Skip to main content

Daily Current Affairs in Telugu: డైలీ కరెంట్‌ అఫైర్స్‌ సెప్టెంబర్‌ 7

Krishna Nagar

Tokyo Paralympics 2020: పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన కృష్ణ నాగర్‌ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు? 
టోక్యో పారాలింపిక్స్‌–2020లో భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కృష్ణ నాగర్‌ స్వర్ణం పతకం సాధించాడు. టోక్యో వేదికగా 2021, సెప్టెంబర్‌ 5న జరిగిన పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌–6 కేటగిరీ ఫైనల్లో రాజస్తాన్‌కు చెందిన కృష్ణ నాగర్‌ 21–17, 16–21, 21–17తో చు మన్‌ కాయ్‌ (హాంకాంగ్‌)పై గెలిచి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌కి చెందిన కృష్ణ... రెండేళ్లపుడే వయసుకు తగ్గట్టుగా పెరగడని(ఎదగలేని వైకల్యం) నిర్ధారించారు. 4 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న కృష్ణ 14 ఏళ్ల వయసులో షటిల్‌ వైపు దృష్టి మరల్చాడు. ఎస్‌హెచ్‌–6 పురుషుల సింగిల్స్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంకర్‌గా ఎదిగాడు. 2019లో బాసెల్‌లో జరిగిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్‌లో కాంస్యం, డబుల్స్‌లో రజతం సాధించాడు. 2020 ఏడాది బ్రెజిల్‌లో జరిగిన పారా బ్యాడ్మింటన్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా (రజతం)  నిలిచాడు. అదే ఏడాది పెరూలో జరిగిన ఈవెంట్‌లో సింగిల్స్, డబుల్స్‌లో విజేతగా నిలిచి రెండు బంగారు పతకాలు సాధించాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : టోక్యో పారాలింపిక్స్‌–2020లో స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారుడు?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 5
ఎవరు    :  భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కృష్ణ నాగర్‌
ఎక్కడ    : టోక్యో, భారత్‌
ఎందుకు  : బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌–6 కేటగిరీ ఫైనల్లో  కృష్ణ 21–17, 16–21, 21–17తో చు మన్‌ కాయ్‌ (హాంకాంగ్‌)పై గెలిచినందున... 


Suhas Yathiraj: టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించిన జిల్లా కలెక్టర్‌? 

టోక్యో పారాలింపిక్స్‌–2020లో ఐఏఎస్‌ అధికారి, నోయిడా జిల్లా కలెక్టర్‌ సుహాస్‌ యతిరాజ్‌ రజత పతకం సాధించాడు. టోక్యో వేదికగా 2021, సెప్టెంబర్‌ 5న జరిగిన బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌–4 విభాగం ఫైనల్లో సుహాస్‌ 21–15, 17–21, 15–21తో రెండుసార్లు ప్రపంచ పారా చాంపియన్‌ లుకాస్‌ మజూర్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పోరాడి ఓడిపోయి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 38 ఏళ్ల సుహాస్‌ పారాలింపిక్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. కర్ణాటకలోని హసన్‌ ప్రాంతానికి చెందిన కంప్యూటర్‌ ఇంజినీర్‌ సుహాస్‌ 2007 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌ బుద్ధనగర్‌ (నోయిడా) జిల్లా మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి కాలి పాదాల వైకల్యమున్నా... బ్యాడ్మింటన్‌ అంటే ఎనలేని ఆసక్తి. ప్రొఫెషనల్‌ పారా బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా ఎదిగి.. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్నాడు. 2016లో బీజింగ్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలువడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యూరోక్రాట్‌గానూ రికార్డుల్లోకెక్కాడు. దీంతో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ‘యశ్‌ భారతి’ పురస్కారంతో సుహాస్‌ను సత్కరించింది. జకార్తాలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో టీమ్‌ విభాగంలో కాంస్య పతకం గెలిచాడు. ఇలా అంతర్జాతీయ కెరీర్‌లో ఈ పారా షట్లర్‌ 5 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్యాలు గెలిచాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించిన జిల్లా కలెక్టర్‌?
ఎప్పుడు : సెప్టెంబర్‌ 5
ఎవరు    : సుహాస్‌ యతిరాజ్‌
ఎక్కడ    : టోక్యో, జపాన్‌
ఎందుకు : బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌–4 విభాగం ఫైనల్లో సుహాస్‌ 21–15, 17–21, 15–21తో లుకాస్‌ మజూర్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పోరాడి ఓడిపోయినందున... 

Dutch Grand Prix: డచ్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకున్న రెడ్‌బుల్‌ డ్రైవర్‌?  

ఫార్ములావన్‌ (ఎఫ్‌1) రేసు డచ్‌ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌(నెదర్లాండ్స్‌) విజేతగా నిలిచాడు. నెదర్లాండ్స్‌లోని జాండ్‌వోర్ట్‌లో సెప్టెంబర్‌ 5న జరిగిన ప్రధాన రేసులో వెర్‌స్టాపెన్‌...  72 ల్యాప్‌ల దూరాన్ని అందరికంటే ముందుగా గంటా 30 నిమిషాల 05.395 సెకన్లలో చేరుకుని విజేతగా అవతరించాడు. సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కిది ఏడో విజయం కాగా... ఓవరాల్‌గా 17వది. 20.932 సెకన్లు వెనుకగా రేసును ముగించిన హామిల్టన్‌ (మెర్సిడెస్‌) రెండో స్థానంలో నిలిచాడు. మరో మెర్సిడెస్‌ డ్రైవర్‌ బొటాస్‌ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. తాజా విజయంతో వెర్‌స్టాపెన్‌... డ్రైవర్‌ చాంపియన్‌షిప్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని(224.5 పాయింట్లతో) అందుకున్నాడు. మూడు పాయింట్ల తేడాతో లూయిస్‌ హామిల్టన్‌ (221.5) రెండో స్థానంలో ఉన్నాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : డచ్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకున్న రెడ్‌బుల్‌ డ్రైవర్‌?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 5
ఎవరు    : రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌
ఎక్కడ    : జాండ్‌వోర్ట్, నెదర్లాండ్స్‌ 


టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది? 

టోక్యో పారాలింపిక్స్‌–2020 ముగిశాయి. జపాన్‌ రాజధాని నగరం టోక్యోలో 2021, ఆగస్టు 24న ప్రారంభమైన ఈ విశ్వ క్రీడలు సెప్టెంబర్‌ 5న ముగిశాయి. ఆగస్టు 25 నుంచి ప్రధాన పోటీలు ప్రారంభం కాగా... మొత్తం 162 దేశాలు క్రీడల్లో పాల్గొన్నాయి.

24వ స్థానంలో భారత్‌...
టోక్యో పారాలింపిక్స్‌లో చైనా తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. చైనా 96 స్వర్ణాలు, 60 రజతాలు, 51 కాంస్యాలతో కలిపి మొత్తం 207 పతకాలు సాధించి తొలి స్థానంలో నిలిచింది. 124 పతకాలతో బ్రిటన్‌ (41 స్వర్ణాలు, 38 రజతాలు, 45 కాంస్యాలు) రెండో స్థానంలో... 104 పతకాలతో అమెరికా (37 స్వర్ణాలు, 36 రజతాలు, 31 కాంస్యాలు) మూడో స్థానంలో నిలిచాయి. భారత్‌ 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 19 పతకాలు సాధించి 24వ స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా 78 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి. తదుపరి పారాలింపిక్స్‌ 2024లో పారిస్‌లో జరుగుతాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : టోక్యో పారాలింపిక్స్‌–2020 ముగింపు
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 5, 2021
ఎవరు    : జపాన్‌
ఎక్కడ    : టోక్యో, జపాన్‌

Misbah-ul-Haq: పాక్‌ క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ పదవికి రాజీనామా చేసిన ఆటగాడు? 

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఉన్న మిస్బా ఉల్‌ హఖ్, బౌలింగ్‌ కోచ్‌ వకార్‌ యూనిస్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. తమను సంప్రదించకుండానే టి20 ప్రపంచకప్‌కు పాక్‌ జట్టును ఎంపిక చేయడంతో సెప్టెంబర్‌ 6న వీరిద్దరు రాజీనామా చేశారు. మాజీ క్రికెటర్లు సక్లాయిన్‌ ముస్తాక్, అబ్దుల్‌ రజాక్‌లను తాత్కాలిక కోచ్‌లుగా నియమించినట్లు పాక్‌ బోర్డు తెలిపింది.

పంజ్‌షీర్‌పై పట్టు సాధించాం: తాలిబన్లు
దశాబ్దాలుగా తమకు కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్‌ ప్రావిన్సును ఎట్టకేలకు హస్తగతం చేసుకున్నామని తాలిబన్లు సెప్టెంబర్‌ 6న ప్రకటించారు. ఇప్పటివరకు తాలిబన్ల పాలనకు లొంగకుండా ఉన్నవారికి పంజ్‌షీర్‌ కేంద్రస్థానంగా నిలిచింది. మరోవైపు తాలిబన్ల ప్రకటనను పంజ్‌షీర్‌ పోరాట నేతలు తోసిపుచ్చారు. అఫ్గాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లాసలేహ్, పంజ్‌షీర్‌ నేత అహ్మద్‌ మసూద్‌ నేతృత్వంలో ఇంతవరకు పంజ్‌షీర్‌లో దళాలు తాలిబన్లను ప్రతిఘటిస్తూ వచ్చాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌ రాజీనామా 
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 6
ఎవరు    : మిస్బా ఉల్‌ హఖ్‌ 
ఎందుకు   : తమను సంప్రదించకుండానే టి20 ప్రపంచకప్‌కు పాక్‌ జట్టును ఎంపిక చేయడంతో...

BRICS Summit: బ్రిక్స్‌ దేశాల వార్షిక సదస్సుకు అధ్యక్షత వహించనున్న నేత? 

 బ్రిక్స్‌ దేశాల వార్షిక సదస్సు–2021కు భారత ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ సెప్టెంబర్‌ 6న తెలిపింది. సెప్టెంబర్‌ 9న వర్చువల్‌ విధానంలో జరగనున్న ఈ సదస్సులో భారత్‌ నుంచి ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా, బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో పాల్గొననున్నారు. ‘అంతర్గత సహకారం’ అనే అంశం ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. 

ఉత్సవంలా మోదీ పుట్టిన రోజు... 
2021, సెప్టెంబర్‌ 17న ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకొని బీజేపీ భారీ కార్యక్రమాలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ‘సేవ సమర్పణ అభియాన్‌’ పేరుతో 20 రోజుల  వేడుకలకు కార్యాచరణ రూపొందించింది. ప్రధాని మోదీ ప్రజా సేవలో అడుగు పెట్టి 20 ఏళ్లు అయిన సందర్భంగా 20 రోజుల పాటు వేడుకలు సాగించనున్నట్లు తెలిపింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 2021, సెప్టెంబర్‌ 9న బ్రిక్స్‌ దేశాల వార్షిక సదస్సు–2021కు అధ్యక్షత వహించనున్న నేత?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 6
ఎవరు    : భారత ప్రధాని నరేంద్ర మోదీ  
ఎందుకు  : అంతర్జాతీయ అంశాలు, అంతర్గత సహకారం వంటి అంశాలపై చర్చలు జరిపేందుకు... 


Venkaiah Naidu: కోవిడ్‌–19 ప్రొటోకాల్‌ గైడ్‌ను రూపొందించిన ఆస్పత్రి? 

కరోనా చికిత్సలు, మార్గదర్శకాల కోసం ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రి ‘కోవిడ్‌–19 ప్రొటోకాల్‌ అండ్‌ గైడ్‌ లైన్స్‌’ పేరుతో ఒక పుస్తకాన్ని రూపొందించింది. ఈ పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సెప్టెంబర్‌ 6న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. పరీక్షలు, చికిత్సల్లో  అనుసరించే మెళకువలు, వాడే మందులకు సంబందించిన ప్రొటోకాల్‌ వంటి సమగ్ర వివరాలను ఇందులో పొందుపరిచారు. కరోనా చికిత్సలు అందించే ఫిజీషియన్లకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఏఐజీ చైర్మన్‌ నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు.

బెంగళూరులో 106 భాషల ప్రజలు
సిలికాన్‌ సిటీ బెంగళూరులో 22 అధికార, 84 ఇతరత్రా భాషలు కలిపి మొత్తం 106 భాషలు మాట్లాడేవారు నివసిస్తున్నారు. ఇందులో 44.5% మంది కన్నడ మాట్లాడేవారు కాగా, 15% తమిళం, 14% తెలుగు, 12% ఉర్దూ, 3% మలయాళీలు, 6% మంది ఇతర భాషలు మాట్లాడే ప్రజలున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఢిల్లీకి చెందిన ఓ నిపుణుడు నిర్వహించిన పరిశోధనలో ఇది వెల్లడైంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రి రూపొందించిన ‘కోవిడ్‌–19 ప్రొటోకాల్‌ అండ్‌ గైడ్‌ లైన్స్‌’ పుస్తకం ఆవిష్కరణ
ఎప్పుడు    : సెప్టెంబర్‌ 6
ఎవరు    : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ    : హైదరాబాద్‌ 
ఎందుకు  : కరోనా చికిత్సలు, మార్గదర్శకాల కోసం...


IIT Hyderabad: రోడ్డు ప్రమాదాలపై పరిశోధన చేస్తోన్న ఐఐటీ?  

జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల తీరుపై హైదరాబాద్‌ ఐఐటీ ప్రత్యేక పరిశోధన చేస్తోంది. దీనికోసం ముంబై హైవే (65)పై సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రం వద్ద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేసింది. వాహనాల వేగాన్ని కొలిచేందుకు పోలీసుశాఖ ఏర్పాటు చేసే స్పీడ్‌గన్‌ మాదిరిగా ఉన్న ఈ పరికరాలు జాతీయ రహదారిపై వాహనాల కదలికలను క్షుణ్ణంగా రికార్డు చేస్తోంది.

అంతరిక్ష ప్రయోగాలకు కొత్త సాధనం
అంతరిక్షంలో జరిపే జీవసంబంధిత ప్రయోగాలకు ఉపయోగపడే ఒక సాధనాన్ని ఇస్రో, ఐఐఎస్‌సీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ మాడ్యులర్‌ సాధనంతో జీవప్రయోగాలకు అవసరమైన సూక్ష్మజీవులను అభివృద్ధి చేస్తారు. అక్టా ఆస్ట్రోనాటికాలో ఈ పరిశోధన వివరాలు ప్రచురించారు. స్పొరోసార్సినా పాశ్చురై అనే బ్యాక్టీరియాను చాలా రోజులపాటు పెంచి పోషించేందుకు కొత్త సాధనం ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని పరిశోధనలో వివరించారు. అంతరిక్షంలో ఎదురయ్యే విపరీత పరిస్థితుల్లో సదరు సూక్ష్మజీవులు ఎలా స్పందిస్తాయన్న విషయాలను అవగతం చేసుకోవడంలో ఈ ప్రయోగాలు కీలకపాత్ర పోషిస్తాయి.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల తీరుపై పరిశోధన
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 6
ఎవరు    : హైదరాబాద్‌ ఐఐటీ
ఎక్కడ    : ముంబై హైవే, కంది మండల కేంద్రం, సంగారెడ్డి జిల్లా, 
ఎందుకు  : రహదారులపై జరుగుతున్న ప్రమాదాలకు కారణాలు తెలుసుకునేందుకు... 


National Teachers Award: 44 మందికి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డుల ప్రదానం 

ఉపాధ్యాయ దినోత్సవం(సెప్టెంబర్‌ 5) సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 44 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వర్చువల్‌ విధానం ద్వారా అవార్డులను ప్రదానం చేశారు. విద్యార్థుల్లో దాగి ఉండే స్వాభావిక ప్రతిభను వెలికితీయడం తమ ప్రాథమిక బాధ్యతగా ఉపాధ్యాయులు పనిచేయాలని కోవింద్‌ ఆకాంక్షించారు. దేశాభివృద్ధిలో ఉపాధ్యాయుడి పాత్ర కీలకంగా ఉంటుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి...
రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి నలుగురు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్నారు. వారిలో కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన కెరమెరి మండలం సవర్‌ఖేడా ఎంపీపీఎస్‌ తాత్కాలిక ప్రధాన ఉపాధ్యాయుడు రంగయ్య కడెర్ల, సిద్దిపేటలోని ఇందిరానగర్‌ జెడ్పీ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు పయ్యావుల రామస్వామి, విశాఖపట్నం జిల్లా ఎస్‌.రాయవరం జిల్లా పరిషత్‌ హైస్కూలు ఉపాధ్యాయుడు కొణతాల ఫణి భూషణ్, చిత్తూరు జిల్లా ఎం.పైపల్లి ఈరాల జెడ్పీ హైస్కూల్‌ ఉపాధ్యాయుడు ఎస్‌.మునిరెడ్డి ఉన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : వర్చువల్‌ విధానం ద్వారా 44 మందికి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డుల ప్రదానం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 5
ఎవరు    : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 
ఎందుకు   : విద్యారంగంలో విశేష ప్రతిభ కనబరిచినందుకు... 


Biopharma Hub: ఏయే సంస్థల భాగస్వామ్యంతో బీ–హబ్‌ను నిర్మించనున్నారు?  

  • తెలంగాణ రాష్ట్రంలో బయో ఫార్మా రంగాభివృద్ధికి ఊతమిచ్చేందుకు బయోఫార్మా హబ్‌ (బీ–హబ్‌)ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి కె. తారక రామారావు ప్రకటించారు.  బీ–హబ్‌ భవనం నమూనా డిజైన్‌ను సెప్టెంబర్‌ 5న మంత్రి ఆవిష్కరించారు. ఫార్మారంగంలో అడుగుపెట్టే కొత్త కంపెనీల శీగ్రాభివృద్ధికి కేంద్రం (గ్రోత్‌–ఫేజ్‌ సెంటర్‌)గా బీ–హబ్‌ సేవలందించనుందని తెలిపారు.  దీంతో ఫార్మా ఉత్పత్తుల తయారీ సదుపాయం కూడా విస్తరిస్తుందన్నారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
  • 15 నెలల్లో బీ–హబ్‌ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని, ఫార్మా రంగంలో తెలంగాణ ఆధిపత్యాన్ని నిలపడానికి ఇది దోహదపడనుంది.
  • రెండుదశల్లో లక్ష చదరపు అడుగుల నిర్మిత స్థలం (బిల్టప్‌ ఏరియా)లో జినోమ్‌ వ్యాలీలో దీన్ని నిర్మించనున్నారు.
  • కేంద్రప్రభుత్వ సంస్థ బయోటెక్‌ ఇండియాతో పాటు సైటియా, సెరెస్ట్రా్ట సంస్థల భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం బీ– హబ్‌ను నిర్మించనుంది.
  • స్టార్టప్‌ల పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బీ–హబ్‌లో ప్రయోగశాలలు ఉంటాయి.
  • ఇతర సంస్థలతో చర్చలు, భాగస్వామ్యాలు చేసుకోవడానికి బీ–హబ్‌ వేదికగా ఉపయోగపడనుంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : బయోటెక్‌ ఇండియాతో పాటు సైటియా, సెరెస్ట్రా్ట సంస్థల భాగస్వామ్యంతో బయోఫార్మా హబ్‌ (బీ–హబ్‌) ఏర్పాటు 
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 5
ఎవరు    : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ    : జినోమ్‌ వ్యాలీ, హైదరాబాద్‌
ఎందుకు  : తెలంగాణ రాష్ట్రంలో బయో ఫార్మా రంగాభివృద్ధికి ఊతమిచ్చేందుకు...

Published date : 07 Sep 2021 07:29PM

Photo Stories