Skip to main content

సెప్టెంబర్ 2020 ద్వైపాక్షిక సంబంధాలు

నవంబర్‌లో గిల్గిత్ అసెంబ్లీ ఎన్నికలు: పాకిస్తాన్
Current Affairs
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని గిల్గిత్- బాల్టిస్తాన్ అసెంబ్లీకి 2020, నవంబర్ 15వ తేదీన ఎన్నికలు జరపనున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. 2017 ఎన్నికల చట్టం ప్రకారం గిల్గిత్ - బాల్టిస్తాన్ శాసన సభకు నవంబర్ 15న ఎన్నికలు జరుగుతాయని పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ సెప్టెంబర్ 24న నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సైన్యం ఆక్రమించుకున్న గిల్గిత్- బాల్టిస్తాన్ ప్రాంతంలో ప్రస్తుతమున్న పరిస్థితులను మార్చేందుకు చేసే ఎలాంటి ప్రయత్నం కూడా న్యాయపరంగా చెల్లుబాటు కాదని పేర్కొంది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లతోపాటు గిల్గిత్-బాల్టిస్తాన్ భారత్‌లో అంతర్భాగంగా ఉన్నాయనీ, ఎప్పటికీ ఉంటాయని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గిల్గిత్- బాల్టిస్తాన్ అసెంబ్లీకి 2020, నవంబర్ 15వ తేదీన ఎన్నికలు
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : పాకిస్తాన్ ప్రభుత్వం
ఎక్కడ : గిల్గిత్- బాల్టిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)

డెన్మార్క్ ప్రధానితో భారత ప్రధాని సమావేశం
డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్ ఫ్రెడరిక్సన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 28న వర్చువల్ విధానంలో ద్వైపాక్షిక సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... గ్లోబల్ సప్లయ్ చైన్ కేవలం ఒకే ఒక్క వనరుపైనే అధికంగా ఆధారపడి ఉండటం ఎంత ప్రమాదకరమో కోవిడ్ తెలియజెప్పిందని అన్నారు. సప్లయ్ చైన్‌ను ఒకే దేశానికి బదులు అనేక దేశాలకు విస్తరించుకునే క్రమంలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలతో భారత్ పనిచేస్తోందనీ, భావసారూప్యం గల దేశాలను ఆహ్వానిస్తోందని మోదీ వివరించారు.
3.68 బిలియన్ డాలర్ల వాణిజ్యం...
అధికార గణాంకాల ప్రకారం.. భారత్-డెన్మార్క్ ద్వైపాక్షిక వాణిజ్యం 2016-2019 సంవత్సరాల్లో 2.82 బిలియన్ డాలర్ల నుంచి 3.68 బిలియన్ డాలర్లకు పెరిగింది. సుమారు 200 డెన్మార్క్ కంపెనీలు దేశంలో నౌకాయానం, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాయి. డెన్మార్క్ కంపెనీల్లో 5వేల మంది భారతీయ నిపుణులు పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్ ఫ్రెడరిక్సన్‌తో వర్చువల్ సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ

కరోనా టీకా తయారీకి వాషింగ్టన్ వర్సిటీతో ఒప్పందం చేసుకున్న భారత ఫార్మా?
Current Affairs
ముక్కు ద్వారా అందించే కరోనా టీకా తయారీకి సంబంధించి అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీతో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని సెప్టెంబర్ 23న భారత్ బయోటెక్ వెల్లడించింది. టీకా లెసైన్సింగ్‌కు సంబంధించిన ఈ ఒప్పందం ప్రకారం... భారత్ బయోటెక్ అమెరికా, జపాన్, యూరప్ దేశాలు మినహా మిగిలిన దేశాల్లో టీకాను పంపిణీ చేసే హక్కులు కలిగి ఉంటుంది. హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో ఉన్న కంపెనీ కేంద్రంలో ఈ టీకా ఉత్పత్తి జరగనుంది. కనీసం వంద కోట్ల డోసులు తయారు చేయాలన్నది తమ లక్ష్యమని కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీతో ఒప్పందం
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : భారత్ బయోటెక్
ఎందుకు : ముక్కు ద్వారా అందించే కరోనా టీకా తయారీకి సంబంధించి

రూ.14.91 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీ?
Current Affairs
రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ సెప్టెంబర్ 10న మరో రికార్డ్ ఘనత సాధించింది. రిలయన్స్ అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్‌లో 40 శాతం వరకూ వాటాను అంతర్జాతీయ ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్‌కు విక్రయించనున్నదన్న వార్తల కారణంగా... రిలయన్స్ షేర్ ఇంట్రాడేలో 8.4 శాతం లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.2,344ను తాకింది. చివరకు 7 శాతం లాభంతో రూ.2,315 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.14.91 లక్షల కోట్లకు(20,000 కోట్ల డాలర్లు) ఎగసింది. ఈ స్థాయి మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీ ఇదే. ఒక్క సెప్టెంబర్ 10వ తేదీనే రిలయన్స్ రూ.97,000 కోట్ల మేర మార్కెట్‌క్యాప్ పెరిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రూ.14.91 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి భారత కంపెనీ
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ

ఐదు అంశాల్లో భారత్, చైనా ఏకాభిప్రాయం
తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట నెలకొన్న తీవ్రస్థాయి ఉద్రిక్తతలను తొలగించే దిశగా భారత్, చైనా ముందడుగు వేశాయి. రష్యా రాజధాని మాస్కోలో సెప్టెంబర్ 11న జరిగిన రెండు దేశాల విదేశాంగ మంత్రుల భేటీలో ఇందుకు సంబంధించి ఐదు అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చాయి. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొనేందుకు మాస్కో వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి.. సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపు లక్ష్యంగా అక్కడ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఐదు అంశాలు...
  • సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ
  • సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేలా చర్యలు చేపట్టకపోవడం
  • వాస్తవాధీన రేఖ వెంట శాంతి, సంయమనం నెలకొనడం
  • రెండు దేశాల సరిహద్దు భద్రత దళాలు చర్చలు కొనసాగించడం
  • సైనిక బలగాల మధ్య దూరం పాటించడం

రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష..
చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సెప్టెంబర్ 11న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె, వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐదు అంశాల్లో ఏకాభిప్రాయం
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : భారత్, చైనా
ఎందుకు : తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట నెలకొన్న తీవ్రస్థాయి ఉద్రిక్తతలను తొలగించేందుకు

స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ సరఫరాకై ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం చేసుకున్న భారత సంస్థ?
కోవిడ్-19ను అరికట్టడానికి రష్యా అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్-వీ’ వ్యాక్సిన్ మూడవ దశ ఔషధ పరీక్షలతోపాటు పంపిణీకై హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, రష్యన్ డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించిన తర్వాత రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఆర్‌డీఐఎఫ్ సరఫరా చేయనుంది. పరీక్షలు విజయవంతం అయి, వ్యాక్సిన్ నమోదు ప్రక్రియ పూర్తి అయితే.. 2020 ఏడాది చివరి నుంచే దేశంలో వ్యాక్సిన్ల డెలివరీ ఉండే అవకాశం ఉందని రెడ్డీస్ సెప్టెంబర్ 16న ప్రకటించింది.
హ్యూమన్ ఎడినోవైరస్ ప్లాట్‌ఫాంపై...
రష్యాకు చెందిన గమలేయ నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. హ్యూమన్ ఎడినోవైరస్ డ్యూయల్ వెక్టర్ ప్లాట్‌ఫాంపై ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేశామని, ఇది సురక్షితమైందని ఆర్‌డీఐఎఫ్ సీఈవో కిరిల్ దిమిత్రీవ్ తెలిపారు. రష్యాలో 25 ఏళ్లుగా డాక్టర్ రెడ్డీస్‌కు సుస్థిర, గౌరవప్రద స్థానం ఉందని వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం చేసుకున్న భారత సంస్థ
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్
ఎందుకు : స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ మూడవ దశ ఔషధ పరీక్షలతోపాటు పంపిణీకై

భారత్‌లో ఏకే-47 తయారీకి కేంద్రం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది?
Current Affairs
భారత్‌లో ఏకే- 47 203 రైఫిల్స్ ఉత్పత్తికి సంబంధించి భారత్, రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజా రష్యా పర్యటనలో ఈ ఒప్పందం కుదిరిందని సెప్టెంబర్ 2న రష్యా మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించి భారత్, రష్యా సంయుక్తంగా ‘ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ జాయింట్ వెంచర్(జేవీ)లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(భారత సంస్థ), కల్నోషికోవ్ కన్సెర్న్(రష్యా సంస్థ), రోసోబోరోనెక్స్‌పోర్ట్(రష్యా సంస్థ)లు భాగస్వాములుగా ఉంటాయి. జేవీలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి 50.5 శాతం వాటా, కన్సెర్న్‌కు 42 శాతం వాటా, రోసోబోరోనెక్స్‌పోర్ట్‌కు 7.5 శాతం వాటా ఉంది.
ఒప్పందం విశేషాలు...

  • ఏకే- 47 రైఫిల్స్‌లో 203 మోడల్ ఆధునికమైన వెర్షన్.
  • ఉత్తరప్రదేశ్‌లోని కొర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ ఏకే- 47లను ఉత్పత్తి చేయనున్నారు.
  • ప్రస్తుతం భారత ఆర్మీ వాడుతున్న ఇన్‌సాస్ 5.56 x45 ఎంఎం అసాల్ట్ రైఫిల్ స్థానంలో ఈ ఏకే- 47 -203 7.62×39 ఎంఎం రైఫిల్స్‌ను ప్రవేశపెడతారు.
  • భారత ఆర్మీకి దాదాపు 7.7 లక్షల ఏకే- 47 203లు అవసరం పడతాయని అంచనా.
  • లక్ష రైఫిల్స్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు. మిగతావి దేశీయంగా తయారు చేసేలా ఒప్పందం కుదిరింది.
  • ఒక్కోరైఫిల్ ఖరీదు దాదాపు 1100 యూఎస్ డాలర్లు.
  • ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇన్సాస్ రైఫిళ్లను 1996 నుంచి వినియోగిస్తున్నారు.
  • ఇన్సాస్ రైఫిళ్లతో హిమాలయ మంచు ప్రాంతాల్లో జామ్ కావడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే ఆర్మీకి ఏకే- 47 203 మోడల్ రైఫిళ్లను అందించాలని నిర్ణయించారు.


రష్యా రక్షణమంత్రితో రాజ్‌నాథ్ చర్చలు
రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయగుతో ఫలప్రదవంతమైన చర్చలు జరిగాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెప్టెంబర్ 3న వెల్లడించారు. రక్షణ, వ్యూహాత్మక సహకారం సహా పలు అంశాలను చర్చించినట్లు తెలిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశాల కోసం రాజ్‌నాథ్ మూడురోజుల రష్యా పర్యటనకు వెళ్లారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, రష్యాల మధ్య కీలక ఒప్పందం
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎందుకు : భారత్‌లో ఏకే- 47 203 రైఫిల్స్ ఉత్పత్తికి సంబంధించి

ఏ రెండు దేశాల భాగస్వామ్య మండలిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు?
అమెరికా- భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని (యూఎస్- ఇండియా స్ట్రాటెజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్) ఉద్దేశించి సెప్టెంబర్ 3న వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారత్ అత్యుత్తమ గమ్యస్థానమని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.
ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • దేశంలో నెలకొన్న రాజకీయ సుస్ధిరత, విధాన కొనసాగింపు భారత్‌ను పెట్టుబడిదారులకు అత్యుత్తమ కేంద్రంగా రూపొందించింది.
  • ప్రజాస్వామ్యానికి, బహుళత్వానికి భారత్ కట్టుబడి ఉంది.
  • ప్రస్తుత కరోనా ముప్పు పరిస్థితిని ఎదుర్కొనేందుకు వినూత్నంగా, మానవ సంక్షేమం కేంద్రంగా ఆలోచించాలి.
  • కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా రికార్డు సమయంలో దేశంలో వైద్య వసతులను సమకూర్చుకోగలిగాం.
  • కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఉద్యమంలా ప్రచారం చేసిన తొలి దేశాల్లో భారత్ ఒకటి.

క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా- భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని ఉద్దేశించి ప్రసంగం
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ

భారత్, చైనా రక్షణ మంత్రుల సమావేశం
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో భారత, చైనా రక్షణ మంత్రుల మధ్య కీలక భేటీ జరిగింది. రష్యా రాజధాని మాస్కోలో సెప్టెంబర్ 4న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చైనా రక్షణ మంత్రి వీ ఫెన్‌ఘీ సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తొలగించే దిశగా చోటు చేసుకున్న కీలక ముందడుగుగా భావిస్తున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో 2020, మే నెలలో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు ప్రారంభమైన తరువాత ఇరు దేశాల మధ్య కీలక మంత్రిత్వ స్థాయి ముఖాముఖి చర్చలు జరగడం ఇదే ప్రథమం. గతంలో విదేశాంగ మంత్రి జై శంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ఫోన్‌లో చర్చించారు. కానీ, వారిద్దరి మధ్య ముఖాముఖీ భేటీ జరగలేదు. ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రాజ్‌నాథ్, వీ ఫెన్‌ఘీ రష్యాకు వెళ్లిన విషయం తెలిసిందే.
మరో దఫా మిలిటరీ చర్చలు
భారత్- చైనాల మధ్య మరోదఫా మిలిటరీ చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి తూర్పు లద్దాఖ్‌లోని చుషుల్‌లో సెప్టెంబర్ 4న బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. చర్చల్లో పురోగతి ఏంటనేది వెంటనే తెలియరాలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, చైనా రక్షణ మంత్రుల సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చైనా రక్షణ మంత్రి వీ ఫెన్‌ఘీ
ఎక్కడ : మాస్కో, రష్యా
ఎందుకు : సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో...

ఇంద్రనేవీ పేరుతో నేవీ విన్యాసాలు నిర్వహించిన దేశాలు?
ఇంద్రనేవీ-2020 పేరుతో భారత్, రష్యా నావికాదళాలు సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. భవిష్యత్ ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ, పరస్పర రక్షణ ఒప్పందాలు పటిష్టం చేయడంలో భాగంగా బంగాళాఖాతం సముద్రంలో సెప్టెంబర్ 4, 5 తేదీల్లో ఈ విన్యాసాలను నిర్వహించారు. ఈ విన్యాసాల్లో భారత్ నావికాదళానికి చెందిన క్షిపణి విధ్వంసక నౌకలు రన్‌విజయ్‌శక్తి, ఆర్‌యూఎఫ్‌ఎన్ నౌకలు పాల్గొన్నాయి. క్రాస్‌డెక్ ఫ్లయింగ్, ఫైరింగ్, తదితర విన్యాసాలు విజయవంతంగా నిర్వహించారు. ఇంద్ర పేరుతో 2003 ఏడాది నుంచి భారత్, రష్యాలు నేవీ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా 11వ ఎడిషన్ విన్యాసాలను విజయవంతంగా పూర్తి చేశాయి. భారత్-చైనా సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్-రష్యా నౌకలు తమ యుద్ధప్రావీణ్యం పరీక్షించుకోవడం ప్రాధాన్యత సంతరించకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంద్రనేవీ-2020 పేరుతో నేవీ విన్యాసాలు
ఎప్పుడు : సెప్టెంబర్ 4, 5
ఎవరు : భారత్, రష్యా నావికాదళాలు
ఎక్కడ : బంగాళాఖాతం సముద్రం
ఎందుకు : భవిష్యత్ ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ, పరస్పర రక్షణ ఒప్పందాలు పటిష్టం చేయడంలో భాగంగా

ఇరాన్ రక్షణ మంత్రి హటామితో రాజ్‌నాథ్ చర్చలు
ఇరాన్ రక్షణ మంత్రి జనరల్ అమీర్ హటామితో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో సెప్టెంబర్ 5న జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ భద్రతతోపాటు అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితి తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. రాజ్‌నాథ్ రష్యాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని ఇరాన్‌కు వచ్చారు.
పాక్ చెరలో 19మంది భారతీయులు
అక్రమ ప్రవేశం, గూఢచర్యం నేరాలపై రెండు నెలల క్రితం 19మంది భారతీయులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసి వివిధ జైళ్లలో ఉంచామని పాకిస్తాన్ అధికారులు తెలిపారు. అలాగే ఇద్దరు బంగ్లాదేశీయులను అరెస్టు చేశామని, 2020, నవంబర్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టేదాకా వీరు జైల్లోనే ఉంటారని సెప్టెంబర్ 7న పేర్కొన్నారు.
ఖల్సా ఉగ్రవాదులు అరెస్టు..
సిక్కు ఉగ్రవాద సంస్థ బబ్బర్‌ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందిన ఇద్దరిని సెప్టెంబర్ 7న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని భూపేందర్ అలియాస్ దిలావర్ సింగ్, కుల్వంత్ సింగ్‌గా గుర్తించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇరాన్ రక్షణ మంత్రి జనరల్ అమీర్ హటామితో భేటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎక్కడ : టెహ్రాన్, ఇరాన్
ఎందుకు : ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ భద్రతతోపాటు అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితి తదితర అంశాలపై చర్చించేందుకు

45 ఏళ్ల తరువాత చైనా సరిహద్దుల్లో కాల్పులు
సరిహద్దుల్లో తరచుగా ఉద్రిక్తతలు సృష్టిస్తూ.. భారత్‌ను కవ్విస్తున్న చైనా మరోసారి తెంపరితనం చూపింది. సెప్టెంబర్ 7న తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సు సరిహద్దుల్లో భారత దళాలకు హెచ్చరికగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) గాలిలో కాల్పులు జరిపి దుస్సాహసానికి తెగబడింది. సరిహద్దు ఘర్షణల సమయంలో కాల్పులకు పాల్పడకూడదన్న ఒప్పందాన్ని ఉల్లంఘించింది. 1975 నాటి ఘర్షణల అనంతరం చైనా సరిహద్దుల్లో కాల్పుల ఘటన చోటుచేసుకోవడం ఇదే ప్రథమం. పీఎల్‌ఏ గాలిలో కాల్పులు జరిపాయని, సరిహద్దుల్లోని భారత్ పోస్ట్‌ను స్వాధీనం చేసుకునేందుకు విఫలయత్నం చేశాయని సెప్టెంబర్ 8న భారతీయ సైన్యం ప్రకటించింది. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ను దాటి వచ్చి భారత దళాలే కాల్పులు జరిపాయన్న చైనా ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. చైనా బలగాలే కాల్పులు జరిపాయని స్పష్టం చేసింది.
ఆర్టికల్ 6 ప్రకారం...
1988లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు 3,500 కి.మీ పొడవునా ఉన్న భారత్-చైనా సరిహద్దుల్లో శాంతి స్థాపన కోసం పరస్పరం విశ్వాసం పాదుకొల్పే చర్యలుకు తొలుత శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 1993, 1996, 2005, 2012, 2013లో పలు ఒప్పందాలు జరిగాయి. 1996లో జరిగిన ఒప్పందంలో ఆర్టికల్ 6 ప్రకారం ఇరుపక్షాలు వాస్తవాధీన రేఖ వెంబడి 2 కి.మీ. వరకు కాల్పులు, పేలుళ్లకు పాల్పడకూడదు. స్వీయనియంత్రణ పాటిస్తూ సమస్యను శాంతి యుతంగా చర్చించుకోవాలి.

ఏ ప్రాంతంలోని సరిహద్దుల్లో సైన్యం సొరంగ మార్గాన్ని గుర్తించింది?
Current Affairs
జమ్మూలోని సాంబా సెక్టార్‌లో గాలార్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ వైపు వెళుతున్న 170 మీటర్ల పొడవైన ఒక సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్‌ఎఫ్) కనుగొన్నాయి. 25 అడుగుల లోతు, 20 అడుగుల పొడవు, 3-4 అడుగుల వెడల్పున ఈ సొరంగ మార్గం ఉందని ఆగస్టు 29న సైన్యాధికారులు వెల్లడించారు. భారత్‌లోకి చొరబాట్లు, నార్కోటిక్ డ్రగ్‌‌స, ఆయుధాలు రవాణా చేయడం కోసమే పాకిస్తాన్ దీనిని నిర్మించిందని పేర్కొన్నారు. సరిహద్దుల నుంచి భారత్ భూభాగం వైపు 50 మీటర్ల దూరంలో ఈ సొరంగమార్గం ఉంది. ప్రస్తుతం బీఎస్‌ఎఫ్ డెరైక్టర్ జనరల్ రాకేశ్ ఆస్తానా ఉన్నారు.
చుషుల్‌లో చర్చలు...
సరిహద్దులోని తూర్పు లద్దాఖ్‌లో తాజాగా నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చేందుకు భారత్, చైనా మరో దఫా సైనిక చర్చలు చేపట్టాయి. సరిహద్దులో భారత్ వైపున్న చుషుల్‌లో సెప్టెంబర్ 1న బ్రిగేడ్ కమాండర్ స్థాయి అధికారుల చర్చలు ప్రారంభమయ్యాయి. పాంగాంగ్ సరస్సు వద్ద యథాతథ స్థితిని కొనసాగించాలన్న నిర్ణయానికి తూట్లు పొడుస్తూ ఆగస్టు 31న చైనా మిలిటరీ దుస్సాహసానికి దిగింది. పెద్ద సంఖ్యలో చైనా బలగాలు భారత్ వైపునకు చొచ్చుకొని వచ్చి దురాక్రమణకు యత్నించాయి.
అందుకే వివాదాలు: చైనా మంత్రి
భారత్, చైనా సరిహద్దులో ఒకవైపు ఉద్రిక్తతలు నెలకొనగా మరోవైపు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా సరిహద్దుల్ని ఇంకా నిర్ణయించలేదని, అందుకే ఎప్పుడూ సమస్యలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశ సరిహద్దుల్లో సొరంగ మార్గం గుర్తింపు
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్‌ఎఫ్
ఎక్కడ : గాలార్ ప్రాంతం, సాంబా సెక్టార్, జమ్మూ

Published date : 25 Sep 2020 01:28PM

Photo Stories