన విద్యాంజలి పోర్టల్‌ ఆవిష్కరించారు. దివ్యాంగుల కోసం టాకింగ్, ఆడియో బుక్స్, సైన్‌లాంగ్వేజి డిక్షనరీని విడుదల చేశారు. 2021 శిక్షక్‌ పర్వ్‌ థీమ్‌గా క్వాలిటీ అండ్‌ సస్టైనబుల్‌ స్కూల్స్‌: లెర్నింగ్‌ ఫ్రమ్‌ స్కూల్స్‌ ఇన్‌ ఇండియా ఎంచుకున్నారు.

జాతీయ మహిళా కమిషన్‌ చైర్మన్‌ ఎవరు?
దేశంలో 2021 ఏడాది మొదటి 8 నెలల్లో మహిళలపై నేరాల్లో గత ఏడాదితో పోలిస్తే 46 శాతం పెరుగుదల నమోదైందని జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) తెలిపింది. ఇందులో దాదాపు సగం వరకు ఫిర్యాదులు ఒక్క యూపీలోనివేనని ఎన్‌సీడబ్ల్యూ చైర్మన్‌ రేఖా శర్మ వివరించారు.


Hurriyat Conference: హురియత్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?

జమ్మూకశ్మీర్‌లోని అతివాద రాజకీయ పార్టీల సమాహారం ‘హురియత్‌ కాన్ఫరెన్స్‌’ తమ చైర్మన్‌గా మస్రాత్‌ ఆలమ్‌ భట్‌ (50)ను ఎన్నుకుంది. కాన్ఫరెన్స్‌ చైర్మన్‌గా ఉన్న సయీద్‌ అలీ షా గిలానీ ఇటీవల కన్నుమూశారు. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్‌ ఎన్నిక జరిగింది. కాన్ఫరెన్స్‌ వైస్‌ చైర్మన్లుగా షబిర్‌ అహ్మద్‌ షా, గులాం అహ్మద్‌ గుల్జార్‌లు ఎన్నికయ్యారు. హురియత్‌ రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగే వరకు ఈ నియామకాలు తాత్కాలికంగా ఉంటాయని సెప్టెంబర్‌ 7న కాన్ఫరెన్స్‌ స్పష్టం చేసింది.

తీహార్‌ జైల్లో...
కొత్తగా ఎన్నికైన మస్రాత్‌ ఆలమ్‌ భట్‌ ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్నాడు. ఉగ్ర సంస్థలకు నిధులు సమకూర్చడంలో ఆయన పాత్ర ఉందనే అభియోగాలపై అరెస్టయ్యారు.

ప్రస్తుతం పీడీపీ చీఫ్‌గా ఎవరు ఉన్నారు?
పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీని సెప్టెంబర్‌ 7న జమ్మూకశ్మీర్‌ అధికారులు గృహ నిర్బంధంలో ఉంచారు. తన కదలికలపై ఆంక్షలు విధించడం ‘కశ్మీర్‌లో శాంతి నెలకొందంటూ అధికారులు చేస్తున్న ప్రచారం అబద్ధమని పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జమ్మూకశ్మీర్‌లోని అతివాద రాజకీయ పార్టీల సమాహారం  హురియత్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
ఎప్పుడు : సెప్టెంబర్‌ 7
ఎవరు    : మస్రాత్‌ ఆలమ్‌ భట్‌ 
ఎందుకు   : ఇప్పటివరకు హురియత్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌గా ఉన్న సయీద్‌ అలీ షా గిలానీ ఇటీవల కన్నుమూయడంతో...


China Military: వెస్టర్న్‌ థియేటర్‌ కమాండ్‌ కమాండర్‌గా ఎవరు నియమితులయ్యారు? 

భారత్‌తో సరిహద్దు బాధ్యతలను చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ మరో ఆర్మీ కమాండర్‌కు అప్పగించారు. భారత్‌తో సరిహద్దు బాధ్యతలను చూసే చైనా మిలటరీ (పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ,, పీఎల్‌ఏ) వెస్టర్న్‌ థియేటర్‌ కమాండ్‌కు జనరల్‌ వాంగ్‌ హైజియాంగ్‌(58)ను కమాండర్‌గా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నియమించినట్లు ఆ దేశ అధికార వెబ్‌సైట్‌ చైనా మెయిల్‌ సెప్టెంబర్‌ 6న వెల్లడించింది. చైనా అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ(సీపీసీ)తోపాటు సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌కి కూడా అధ్యక్షుడు జిన్‌పింగే సర్వాధికారి. 2020, మేలో తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల్లో భారత్‌తో ప్రతిష్టంభన తలెత్తినప్పటి నుంచి వెస్టర్న్‌ థియేటర్‌ కమాండ్‌కు చైనా నలుగురు కమాండర్లను మార్చింది. గల్వాన్‌ లోయ, పాంగాంగ్‌ సో, గోగ్రా వంటి ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ జరిగినప్పటికీ హాట్‌స్ప్రింగ్స్, డెప్సంగ్‌ వంటి ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరింపు కొనసాగుతూనే ఉంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పీఎల్‌ఏ వెస్టర్న్‌ థియేటర్‌ కమాండ్‌ కమాండర్‌గా నియమితులైన వ్యక్తి?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 6
ఎవరు    : జనరల్‌ వాంగ్‌ హైజియాంగ్‌
ఎందుకు  : భారత్‌తో సరిహద్దు బాధ్యతలను చూసేందుకు...


Vivek Sagar: డీఎస్పీగా నియమితులైన వివేక్‌ సాగర్‌ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు?

ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల విరామం తర్వాత పతకం (కాంస్యం) గెలిచిన భారత పురుషుల హాకీ జట్టులోని తమ రాష్ట్ర క్రీడాకారుడు వివేక్‌ ప్రసాద్‌ సాగర్‌ను డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ)గా నియమిస్తూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సెప్టెంబర్‌ 7న ఉత్తర్వులను జారీ చేసింది. 2021, సెప్టెంబర్‌ మొదటి వారంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్‌ చౌహాన్‌ కోటి రూపాయల చెక్‌ను వివేక్‌కు అందజేశారు. ఆ సమయంలో వివేక్‌ను డీఎస్పీగా నియమిస్తామని చెప్పారు.

టాప్‌ ర్యాంక్‌లోనే షఫాలీ వర్మ
భారత మహిళా క్రికెట్‌ టీనేజ్‌ సంచలనం షఫాలీ వర్మ టి20ల్లో తన టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి విడుదల చేసిన టి20 బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో ఆమె 759 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా బ్యాటర్‌ బెత్‌ మూనీ (744 రేటింగ్స్‌)... మూడో స్థానంలో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (716) ఉన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : డీఎస్పీగా నియమితులైన హాకీ క్రీడాకారుడు?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 7
ఎవరు    : భారత హాకీ క్రీడాకారుడు వివేక్‌ ప్రసాద్‌ సాగర్‌
ఎక్కడ    : మధ్యప్రదేశ్‌
ఎందుకు   : వివేక్‌ సభ్యుడిగా ఉన్న భారత పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌–2020 కాంస్యం గెలిచినందున...


India Post Payments Bank: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌తో జట్టు కట్టిన సంస్థ?

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) తాజాగా ఎల్‌ఐసీ హౌజింగ్‌ ఫైనాన్స్‌తో చేతులు కలిపింది. ఎల్‌ఐసీ హౌజింగ్‌కు చెందిన గృహ రుణ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ఉన్న తమ 4.5 కోట్ల మంది కస్టమర్లకు ఐపీపీబీ చేర్చనుంది. గృహ రుణాలను కస్టమర్లకు చేర్చడంలో సంస్థకు ఉన్న సామర్థ్యం కీలకపాత్ర పోషించనుందని ఐపీపీబీ ఎండీ, సీఈవో జె.వెంకట్రాము తెలిపారు. మార్కెట్లో మరింత విస్తరించడానికి ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఎండీ, సీఈవో వై.విశ్వనాథ గౌడ్‌ వివరించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌తో జట్టు కట్టిన సంస్థ?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 7
ఎవరు    : ఎల్‌ఐసీ హౌజింగ్‌ ఫైనాన్స్‌ 
ఎందుకు    : ఎల్‌ఐసీ హౌజింగ్‌ను మార్కెట్లో మరింత విస్తరించడానికి...


India Ratings: భారత బ్యాంకింగ్‌ అవుట్‌లుక్‌... స్టేబుల్‌: ఇండియా రేటింగ్స్‌

భారత్‌ బ్యాంకింగ్‌ రంగానికి 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘స్టేబుల్‌’ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు ఇండియా రేటింగ్స్‌ ప్రకటించింది. అయితే ఎంఎస్‌ఎంఈలకు పంపిణీ చేసిన రుణాలకు సంబంధించి బ్యాంకింగ్‌ 2022 మార్చి ముగిసే నాటికి కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు బ్యాంకింగ్‌పై సెప్టెంబర్‌ 7న ఒక నివేదికను విడుదల చేసింది.

నివేదికలోని ముఖ్యాంశాలు...

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూలంగా మొండిబకాయిలు (జీఎన్‌పీఏ) ఇచ్చిన రుణాల్లో 8.6 శాతంగా కొనసాగవచ్చు. ఒత్తిడిని ఎదుర్కొనే రుణాల విషయంలో ఈ శాతం 10.3 శాతంగా ఉండే వీలుంది.
  • కోవిడ్‌–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొనే విషయంలో బ్యాంకింగ్‌ పటిష్టంగా ఉండడం అవుట్‌లుక్‌ యథాతథ కొనసాగింపునకు కారణం.
  • 2021–22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ రుణ వృద్ధి 8.9 శాతంగా ఉంటుందన్న తమ అంచనాల్లో ఎటువంటి మార్పూ ఉండబోదు.

వృద్ధి రేటు 9.1 శాతం... 
భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఇండ్‌  రా) ఇటీవలే 30 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెంచింది. ఇంతక్రితం 9.1 శాతం ఉన్న అంచనాలను 9.4 శాతానికి అప్‌గ్రేడ్‌ చేసింది. ప్రస్తుతం జరుగుతున్నది ‘వీ’ ( ఠి) నమూనా రికవరీ కాదని, ‘కే’ ( జు) నమూనా రికవరీ అని సంస్థ పేర్కొంటోంది. వృద్ధి నుంచి కొందరు  మాత్రమే ప్రయోజనం పొందే పరిస్థితి ‘కే’ నమూనా రికవరీలో ఉంటుంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌ బ్యాంకింగ్‌ రంగానికి 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘స్టేబుల్‌’ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నాం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 7
ఎవరు    : ఇండియా రేటింగ్స్‌ 
ఎందుకు   : కోవిడ్‌–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొనే విషయంలో బ్యాంకింగ్‌ పటిష్టంగా ఉండడంతో...


Kaloji Narayana Rao Award: కాళోజీ పురస్కారానికి ఎంపికైన సాహితీవేత్త?

ప్రజాకవి, పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణరావు పేరిట ఏర్పాటు చేసిన కాళోజీ పురస్కారం– 2021 ఏడాదికిగాను తెలంగాణ సాహితీవేత్త పెన్నా శివరామకృష్ణ ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద ఆయనకు రూ.1,01,116 నగదు బహుమతిని, శాలువాను, మెమొంటోను ప్రదానం చేయనున్నారు. కాళోజీ జయంతి సందర్భంగా సెప్టెంబర్‌ 9న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే కాళోజీ జయంతి ఉత్సవాల్లో పెన్నాకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. 2015 నుంచి కాళోజీ పురస్కారాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం... ఏటా ఓ సాహితీవేత్తకు అవార్డును ప్రదానం చేస్తోంది.

అలల పడవల మీద...
నల్లగొండ జిల్లాకు చెందిన రిటైర్డ్‌ లెక్చరర్‌ పెన్నా శివ రామకృష్ణ ‘అలల పడవల మీద’, ‘నిశ్శబ్దం నా మాతృక’వంటి కవితా సంకలనాలను ప్రచురించారు. గజల్‌ ప్రక్రియపై ఆయన చేసిన రచనలు సాహితీవేత్తల ప్రశంసలు అందుకున్నాయి.

కాళోజీ రచనల్లో కొన్ని...

  • అణా కథలు
  • నా భారతదేశయాత్ర
  • పార్థివ వ్యయము
  • కాళోజి కథలు
  • నా గొడవ
  • జీవన గీత
  • తుదివిజయం మనది
  • తెలంగాణ ఉద్యమ కవితలు
  • ఇదీ నా గొడవ
  • బాపూ!బాపూ!!బాపూ!!!

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం–2021కు ఎంపికైన వ్యక్తి?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 7
ఎవరు    : తెలంగాణ సాహితీవేత్త పెన్నా శివరామకృష్ణ  
ఎందుకు  : సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు...

Published date : 08 Sep 2021 07:54PM

Photo Stories