Skip to main content

ఏప్రిల్ 2021 అవార్డ్స్

రాష్ట్రంలో ఐఎస్‌ఓకు ఎంపికైన మొదటి గ్రామం?
Current Affairs
సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్‌ మండలానికి చెందిన ఇర్కోడ్‌ గ్రామం ఏటా ప్రత్యేక కార్యక్రమాలతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందుతూ ఆదర్శంగా నిలుస్తోంది. పంచాయతీ పరిధిలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ సేవలందించినందుకు గాను ఐఎస్‌ఓ (ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌) ఏప్రిల్‌ 16న గ్రామాన్ని ఎంపిక చేసి సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌ ద్వారా అందించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఐఎస్‌ఓకు ఎంపికైన మొదటి గ్రామంగా ఇర్కోడ్‌ నిలిచింది.
జాతీయ పురస్కారాలు, ప్రత్యేక కార్యక్రమాలు
మొత్తం 650 గృహాలు, 2,482 జనాభా కలిగిన ఇర్కోడ్‌ గ్రామం.. గతంలో 2016–17, 2017–18 సంవత్సరాలకు గాను శానిటేషన్, సోషల్‌ సెక్టార్‌ విభాగాల్లో రెండుసార్లు జాతీయ స్థాయి స్వశక్తి కరణ్‌ అవార్డులను సొంతం చేసుకుంది. తెలంగాణ ప్రస్తుత ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో గ్రామంలో మహిళల ఆర్థిక సాధికారత కోసం మటన్, చికెన్‌ పచ్చడి తయారీతో గుర్తింపు పొందింది.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ఐఎస్‌ఓకు ఎంపికైన మొదటి గ్రామం?
ఎప్పుడు : ఏప్రిల్‌ 16
ఎవరు : ఇర్కోడ్‌ గ్రామం
ఎక్కడ : ఇర్కోడ్‌ గ్రామం, సిద్దిపేట రూరల్‌ మండలం, సిద్దిపేట జిల్లా
ఎందుకు : పంచాయతీ పరిధిలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ సేవలందించినందుకు గాను

రెండు కొత్త గిన్నిస్‌ ప్రపంచ రికార్డులను నెలకొల్పిన లెఫ్టినెంట్‌ కల్నల్‌?
Current Affairs
భారత సైన్యంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ అయిన భరత్‌ పన్నూ రెండు కొత్త గిన్నిస్‌ ప్రపంచ రికార్డులను తిరగరాశారు. 2020, అక్టోబర్‌లో అత్యంత వేగంగా ఒంటరిగా సైకిల్‌ తొక్కి కొత్త రికార్డు సృష్టించారని గిన్నిస్‌ అధికారులు 2021, ఏప్రిల్‌ 8న ధ్రువీకరించారు. 2020, అక్టోబర్‌ 10న లేహ్‌ నుంచి మనాలి వరకు 472 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 35 గంటల 25 నిమిషాల్లో సైకిల్‌ తొక్కి రికార్డును నెలకొల్పారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలను కలిపే ‘స్వర్ణచతుర్భుజి’రహదారిగా పేరొందిన రోడ్డు మార్గాన్ని 14 రోజుల 23 గంటల, 52 సెకన్లలో సైకిల్‌పై పూర్తిచేసి మరో కొత్త గిన్నిస్‌ రికార్డును బద్దలుకొట్టారు.

అత్యుత్తమ ఫ్లైయాష్‌ వినియోగ సంస్థగా అవార్డు గెలుచుకున్న సంస్థ?
థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి వెలువడే బూడిద (ఫ్లైయాష్‌)ను 100 శాతం వినియోగంలోకి తెచ్చినందుకు గాను అత్యుత్తమ ఫ్లైయాష్‌ వినియోగ సంస్థగా ‘‘సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌’’కు జాతీయ పురస్కారం లభించింది. 500 మెగావాట్ల పైబడి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న థర్మల్‌ ప్లాంట్ల విభాగంలో సింగరేణికి ఈ పురస్కారం దక్కింది. ఏప్రిల్‌ 10న గోవాలో మిషన్‌ ఎనర్జీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సింగరేణి డెరైక్టర్‌ డి.సత్యనారాయణరావు అవార్డు అందుకున్నారు. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి వెలువడే బూడిదను ప్రధానంగా సిమెంటు కంపెనీలకు రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం సింగరేణి సంస్థ సీఎండీగా ఎన్‌.శ్రీధర్‌ ఉన్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : అత్యుత్తమ ఫ్లైయాష్‌ వినియోగ సంస్థగా అవార్డు గెలుచుకున్న సంస్థ?
ఎప్పుడు : ఏప్రిల్‌ 10
ఎవరు : సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌
ఎక్కడ : గోవా
ఎందుకు : థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి వెలువడే బూడిద (ఫ్లైయాష్‌)ను 100 శాతం వినియోగంలోకి తెచ్చినందుకు గాను

51వ దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి ఎంపికైనటుడు
Current Affairs
దిగ్గజ నటుడు రజనీ కాంత్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. సినీ రంగంలో ఇచ్చే ఈ అత్యున్నత పురస్కారానికి... రజనీని ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 1న తెలిపింది. ఫాల్కే అవార్డు దక్కిన 51వ సినీ ప్రముఖుడు రజనీకాంత్‌. 2019వ సంవత్సరానికి గాను రజనీకి ఈ అవార్డు ప్రకటించారు. గతంలో తమిళంలో హీరో శివాజీ గణేశన్‌ (1996), దర్శక – నిర్మాత కె. బాలచందర్‌ (2000)లకు కూడా ఫాల్కే అవార్డు దక్కింది. వారి తర్వాత ఆ అవార్డు సాధించిన మూడో తమిళ సినీ ప్రముఖుడిగా రజనీ గుర్తింపు పొందారు.
దాదా సాహెబ్‌ ఫాల్కే...
దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు భారతీయ సినిమాలో అత్యున్నత పురస్కారం. భారతీయ సినిమా పురోగతికీ, అభివృద్ధికీ అందించిన అత్యున్నతసేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఈ అవార్డును ఇస్తోంది. భారతీయ సినిమా పితామహుడు ధుండిరాజ్‌ గోవింద్‌ ఫాల్కే పేరు మీదుగా 1969 నుంచి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును అందజేస్తున్నారు. ఈ అవార్డు కింద రూ.10 లక్షలతో పాటు స్వర్ణ కమలం అందజేస్తారు.
ఏడుగురు తెలుగు వారికి...
ఇప్పటి దాకా ఏడుగురు తెలుగు వారికి ఫాల్కే అవార్డు దక్కింది. తెలుగువారైన బి.ఎన్‌. రెడ్డి, పైడి జైరాజ్, ఎల్వీ ప్రసాద్, నాగిరెడ్డి, అక్కినేని, రామానాయుడు, కె. విశ్వనాథ్‌లు ఈ అవార్డు గ్రహీతల్లో ఉన్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి ఎంపికై నటుడు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 1
ఎవరు : రజనీ కాంత్‌
ఎందుకు : భారతీయ సినిమా పురోగతికీ, అభివృద్ధికీ అందించిన అత్యున్నతసేవలకు గుర్తింపుగా

ఏ రాష్ట్ర గవర్నర్‌కు కళింగరత్న మకుటంను ప్రదానం చేశారు?
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ప్రతిష్టాత్మక కళింగరత్న సత్కారం లభించింది. భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కళింగరత్న మకుటం ప్రదానం చేసి సత్కరించారు. ఒడిశాలోని కటక్‌ నగరంలో ఏప్రిల్‌ 2న జరిగిన ఆదికవి సరళదాస్‌ 600వ జయంత్యుత్సవం వేదికపై ఈ సత్కారం చేశారు. కార్యక్రమంలో పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, ఒడిశా గవర్నర్‌ ఆచార్య గణేషీ లాల్, సరళ సాహిత్య సంసద్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ప్రభాకర్‌ స్వాయి పాల్గొన్నారు.
ఒడిశా...
అవతరణ: ఆగస్టు 15, 1947.
విస్తీర్ణం: 1,55,707 చ.కి.మీ.
రాజధాని: భువనేశ్వర్‌
ప్రస్తుత గవర్నర్‌: గణేషీ లాల్‌
ప్రస్తుత ముఖ్యమంత్రి: నవీన్‌ పట్నాయక్‌
సరిహద్దు రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖాండ్, పశ్చిమబెంగాల్‌
మొత్తం జిల్లాలు: 30 (అంగుల్, బొలంగిర్, బాలాసోర్, బర్‌గత్, బద్రక్, భోద్, కటక్, డియోగర్, దెంకనాల్, గజపతి, గంజామ్, జగత్‌సింగ్‌పూర్, జయ్‌పూర్, జర్సుగుడా, కలహండి, కందమల్, కేంద్రపర, కియంజర్, మల్కజ్‌గిరి, మయూర్‌బంగ్, నవరంగాపూర్, నయగఢ్, నౌపడ, రాయగడ, పూరీ, సంబల్‌పూర్, సోనీపూర్, సుందర్‌గర్‌)
కార్యనిర్వాహణ శాఖ: ఏకసభ
శాసనసభ సీట్లు: 147
లోక్‌సభ సీట్లు: 21
రాజ్యసభ సీట్లు: 10
ప్రధాన భాష: ఒరియా
హైకోర్టు: కటక్‌
ప్రధాన మతం: హిందూమతం, జైనమతం, ఇస్లాం.
ముఖ్యనగరాలు: భువనేశ్వర్, కటక్, చత్రాపూర్, పూరి, సంబల్‌పూర్, బొలంగిర్, జర్సుగుడా, బరగర్, కొరాపుట్, రూర్కెలా, బాలాసోర్, బరిపెడ, బరంపూర్, బద్రక్, నవరంగాపూర్, రాయగడ, భవానిపట్నం, పుల్‌బాని, దెంకానాల్, కేంద్రపర, కీన్‌జర్, కోనార్క్, సుందర్‌గర్‌
నదులు: మహానది, బ్రాహ్మణి, టెల పుషికూల్యా, శబరీ, వైతరణి.
పర్వత శిఖారాలు: గర్‌జాత్‌ హిల్స్, మహేంద్రగిరి.
సరస్సులు: చిల్కా (64 కి.మీ. పొడవు, 16–20 కి.మీ వెడల్పు)
జాతీయపార్కులు: బితర్‌కనికా వన్యప్రాణుల అభయారణ్యం.
ఖనిజాలు: క్రోమైట్, బాక్సైట్, డోలమైట్, గ్రాఫైట్, ఐరెన్‌ ఓర్, బొగ్గు, రాగి, కొలిన్, లిడ్, క్వార్ట్‌జైట్, స్టీటైట్, టిన్‌.
పరిశ్రమలు: స్టీల్‌ ప్లాంట్, సాండ్‌ కాంప్లెక్స్, భారీ నీటి ప్రాజెక్ట్, కోచ్‌ రిపేర్‌ వర్క్‌షాపు, అల్యూమినియం, విద్యుత్‌ ప్లాంట్‌లు, థర్మల్‌ – హైడల్‌ విద్యుత్‌ స్టేషన్లు మొదలైనవి.
వ్యవసాయోత్పత్తులు: వరి, పప్పు దినుసులు, నూనె గింజలు, జూటు, చెరకు(ప్రధార వాణిజ్య పంట), పసుపు, కొబ్బరి,
విమానాశ్రయాలు: భువనేశ్వర్‌
ఓడరేవు: పారాదీప్, గోపాల్‌పూర్‌
నృత్యం: ఒడిస్సీ, దల్‌కాయ్‌(గిరిజన), గూమ్రా, రనప, ఛా–దయ(ఫోక్‌),
పండుగలు: రథయాత్ర, శరబన్‌ పూర్ణిమ, అశోకాష్టమీ, చందన్‌ యాత్ర, స్నానయ్రా, కోనార్క్‌ పండుగ.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ప్రతిష్టాత్మక కళింగరత్న సత్కారం ప్రదానం
ఎప్పుడు : ఏప్రిల్‌
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
ఎక్కడ : కటక్, ఒడిశా

విమలా శాంతి సాహిత్య అవార్డుకు ఎంపికైన అభ్యుదయ కథారచయిత?
ప్రసిద్ధ అభ్యుదయ కథారచయిత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డిని విమలాశాంతి జీవిత సాహిత్య సాఫల్య పురస్కారం వరించింది. ఈ విషయాన్ని అవార్డు వ్యవస్థాపకుడు డా.శాంతినారాయణ ఏప్రిల్‌ 3న తెలిపారు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో రూ.50 వేల నగదు ప్రదానంతోపాటు సన్మాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన తన సతీమణి విమల జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ప్రతి ఏడాది ఒక సీనియర్‌ కథా, నవలా రచయితకు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా తొలి పురస్కారాన్ని విశ్వనాథరెడ్డికి ఇస్తున్నట్లు వివరించారు.
విశ్వనాథ్‌రెడ్డి నేపథ్యం...
  • కడప జిల్లా రంగశాయిపురానికి చెందిన కేతు విశ్వనాథరెడ్డి జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు వంటి సంపుటాలు వెలువరించారు. బోధి, వేర్లు అనే నవలికలు రాశారు. దృష్టి అనే విమర్శనా వ్యాస సంపుటిని ప్రచురించారు.
  • తెలుగు అధ్యాపకులుగా పనిచేసిన ఆయన ‘కడప ఊర్లపేర్లు ‘అనే అంశం మీద పరిశోధించి, తెలుగు పరిశోధనలో కొత్త గవాక్షం తెరిచారు.
  • కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సర్వస్వాన్ని ఆరు సంపుటాలుగా సంకలనం చేసి, విలువైన ముందు మాటలు రాశారు.
  • కూలినబురుజు, వాన కురుస్తే, అమ్మవారి నవ్వు, నమ్ముకున్న నేల, తేడా వంటి అనేక కథలలో రాయలసీమ జీవిత వాస్తవికతను ప్రతిబింబించారు.
  • సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధనా కేంద్రం సలహామండలి సభ్యులుగా ఉన్నారు.
  • ఇప్పటికే కేంద్ర సాహిత్య అకాడమీతోపాటు అప్పాజోశ్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్‌ పురస్కారం పొందారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : విమలా శాంతి సాహిత్య అవార్డుకు ఎంపికైన అభ్యుదయ కథారచయిత?
ఎప్పుడు : ఏప్రిల్‌ 3
ఎవరు : ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి
ఎందుకు : సాహిత్య రంగంలో చేసిన విశేష సేవలకుగాను

4,300 కిలోమీటర్ల మారథాన్‌ చేపట్టిన భారత సైనికుడు?
కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఏకంగా 4,300 కిలోమీటర్లు పరిగెత్తి గిన్నిస్‌ ప్రంపంచ రికార్డుల్లోకి ఎక్కేందుకు భారత సైనికుడు నాయక్‌ వేలు పీ (30) బయలు దేరారు. 60 పారా ఫీల్డ్‌ ఆస్పత్రిలో నర్సింగ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వేలు... శ్రీనగర్‌లోని 92 బేస్‌ ఆస్పత్రి నుంచి ఏప్రిల్‌ 2న తన పరుగును ఆరంభించారు. వేలు తన లక్ష్యాన్ని 50 రోజుల్లో చేరుకోవడానికి ఆయన రోజుకు 70 నుంచి 100 కిలోమీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. ‘క్లీన్‌ ఇండియా – గ్రీన్‌ ఇండియా’ సందేశాన్ని వేలు మోసుకెళ్తున్నారని ఇపీఆర్‌ఓ డిఫెన్స్‌ (జమ్మూ) లెఫ్టినెంట్‌ కల్నల్‌ దేవేందర్‌ ఆనంద్‌ చెప్పారు.
వరల్డ్‌ ఛాంపియన్‌ రన్‌లో...
1991 ఏప్రిల్‌21న జన్మించిన వేలు 2011లో ఆర్మీలో చేరారు. 2012లో 12.5 కిలోమీటర్ల క్రాస్‌–కంట్రీ రన్‌కు గానూ ఆర్మీ నుంచి బంగారు పతకాన్ని అందుకున్నారు. 2016 నుంచి భారత అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2021, సెప్టెంబర్‌లో రొమేనియాలో జరగనున్న వరల్డ్‌ ఛాంపియన్‌ రన్‌లో పాల్గొననున్నారు.
క్విక్‌ రివ్యూ:
ఏమిటి : 4,300 కిలోమీటర్ల మారథాన్‌ చేపట్టిన భారత సైనికుడు?
ఎప్పుడు : ఏప్రిల్‌ 2
ఎవరు : నాయక్‌ వేలు పీ
ఎక్కడ : శ్రీనగర్, జమ్మూకశ్మీర్‌
ఎందుకు : క్లీన్‌ ఇండియా – గ్రీన్‌ ఇండియా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు
Published date : 16 Apr 2021 05:36PM

Photo Stories