Skip to main content

భారత ఫుట్‌బాల్ దిగ్గజం పీకే బెనర్జీ అస్తమయం

భారత ఫుట్‌బాల్ దిగ్గజం ప్రదీప్ కుమార్ (పీకే) బెనర్జీ కన్నుమూశారు.
Current Affairsకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 83 ఏళ్ల బెనర్జీ మార్చి 20న కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. తన కెరీర్‌లో భారత్ తరఫున ఫ్రెండ్లీ తదితర మ్యాచ్‌లు కలుపుకొని ఓవరాల్‌గా 84 మ్యాచ్‌లాడిన బెనర్జీ 65 గోల్స్ చేశారు. 36 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 19 గోల్స్ సాధించాడు. స్ట్రయికర్‌గా... సారథిగా... కోచ్‌గా... ఐదు దశాబ్దాలు ఫుట్‌బాల్ కోసమే పరితపించారు.

క్రీడాకారుడిగా...
పశ్చిమ బెంగాల్‌లోని మొయినగురిలో 1936, జూన్ 23న జన్మించిన బెనర్జీ 1951లో తొలిసారి సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ ఆడారు. తదనంతర కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికై కీలక ఆటగాడిగా ఎదిగారు. 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నారు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టుకు నాయకత్వం వహించారు. అలాగే వరుసగా మూడు ఆసియా క్రీడల్లో (1958-టోక్యో, 1962-జకార్తా, 1966-బ్యాంకాక్) స్ట్రయికర్‌గా రాణించారు. 1962 ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణం గెలవడంలో కీలకపాత్ర పోషించారు. ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణం నెగ్గడం అదే చివరిసారి.

కోచ్‌గా...
క్రీడాకారుడిగా రిటైరైన బెనర్జీ 1970 నుంచి 1985 వరకు భారత జట్టుకు కోచ్‌గా సేవలందించారు. ఆయన భారత్ 1970 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గింది. ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టు పతకం సాధించడం అదే చివరిసారి. భారత జట్టు కోచ్ పదవి నుంచి తప్పుకున్నాక ఆయన 2003 వరకు మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్, మొహమ్మడన్ స్పోర్టింగ్ క్లబ్ జట్లకు కోచ్‌గా ఉన్నారు.

తొలి అర్జున అవార్డు...
జాతికి కీర్తిప్రతిష్టలు తెచ్చిన క్రీడాకారుల్ని అవార్డులతో గుర్తించాలని అప్పటి భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 1961లో ‘అర్జున’ అవార్డులు ఇవ్వడం మొదలైంది. ఫుట్‌బాల్ క్రీడాంశంలో తొలి అర్జున పొందింది బెనర్జీనే. 1990లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో ఆయనను ప్రభుత్వం గౌరవించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత ఫుట్‌బాల్ దిగ్గజం అస్తమయం
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : ప్రదీప్ కుమార్ (పీకే) బెనర్జీ(83)
ఎక్కడ : కోల్‌కతా, పశ్చిమబెంగాల్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 21 Mar 2020 05:57PM

Photo Stories