Skip to main content

డిసెంబర్ 2017 ద్వైపాక్షిక సంబంధాలు

నల్లధనం సమాచార ఒప్పందంపై భారత్, స్విట్జర్లాండ్ సంతకాలు
Current Affairs
నల్లధనంపై సమాచారం పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై భారత్, స్విట్జర్లాండ్‌లు డిసెంబర్ 21న సంతకాలు చేశాయి. స్విట్జర్లాండ్ పార్లమెంట్‌లోనూ దీనికి సంబంధించిన విధానపర ప్రక్రియ ముగియడంతో జనవరి 1 నుంచి ఇరు దేశాల మధ్య సమాచార మార్పిడి ప్రారంభమవుతుంది. ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర, భారత్‌లో స్విట్జర్లాండ్ రాయబారి ఆండ్రియాస్ బామ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆటోమేటిక్ సమాచార మార్పిడి(AEIO) ఉమ్మడి డిక్లరేషన్‌పై రెండు దేశాల మధ్య 2017 నవంబర్ నెలలోనే అవగాహన కుదిరింది. దీని వల్ల స్విట్జర్లాండ్‌లో బ్యాంకు ఖాతాలు కలిగిన భారతీయుల సమాచారం పొందడానికి వీలవుతుంది. ఆటోమేటిక్ సమాచార మార్పిడికి స్విట్జర్లాండ్ అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఉండగా, తమకు అందిన సమాచారం గోప్యతను కాపాడతామని భారత్ స్విస్‌కు హామీ ఇచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నల్లధనం సమాచార మార్పిడి ఒప్పందంపై సంతకాలు
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : భారత్ - స్విట్జర్లాండ్
ఎందుకు : స్విట్జర్లాండ్‌లో బ్యాంకు ఖాతాలు కలిగిన భారతీయుల సమాచారం పొందడానికి వీలుగా

భారత్, చైనా మధ్య ‘సరిహద్దు’ చర్చలు
భారత్, చైనా మధ్య 20వ దఫా సరిహద్దు చర్చలు డిసెంబర్ 22న జరిగాయి. రోజంతా సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా స్టేట్ కౌన్సెలర్ యంగ్ జీచితోపాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య పరస్పరం విశ్వాసం పెంపొందించే చర్యలపైనే ప్రధానంగా చర్చించారు. సరిహద్దు అంశంపై తుది తీర్మానానికి రాలేకపోయామని ఉభయ పక్షాలు అంగీకరించాయి. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యం నెలకొనాలని, ఈ మేరకు అమలుచేయాల్సిన చర్యలపై ఆలోచనలను పంచుకున్నట్లు వెల్లడించాయి. చర్చల్లో వివాదాస్పద అంశమైన డోక్లాం ప్రస్తావన రాలేదు.
భారత్, చైనా మధ్య 2017 జూన్ 16న తలెత్తిన డోక్లాం వివాదం 2017 ఆగస్టు 28న పరస్పర ఒప్పందంతో సమసింది. భూటాన్ సరిహద్దు ప్రాంతమైన డోక్లాంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రహదారి నిర్మించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం అడ్డుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య రెండున్నర నెలలకు పైగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసిన భార్య, తల్లి
పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారతీయుడు కుల్‌భూషణ్ జాధవ్ ఎట్టకేలకు తన భార్య, తల్లిని కలుసుకున్నారు. ఇస్లామాబాద్‌లోని పాక్ విదేశాంగశాఖ కార్యాలయంలో దాదాపు 40 నిమిషాల సేపు జాధవ్.. భార్య చేతాంకుల్, తల్లి అవంతి మధ్య ఉద్వేగపూరిత సంభాషణ జరిగింది. అయితే వీరు నేరుగా కలుసుకునే అవకాశం లేకుండా మధ్యలో గాజు తెర ఏర్పాటు చేసిన పాక్ అధికారులు.. ఇరువైపులా ఫోన్ ద్వారా (ఇంటర్‌కామ్) మాట్లాడుకునే వీలు కల్పించారు. ఈ భేటీ మొత్తాన్ని ఫొటోలు, సీసీటీవీల ద్వారా రికార్డు చేశారు. వీరితోపాటు వచ్చిన భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్‌ను జాధవ్‌తో మాట్లాడేందుకు అనుమతించలేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసిన భార్య, తల్లి
ఎప్పుడు : డిసెంబర్ 25
ఎక్కడ : ఇస్లామాబాద్, పాకిస్తాన్

ఐరాసకు అనుగుణంగానే ‘కశ్మీర్’ పరిష్కారం
ప్రపంచవ్యాప్తంగా, ప్రాంతీయంగానూ శాంతి, స్థిరత్వాలను సాధించాలంటే కశ్మీర్ వివాదాన్ని ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి తీర్మానాన్ని అనుసరించి భారత్, పాక్‌లు శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. రష్యా, చైనా, ఇరాన్, టర్కీ, అఫ్గానిస్తాన్, పాక్ దేశాల పార్లమెంటు స్పీకర్లు ఇస్లామాబాద్‌లో సమావేశమై ఈ ప్రకటనను వెలువరించారు. తొలుత కశ్మీర్ అంశంపై చర్చించేందుకు రష్యా, ఇరాన్, అఫ్గాన్‌లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే ఆయా దేశాలు తమకు రాజకీయంగా ప్రయోజనాలు చేకూర్చే అంశాలను చర్చల జాబితాలో చేర్చాయనీ, తమకూ కశ్మీర్ అంశమే ముఖ్యమని పాక్ పట్టుబట్టడంతో మిగతాదేశాలూ ఒప్పుకోక తప్పలేదు.
అలాగే... చైనా, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల విదేశాంగ మంత్రులు కలసి తొలిసారిగా డిసెంబర్ 26న బీజింగ్‌లో త్రైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.

చైనా విదేశీ పెట్టుబడుల్లో భారత్ ర్యాంక్ 37
Current Affairs
చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో భారత్ ర్యాంక్ ఆరు స్థానాలు దిగజారి 37కు చేరింది. ఈ జాబితాలో సింగపూర్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్‌‌స యూనిట్ (ఈఐయూ) 60 దేశాలకు సంబంధించి డిసెంబర్ 7న విడుదల చేసిన ‘చైనా గోయింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇండెక్స్ 2017’ ఈ వివరాలు వెల్లడించింది. అమెరికా (2), హాంకాంగ్ (3), మలేషియా(4), ఆస్ట్రేలియాలు (5) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆటోమొబైల్, వినియోగ వస్తువులు, ఎనర్జీ ఫైనాన్షియల్ సేవలు, హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబడులను పరిశీలించి ఈ నివేదిక రూపొందించారు. ఈ విషయంలో భారత్ ర్యాంక్ తగ్గడానికి ప్రధాన కారణం రాజకీయ, భౌగోళిక పరమైన ఉద్రిక్తతలు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భారత్ ర్యాంక్ 37
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : ఎకనామిక్ ఇంటెల్లిజెన్స్ యూనిట్
ఎందుకు : రాజకీయ, భౌగోళిక పరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో

సింగపూర్‌తో భారత్ రక్షణ ఒప్పందం
రక్షణ రంగంలో పరస్పరం మరింత సహకరించుకునేందుకు భారత్ - సింగపూర్ 2017 నవంబర్ 29న ఒప్పందం కుదుర్చు కున్నాయి. ప్రధానంగా నౌకారంగంలో ఇరు దేశాలు సహకారాన్ని పెంపొందించు కోనున్నాయి. భారత రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్, సింగపూర్ రక్షణ మంత్రి ఎంగ్ ఇంగ్ హెన్ మధ్య చర్చలు జరిగాయి. భారత యుద్ధ నౌకలు తమ నౌకా స్థావరాల్లో ఇంధనం నింపుకోవ డా నికి అవకాశం కల్పిస్తామని సింగపూర్ మంత్రి తెలిపారు. దక్షిణ చైనా సముద్రం లో నౌకలు తిరగడానికి స్వేచ్ఛ ఉండాలని ఇరు దేశాలు డిమాండ్ చేశాయి. ఉగ్రవాద అణిచివేత, రక్షణ ఉత్పత్తుల తయారీలో సహకరించుకోవాలని నిర్ణయించాయి.

వాసెనార్ బృందంలో భారత్ కు సభ్యత్వం
ఆయుధాల సరఫరా, ఎగుమతులను నియంత్రించే వాసెనార్ బృందం (Wassenaar) లో భారత్ 42వ సభ్య దేశంగా చేరింది. ఈ మేరకు డిసెంబర్ 7న వియన్నాలో ముగిసిన ప్లీనరీలో భారత్‌ను సభ్య దేశంగా చేర్చుకోవడానికి వాసెనార్ బృందం ఆమోదం తెలిపింది. దీంతో అణు విస్తరణ నిరోధక కార్యకలాపాల్లో భారత్ స్థాయి పెరగడంతో పాటు కీలక రక్షణ, అంతరిక్ష రంగాల్లో అధునాతన సాంకేతికతలను ఇతర దేశాల నుంచి పొందడానికి వీలవుతుంది.
Wassenaar Arrangement on Export Controls for Conventional Arms and Dual-Use Goods and Technologies లేదా Wassenaar Arrangement అనేది ఆయుధాల ఎగుమతులు, సరఫరాలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు పనిచేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వాసెనార్‌లో 42వ సభ్యదేశం చేరిక
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : భారత్
ఎందుకు : రక్షణ, అంతరిక్ష రంగాల్లో ఇతర దేశాలతో అధునాతన సాంకేతికత పంచుకోవడానికి

ఢిల్లీలో ఆర్‌ఐసీ విదేశాంగ మంత్రుల సమావేశం
ఉగ్రవాదులకు నిధులు అందే మార్గాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వారి స్థావరాలను నిర్వీర్యం చేయాలని భారత్, చైనా, రష్యా నిర్ణయించాయి. ఈ మేరకు డిసెంబర్ 11న ఢిల్లీలో జరిగిన 15వ రష్యా, భారత్, చైనా (ఆర్‌ఐసీ) త్రైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మూడు దేశాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్ (భారత్), వాంగ్ యీ(చైనా), సెర్జీ లావ్రోవ్ (రష్యా) ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై ఉమ్మడిగా చర్యలు చేపట్టాలని ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రష్యా, భారత్, చైనా విదేశాంగ మంత్రుల సమావేశం
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : సుష్మాస్వరాజ్, వాంగ్ యీ, సెర్జీ లావ్రోవ్ (రష్యా)
ఎక్కడ : ఢిల్లీ

‘చాబహర్’ పోర్టును ప్రారంభించిన ఇరాన్
Current Affairs
భారత ఆర్థిక సాయంతో ఇరాన్‌లో నిర్మించిన చాబహర్ నౌకాశ్రయం మొదటి దశను ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ డిసెంబర్ 3న ప్రారంభించారు. ఈ పోర్టు అందుబాటులోకి వస్తే పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా ఇరాన్, భారత్, అఫ్గానిస్థాన్ మధ్య రవాణాకు వీలు కలుగుతుంది. ఇరాన్‌లోని సిస్టాన్-బలూచిస్తాన్ ప్రావిన్‌‌సలో నిర్మించిన ఈ పోర్టును భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉన్న నౌకాశ్రయాలతో సులువుగా అనుసంధానం చేయవచ్చు. చైనా పెట్టుబడులతో పాకిస్తాన్‌లో నిర్మించిన గ్వాదర్ పోర్టుకు పోటీగా దీనిని భారత్ ఇరాన్‌లో నిర్మించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘చాబహర్’ పోర్టు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : ఇరాన్
ఎందుకు : ఇరాన్, భారత్, అఫ్గానిస్థాన్ మధ్య రవాణాకు
Published date : 16 Dec 2017 03:24PM

Photo Stories