Skip to main content

Daily Current Affairs in Telugu: డైలీ కరెంట్‌ అఫైర్స్‌ సెప్టెంబర్‌ 9

boat accident

Boat Accident: అసోం దు:ఖదాయని అని ఏ నదిని పిలుస్తారు?

బ్రహ్మపుత్ర నదిలో బోటు ప్రమాదం చోటు చేసుకుంది. సెప్టెంబర్‌ 8న ఎదురెదురుగా వస్తున్న రెండు బోట్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా 33 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. అస్సాంలోని జొరాత్‌ జిల్లాలోని నిమాటి ఘాట్‌ వద్ద ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం ప్రమాదం జరిగిన చోటుకు చేరుకొని 40 మంది ప్రయాణికులను రక్షించింది.

బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ

  • టిబెట్‌లోని మానస సరోవరం వద్ద గల ‘షమ్‌యంగ్‌ డమ్‌’ అనే హిమానీ నదం వద్ద బ్రహ్మపుత్ర నది జన్మించింది.
  • చైనాలోని టిబెట్, భారత్, బంగ్లాదేశ్‌లో ఈ నది ప్రయాణిస్తుంది.
  • బంగ్లాదేశ్‌లో గంగానదితో కలిసి చివరగా బంగాళాఖాతంలో కలుస్తుంది.
  • భారత్‌లో అరుణాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది.
  • ప్రపంచంలోని అతి పెద్ద సుందర్‌బన్స్‌ డెల్టా... బ్రహ్మపుత్ర, గంగా నదుల కలయిక వల్ల ఏర్పడింది.
  • భారతదేశంలో గల ఏకైక నదీ ఆధారిత దీవి మాజులీ (అసోం) ఈ నది వల్లే ఏర్పడింది.
  • బహ్మప్రుత్ర నదిని అసోం దు:ఖదాయని అని పిలుస్తారు.
  • బ్రహ్మపుత్ర నదికి వచ్చే వరదలతో అధికంగా నష్టపోతున్న రాష్ట్రం అసోం.
  • ఈ నది ప్రయాణించే మార్గంలో దీన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. టిబెట్‌లో త్సాంగ్‌ పో అని, అరుణాచల్‌ప్రదేశ్‌లో దిహాంగ్, సియాంగ్‌ అని, అసోంలో సైడాంగ్, ఉత్తర బంగ్లాదేశ్‌లో పద్మా నది (గంగానది)ని కలవక ముందు జమున అని, దక్షిణ బంగ్లాదేశ్‌లో (పద్మా నదిని కలిసిన తర్వాత) మేఘన అనే పేర్లతో పిలుస్తారు.
  • అసోంలోని ఎర్ర నేలల మీదుగా ప్రవహించడం వల్ల దీన్ని ఎర్ర నది అని కూడా పిలుస్తారు.

బ్రహ్మపుత్ర ఉప నదులు:

  • దన్‌సిరి, సబన్‌సిరి, సంకోష్, రైడాక్, అమొచు, మనస్, భరేలి, లోహిత్, సుర్మ, తీస్తా, గంగాధర్, బేల్‌సిరి, దిబ్రు, డిక్కు, దిబాంగ్, లోహిత్‌ మొదలైనవి.
  • తీస్తా నది టిబెట్‌లోని చితము సరస్సు వద్ద జన్మిస్తుంది. తీస్తా 1887 వరకు గంగా నది ఉపనదిగా ఉండేది. కానీ 1887లో వచ్చిన భూకంపం వల్ల దీని ప్రవాహ దిశ మారి బ్రహ్మపుత్రకు ఉపనదిగా మారింది.

 

Minimum Support Price: రబీ పంటలకు కనీస మద్దతు దర పెంపు 

రబీ సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణంతోపాటు రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను కేంద్ర ప్రభుత్వం పెంచేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ) సెప్టెంబర్‌ 8న సమాశమై, పలు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై నిర్ణయం తీసుకుంది. క్వింటాల్‌కు గోధుమలకు రూ.40, ఆవాలకు రూ.400 చొప్పున పెంచారు. ఈ పెంపుతో కనీస మద్దతు ధర క్వింటాల్‌ గోధుమలకు రూ.2,015, ఆవాలకు రూ.5,050కు చేరుకోనుంది.

కనీస మద్దతు ధర(క్వింటాల్‌కు రూ.లలో)
పంట     2020–21 2021–22
గోధుమ     1,975 2,015
ఆవాలు     4,650     5,050
బార్లీ 1,600 1,635 
పప్పు ధాన్యాలు 5,100     5,230 
మసూర్‌     5,100     5,500
పొద్దుతిరుగుడు     5,327 5,441


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : గోధుమ, ఆవాలు వంటి రబీ పంటలకు కనీస మద్దతు దర పెంపు
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 8
ఎవరు    : ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఈఏ)
ఎక్కడ    : దేశవ్యాప్తంగా...
ఎందుకు  : రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా...

 

Uttarakhand Governor: ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేసిన వారు?

ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ బేబీ రాణి మౌర్య (65) తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కి పంపినట్లు రాష్ట్రపతిభవన్‌ అధికారులు సెప్టెంబర్‌ 8న వెల్లడించారు. గవర్నర్‌గా మరో రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే ఆమె రాజీనామా చేయడం గమనార్హం. రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకే మౌర్య రాజీనామా చేశారని వార్తలు వెలువడుతున్నాయి. బీజేపీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న మౌర్య 2018 ఆగస్టు 26న ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆగ్రాకు తొలి మహిళా మేయర్‌గా పనిచేసిన (1995–2000 మధ్య) ఘనత కూడా ఆమె సాధించారు. 2002–2005 మధ్య జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా పనిచేశారు.

యూఎస్, యూకే, రష్యాతో భారత్‌ చర్చలు
తాలిబన్లతో పాటు అఫ్గాన్‌లో ఇతర టెర్రరిస్టు గ్రూపులతో పాకిస్తాన్‌కు ఉన్న సంబంధాలపై యూఎస్, యూకే, రష్యాలకు భారత్‌ తన ఆందోళన తెలియజేసింది. ఇటీవల కొద్ది రోజుల వ్యవధిలో యూఎస్‌ సీఐఏ అధినేత విలయం బర్న్స్, యూకే ఎం16 అధిపతి రిచర్డ్‌ మూరే, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శి నికోలాయ్‌ పట్రుషెవ్‌లు భారత్‌లో పర్యటించారు. వీరితో జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌ చర్చలు జరిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 8
ఎవరు    :  బేబీ రాణి మౌర్య 
ఎందుకు    : వ్యక్తిగత కారణాల వల్ల...

 

T20 World Cup 2021: టి20 వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు ఎవరు సారథ్యం వహిస్తున్నారు?

టి20 వరల్డ్‌కప్‌–2021లో పాల్గొనే 15 మంది సభ్యుల భారత జట్టును సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ సెప్టెంబర్‌ 8న ప్రకటించింది. విరాట్‌ కోహ్లి సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. మరో ముగ్గురు రిజర్వ్‌ ఆటగాళ్లను కూడా టీమ్‌లోకి ఎంపిక చేశారు. జట్టుకు రవిశాస్త్రి హెడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిన ఎమ్మెస్‌ ధోని ఈసారి కొత్తగా ‘మెంటార్‌’ పాత్రలో జట్టుతో కలిసి పని చేయనున్నాడు. ఒమన్, యూఏఈలలో 2021, అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు ఈ మెగా టోర్ని జరగనుంది.

భారత టి20 జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్, సూర్యకుమార్, పంత్, ఇషాన్‌ కిషన్, హార్దిక్, జడేజా, రాహుల్‌ చహర్, అశ్విన్, అక్షర్‌ పటేల్, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్, షమీ. స్టాండ్‌బై: శ్రేయస్‌ అయ్యర్, దీపక్‌ చహర్, శార్దుల్‌ ఠాకూర్‌. 

 

National Sports Awards: శిక్ష ముగిసిన డోపీలకూ జాతీయ క్రీడా పురస్కారాలు

ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాలకు డోపింగ్‌ ఉచ్చులో పడి శిక్ష పూర్తి చేసుకున్న క్రీడాకారుల పేర్లను కూడా ఇకపై పరిశీలించనున్నారు. దీంతో అమిత్‌ పంఘాల్‌లాంటి భారత స్టార్‌ బాక్సర్‌కు ‘అర్జున’ తదితర అవార్డులు దక్కనున్నాయి. 2012లో డోపింగ్‌ మరక వల్లే అమిత్‌ అవార్డులకు దూరమయ్యాడు. అయితే నిషేధకాలం పూర్తి చేసుకున్న వారినే ఎంపిక చేస్తారు. 2021 ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ వల్లే జాతీయ క్రీడా పురస్కారాల ఎంపిక, ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఒలింపిక్స్‌ పతక విజేతలకు కూడా అవకాశమివ్వాలనే ఉద్దేశంతో కేంద్ర క్రీడాశాఖ ఈ ప్రక్రియను వాయిదా వేసింది. త్వరలోనే ప్రతిపాదనలు స్వీకరించి అవార్డు విజేతలను ప్రకటించనుంది. 


Textile Sector: ఇటీవల ఏ పరిశ్రమను పీఎల్‌ఐ స్కీమ్‌ పరిధిలోకి తెచ్చారు?

వస్త్ర పరిశ్రమ (టెక్స్‌టైల్స్‌)ను ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కిందకు తీసుకువస్తూ కేంద్ర కేబినెట్‌ సెప్టెంబర్‌ 8న కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రంగానికి రానున్న ఐదేళ్లలో రూ.10,683 కోట్లు కేటాయించింది. పరిశ్రమ పురోభివృద్ధి, ఎగుమతులు లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ విలేకరులకు తెలిపారు. ఎంఎంఎఫ్‌ (మేన్‌–మేడ్‌ ఫైబర్‌) దుస్తులు, ఎంఎంఎఫ్‌ వస్త్రాలు, టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌కు సంబంధించిన 10 విభాగాలు/ఉత్పత్తులకు తాజా నిర్ణయం వర్తిస్తుందని వెల్లడించింది.

13 రంగాలకు వర్తించే విధంగా పీఎల్‌ఐ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం 2021–22 ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి మొత్తంగా రూ.1.97 లక్షల కోట్ల కేటాయింపులు జరిపింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : వస్త్ర పరిశ్రమ (టెక్స్‌టైల్స్‌)ను ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కిందకు తేవాలని నిర్ణయం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 8
ఎవరు    :  కేంద్ర కేబినెట్‌ 
ఎందుకు    : వస్త్ర పరిశ్రమ పురోభివృద్ధి, ఎగుమతులు లక్ష్యంగా..


Neeraj Chopra: ఏ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నీరజ్‌ చోప్రా నియమితులయ్యాడు?

టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ.. ఇటీవలే టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్టు సెప్టెంబర్‌ 8న ప్రకటించింది. దేశవ్యాప్తంగా వినియోగదారులుకు అత్యుత్తమ జీవిత బీమా, ఆరోగ్య బీమా రక్షణకుతోడు, ఆరోగ్య పరిష్కారాలను అందించాలన్న కంపెనీ ప్రయత్నాలకు నీరజ్‌చోప్రా మద్దతుగా నిలుస్తారని టాటా ఏఐఏ లైఫ్‌ తన ప్రకటనలో తెలిపింది. నీరజ్‌ భాగస్వామ్యంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కంపెనీ మరింత విస్తరించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులైన క్రీడాకారుడు?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 8
ఎవరు    : జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా 
ఎందుకు  : నీరజ్‌ భాగస్వామ్యంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కంపెనీ మరింత విస్తరించగలదని...


BPCL Chairman: బీపీసీఎల్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?

ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అరుణ్‌ కుమార్‌ సింగ్‌ సెప్టెంబర్‌ 8న బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో ఆయన నియామకానికి కేబినెట్‌ కమిటీ (నియామకాలు) ఆమోదముద్ర వేసింది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ పరిశ్రమలో సింగ్‌కు 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. 2020 ఆగస్టులో డీ రాజ్‌కుమార్‌ పదవీ విరమణ నేపథ్యంలో ఆయన స్థానంలో 2021, నెలలో సింగ్‌ నియామకం జరిగింది. రాజ్‌కుమార్‌ స్థానంలో ఇప్పటివరకు కే పద్మాకర్‌ (మానవ వనరుల విభాగం డైరెక్టర్‌) సంస్థ సీఎండీ అదనపు బాధ్యతలు నిర్వహించారు.

ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా రామకృష్ణ గుప్తా...
దేశంలో అతిపెద్ద రెండవ ఇంధన మార్కెటింగ్‌ కంపెనీ బీపీసీఎల్‌ కొత్త డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా వేత్స రామకృష్ణ గుప్తా పదోన్నతి పొందారు. ప్రస్తుతం బీపీసీఎల్‌ సీఎఫ్‌ఓగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31న పదవీ విరమణ చేసిన ఎన్‌. విజయగోపాల్‌ స్థానంలో ఈ నియామకం జరిగింది. బీపీసీఎల్‌లో తన మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 8
ఎవరు    : అరుణ్‌ కుమార్‌ సింగ్‌ 
ఎందుకు  : బీపీసీఎల్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా డీ రాజ్‌కుమార్‌ పదవీ విరమణ నేపథ్యంలో...

 

Diamond Mines: రాష్ట్రంలోని ఏ జిల్లాలో వజ్రాల లభ్యత ఉన్నట్టు జీఐఎస్‌ గుర్తించింది?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వైఎస్సార్‌ కడప జిల్లా పరిధిలో పెన్నా నదీ బేసిన్‌ ప్రాంతంలో వజ్రాల లభ్యత ఉన్నట్టు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఐఎస్‌) గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఖనిజాన్వేషణ సర్వే నిర్వహించిన ఈ సంస్థ జీ–4 స్థాయి పరిశోధన అనంతరం 100 మినరల్‌ బ్లాక్‌ల (గనులు) నివేదికలను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల మైనింగ్‌ శాఖలతో ఢిల్లీలో సెప్టెంబర్‌ 8న కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆ నివేదికలను ఆయన ఆయా రాష్ట్రాలకు అందజేశారు.

37 చ.కి.మీ మేర వజ్రాల బ్లాక్‌...
మొత్తం 14 రాష్ట్రాలు మైనింగ్‌ బ్లాక్‌ నివేదికలను అందుకున్నాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్‌ 21, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 9 చొప్పున నివేదికలు అందుకున్నాయి. ఏపీ తరఫున రాష్ట్ర మైనింగ్‌ డైరెక్టర్‌ వెంకటరెడ్డి నివేదికలు అందుకున్నారు. రాష్ట్రాలు ఆయా బ్లాక్‌లకు కాంపోజిట్‌ లైసెన్స్‌లు ఇచ్చేందుకు వేలం నిర్వహించాల్సి ఉంటుంది. వైఎస్సార్‌ జిల్లా ఉప్పరపల్లె ప్రాంతంలో 37.65 చదరపు కిలోమీటర్ల పరిధిలో వజ్రాల లభ్యతకు అవకాశం ఉన్నట్టు జీఐఎస్‌అన్వేషణలో తేలింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆంధ్రప్రదశ్‌లో వజ్రాల లభ్యత ఉన్నట్టు గుర్తింపు
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 8
ఎవరు    : జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఐఎస్‌)
ఎక్కడ    : పెన్నా నదీ బేసిన్‌ ప్రాంతం, ఉప్పరపల్లె, వైఎస్సార్‌ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం

 

PMAGY National Awards: రాష్ట్రంలోని ఏ రెండు జిల్లాలు పీఎంఏజీవై అవార్డుకు ఎంపికయ్యాయి?

దేశవ్యాప్తంగా షెడ్యూల్‌ కులాల సమగ్రాభివృద్ధి పథకం అమలుకు సంబంధించి... 2020–21 ఏడాదికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు అవార్డుల్లో రెండింటిని ఆంధ్రప్రదేశ్‌ గెలుచుకుంది. ఈ పథకం అమలులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన దేశంలోని మూడు జిల్లాలకు ప్రధాన మంత్రి ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన (పీఎంఏజీవై) అవార్డులను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. వీటికి ఎంపికైన మూడింటిలో రెండు జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానివే. ఇందులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రెండో స్థానం, తూర్పు గోదావరి జిల్లా మూడో స్థానం దక్కించుకున్నాయి. ఈ విషయాలను సెప్టెంబర్‌ 8న కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది.

2015లోనే అమల్లోకి తెచ్చినప్పటికీ..
ఎక్కువగా ఎస్సీ జనాభా ఉండే గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పీఎంఏజీవైను అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లోని 530 జిల్లాల పరిధిలో 19,172 గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఈ పథకం అమలవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం, విశాఖ జిల్లాలు మినహా 11 జిల్లాల పరిధిలోని 501 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2015 నుంచే ఈ పథకం అమల్లోకి తెచ్చినప్పటికీ.. 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచే ఏపీలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పీఎంఏజీవై అవార్డుకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలు
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 8
ఎవరు    : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తూర్పు గోదావరి జిల్లా 
ఎందుకు: ప్రధాన మంత్రి ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన (పీఎంఏజీవై) అమలులో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు...

 

Gold Purchases: భారత్‌ ఫారెక్స్‌ నిల్వల్లో బంగారం వాటా ఎంత శాతం?

అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో భారత్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తన పసిడి నిల్వల పెంపుపై దృష్టి సారిస్తోంది. 2021 క్యాలెండర్‌ ఇయర్‌ మొదటి ఆరు నెలల్లో (జనవరి–జూన్‌) రికార్డు స్థాయిలో 29 టన్నులు కొనుగోలు చేసింది. గడచిన రెండు సంవత్సరాల్లో ఆర్‌బీఐ పసిడి నిల్వలో 27 శాతం పెరుగుదల కనిపించింది. తాజా గణాంకాల ప్రకారం...

  • ఆర్‌బీఐ నిర్వహణలో ఉండే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా ఉండే పసిడి పరిమాణం 2021 జూన్‌ 30 నాటికి 705.6 టన్నులకు చేరింది. 2018 ప్రారంభంలో ఈ పరిమాణం 558.1 టన్నులు.
  • ఆర్‌బీఐ వద్ద ఉన్న మొత్తం ఫారెక్స్‌ నిల్వల్లో 2021, ఆగస్టు 27తో ముగిసే  త్రైమాసికానికి పసిడి వాటా దాదాపు 6 శాతంగా ఉంది.
  • ఆగస్టు 27వ తేదీతో ముగిసిన వారంలో భారత ఫారెక్స్‌ నిల్వలు రికార్డు స్థాయిలో 633.558 బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.46 లక్షల కోట్లు) చేరాయి.
అత్యధిక పసిడి నిల్వలు ఉన్న టాప్‌–10 దేశాలు
దేశం     నిల్వలు     నిల్వల్లో వాటా (శాతాల్లో)
అమెరికా     8,133.5     77.5 
జర్మనీ     3,362.4     74.5 
ఇటలీ 2,451.8     69.3
ఫ్రాన్స్‌     2,436.2 64.5
రష్యా     2,298.5     22.0 
చైనా     1,948.3     3.3 
స్విట్జర్లాండ్‌ 1,040.0     5.4
జపాన్‌ 765.2     3.1
భారత్‌     705.6     6.0
నెదర్లాండ్స్‌ 612.5 67.4
Published date : 09 Sep 2021 07:43PM

Photo Stories