Skip to main content

Daily Current Affairs in Telugu: డైలీ కరెంట్‌ అఫైర్స్‌ సెప్టెంబర్‌ 4

Avani Lekhara

Tokyo Paralympics 2020: ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన ఏకైక భారతీయురాలు? 

టోక్యో పారాలింపిక్స్‌–2020లో భారత మహిళా టీనేజ్‌ షూటర్‌ అవనీ లేఖరా అద్భుతాన్ని ఆవిష్కరించింది. 2021, ఆగస్టు 30న 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌ –1 విభాగంలో స్వర్ణం సాధించిన 19 ఏళ్ల అవనీ... సెప్టెంబర్‌ 3న 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఎస్‌హెచ్‌–1 ఈవెంట్‌లో కాంస్యం సాధించింది. తద్వారా పారాలింపిక్స్‌ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన మహిళల షూటింగ్‌ 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌ ఫైనల్లో రాజస్తాన్‌కు చెందిన 19 ఏళ్ల అవని... 445.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది.

రెండో భారతీయ ప్లేయర్‌...
ఒకే పారాలింపిక్స్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పతకాలు నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్‌ అవని. 1984 పారాలింపిక్స్‌లో జోగిందర్‌ సింగ్‌ మూడు పతకాలు గెలిచాడు. ఆయన షాట్‌పుట్‌లో రజతం, జావెలిన్‌ త్రోలో కాంస్యం, డిస్కస్‌ త్రోలో కాంస్యం సాధించాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన ఏకైక భారతీయురాలిగా గుర్తింపు
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 3, 2021
ఎవరు    : షూటర్‌ అవనీ లేఖరా 
ఎందుకు    : టోక్యో పారిలింపిక్స్‌–2020 షూటింగ్‌లో రెండు పతకాలు(10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌ –1 విభాగంలో స్వర్ణం, 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఎస్‌హెచ్‌–1 ఈవెంట్‌లో కాంస్యం) నెగ్గినందున... 

 

Haibatullah Akhunzada: అఫ్గాన్‌ అత్యున్నత నాయకుడిగా ఎంపికైన మత గురువు? 

అఫ్గానిస్తాన్‌ను అక్రమించిన రెండు వారాల తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా... దేశ అత్యున్నత నాయకుడిగా(సుప్రీం లీడర్‌) తాలిబన్‌ మత గురువు ముల్లా హైబతుల్లా అఖుంద్‌జాదా(60)ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని తాలిబన్‌ సమాచార, సాంస్కృతిక కమిషన్‌ సీనియర్‌ ప్రతినిధి ముఫ్తీ ఇనాముల్లా సమాంఘనీ సెప్టెంబర్‌ 2న వెల్లడించారు. కొత్త ప్రభుత్వంలో ప్రావిన్స్‌లకు గవర్నర్లు, జిల్లాలకు జిల్లా గవర్నర్లు ఇన్‌చార్జులుగా ఉంటారని తెలిపారు. నూతన ప్రభుత్వ వ్యవస్థ పేరును, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని ఇంకా ఖరారు చేయలేదని వివరించారు.

సుప్రీం లీడర్‌దే పెత్తనం... 
అఫ్గానిస్తాన్‌లో ఇరాన్‌ తరహా ప్రభుత్వం, పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలని తాలిబన్లు నిర్ణయించినట్లు తెలిసింది. ఇరాన్‌లో సుప్రీం లీడర్‌దే పెత్తనం. దేశంలో ఇదే అత్యున్నత రాజకీయ, మతపరమైన, సైనికపరమైన పదవి. అధ్యక్షుడి కంటే సుప్రీం లీడర్‌కే ఎక్కువ అధికారాలు ఉంటాయి. సైనిక, ప్రభుత్వ, న్యాయ విభాగం అధినేతల నియామకంలో సుప్రీం లీడర్‌ మాటే చెల్లుబాటు అవుతుంది. సుప్రీం లీడర్‌కు లోబడి అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి పరిపాలన సాగిస్తారు.

కాందహార్‌ నుంచే పరిపాలన...
అఫ్గాన్‌ కొత్త ప్రభుత్వ వ్యవస్థలో మహిళలు, గిరిజన తెగలతో సహా దేశంలోని అన్ని వర్గాలకు భాగస్వామ్యం దక్కుతుందని ఖతార్‌ రాజధాని దోహాలోని తాలిబన్‌ రాజకీయ కార్యాలయ ఉప నాయకుడు షేర్‌ మొహమ్మద్‌ అబ్బాస్‌ స్టానిక్‌జాయ్‌ ప్రకటించారు. తాలిబన్లకు గట్టి పట్టున్న కాందహార్‌ నగరం నుంచే ముల్లా హైబతుల్లా అఖుంద్‌జాదా ప్రభుత్వ అధినేతగా దేశ పరిపాలనను పర్యవేక్షిస్తారని తెలిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అఫ్గాన్‌ అత్యున్నత నాయకుడిగా ఎంపికైన మత గురువు?
ఎప్పుడు : సెప్టెంబర్‌ 2
ఎవరు   : ముల్లా హైబతుల్లా అఖుంద్‌జాదా 
ఎందుకు  : అఫ్గానిస్తాన్‌ కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా...


ex-MP Chandan Mitra: రాజ్యసభ మాజీ సభ్యుడు చందన్‌ ఏ పత్రిక ఎడిటర్‌గా పనిచేశారు?

ఆంగ్ల దినపత్రిక ది పయనీర్‌ ఎడిటర్, రాజ్యసభ మాజీ సభ్యుడు చందన్‌ మిత్రా(65) కన్నుమూశారు. ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్‌ 1న ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జర్నలిస్ట్‌గా సుదీర్ఘ కాలం పనిచేసిన మిత్రా సమకాలీన రాజకీయ పరిణామాలపై చురుగ్గా స్పందిస్తారనే పేరుంది. 1997లో పయనీర్‌లో కీలక బాధ్యతలు చేపట్టడానికి ఆయన ముందు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, హిందుస్తాన్‌ టైమ్స్‌ తదితర పత్రికల్లో పనిచేశారు. అనారోగ్య కారణాలతో పయనీర్‌ పత్రిక పబ్లిషర్‌ హోదాకు రాజీనామా చేసిన ఆయన... ఎడిటర్‌గా కొనసాగుతున్నారు. ఎల్‌కే అద్వానీకి సన్నిహితుడైన మిత్రా బీజేపీ తరఫున రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2018లో బీజేపీకి రాజీనామా చేసి, టీఎంసీలో చేరిన ఆయన క్రియాశీలక రాజకీయాలకు మాత్రం దూరంగా ఉండిపోయారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ది పయనీర్‌ ఎడిటర్, రాజ్యసభ మాజీ సభ్యుడు కన్నుమూత
ఎప్పుడు    : సెప్టెంబర్‌ 1
ఎవరు    : చందన్‌ మిత్రా(65)
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు    : అనారోగ్యం కారణంగా...


Football: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ సాధించిన ప్లేయర్‌?

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డొ మరో కొత్త రికార్డును సృష్టించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ సాధించిన ప్లేయర్‌గా రొనాల్డో అవతరించాడు. ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ పోటీల్లో భాగంగా ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌ నగరంలో సెప్టెంబర్‌ 2న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్‌ చేసిన రొనాల్డో 111 గోల్స్‌తో శిఖరాన నిలిచాడు. ఈ ఘనతను అతడు 180 మ్యాచ్‌ల్లో సాధించాడు. ఈ మ్యాచ్‌ ముందు వరకు 109 గోల్స్‌తో ఇరాన్‌ ప్లేయర్‌ అలీ దాయ్‌తో కలిసి అతను సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.

ఫార్ములా వన్‌కు రైకొనెన్‌ గుడ్‌బై...
2007 ప్రపంచ డ్రైవర్‌ చాంపియన్, ఆల్ఫా రొమెయో డ్రైవర్‌ కిమీ రైకొనెన్‌ (ఫిన్లాండ్‌) తన 19 ఏళ్ల ఫార్ములా వన్‌ (ఎఫ్‌1) రేసింగ్‌ కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతోన్న ఎఫ్‌1 సీజనే తనకు చివరిదని అతడు సెప్టెంబర్‌ 2న ప్రకటించాడు. ఎఫ్‌1 చరిత్రలో అత్యధిక గ్రాండ్‌ప్రిల్లో (344) పాల్గొన్న రేసర్‌గా ఉన్నాడు. 21 గ్రాండ్‌ప్రిల్లో విజేతగా నిలిచాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ సాధించిన ప్లేయర్‌?
ఎప్పుడు    : సెప్టెంబర్‌ 2
ఎవరు    : క్రిస్టియానో రొనాల్డొ
ఎక్కడ    : డబ్లిన్, ఐర్లాండ్‌
ఎందుకు    : ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చేసిన రెండు గోల్స్‌ సహా మొత్తం 111 గోల్స్‌ చేసినందున...


Vizag Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ సీఎండీగా ఎవరు నియమితులయ్యారు?

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ సీఎండీగా అతుల్‌ భట్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సెప్టెంబర్‌ 2న ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన ఉప కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన పి.కె.రథ్‌ 2021, మే 31న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత అప్పటి డైరెక్టర్‌ (పర్సనల్‌) కె.సి.దాస్‌ ఇన్‌చార్జి సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన జూన్‌ 30న పదవీ విరమణ చేయడంతో ప్రస్తుత డైరెక్టర్‌ (కమర్షియల్‌) డి.కె.మహంతి ఇన్‌చార్జ్‌ సీఎండీ బాధ్యతలు చేపట్టి ఇప్పటి వరకు కొనసాగుతున్నారు.

 

రాజీనామాకు సిద్ధమైన జపాన్‌ ప్రధాని సుగా...
కోవిడ్‌–19 మహమ్మారిని ఎదుర్కోవడంలో విఫలమయ్యారంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న జపాన్‌ ప్రధాని యోషిహిడే సుగా(72) పదవి నుంచి వైదొలిగేందుకు సిద్ధమయ్యారు. పార్టీ నాయకుడిని ఎన్నుకునేందుకు ఈ నెలాఖరులో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. 2020, సెప్టెంబర్‌లో ప్రధాని షింజో అబే అనారోగ్య కారణాలతో పదవి నుంచి వైదొలగగా సుగా బాధ్యతలు చేపట్టారు. పార్లమెంట్‌లో అధికార పార్టీకి పూర్తి స్థాయిలో బలముంది. పార్టీకి ఎన్నికయ్యే కొత్త నాయకుడే ప్రధానిగా బాధ్యతలు చేపడతారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ సీఎండీగా నియామకం
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 2
ఎవరు    : అతుల్‌ భట్‌
ఎందుకు  : ప్రభుత్వ నిర్ణయం మేరకు...


Supreme Court Collegium: తొలిసారి మిజోరాం నుంచి హైకోర్టు జడ్జి పదవికి ఎంపికైన వ్యక్తి?

వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా 68మంది పేర్లను సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. ఆగస్టు 25, సెప్టెంబర్‌1న జరిపిన సమావేశాల్లో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కొలిజియం 112మంది పేర్లను పదోన్నతి కోసం పరిశీలించింది. ఇందులో 82మంది బార్‌కు చెందినవారు కాగా, 31మంది జుడిషియల్‌ సర్వీసెస్‌కు చెందినవారు. వీరిలోనుంచి 68మంది పేర్లను 12 హైకోర్టులకు కొలిజియం రికమండ్‌ చేసింది. వీరిలో 44మంది బార్‌కు, 24 మంది జుడిషియల్‌ సర్వీసెస్‌కు చెందినవారు ఉన్నారు.

పది మంది మహిళలు...
ఈ దఫా సిఫార్సుల్లో కూడా కొలిజియం చరిత్ర సృష్టించింది. తొలిసారి మిజోరాం నుంచి హైకోర్టు జడ్జి పదవికి ఒకరిని ఎంపిక చేసింది. మిజోరాంకు చెందిన ఎస్‌టీ జుడిషియల్‌ అధికారి మర్లి వాంకుంగ్‌ను గౌహతి హైకోర్టుకు జడ్జిగా కొలిజియం రికమండ్‌ చేసింది. అలాగే సిఫార్సు చేసిన 68మందిలో 10మంది మహిళలున్నారు. ప్రస్తుతం సిఫార్సు చేసిన జడ్జిలను అలహాబాద్, రాజస్తాన్, కలకత్తా, జార్ఖండ్, జమ్ము కాశ్మీర్, మద్రాస్, మధ్యప్రదేశ్, కర్నాటక, పంజాబ్‌ అండ్‌ హర్యానా, కేరళ, చత్తీస్‌గఢ్, అస్సాం హైకోర్టుల్లో నియమిస్తారు.

సుప్రీం జడ్జిల సంఖ్య 33...
ఇటీవలే కొలిజయం ఏడుగురు జడ్జిలను తెలంగాణ హైకోర్టుకు, 9మందిని సుప్రీంకోర్టుకు రికమండ్‌ చేసింది. వీరందరితో ఒకేరోజు సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో సుప్రీంలో జడ్జిల సంఖ్య 33కు చేరింది.


Eastern Economic Forum: ఈస్ట్రన్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సమావేశాలు ఏ నగరంలో జరగుతున్నాయి? 

రష్యాలోని వ్లాడివోస్టోక్‌ నగరంలో జరుగుతున్న ఈఈఎఫ్‌(ఈస్ట్రన్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌) సమావేశాలనుద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్‌ 3న ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. భారత్, రష్యాల స్నేహబంధం కాలపరీక్షను తట్టుకొని నిలిచిందని మోదీ కొనియాడారు. యాక్‌ ఫార్‌ ఈస్ట్‌ పాలసీలో భాగంగా 2019లో జరిపిన రష్యా పర్యటనను ఆయన గుర్తు చేసుకున్నారు. రష్యాతో కీలక, నమ్మక వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంలో ఈ పాలసీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. రష్యా తూర్పు ప్రాంతానికి చెందిన 11 ప్రాంతాల గవర్నర్లను భారత్‌లో పర్యటించాలని మోదీ ఆహ్వానించారు.

క్లైమెట్‌ బులిటన్‌ విడుదల...
ఐక్యరాజ్యసమితి వాతావరణ ఏజెన్సీ... ప్రపంచ వాతావరణ సమాఖ్య(డబ్ల్యఎంఓ) సెప్టెంబర్‌ 3న ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ క్లైమెట్‌ బులిటన్‌ను విడుదల చేసింది. ప్రపంచంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కరోనా నివారణకు విధించిన లాక్‌డౌన్లు, ప్రయాణాలపై ఆంక్షలు పర్యావరణపరంగా సత్ఫలితాలిచ్చినట్లు బులిటిన్‌ తెలిపింది. 2020 లాక్‌డౌన్‌ కాలంలో గాలిలోకి వాయు కాలుష్య కారకాల విడుదల భారీగా తగ్గిందని పేర్కొంది. 

 

British-era Tunnel: ఏ రాష్ట్రం/యూటీ అసెంబ్లీలో బ్రిటిష్‌ కాలం నాటి సొరంగాన్ని కనుగొన్నారు? 

కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న బ్రిటిష్‌ కాలం నాటి సొరంగం, ఎగ్జిక్యూటివ్‌ రూమ్‌లలోకి 2022 ఏడాది జనవరి 26కుగానీ లేదా ఆగస్టు 15కు గానీ ప్రజలకు ప్రవేశం కల్పిస్తామని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయల్‌ సెప్టెంబర్‌ 3న తెలిపారు. 2016లో ఈ సొరంగాన్ని, ఎగ్జిక్యూటివ్‌ రూమ్‌ను కనుగొన్న సంగతి తెలిసిందే. 1911లో ఢిల్లీ అసెంబ్లీ భవన నిర్మాణం జరిగింది. ఈ సొరంగం ద్వారా ఎర్రకోట వద్దకు (5–6 కి.మీ) చేరే అవకాశం అప్పట్లో ఉండేదని భావిస్తున్నట్లు రామ్‌ నివాస్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ రూమ్‌ వద్ద పునర్నిర్మాణం జరుగుతోందని తెలిపారు. అయితే ఎర్ర కోట వరకూ సొరంగాన్ని తవ్వబోవడం లేదని అన్నారు. దేశ రాజధాని 1912లో కోల్‌కతా నుంచి ఢిల్లీకి మారినప్పుడు ఈ భవనాన్నే అసెంబ్లీగా ఉపయోగించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : బ్రిటిష్‌ కాలం నాటి సొరంగం, ఎగ్జిక్యూటివ్‌ రూమ్‌లలోకి 2022 ఏడాది జనవరి 26కుగానీ లేదా ఆగస్టు 15కు గానీ ప్రజలకు ప్రవేశం కల్పిస్తాం
ఎప్పుడు    : సెప్టెంబర్‌ 3
ఎవరు    : ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయల్‌
ఎక్కడ    : ఢిల్లీ అసెంబ్లీ 


Operation London Bridge: ఏ కార్యకలాపాలను ఆపరేషన్‌ లండన్‌ బ్రిడ్జ్‌గా పిలుస్తారు?

బ్రిటన్‌ మహారాణి క్వీన్‌ ఎలిజబెత్‌–2 మరణించిన అనంతరం తీసుకొనే చర్యల వివరాలు సెప్టెంబర్‌ 3న లీకయ్యాయి. రాణి మరణించిన వెంటనే ఆరంభమయ్యే ఈ కార్యకలాపాలను ‘‘ఆపరేషన్‌ లండన్‌ బ్రిడ్జ్‌’’గా పిలుస్తారని  పొలిటికో వార్తా సంస్థ వెల్లడించింది. రాణి మరణించిన రోజును అధికారికంగా ‘డీ డే’గా పిలుస్తారని, ఆమె మరణించిన రోజును జాతి సంతాపదినంగా ప్రధాని ప్రకటిస్తారని, సెలవు కూడా ఇస్తారని తెలిపింది. బ్రిటన్‌ చరిత్రలో సుదీర్ఘకాలం పరిపాలిస్తున్న రాణిగా ఎలిజబెత్‌–2 రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమెకు 95 సంవత్సరాల వయసు.

అమెరికాలో ఇదా తుపాను...
అమెరికా ఈశాన్య రాష్ట్రాలను ‘ఇదా’ తుపాను అతలాకుతలం చేస్తోంది. న్యూయార్క్, న్యూ జెర్సీ, పెన్సిల్వేనియాలలో మొత్తంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. తుపాను సృష్టించిన విలయం ధాటికి న్యూయార్క్‌ రాష్ట్రంలో అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ)ని సెప్టెంబర్‌ 2న గవర్నర్‌ క్యాథీ హోచల్‌ ప్రకటించారు.

 

Praveen Kumar: పారాలింపిక్స్‌ హైజంప్‌ టి64 కేటగిరీలో రజతం సాధించిన అథ్లెట్‌? (క్రీడలు) 

టోక్యో పారాలింపిక్స్‌–2020లో భారత అథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్‌ రజత పతకం సాధించాడు. విశ్వ క్రీడల్లో భాగంగా సెప్టెంబర్‌ 3న జరిగిన పురుషుల అథ్లెటిక్స్‌ హైజంప్‌ టి64 కేటగిరీ పోటీల్లో 18 ఏళ్ల ప్రవీణ్‌... 2.07 మీటర్ల ఎత్తుకు ఎగిరి కొత్త ఆసియా రికార్డు సృష్టించడంతోపాటు రజత పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. దిగిన తొలిసారే పతకం సాధించడం చాలా ఆనందంగా ఉందని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ప్రవీణ్‌ అన్నాడు. జొనాథన్‌ బ్రూమ్‌ ఎడ్వర్డ్స్‌ (బ్రిటన్‌–2.10 మీటర్లు) స్వర్ణం సాధించగా... లెపియాటో (పోలాండ్‌–2.04 మీటర్లు) కాంస్యం గెలిచాడు.

‘షూట్‌ ఆఫ్‌’లో సూపర్‌...
టోక్యో పారాలింపిక్స్‌–2020లో భాగంగా జరిగిన ఆర్చరీ పోటీల్లో హరియాణాకు చెందిన 31 ఏళ్ల హర్వీందర్‌ సింగ్‌ కాంస్య పతకం గెలిచాడు. 2021, సెప్టెంబర్‌ 3న జరిగిన పురుషుల రికర్వ్‌ ఓపెన్‌ వ్యక్తిగత విభాగం కాంస్య పతక పోరులో... దక్షిణ కొరియాకు చెందిన కిమ్‌ మిన్‌ సుపై హర్వీందర్‌ ‘షూట్‌ ఆఫ్‌’లో 10–8తో నెగ్గాడు. దీంతో విశ్వ క్రీడల్లో పతకం నెగ్గిన తొలి భారతీయ ఆర్చర్‌గా హర్వీందర్‌ చరిత్ర సృష్టించాడు. హరియాణాలోని కైథాల్‌ జిల్లాలోని గుహ్లా చీకా గ్రామానికి చెందిన హర్వీందర్‌ ప్రస్తుతం పాటియాలాలోని పంజాబీ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : టోక్యో పారాలింపిక్స్‌–2020 హైజంప్‌ టి64 కేటగిరీలో రజతం సాధించిన భారత అథ్లెట్‌?
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 3, 2021
ఎవరు    : ప్రవీణ్‌ కుమార్‌
ఎక్కడ    : టోక్యో, జపాన్‌
ఎందుకు  : హైజంప్‌ టి64 కేటగిరీలో 2.07 మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచినందున...

Published date : 04 Sep 2021 07:01PM

Photo Stories