Skip to main content

డిసెంబర్ 2020 ద్వైపాక్షిక సంబంధాలు

కోవాక్స్‌తో ఒప్పందం చేసుకున్న భారత ఫార్మా సంస్థ?
Current Affairs
యునెటైడ్ బయోమెడికల్‌కు చెందిన కోవాక్స్(అమెరికా)తో ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ సంస్థ అరబిందో ఫార్మా.. ప్రత్యేక లెసైన్సింగ్ ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా కోవిడ్-19 చికిత్సకై కోవాక్స్ తయారు చేసిన తొలి మల్టీటోప్ పెప్టైడ్ ఆధారిత వ్యాక్సిన్ ‘‘యూబీ-612’’ అభివృద్ధి, ఉత్పత్తి, విక్రయాలను అరబిందో చేపడుతుంది. భారత్‌తోపాటు యునిసెఫ్‌కు ఈ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తారు. కోవాక్స్ ప్రస్తుతం యూబీ-612 వ్యాక్సిన్ క్యాండిడేట్ తొలి దశ ఔషధ ప్రయోగాలను నిర్వహిస్తోంది.
ఎల్ అండ్ టీ 3డీ బిల్డింగ్...
ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) కన్‌స్ట్రక్షన్ తాజాగా 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో భవంతిని నిర్మించింది. దేశీయంగా ఇలాంటి నిర్మాణం ఇదే మొదటిదని కంపెనీ వెల్లడించింది. తమిళనాడులోని కాంచీపురంలోని తమ ప్లాంటులో జీప్లస్1 (గ్రౌండ్ ప్లస్ వన్) స్వరూపంలో ఈ భవంతిని రూపొందించినట్లు వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యునెటైడ్ బయోమెడికల్‌కు చెందిన కోవాక్స్(అమెరికా)తో ఒప్పందం
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : హైదరాబాద్ సంస్థ అరబిందో ఫార్మా
ఎందుకు : యూబీ-612 వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి, విక్రయాల కోసం

కంబోడియా చేరుకున్న ఐఎన్‌ఎస్ కిల్టన్ నౌక
భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ కిల్టన్ నౌక కంబోడియాలోని శిహనౌక్‌విల్లి తీరానికి డిసెంబర్ 29న చేరుకుంది. విపత్తుల నిర్వహణలో భాగంగా 15 టన్నుల ఆహార పదార్థాలను ఈ నౌకలో భారత్ నుంచి కంబోడియాకు పంపారు. మిషన్ సాగర్-III(Mission Sagar-III)లో భాగంగా (కోవిడ్-19 నేపథ్యంలో) దక్షిణాసియాలోని దేశాలకు, ఇతర కోవిడ్ బాధిత దేశాలకు భారత్ సహకారాన్ని అందిస్తోంది.
కంబోడియా(కంపూచియా) రాజధాని: నామ్‌ఫెన్(Phnom Penh)
కంబోడియా కరెన్సీ: రియాల్(Riel)
కంబోడియా ప్రస్తుత రాజు: నోరోడోమ్ సిహామోని
కంబోడియా ప్రస్తుత ప్రధాని: హున్ సేన్
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం: అంగ్కోర్ వాట్(కంబోడియా)
క్విక్ రివ్యూ:
ఏమిటి : కంబోడియా చేరుకున్న భారత నౌక
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : ఐఎన్‌ఎస్ కిల్టన్ నౌక
ఎక్కడ : శిహనౌక్‌విల్లి తీరా, కంబోడియా
ఎందుకు : విపత్తుల నిర్వహణలో భాగంగా 15 టన్నుల ఆహార పదార్థాలను భారత్ నుంచి కంబోడియాకు తరలించడం కోసం

భారత్, బంగ్లాదేశ్ మధ్య ఏడు ఒప్పందాలు
Current Affairs
భారత్, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయి. మొత్తం ఏడు రంగాల్లో పరస్పర సహకారం కోసం ఇరుపక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య డిసెంబర్ 17న జరిగిన ఆన్‌లైన్ సదస్సులో ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయి. హైడ్రోకార్బన్స్, వ్యవసాయం, ఇంధనం, టెక్స్‌టైల్స్ రంగాల్లో పరస్పర సహకారంతో పాటు సరిహద్దుల్లో ఏనుగుల సంరక్షణ, బంగ్లాకు చెత్తను శుద్ధి చేసే పరికరాల ఎగుమతి వంటి వాటిపై ఈ ఒప్పందాలు కుదిరాయి.
తాజా సదస్సు సందర్భంగా భారత జాతిపిత మహాత్మాగాంధీ, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబీర్ రెహ్మాన్ జీవితాలను ఆవిష్కరించే డిజిటల్ ఎగ్జిబిషన్‌ను మోదీదీ, హసీనా సంయుక్తంగా ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య గత 55 ఏళ్లుగా నిలిచిపోయిన ‘‘చిల్హాటీ - హల్దీబారీ’’ రైలు మార్గాన్ని సైతం పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
బంగ్లాదేశ్ రాజధాని: ఢాకా; కరెన్సీ: బంగ్లాదేశ్ టాకా
బంగ్లాదేశ్ ప్రస్తుత అధ్యక్షుడు: మోహమ్మద్ అబ్దుల్ హమీద్
బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని: షేక్ హసీనా
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, బంగ్లాదేశ్ మధ్య ఏడు ఒప్పందాలు
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
ఎందుకు : హైడ్రోకార్బన్స్, వ్యవసాయం, ఇంధనం, టెక్స్‌టైల్స్ రంగాల్లో పరస్పర సహకారంతో పాటు సరిహద్దుల్లో ఏనుగుల సంరక్షణ, బంగ్లాకు చెత్తను శుద్ధి చేసే పరికరాల ఎగుమతి వంటి వాటి కోసం

భారత్‌కు ఎస్-400 క్షిపణి వ్యవస్థలను సరఫరా చేయనున్న దేశం?
భారత్‌తో ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థల సరఫరా సహా అన్ని రక్షణ ఒప్పందాల అమలు కొనసాగుతుందని రష్యా స్పష్టం చేసింది. అమెరికా విధించే ఏకపక్ష ఆంక్షలను పట్టించుకోమని తెలిపింది. ఈ మేరకు రష్యా రాయబారి నికొలాయ్ కుదాషెవ్, రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రొమన్ బబూష్కిన్ డిసెంబర్ 21న మీడియాకు తెలిపారు.
రష్యా ఉత్పత్తి చేసే, ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే ఎస్-400 ట్రయంఫ్ శ్రేణిలోని ఐదు క్షిపణి వ్యవస్థలను 39 వేల కోట్ల రూపాయలు (5 బిలియన్ అమెరికన్ డాలర్లు) వెచ్చించి కొనుగోలు చేయాలని భారత్ 2015లో నిర్ణయించింది. ఈ మేరకు 2018లో ఆ దేశంతో భారత్ ఒప్పందం చేసుకుంది. ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా హెచ్చరించినప్పటికీ వెనుకంజ వేయకుండా మొదటి దఫాగా 800 మిలియన్ డాలర్లను చెల్లించింది.
ఎస్-400 ప్రత్యేకతలు..
  • శత్రు దేశాల క్షిపణులు, డ్రోన్లు, గూఢచర్య విమానాలు 400 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఉన్నా ఎస్-400 ట్రయంఫ్ వాటిని గుర్తించి నాశనం చేయగలదు.
  • ఏకకాలంలో 36 లక్ష్యాలపై ఇది దాడులు చేయగలదు.
  • ఎస్-300 క్షిపణుల కన్నా ఇది రెండున్నర రెట్లు ఎక్కువ వేగంతో దాడులు చేస్తుంది. అందుకే ఎస్-400 ట్రయంఫ్‌ను రష్యా వద్దనున్న అత్యంత శక్తిమంతమైన, అధునాతన క్షిపణి వ్యవస్థగా పేర్కొంటారు.
  • భారత్‌కు ఈ క్షిపణులు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్‌లోని అన్ని వైమానిక స్థావరాలు, టిబెట్‌లోని చైనా స్థావరాలపై కూడా దాడులు చేయొచ్చు.
  • వీటిని వాహనాలపై ఇతర ప్రాంతాలకు తరలించేందుకూ వీలుంది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు ఎస్-400 క్షిపణి వ్యవస్థలను సరఫరా చేయనున్న దేశం
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : రష్యా
ఎందుకు : 2018లో భారత్, రష్యా మధ్య కుదిరిన 39 వేల కోట్ల రూపాయల ఒప్పందం మేరకు

భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య తొమ్మది ఒప్పందాలు
Current Affairs
భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య వివిధ రంగాల్లో తొమ్మది ఒప్పందాలు కుదిరాయి. ఉగ్రవాద నిర్మూలన కోసం పాటుపడ్తామని ఇరు దేశాలు ప్రతినబూనాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు శావ్‌కట్ మిర్జియోయెవ్ డిసెంబర్ 11న వర్చువల్ విధానంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పునరుత్పాదిత ఇంధనం, డిజిటల్, సైబర్ టెక్నాలజీ, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు, వస్తు రవాణా, సమాచార మార్పిడి వంటి రంగాల్లో మొత్తం 9 ఒప్పందాలు కుదిరాయి. అలాగే, ఉజ్బెకిస్తాన్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం భారత్ 44.8 కోట్ల డాలర్ల రుణాన్ని అందించేందుకు అంగీకరించింది.
ఉజ్బెకిస్తాన్ రాజధాని: తాష్కెంట్; కరెన్సీ: ఉజ్బెకిస్తాన్ సోమ్
ఉజ్బెకిస్తాన్ ప్రస్తుత అధ్యక్షుడు: శావ్‌కట్ మిర్జియోయెవ్
ఉజ్బెకిస్తాన్ ప్రస్తుత ప్రధాని: అబ్దుల్లా అరిపోవ్
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య తొమ్మది ఒప్పందాలు
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు శావ్‌కట్ మిర్జియోయెవ్
ఎందుకు : పునరుత్పాదిత ఇంధనం, డిజిటల్, సైబర్ టెక్నాలజీ, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు, వస్తు రవాణా, సమాచార మార్పిడి వంటి రంగాల్లో పరస్పర సహకారం కోసం

2021 ఏడాది భారత గణంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేత?
2021 ఏడాది భారత గణంత్ర వేడుకలకు హాజరుకావాలని ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోదీ పంపిన ఆహ్వానాన్ని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అంగీకరించారు. 2021, జనవరి 26న జరిగే భారత గణతంత్ర వేడుకలకు ప్రధాని జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ డిసెంబర్ 15న వెల్లడించారు. ఈ పర్యటన భారత్, బ్రిటన్‌ల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఉపకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు బ్రిటన్‌లో జరిగే జీ7 సమ్మిట్‌కి సౌత్ కొరియా, ఆస్ట్రేలియాతో సహా భారత్‌ని ఆహ్వనిస్తూ ప్రధాని మోదీకి జాన్సన్ లేఖ రాశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2021 ఏడాది భారత గణంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేత?
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్
ఎక్కడ : భారత్
ఎందుకు : భారత్ ఆహ్వానం మేరకు

గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాని
Current Affairs
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని అంగీకరిస్తే, 1993 తరువాత బ్రిటన్ ప్రధాని తొలిసారి భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 27న బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌తో ఫోన్‌లో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తూ... 2021, జనవరి 26న భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలంటూ ఆహ్వానించారు. అలాగే 2021 ఏడాది బ్రిటన్‌లో జరిగే జీ-7 సమ్మిట్‌కి ప్రధాని మోదీని.. బోరిస్ ఆహ్వనించారు. చివరిసారి 1993లో బ్రిటన్ ప్రధాని జాన్ మేజర్ భారత గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు.

ఏ రెండు దేశాల మధ్య 9 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం కుదిరింది?
అమెరికా-భారత్‌ల మధ్య 9 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు మిలిటరీ ఆయుధాలు, సేవలకు అమెరికా ఆమోదం తెలిపింది. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింతగా మెరుగు పరిచేందుకు, భారత్‌ను మేజర్ డిఫెన్స్ భాగస్వామిగా చేసేందుకు ఈ ఆమోదం దోహదం చేస్తుందని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (డీఎస్‌సీఏ)కు చెందిన రక్షణ విభాగం డిసెంబర్ 3న వెల్లడించింది.
తాజా ఒప్పందంలో భాగంగా... యుద్ధవిమానాల రిపేర్లు, ఫైర్ కాట్రిడ్‌‌జలు, అడ్వాన్స్ డ్ రాడార్ వార్నింగ్ రిసీవర్ షిప్‌సెట్, నైట్ విజన్ బైనాక్యులర్, జీపీఎస్ వంటి పరికరాలను భారత్ పొందనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 9 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : భారత్, అమెరికా
ఎందుకు : పలు రక్షణ పరికరాలను భారత్‌కు అందించేందుకు

జమ్మూకశ్మీర్‌లోకి టర్కీ కిరాయి సైనికులు
భారత్‌లోని కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లోకి టర్కీ... తూర్పు సిరియా నుంచి కిరాయి సైనికులను పంపుతోందని ఏఎన్‌ఎఫ్ న్యూస్ తెలిపింది. ఈ విషయమై సిరియాలోని సులేమన్‌షా బ్రిగేడ్‌‌స టైస్టు ఆర్గనైజేషన్ ప్రతినిధి అబు ఇమ్‌షా తన అనుచరులతో చర్చించారని పేర్కొంది. కశ్మీర్‌కు వెళ్లే వారికి 2 వేల డాలర్లు ముడతాయని అబు ఇమ్‌షా చెప్పాడని వివరించింది. ఇదంతా టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ పన్నాగమని గ్రీకు జర్నలిస్టు అండ్రియాస్ మౌంట్‌జొరాలియస్ ఒక నివేదికలో వెల్లడించారు.
జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి తొలగించిన సందర్భంలో టర్కీ పాకిస్తాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. అలాగే పలుమార్లు పాక్‌కు అంతర్జాతీయ వేదికలపై కూడా టర్కీ మద్దతిస్తోంది.
టర్కీ రాజధాని: అంకారా; కరెన్సీ: టర్కీస్ లీరా

ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం చేసుకున్న భారత ఫార్మా దిగ్గజం?
Current Affairs
రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో పెద్ద ఎత్తున తయారు చేయనున్నారు. ఏడాదికి 10 కోట్ల స్పుత్నిక్-వీ డోసులకు పైగా డోసుల్ని ఉత్పత్తి చేయడానికి భారత్ ఫార్మా దిగ్గజం హెటిరోతో రష్యా డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) ఒప్పందం కుదుర్చుకుంది. 2021 ఏడాది మొదట్లో ఉత్పత్తిని భారత్‌లో ప్రారంభిస్తామని నవంబర్ 27న ఆర్‌డీఐఎఫ్ తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు వెనెజులా, భారత్ తదితర దేశాల్లో జరుగుతున్నాయి. 50కి పైగా దేశాల నుంచి 1,200 కోట్లకు పైగా టీకా డోసులు కావాలంటూ రష్యాకు విజ్ఞప్తులు అందాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ ఫార్మా దిగ్గజం హెటిరోతో ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : రష్యా డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్)
ఎందుకు : భారత్‌లో పెద్ద ఎత్తున స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు

ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు, దిగుమతిదారు?
దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత భారత్ నుంచి చైనా బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం ఆరంభించింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా తగ్గడం, ఇదే సమయంలో భారత్‌లో బియ్యం రేటు తగ్గడంతో చైనా బియ్యం కొనుగోలుకు ముందుకు వచ్చింది. ప్రపంచంలో భారత్ అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు కాగా, చైనా అతిపెద్ద దిగుమతిదారు. ఏటా చైనా దాదాపు 40 లక్షల టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకుంటుంది. కానీ నాణ్యతా ప్రమాణాలు సాకుగా చూపుతూ భారత్ నుంచి మాత్రం బియ్యం కొనేది కాదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్ నుంచి బియ్యం దిగుమతి ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : చైనా
ఎక్కడ : చైనా
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా బియ్యం సరఫరా తగ్గడంతో

గల్వాన్ ఘర్షణలు డ్రాగన్ దేశం కుట్ర: రివ్యూ కమిషన్
భారత్‌ను లక్ష్యంగా చేసుకొని చైనా చేసే కుట్రలు, కుతంత్రాలు మరోసారి బట్టబయలయ్యాయి. 2020 జూన్‌లో భారత్‌కు చెందిన 20 మంది సైనికుల్ని బలి తీసుకున్న గల్వాన్ ఘర్షణల్ని డ్రాగన్ దేశం చైనా పక్కాగా కుట్ర పన్ని పాల్పడినట్టుగా అమెరికా-చైనా ఆర్థిక, భద్రత రివ్యూ కమిషన్ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన నివేదికను డిసెంబర్ 2న అమెరికన్ కాంగ్రెస్‌కి సమర్పించింది. దీనికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది.
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో జూన్ 15న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ), భారత సైనికుల మధ్య హోరాహోరీ జరిగిన పోరులో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చైనా తరఫున ఎంత ప్రాణ నష్టం జరిగిందో డ్రాగన్ దేశం ఇప్పటికీ వెల్లడించలేదు.

Published date : 17 Dec 2020 12:52PM

Photo Stories