Skip to main content

సెప్టెంబర్ 2018 అవార్డ్స్

మోదీకి చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ అవార్డు
Current Affairs భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రన్‌లకు ఐక్యరాజ్య సమితి ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ అవార్డు లభించింది. అలాగే సౌరశక్తితో నడుస్తున్న ఏకైక విమానాశ్రయంగా గుర్తింపు పొందిన కొచ్చి విమానాశ్రయానికి కూడా ఈ అవార్డు దక్కింది. ఈ మేరకు సెప్టెంబర్ 26న ఐరాస వెల్లడించింది. అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటులో ఇద్దరు నేతలు చేసిన కృషికిగాను ఈ అవార్డును ప్రకటించారు. 2022 నాటికి భారత్‌లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని మోదీ చెప్పారు. పారిస్ ఒప్పందం కుదరడంలో మాక్రన్ కీలక పాత్ర పోషించారు.
పాలసీ లీడర్‌షిప్ కేటగిరీ కింద ప్రకటిస్తున్న ఈ అవార్డును ఐరాస ఇచ్చే అత్యున్నత పర్యావరణ పురస్కారంగా భావిస్తారు. పర్యావరణ పరిరక్షణకు విశేష కృషిచేస్తున్న ప్రముఖులకు ఈ అవార్డును ప్రకటిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రన్
ఎందుకు : అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటులో కృషి చేసినందుకుగాను

శంషాబాద్’కు నంబర్ 1 ఎయిర్‌పోర్ట్ అవార్డు
Current Affairs శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘నంబర్ 1 ఎయిర్‌పోర్ట్ అవార్డు ట్రోఫీ’ లభించింది. కెనడాలోని హాలీఫాక్స్‌లో సెప్టెంబర్ 12న నిర్వహించిన ‘ఏసీఐ కస్టమర్ ఎక్స్‌లెన్స్ సమ్మిట్’లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్‌జీకే కిశోర్ ఈ అవార్డును అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 34 విమానాశ్రయాల్లో సేవల నాణ్యత విషయంలో ఎయిర్‌పోర్‌‌ట్స కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) సర్వే నిర్వహించగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తొలిస్థానం దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నంబర్ 1 ఎయిర్‌పోర్ట్ అవార్డు ట్రోఫీ
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం
ఎందుకు : నాణ్యమైన సేవలు అందించినందుకు

నృత్యకారిణి భావనారెడ్డికి యువ పురస్కారం
ప్రఖ్యాత కూచిపూడి గురువులు రాజారెడ్డి, కౌసల్యారెడ్డిల కుమార్తె భావనారెడ్డికి (తెలంగాణ) కేంద్ర సంగీత నాటక అకాడమీ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం-2017 లభించింది. ఈ మేరకు మేఘాలయలోని షిల్లాంగ్‌లో సెప్టెంబర్ 15న జరిగిన కార్యక్రమంలో మేఘాలయ గవర్నర్ తథాగతరాయ్ ఈ అవార్డును అందజేశారు. తన నాలుగో ఏట నుంచే నృత్యంలో శిక్షణ తీసుకున్న భావనా... ప్రస్తుతం దేశ విదేశాల్లో ప్రదర్శనలిస్తూ కూచిపూడి ఖ్యాతిని చాటుతుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం-2017
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : భావనారెడ్డి
ఎక్కడ : షిల్లాంగ్, మేఘాలయ

కాళేశ్వరం సీఈకి ఇంజనీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చీఫ్ ఇంజనీర్ నల్లా వెంకటేశ్వర్లుకి ఇంజనీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 150వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) నిర్వహించిన ఇంజనీర్స్ డే వేడుకల్లో ఈ అవార్డును అందజేశారు. ప్రఖ్యాత ఇంజనీర్, భారతరత్న, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సెప్టెంబర్ 15 ను ఇంజనీర్స్ డేగా జరుపుకొంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంజనీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చీఫ్ ఇంజనీర్ నల్లా వెంకటేశ్వర్లు

ఏపీకి ఐదు స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు పాఠశాలలకు ‘స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు 2017-18’ లభించాయి. ఈ మేరకు ఢిల్లీలో సెప్టెంబర్ 18న జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ అవార్డులను అందజేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం కేజీబీవీ, కొట్టూరు మండలం మెట్టూరు కేజీబీవీ, పొందూరు కేజీబీవీ పాఠశాలు ఈ అవార్డులను సొంతం చేసుకున్నాయి. అలాగే నెల్లూరు జిల్లా నుంచి విన్నామల మండల పరిషత్ ఉన్నత పాఠశాల, చెరలోయడవల్లి మండల పరిషత్ ఉన్నత పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు దక్కాయి. ఈ పాఠశాలలకు అవార్డులతోపాటు రూ.50 వేల చొప్పున స్కూల్ గ్రాంట్‌ను కూడా అందజేశారు.
స్వచ్ఛ పాఠశాలల ఆవిష్కరణలో కృషి చేసినందుకుగాను స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. పరిశుభ్రత నిర్వహణ, టాయ్‌లెట్లు, మంచినీరు, సబ్బుతో చేతులు శుభ్రం చేసుకునే వసతి అంశాల ప్రాతిపదికన అవార్డులకు ఎంపికచేస్తారు. మొత్తంగా ఎక్కువ అవార్డులు దక్కించుకున్న రాష్ట్రాలకు కూడా అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ జాబితాలో ఏపీకి కూడా చోటు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీకి ఐదు స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలు
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : స్వచ్ఛ పాఠశాలల ఆవిష్కరణలో కృషి చేసినందుకుగాను

ప్రొఫెసర్ సర్జన్‌రావుకు ఎన్‌ఏడీఎస్ ఫెలో అవార్డు
Current Affairs శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ స్టూడెంట్ అఫైర్స్ డీన్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ కె.సర్జన్‌రావుకు నేషనల్ అకాడమీ ఆఫ్ డెయిరీ సైన్స్ (ఎన్‌ఏడీఎస్) ఫెలో అవార్డు లభించింది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోని డెయిరీ టెక్నాలజీ కళాశాలలో సెప్టెంబర్ 9న జరిగిన ఎన్‌ఏడీఎస్ 5వ స్నాతకోత్సవంలో సర్జన్‌రావుకు ఎన్‌ఏడీఎస్ చైర్మన్ ప్రొఫెసర్ శ్రీవాస్తవ ఈ అవార్డును అందజేశారు.
ప్రొఫెసర్ సర్జన్‌రావు రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన పథకం ద్వారా జెర్సీ, షాహివాల్ డెయిరీ ఫాంల స్థాపన, గ్రామీణ స్థాయిలో చిన్న, సన్నకారు రైతులు డెయిరీ ఫాంలు ఏర్పాటు చేసుకునేలా కృషి చేశారు. పశు బాహ్య నిర్మాణం’ ద్వారా పాల ఉత్పత్తి, పునరుత్పత్తి సామర్థ్యాన్ని కనుగొనే ప్రక్రియలపై పరిశోధనలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేషనల్ అకాడమీ ఆఫ్ డెయిరీ సైన్స్ (ఎన్‌ఏడీఎస్) ఫెలో అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : ప్రొఫెసర్ కె.సర్జన్‌రావు
ఎక్కడ : శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తిరుపతి

తెలంగాణకు ఏడు జాతీయ అవార్డులు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో మెరుగైన పనితీరు కనబరిచినందుకు తెలంగాణకు ఏడు జాతీయ అవార్డులు లభించాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సెప్టెంబర్ 11న జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహాయ మంత్రి రాంకృపాల్ యాదవ్ ఈ అవార్డులను తెలంగాణ అధికారులకు అందజేశారు.
అవార్డులు లభించిన అంశాలు...
ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత, జవాబుదారీతనం అంశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచి అవార్డును సొంతం చేసుకుంది. అలాగే శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అమలులో మూడో స్థానం పొంది పురస్కారాన్ని దక్కించుకుంది. అత్యుత్తమ పని తీరు కనబరిచిన జిల్లాల విభాగంలో దేశవ్యాప్తంగా 18 అవార్డులు ప్రదానం చేయగా తెలంగాణలోని వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఈ అవార్డులు దక్కాయి.
అత్యుత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీ విభాగంలో సిద్ది పేట జిల్లా ఇబ్రహీంపూర్ పంచాయతీ అవార్డును సొంతం చేసుకుంది. సకాలంలో నగదు చెల్లింపు చేసిన విభాగంలో మెదక్ జిల్లా మక్తలక్ష్మాపూర్ బ్రాంచి పోస్టుమాస్టర్ శాప మానయ్య అవార్డును అందుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమర్థంగా శిక్షణ కార్యక్రమాలు అమలు చేసినందుకు స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ పౌసుమీ బసు జాతీయ అవార్డును పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణకు ఏడు జాతీయ అవార్డులు
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : విజ్ఞాన్ భవన్, ఢిల్లీ
ఎందుకు : మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో మెరుగైన పనితీరు కనబరిచినందుకు

విశాఖ పోర్టుకు ఇండియా గ్రీన్ ఎనర్జీ అవార్డు
విశాఖ పోర్టుట్రస్ట్‌కు ఇండియా గ్రీన్ ఎనర్జీ-2018 అవార్డు లభించింది. ఈ మేరకు ఢిల్లీలో సెప్టెంబర్ 10న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు అవార్డును అందజేశారు. గ్రీన్ ఎన ర్జీ ఉత్పత్తిలో ఉత్తమ ప్రగతి సాధించినందుకు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ ఈ అవార్డుకు విశాఖ పోర్టును ఎంపికచేసింది.
విశాఖ పోర్టుట్రస్ట్ యాజమాన్యం రూ.57.5 కోట్ల వ్యయంతో 10 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను విశాఖ విమానాశ్రయ ప్రాంతంలో నెలకొల్పి, మే 2017 నుంచి వాడుకలోకి తీసుకువచ్చింది. ఉత్పత్తి అయిన గ్రీన్ ఎనర్జీలో పోర్టు అవసరాలకు వినియోగించిన తర్వాత మిగులు విద్యుత్‌ను ఏపీఈపీడీసీఎల్‌కు విక్రయిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా గ్రీన్ ఎనర్జీ-2018 అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : విశాఖ పోర్టుట్రస్ట్
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : గ్రీన్ ఎన ర్జీ ఉత్పత్తిలో ఉత్తమ ప్రగతి సాధించినందుకు

తెలంగాణకు జాతీయ పురస్కారం
తెలంగాణకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ జాతీయ అవార్డు లభించింది. ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సెప్టెంబర్ 11న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్థిశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ అవార్డును అందజేశారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకం అమలులో మూడో స్థానంలో నిలిచినందుకుగాను తెలంగాణకు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ జాతీయ అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : తెలంగాణ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : రూర్బన్ మిషన్ పథకం అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు

సింగరేణికి ఎక్స్‌లెన్స్ ఇన్ పెర్ఫార్మెన్స్ పురస్కారం
సింగరేణి సంస్థకు ఎక్స్‌లెన్స్ ఇన్ పెర్ఫార్మెన్స్ పురస్కారం లభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో సెప్టెంబర్ 7న జరిగిన కోల్ ఇండియా సమ్మిట్-2018 సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్ర బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి అలోక్ పార్థి ఈ అవార్డును సింగరేణి సంస్థకు అందజేశారు. జాతీయ స్థాయిలో ప్రముఖ మైనింగ్ జియోలాజికల్ అండ్ మెటలర్జికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎంజీఎంఐ) ఈ అవార్డులను ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎక్స్‌లెన్స్ ఇన్ పెర్ఫార్మెన్స్ పురస్కారం
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : సింగరేణి సంస్థ

ఫొటో జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డికి ఐయూఎస్‌ఎఫ్ పురస్కారం
Current Affairs తెలుగు ఫొటో జర్నలిస్ట్ తమ్మా శ్రీనివాసరెడ్డికి హానరరీ ఎక్సలెన్స్ ఐయూఎస్‌ఎఫ్-2018 పురస్కారం లభించింది. ఫొటో జర్నలిజంలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఈ అవార్డుకు ఎంపిక చేసిన నలుగురిలో శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారని ఐసీఎస్ వ్యవస్థాపకుడు టోనీ లీ కిమ్ థుయాన్ ఆగస్టు 30న వెల్లడించారు. నవంబరులో జరగనున్న అంతర్జాతీయ ఫొటోగ్రఫీ కన్వెన్షన్‌లో ఈ అవార్డును శ్రీనివాసరెడ్డికి అందజేయనున్నారు. ఇప్పటికే 3 ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫొటోగ్రఫీ అవార్డులను ఆయన అందుకున్నారు. ప్రస్తుతం ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్‌కు అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డికి గత పాతికేళ్లలో 168 స్వర్ణ పతకాలు, 497 అవార్డులు, 876 గౌరవసత్కారాలు లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హానరరీ ఎక్సలెన్స్ ఐయూఎస్‌ఎఫ్-2018 పురస్కారం
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : తమ్మా శ్రీనివాసరెడ్డి
ఎందుకు : ఫొటో జర్నలిజంలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు

ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు
వివిధ అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 45 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం-2017 అందజేశారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సెప్టెంబర్ 5న ఈ అవార్డులను ప్రదానం చేశారు. తెలంగాణ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధ్యాయ పురస్కారం-2017 అందుకున్నారు.
తెలంగాణలో బేగంపేట కేంద్రీయ విద్యాలయంలో పనిచేస్తున్న ఆంగ్ల అధ్యాపకురాలు శేష ప్రసాద్ నుడుపల్లి, జోగులాంబ గద్వాల జిల్లా అమరావతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్‌మాస్టర్ బీఎస్ రవికి ఈ అవార్డులు లభించాయి. అలాగే నిజామాబాద్ జిల్లా బోర్గాం (పి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్‌మాస్టర్ నర్రా రామారావు, వరంగల్ అర్బన్ జిల్లా వెంకటాపురం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ బండారి రమేశ్‌ను ఈ పురస్కారం వరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎయిడెడ్ ఉన్నత పాఠశాల అధ్యాపకురాలు మేకా సుసత్యరేఖ పురస్కారాన్ని అందుకున్నారు. విద్యార్థులకు సులువైన పద్ధతుల్లో విద్యాబోధన, సృజనాత్మకత పెంపులో, పాఠశాలల్లో విద్యార్థుల చేరిక సంఖ్య పెంచడం వంటి అంశాల్లో చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పురస్కారాలు ప్రదానం చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 45 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం-2017
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : వివిధ అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు
Published date : 20 Sep 2018 04:03PM

Photo Stories